Monday, January 25, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-32 : తమ వంశ కథను శ్రీరాముడికి చెప్పిన విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-32
తమ వంశ కథను 
శ్రీరాముడికి చెప్పిన విశ్వామిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు

శిష్యుడు గురు వంశ పరంపరను-గురువు మహత్యాన్ని, అవశ్యం తెలుసుకోవాలి కనుక, విశ్వామిత్రుడు తన వంశ చరిత్రను తానే తెలిపాడు.అయితే, తన మహత్యాన్ని తానే చెప్పుకోకూడదు కాబట్టి, తన విషయాన్ని తెలిసిన ఇతరులతో చెప్పించాలన్న వుద్దేశంతో, ఆ విషయాలను శతానందుడు ద్వారా శ్రీరామ లక్ష్మణులు తెలుసుకోవడం జరిగింది వివరంగా.

పూర్వ కాలంలో నిర్విఘ్నంగా తపస్సు చేసినవాడు-బ్రహ్మ పుత్రుడు-కుచ్చితపు జనులను దండించే వాడు-లోకులకు, తనకు మేలుగలిగించే దానిని తెలిసిన వాడు-సాధు వశుడు-గొప్ప మహిమగలవాడైన నైకుశుడనేవాడుండే వాడు. మిక్కిలి సద్గుణాలు కలిగి-గొప్ప వంశంలో పుట్టిన రత్నం లాంటి విదర్భ రాజు కూతురుని తనకు భార్యగా చేసుకుని, నైకుశుడు తనతో సమానమైన నిర్మల గుణాలున్న నలుగురు కొడుకులను ఆమె గర్భంలో కన్నాడు. (కుశుడు బ్రహ్మ పుత్రుడైనా, ఆయన కొడుకులు క్షత్రియ స్త్రీకి జన్మించి, క్షత్రియ వృత్తిలో చరించారు కాబట్టి వారూ క్షత్రియులయ్యారు. రావణాసురుడు అలాంటి వాడే). నైకుశుడి నలుగురు కొడుకుల పేర్లు: కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు. వారందరు తేజోవంతులు-ఉత్సాహం, ధైర్యం గలవారు-అత శూరులు. కుశుడు బ్రహ్మ కొడుకైనా కుమారుల విషయంలో క్షత్రియ ధర్మాన్నే పాటించ దలచి, కొడుకులతో, పుణ్యమతిశయించే భూమి పరిపాలన చేయమని ఆదేశించాడు. కీర్తిమంతులైన ఆ నలుగురు, తండ్రి చెప్పినట్లే తమకు యోగ్యమైన ప్రదేశాలను ఎంచుకుని, న్యాయంగా-పరిశుద్ధంగా-ప్రజలు చెడిపోకుండా-ప్రీతితో-పరాక్రమంతో, జనులందరూ తమను గౌరవిస్తుంటే రాజులై రాజ్యమేలారు.

కుశాంబుడు తన పేరుమీద "కౌశాంబి" అనే నగరాన్ని- కుశనాభుడు "మహోదయం" అనే పట్టణాన్ని - ఆధూర్తరజసుడు "ధర్మారణ్యం" అనే నగరాన్ని - వసువు " గిరివ్రజ పురాన్ని కట్టించి, వాటిని తమ రాజ్యాలకు రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఆ నలుగురిలో వసువు పాలించిన గిరివ్రజ పురం రాజధానిగా వున్న ప్రదేశం ఇదే. ఐదు మహా పర్వతాలు ఈ ప్రదేశాన్ని చుట్టి కోట గోడల వలె రక్షిస్తుంటాయి. మగధ దేశంలో పుట్టిన శోణ నది ఈ పర్వతాల మధ్య రాజ్యలక్ష్మి ధరించిన ముత్యాల సరం లాగా ప్రవహిస్తుంటుంది. శోణ నది పడమటి ముఖంగా పారుతుంది. వసువు చేసిన ప్రయత్నాలవలన ఈ ప్రదేశం ఎంతో వృద్ధి చెందింది. ఇంద్ర వైభవంతో సమానమైన వైభవం కల కుశనాభుడు, సుందరి-చిరునవ్వులు చిందించేదైన "ఘృతాచి" ని పెళ్లి చేసుకుని, రూప-విలాస అతిశయం గలిగి, లోకమంతా గౌరవించే మంచి తేజస్సు-నిర్మల ప్రీతి కల వంద మంది కన్యలను కన్నాడు.

కుశనాభుడి పుత్రికల వృత్తాంతం

పూచిన తంగేడు చెట్ల లాంటి శరీరాలతో బంగారు కాంతులు వ్యాపింప చేస్తూ-వికసించిన మల్లె పూల లాంటి నడుంతో వయ్యారంగా వూదితే ఎగిరిపోతారానే సొగసుతో-విచ్చిన అశోకాల లాంటి సొమ్ములను, కెంపులను ధరించి తళ తళమనే కాంతులు చిమ్ముతూ-గాలికి వడికిన మన్మథ ధ్వజాలనదగిన పైటలు వంటి మీదనుండి జారుతుంటే, నిండు వయసు వికాసంతో అతిశయించిన చిలుకల దండు వచ్చిందా అన్న రీతిలో, ఒయ్యారాలొలికిస్తూ, ఆ వంద మంది గజగమనలు, ఒకనాడు ఉద్యానవనంలో ప్రవేశించారు. చేతుల్లో వీణలు ధరించి, విలాస చేష్టలతో మనసులు సంతోషిస్తుంటే, వానాకాలపు మెరుపులలాగా, మనోహరమైన శరీరాలను అందంగా ఆటల్లో ముంచి-విలాసంగా పాడుతూ-మబ్బుల మధ్య చుక్కల్లా వారందరు ఉద్యానవనంలో విహరించారు.


అలా సమానమైన అందంతో-ప్రాయంతో ప్రకాశిస్తూ, రత్నాలు చెక్కిన ఒడ్డాణాలు ధరించిన ఆ సుందరాంగులను చూసి, ఆశ్చర్య పడి, మన్మథుడి ప్రభావంతో వికసించిన మనస్కుడైన వాయుదేవుడు, ఆ కన్యలందరినీ తన భార్యలు కమ్మని కోరాడు. తన కోరికను వాళ్లు ఒప్పుకుంటే, వారికి మనుష్యత్వం పోయి-దీర్ఘాయువు, సంపద కలిగి ఆనందంతో వుండొచ్చని అంటాడు వాయుదేవుడు. "చక్కని అవయవాలున్న వనితలారా ! మిమ్మల్ని చూసినప్పటి నుండి, మదన తాపంతో-విస్తార మోహంతో బాధ పడుతున్నాను. కాబట్టి మిమ్మల్ని కౌగలించుకుంటే కలిగే సుఖాన్ని నా కివ్వండి. మీకు దేవత్వాన్ని కలిగిస్తాను. మీరు దీర్ఘకాలం యౌవనం కలిగి సుఖించవచ్చు. మనుష్యులలో యవ్వనం శాశ్వతం కాదనే విషయం మీకు తెలిసిందే. మీరు నాకు భార్యలై నాతో సాంగత్యం చేస్తే, మీకు మరణం లేకుండా దేవత్వం లభిస్తుంది" అన్న వాయుదేవుడితో పరిహాసంగా జవాబిచ్చారు ఆ కన్యలీవిధంగా:

"జగత్ ప్రాణా ! ప్రీతితో సమస్త భూత కోటులను రక్షించే వాడవని కీర్తి పొందిన నిన్ను తెలియని వారు లేరు. చరా చరాలన్నిటికీ అంతరాత్మవైన నీవంటి మహాత్ములు, న్యాయ మార్గం తప్పి, దిగ్భ్రమ కలిగించే ఆడపిల్లలను చూడగానే ఇలా అవమానించే మాటలు అనదగునా? ఇంత గొప్పవాడవైన నీవు, కుల కన్యకా ధర్మం తెలియక, వార స్త్రీలతో-కులటలతో మాట్లాడినట్లు మాట్లాడడం నీతి కాదు. వాయుదేవా ! నువ్వు ఇతరులను పవిత్రులను చేసేవాడివి కనుకనే ’పవనుడు-పవమానుడు’ అన్న పేరొచ్చింది. ఇలా నీవు అధర్మ కార్యాలకు పూనుకుంటే, అపవిత్రుడవై, ఇతరులను పవిత్రులుగా చేయలేవు. అప్పుడు పవమానుడనే పేరు నీకు నేతి బీరకాయ లాంటిదే. ఇంత సాహసం చేసిన నిన్ను, మా తపోబలంతో శపించి-వధించగలం. కాని, కోపిస్తే, మా తపస్సు వ్యర్థమవుతుందని వూరుకుంటున్నాం. ఈ కుశనాభుడి కూతుర్లను నువ్వెరుగవు-అందుకే జారిణులతో మాట్లాడినట్లు మాట్లాడావు. మన్మథుడు నీ కళ్లల్లో దుమ్ము కొడుతుంటే, మేమేవరిమో తెలుసుకోవడం నీకు సాధ్యంకాదు. ఈ వార్త మా తండ్రికి తెలిస్తే, నిన్ను చంపకుండా వుండడు. ఆయనకు చేరక ముందే వెళ్లిపో. ఆయన్ను అలక్ష్య దృష్టితో చూడొద్దు-కన్యా దాన ఫలం ఆయనకు రాకుండా చేయొద్దు. రాకుమార్తెలమైనా, వయసొచ్చిన వారిమైనా, స్వయంవరాధికారం మాకున్నా, మా తండ్రికి కన్యాదాన ఫలం లేకుండా చేసే పనిని మేమంగీకరించం. మాకు తండ్రే దైవం-రాజు. ఆయన సమ్మతించి ఎవరికిస్తే వారే మా భర్త. మామాట విని నీచపు మాటలు మాని వెళ్లిపో".


ఇలా ఆ కన్యలు జంకు లేకుండా జవాబివ్వగా కోపించిన వాయుదేవుడు, వాళ్ల శరీరాల్లో జొరబడి, దయ లేకుండా, వారి అవయవాలు వంకర-టింకర పోయేటట్లు చేశాడు. బిగుసుకున్న దేహాలతో, వంకర నడకలతో, పొట్టి తొడలతో, చూసేందుకు వికారమైన శరీరాలతో రాకూడనంత వేగంతో ఇళ్లకు తిరిగొచ్చారు వారు. ఇంటికి పోయి-సిగ్గుతో నేలపైపడున్న బిడ్డలను చూసిన తండ్రి, నిబ్బరం వదిలి-విచారంతో-తొట్రుపాటుతో, ఏ పాపాత్ముడు నియమం చెడి వాళ్లనిట్లా చేశాడని అడుగుతాడు. కన్నీరు కారుస్తూ, నేలపై పడి పొర్లుతూ, ఏడుస్తుంటే ఎవరిలా చేటు కాలం సమీపించి వాళ్ల దుఃఖానికి కారణమయ్యారో చెప్పమని కుశనాభుడు కూతుళ్లనడిగి వారి జవాబుకొరకు నిరీక్షించాడు.

No comments:

Post a Comment