బాలకాండ
మందరమకరందం
సర్గ-23
కౌసల్యా
సుప్రజా రామా – సరసిజనయనా
వనం
జ్వాలా నరసింహారావు
అరుణోదయవేళలో దిక్కులన్నీ
తెల్లబడుతుంటే, ఇకతెల్లవారనుందికనుక, విశ్వామిత్రుడు, లేత పచ్చిక ఆకులపై
పరుండిన సూర్యవంశ రాజకుమారులు - రామలక్ష్మణుల వద్దకు చేరి ప్రేమతో : " కౌసల్యా
సుప్రజ! రా, మా! సరసిజనయన లెమ్ము- కౌసల్యా
నందనా, రామా, కమలలోచనా, తొలి సంధ్య వస్తోంది.
దేవత కార్యం, సంధ్యావందనం చేయాలి
లెమ్ము" అంటాడు. విశ్వామిత్రుడలా ప్రీతితో అనగానే, శ్రీరామ లక్ష్మణులు విని-లేచి-ఆచమానంచేసి-సరయూ నదిలో
స్నానంచేసి-తిరిగి ఆచమానంచేసి-గాయత్రి జపించి-అర్ఘ్యం మొదలైన కార్యాలను నెరవేర్చి, నిర్మలమైన మనస్సుతో ఆయనవద్దకుపోయి నమస్కరించారు. సంతోషంగా
ప్రయాణానికి ఉత్సాహపడ్తున్న రామలక్ష్మణులను తన వెంట తీసుకొని విశ్వామిత్రుడు
వెళుతుంటే, దారిలో రాజకుమారులకు
గంగాసరయూసంగమం కనిపించగానే ఆప్రదేశాన్నిచూసి ఆశ్చర్యపోయారు. ఆస్థలంలో
మహాతేజవంతులైన మహర్షులు వేలాది సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా, నిష్ఠతో తపస్సు చేసారు. మంచినడవడిగల రామలక్ష్మణులు ఆప్రదేశాన్ని చూసి, సంతోషంతో, దాన్ని గురించి
తెలుసుకోదలచి విశ్వామిత్రుడితో ఆపుణ్యప్రదేశమెవరిదనీ-అక్కడున్న ఆశ్రమం
ఎవరిదనీ-అక్కడెవరుంటారనీ అడుగుతారు.
(కౌసల్యా సుప్రజ అంటే:
ఎటువంటి మంచి బిడ్డను కనడం వల్ల కౌసల్య గొప్పదయిందోనని అర్థం.
ఇలానేచెప్పుకోవాలికాని, కౌసల్యయొక్క మంచి
కుమారుడు శ్రీరాముడు అని అర్థమొచ్చేటట్లు చెప్పుకోకూడదు. రామచంద్రమూర్తిని
కనినందువల్ల కౌసల్య ప్రసిద్ధికెక్కి ధన్యురాలైందికాని, కౌసల్యకు పుట్టినందువల్ల రాముడు ధన్యుడుకాలేదు. వాల్మీకి ఈ అర్థం
వచ్చేటట్లే రెండుమూడు సందర్భాల్లో చెప్తాడీవిషయాన్ని. తండ్రి పేరు చెప్పకుండా
తల్లిపేరెందుకు చెప్పాడంటే: శ్రీరామచంద్రమూర్తి నిద్రిస్తున్నప్పుడు భక్తులకు
శ్రీమంతుడు గానూ-శత్రువులకు సంహరించేవాడు గానూ కనిపిస్తాడు. కాబట్టి సుఖంగా
నిద్రిస్తున్న శ్రీరాముడిని లేపబోయిన విశ్వామిత్రుడు ఆయన నిద్రాకాలికసౌభాగ్యసంపత్తి
ని చూసి, తానొచ్చిన పని మర్చిపోయి, నివ్వెరపొంది, ఆహా! ఇలాంటి శ్రీమంతుడికి
తల్లి కావడానికి కౌసల్యా దేవి ఎంత తపస్సు చేసిందోకదా అని విస్మయంతో కౌసల్య
సుప్రజ అని సంబోధించాడు. మరో విషయం: వశిష్ఠుడు చెప్పిన తర్వాతే రాముడిని
పంపేందుకొప్పుకున్నాడు. కౌసల్యేమో, ఎంతపుత్రవాత్సల్యం వున్నా, సాదరంగా ఆలస్యం చేయకుండా అంగీకరించింది. ఆమేం చిక్కులుపెట్టుతుందోనని
సందేహించిన విశ్వామిత్రుడికి కౌసల్య గుణ మహిమ చూసి అబ్బురపడ్డాడు. అది జ్ఞప్తి
కొచ్చి ఆమె పేరు స్మరించాడిప్పుడు. దాశరథీ అనికానీ, కౌసలేయ అనికానీ, రాఘవా అనికానీ పిలువలేదు.
"రామా" అనడానికి కారణం: అతడి సౌందర్యానికి అచ్చెరువందడమే).
రాముడికి
వంగదేశ వృత్తాంతాన్ని చెప్పిన విశ్వామిత్రుడు
సర్వజ్ఞుడైన రాముడే ఏమీ
తెలియనివాడిలా తనను అడుగుతున్నాడని కానీ - ఏదేశమైతే మనకేంటనికానీ - మన దారిలో
మనంపోదామనికానీ అనుకోకుండా, బాలురు ఉత్సాహంతో సంగతులు
తెలుసుకోవాలనుకొంటున్నారుకదానని సంతోషంతో, చిరునవ్వుతో వారి ప్రశ్నకు సమాధానం చెప్పడం మొదలెట్టాడు
విశ్వామిత్రుడు. గొప్పదైన-భావరహితమైన ఆ ఆశ్రమ వృత్తాంతాన్ని వారికి
తెలియచేయసాగాడిలా: " పూర్వకాలంలో మన్మథుడు స్వరూపంతో కనిపించే రోజుల్లో
శివుడిక్కడ తపస్సు చేస్తుంటే, పార్వతి ఆయనకు సపర్యలు
చేస్తూండేది. శివుడి తపస్సును దుర్బుద్ధితో మన్మథుడు విఘ్నం చేస్తుంటే, కామాన్ని జ్ఞానాగ్నితో దగ్ధం చేయాలి కాబట్టి, తననొసటి మంటలతో మన్మథుడిని బూడిదచేసాడు శివుడు. అప్పటినుంచి దేహంలేని
మన్మథుడికి అనంగుడు అన్న పేరొచ్చింది. మన్మథుడిక్కడ అంగాన్ని వదలి నందువల్ల ఈదేశం
అంగ దేశం అని ప్రఖ్యాతిగాంచింది. అదే ఈ ఆశ్రమం.
ఇక్కడ కొందరు గొప్ప
తపస్వులు, రుద్రశిష్యులు, తరతరాలుగా-వంశపారంపర్యంగా వుంటున్నారు. వారందరూ పుణ్య కార్యాలే
చేస్తుంటారు కాబట్టి, వారికి పాపాలంటవు.
మనమీరోజు ఇక్కడేవుండి, రేపు సరయూ నదీజలాల్లో
స్నానంచేసి-శుద్ధులమై-పవిత్రమైన మంత్రాలను జపించి-అగ్నిహోత్ర కార్యాలను తీర్చుకొని, బ్రాహ్మణులను దర్శించేందుకు పోదాం". విశ్వామిత్రుడిలా
చెప్తుండగానే, తపస్సంపదవల్ల దూరదృష్ఠితో
చూసిన దేవర్షులు వీరొచ్చిన విషయాన్ని తెలుసుకొని బయలుదేరి అక్కడికే వచ్చారు.
వారొచ్చి, వీరినికలసి, విశ్వామిత్రుడికి అర్ఘ్యం-పాద్యం , రాజకుమారులకు ఆతిధ్యం ఇచ్చి ఆదరించారు. కథలలో కాలయాపనం చేసిన
ఆముగ్గురూ, సంధ్యవార్చి నిష్ఠతో
గాయత్ర్యాది మంత్రాలను జపించారు. ఆ తర్వాత
విశ్వామిత్రుడు కథలు చెప్తూ, హేయగుణాలులేకుండా-మనోహరమైన
కల్యాణ గుణాలే కలిగున్న రామలక్ష్మణులను నిద్దురపుచ్చాడు.
No comments:
Post a Comment