క్రీమీలేయర్
: భావన, చరిత్ర
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (09-01-2016)
వనం
జ్వాలా నరసింహారావు
బీసీ రిజర్వేషన్ల
అమలు ప్రక్రియలో భాగంగా,
సంపన్న శ్రేణిని
గుర్తించడానికి, క్రీమీలేయర్ సూత్రాన్ని పాటించాలని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, వెనుకబడిన
తరగతులకు చెందిన కొందరు వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో, దీనికి
సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకోవాల్సిన అవసరం వుంది. మొట్టమొదటగా అందరూ తెలుసుకోవాల్సింది
ఇదంతా కేవలం సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అమలు చేస్తున్నదనే విషయం.
రిజర్వేషన్ కేటగిరీకి చెందిన కులాల వారిలో, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత-సంపన్న శ్రేణికి చెంది, అభివృద్ధి పొందిన వారికి, అదే కులాలకు చెంది ఇంకా అన్ని విధాలా
వెనుకబడి వున్నవారికి
మధ్య వున్న భేదాన్ని ఎత్తి
చూపేందుకు అనుసరించే పద్ధతిని క్రీమీ లేయర్ సూత్రంగా పిలుస్తున్నారు. నవంబర్ 2014 లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన
ఉత్తర్వులో, బీసీలలో క్రీమీ లేయర్ ఎవరు అనే
విషయంలో, దీనికి సంబంధించి సుప్రీం కోర్ట్
ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని, తదనుగుణంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన పద్ధతిని యధాతథంగా మాత్రమే తెలంగాణ ప్రభుత్వం
అనుసరించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిబ్బంది-ఫిర్యాదులు-పింఛన్ల మంత్రిత్వ శాఖ నిర్ణయించిన
ఆదాయ పరిమితి విధానాన్ని,
దానిని ఆమోదించిన ఉమ్మడి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధించిన పరిమితిని, తెలంగాణ ప్రభుత్వం కూడా అనుకరించింది. సంవత్సరానికి ఆరు లక్షల రూపాయల ఆదాయ
పరిమితిని దాటిన వారిని మాత్రమే బీసీలలో క్రీమీలేయర్ కింద పరిగణించాలని ఆ నిర్ణయం
సారాంశం. కాకపోతే, ఈ ఆదాయ పరిమితిని లెక్కించేటప్పుడు, వ్యవసాయ ఆదాయం మీద, ఉద్యోగ వర్గం వారి జీత భత్యాల మీద
వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకూడదని కూడా నిర్ణయించారు.
తార-తమ్యాలు, అంతరాలు లేని సమసమాజం ఏర్పడాలంటే, సామాజిక-ఆర్థిక అసమానతలు తక్షణం
తొలగిపోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. రిజర్వేషన్ల
అమలు వల్ల చేకూరే లాభాలు అసలు-సిసలైన అర్హత కలవారికి మాత్రమే చెందాలి అని పలువురి
అభిప్రాయం. వీరికి నిజంగా లబ్ది చేకూరాలంటే, క్రీమీలేయర్ కు చెందిన బీసీలలోని
సంపన్న శ్రేణి వారికి విద్యా సంస్థలలో కాని, ఉద్యోగ
నియామకాలలో కాని రిజర్వేషన్ లేకుండా చేయాల్సిందే. అత్యంత
ప్రాముఖ్యత సంతరించుకున్న ఒకానొక కేసులో తీర్పు ఇచ్చిన భారత దేశ అత్యున్నత
న్యాయస్థానం, బీసీలకు చెందిన వారికి, ఆర్థికంగా-సామాజికంగా వెనుకబాటు తనం
వున్నంత కాలం మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం వుండాలి కాని, నిరవధికంగా అమలు చేయడం భావ్యం
కాదన్నారు. ఆ తీర్పులో పేర్కొన్న ముఖ్యాంశాలలో
ఇంకా ఇలా వుంది: "సమాజం అనేది ఎల్లకాలం కదలిక లేకుండా స్థిరంగా వుండదు.
పారిశ్రామికీకరణ, నగరీకరణ, రాజకీయ-ఆర్థిక-సామాజిక రంగాలలో
పురోగతి, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత గత
ఆరేడు దశాబ్దాల కాలంలో చోటుచేసుకున్న సాంఘిక-సంస్కరణోద్యమాలు, బహుముఖ విద్యా వ్యాప్తి, కల కాలం అమల్లో వున్న రిజర్వేషన్ల
లాంటి ప్రత్యేక సౌకర్యాలు...ఇలాంటి మరెన్నో రకాల కారణాలు, వెనుకబడిన తరగతులకు చెందిన చాలా మంది
కాకపోయినా, కనీసం కొద్ది మందైనా (వారి సంఖ్య తక్కువే కావచ్చు) వ్యక్తిగతం
గాను-కుటుంబ పరంగాను,
అన్ని రంగాలలో మరెవరికీ
తీసిపోని విధంగా సమర్థవంతంగా-దక్షతతో పోటీ చేసే స్థాయికి ఎదిగారు. ఇది కాదనలేని
యదార్థం. ఇలా ఎదిగినవారు,
జన్మతహా వెనుకబడిన కులాలకు
చెందిన వారైనప్పటికీ,
న్యాయ పరంగా మాట్లాడితే, వారు వెనుకబడిన వారి జాబితాలోకి రాకూడదు.
ఒక సారి వెనుకబడిన తరగతులకు చెందిన వారిగా గుర్తించబడిన వారు, ఇక ఎల్లప్పుడూ అలానే వుంటారనడానికి
వీల్లేదు. అలా వుండాలి అని భావిస్తే, వెనుకబడిన తరగతులకు చెందిన వారు, అగ్రశ్రేణి కులాలకు చెందిన వారితో
పోటీ పడే స్థాయికి ఎదగాలన్న ధ్యేయంతో రాజ్యాంగంలో కలిగించిన ప్రత్యేక రక్షణల
ప్రధానోద్దేశం వీగి పోతుంది".
నవంబర్
16, 1990 న క్రీమీలేయర్ కు సంబంధించిన ఒక
కేసులో చారిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు, కొన్ని
ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేసింది. ఒక పరిమితి దాటి ఆదాయం వున్నవారి విషయంలో
రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన అంశం అందులో ప్రధానమైంది. కేసు వేసిన పిటీషన్
దారుడు, బీసీ కులాలకు చెందిన కొందరు
సామాజికంగా-ఆర్థికంగా-విద్యా పరంగా బాగా ఎదిగారని, అలాంటివారిని
అగ్ర శ్రేణి వారిగా భావించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ప్రతివాదులు దీన్ని
తీవ్రంగా వ్యతిరేకించారు. "క్రీమీలేయర్" అనే పదమే ఒక "కుతంత్రం"
అని,
"ఉపాయం"
అని, దాని ద్వారా బీసీలకు రిజర్వేషన్లు లేకుండా
చేసే ఎత్తుగడ అని వారు వాదించారు. ఎవరో కొందరు అదృష్ట సంపన్న శ్రేణి బీసీలు తమకు కేటాయించిన
రిజర్వేషన్ సీట్లను,
ఉద్యోగాలను లాక్కొని పోయినంత
మాత్రాన, రిజర్వేషన్లు అవసరం లేదని అనడం భావ్యం
కాదన్నారు.
ఈ
వాదనలకు స్పందించిన న్యాయమూర్తులు, ఏదైనా
"క్లాస్" లేదా” తరగతి" అంటే, విశిష్టమైన
ఉమ్మడి లక్షణాల బృందం అని,
ఈ తరగతికి చెందిన వారికి, ఇతరులకు ప్రత్యేకమైన తేడా వుంటుందని
వ్యాఖ్యానించారు. వారందరి మధ్య వున్న ఉమ్మడి లంకె, సామాజిక
వెనుకబాటుతనమే అయితే,
అది అందరికీ ఒకే విధంగా
వర్తించాలని అన్నారు. అలా కాకుండా వారిలో కొందరు, మిగతా
వారికంటే ఉచ్చ స్థితికి చేరుకుని,
రాజకీయంగా-ఆర్థికంగా-విద్యా
పరంగా ఎదుగుతే, వారికీ, వారికంటే
వెనుకబడి వున్న ఇతరులకూ మధ్య వున్న ఉమ్మడి లంకే తెగిపోయినట్లే భావించాలన్నారు.
అలాంటి వారు వెనుకబడిన తరగతులకు చెందిన వారిలో కొనసాగడానికి అనర్హులని
అభిప్రాయపడ్డారు. స్పందనను కొనసాగిస్తూ...రిజర్వేషన్ల ప్రక్రియలో ఆదాయ పరిమితి
విధించడం అనేది, ఆచరణలో బహు క్లిష్ట తరమైన విషయమని
కూడా వారన్నారు. అభివృద్ధి చెందిన వారికి, వెనుకబడిన
వారికి మధ్య గీసే గీత వాస్తవానికి దగ్గరగా వుండాలి. అలాంటి ఏర్పాటు దేశం
మొత్తానికి ఒకే విధంగా వుండాలా?
రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మారుతుందా? నగరాలకు, పల్లెలకు మధ్య తేడాలుండాలా? అనే విషయం తేలాలని
న్యాయమూర్తులన్నారు. అలానే వ్యవసాయంపై వచ్చే ఆదాయం సరిగ్గా లెక్కించడం కష్టమని, అలాంటప్పుడు వారికున్న భూమి విలువ
పరిగణలోకి తీసుకోవాలా అనేది కూడా ఆలోచించాలని చెప్పారు న్యాయమూర్తులు.
న్యాయ
మూర్తుల అభిప్రాయంలో...ఆదాయ పరిమితి ఎలా వుండాలంటే, అది
స్పష్టంగా, సాంఘికంగా ఎదుగుదల కనపడాలి. అదే
విధంగా, ఆదాయానికి సంబంధం లేకుండా, సమాజంలోని కొంత మందిని, వారి ఉద్యోగ రీత్యానో, స్థాయి రీత్యానో, ఏ విధమైన విచారణ చేయకుండానే, సాంఘికంగా ఎదిగారని భావించాల్సి
వుంటుంది. ఉదాహరణకు,
బీసీ కులాలకు చెందిన వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్ లేదా మరే ఇతర అఖిల భారత
సర్వీసులకు చెందిన ఉద్యోగి అయితే,
సమాజంలో వారి అంతస్తు పెరుగుతుంది కాబట్టి, అలాంటి వారిని సామాజికంగా వెనుకబడిన
వారిగా గుర్తించడానికి వీల్లేదు. వారి సంతానానికి వాళ్ల శక్తి-సామర్ధ్యాలకు తగిన
అవకాశాలు పొందడానికి అందరి లాగే మార్గాలుంటాయి. జీవన యానంలో, పోటీకి దిగడానికి, వారికి ఏ విధమైన ప్రతిబంధకాలు లేవు.
వారి జీత భత్యాలు కూడా అవసరాలకు అనుగుణంగానే వుంటాయి. ఈ నేపధ్యంలో వారి సంతానానికి
రిజర్వేషన్ సౌకర్యం కలిగించడం సమంజసం కాదు. అలా వారికి కలిగిస్తే, వెనుకబడిన తరగతులకు చెందిన ఇతరులకు
అన్యాయం చేసినట్లే.
ఈ
నేపధ్యంలో, న్యాయ మూర్తులు పేర్కొన్న పలు అంశాలు
దృష్టిలో వుంచుకుని,
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం
కోర్టు కొన్ని ఆదేశాలిచ్చింది. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల నుంచి ఎవరెవరిని
మినహాయించాలి? ఆ మినహాయింపు ఆదాయం ఆధారంగా జరగాలా? వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగానా? ఎవరెవరిని క్రీమీలేయర్ గా పరిగణించాలి? తేల్చమని అడిగింది కోర్టు. అలా
ఏర్పాటు జరిగిన తరువాత,
ఆ కేటగిరీలోకి వచ్చే
వారందరినీ వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ అర్హుల జాబితా నుంచి తొలగించాలని కోర్టు
చెప్పింది.
కోర్టు
ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 1993 లో మార్గదర్శకాలను ప్రకటించింది. కేంద్ర
ప్రభుత్వం కింద వచ్చే ఖాళీలను,
మొత్తం ఉద్యోగాలలో 27%
ఓబీసీలకు ప్రత్యక్ష నియామక పద్ధతి ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. మెరిట్
ఆధారంగా ఓపెన్ కేటగిరీ కింద వచ్చే ఓబీసీ అభ్యర్థులను, రిజర్వేషన్ కోటా కింద వచ్చే 27% ఖాళీలలో భర్తీ చేయడానికి వీల్లేదు.
రిజర్వేషన్ కేటగిరీ నుంచి మినహాయింపు సూత్రం, ఆర్టిజాన్లకు, వారసత్వ కుల వృత్తుల వారికి
వర్తించదు. మొదటగా,
మండల్ కమీషన్ నివేదిక లో, రాష్ట్ర ప్రభుత్వాల లిస్టులలో, ఉమ్మడిగా పేర్కొన్న కులాలు-కమ్యూనిటీల వారికి చెందిన వారిని పైన
పేర్కొనబడిన ఓబీసీ రిజర్వేషన్ల జాబితాలోకి వచ్చే వారిగా పరిగణిస్తారు. ఉత్తర్వులు
తక్షణమే అమల్లోకి వస్తాయని మార్గదర్శకాలలో పేర్కొనింది ప్రభుత్వం. దరిమిలా, విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులో, క్రీమీలేయర్ ఆదాయాన్ని ఎలా
నిర్ధారించాలి అనే అంశం పేర్కొనడం జరిగింది. జీతాల కింద వచ్చే ఆదాయాన్ని, వ్యవసాయం మీద వచ్చే ఆదాయాన్ని, క్రీమీలేయర్ నిర్ధారిత ఆదాయంగా
పరిగణలోకి తీసుకోరు. గణనలోకి తీసుకోవాల్సిన ఆదాయ పరిమితిని 1993 లో ఒక లక్ష రూపాయలు గాను, దరిమిలా మే నెల 2003 నాటికి ఆరు లక్షల
రూపాయలు గాను నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, ఏప్రియల్ 4, 2006 న, బీసీ
లలో క్రీమీలేయర్ నిర్ణయించడానికి,
కేంద్ర మార్గదర్శకాలను
అన్వయించుకుంటూ, ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే
అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ పరిమితి (రు. 2.5 లక్షలు) కంటే కొంచెం
ఎక్కువగా రు. 4 లక్షలుగా నిర్ణయించింది. దరిమిలా, కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డిసెంబర్ 9, 2013 న, రు. 6 లక్షలకు
పెంచింది.
ఈ
విధంగా మొదలైన ప్రక్రియను...సుప్రీం కోర్టు ఆదేశాలు, కేంద్ర
ప్రభుత్వ ఉత్తర్వులు,
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆ
ఉత్తర్వులను అన్వయించుకుంటూ నిర్ణయం తీసుకోవడం...తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు
చేయాలని నిర్ణయించింది. ఇందులో తప్పు బట్టాల్సిన పని లేదు. ఆందోళన అంతకంటే అవసరం
లేదు.End
creamy layer concept is good and should be implemented to help the people privileged less. all the income tax payers should be excluded from all sorts of reservation including SC /ST/OBC. reservations in promotions is atrocious.
ReplyDelete