బాలకాండ
మందరమకరందం
సర్గ-27
శ్రీరాముడికి
దివ్యాస్త్రాలను
ఇచ్చిన విశ్వామిత్రుడు
వనం
జ్వాలా నరసింహారావు
ఆ విధంగా ఆ రాత్రి అక్కడే
నిదురించి,మర్నాడు-నాలుగవ రోజు ఉదయం
కాగానే, ముద్దుబాలకులైన రామ
లక్ష్మణులను నిద్ర లేపాడు విశ్వామిత్రుడు. శ్రీరామచంద్రమూర్తిని చూసి, " నాయనా,రామా ! రామచంద్రా ! నీ నడవడికి నాకెంతో సంతోషం కలిగింది.
మనుష్యులనైనా, దేవతలనైనా, రాక్షసులనైనా, యక్షులనైనా, గంధర్వ-కిన్నర-గరుడ-సిద్ధుల సమూహాలనైనా, యుద్ధభూమిలో జయించగల శ్రేష్ఠమైన అనేక అస్త్రాలను నీకిస్తాను. తీసుకో.
వీటితో నువ్వెట్టి శత్రువునైనా అణచి, వశపర్చుకోగల శూరుడివై భూమిపై ప్రసిద్ధికెక్కుతావు" అని అంటాడు.
తానివ్వబోయే అస్త్రాలను వివరిస్తాడీవిధంగా విశ్వామిత్రుడు:
"దండ చక్రం-ధర్మచక్రం-కాలచక్రం-విష్ణుచక్రం-ఐంద్రాస్త్రం-భయంకరమైన వజ్రాస్త్రం-శివ
శూలం- బ్రహ్మ శిరం-ఐషీకం-బ్రహ్మాస్త్రం-మోదకీ శిఖరులనే రెండు గదలు-వరుణ
పాశం-వారుణాస్త్రం-ధర్మ పాశం -కాల పాశం-ఆర్ద్రం, శుష్కం అనే పేర్లున్న యశనులు (పిడుగులు)-నారాయణాస్త్రం-పైనాకం- అగ్ని
దేవతాకమైన ఆగ్నేయాస్త్రం -శిఖరాస్త్రం- వాయువ్యాస్త్రం- హయశిరోస్త్రం
-క్రౌంచాస్త్రం-రాక్షసులు ధరించే కంకాలం, ముసలం, కంకణం, కాపాలం - వైద్యాధరాస్త్రం-నందనం అనే ఖడ్గం-మానవాస్త్రం-గాంధర్వాస్త్రం-
ప్రశమనం-ప్రస్వాపనం-భాస్కరాస్త్రం- దర్పణం - శోషణం - సంతాపనం - విలాపనం -
కందర్పుడికి ప్రియమైన దర్పకాస్త్రం-పైశాచాస్త్రం-మోహనం-సంవర్తకం - దామనంబు - సౌమనం
- త్వష్ట్రస్త్రమైన సుదామనం - భర్గాస్త్రం – శీతాస్త్రం - సౌరాస్త్రం". ఈ
అస్త్రాలన్ని కామరూపాలనీ, మహాబలవంతమైనవనీ అంటూ, విశ్వామిత్రుడు అన్నిటినీ రాముడికిచ్చెదను తీసుకొమ్మంటాడు.
అంటూనే, తూర్పు ముఖంగా శుచిగా ఆచమానం చేసి, ఆ అస్త్రాల మంత్రాలను ఆయనకు ఉపదేశించాడు. ఇన్ని అస్త్రాలను ఒక్కడే
సంపాదించాలంటే దేవతలకైనా సాధ్యపడదు.వాటన్నిటినీ విశ్వామిత్రుడు ఉదార బుద్ధితో
శ్రీరాముడికిచ్చాడు. శ్రీరాముడు కూడా మిక్కిలి నిష్ఠతో జపం చేసింతర్వాత, మునీంద్రుడి ఆజ్ఞ ప్రకారం, ఆ అస్త్ర-శస్త్ర సమూహాలన్ని, భృత్యులై రామచంద్రమూర్తిని సేవించాయి. తనకు ప్రత్యక్షమైన అస్త్ర
దేవతలందరినీ తన హస్త పద్మాలతో తాకి, స్వీకరించి, తనకు అవసరమైనప్పుడు
పిలుస్తాను-అప్పుడొచ్చి తన అవసరాన్ని తీర్చమని-ప్రస్తుతానికి పొమ్మని వారికి
సెలవీయగా, వారందరూ తమ తమ
ఇష్టానుసారంగా వెళ్లిపోయారు. శ్రీరామచంద్రుడు సంతోషం అతిశయించగా, వికసించిన మనస్సుతో, విశ్వామిత్రుడికి
నమస్కరించి ప్రయాణమై పోతూ, తనకున్న సందేహాలను
ఆయన్నడిగి తీర్చుకుంటాడు.
No comments:
Post a Comment