బాలకాండ
మందరమకరందం
సర్గ-20
శ్రీరాముడిని
పంపదలచక పరితపిస్తున్న దశరథుడు
వనం జ్వాలా నరసింహారావు
అలా కొంత సేపు స్మృతి
తప్పిన దశరథుడు, కోలుకొని, ధైర్యం తెచ్చుకొని, కొడుకుమీదుండే మోహంతో - పామరత్వంతో - శ్రీరాముడి మూల్యాన్నే ఎంచుతూ, ఆయన మహాత్మ్యాన్ని గురించి విశ్వామిత్రుడు చెప్పిన మాటలన్నీ మరచిపోయి, రామచంద్రమూర్తిని పంపలేనని చెప్పడం మొదలెట్టాడీవిధంగా: "అయ్యా!
విశ్వామిత్ర మహామునీ! నువ్వు విశ్వానికంతా మిత్రుడవు కనుకనే విశ్వామిత్రుడనే
పేరొచ్చింది. అలాంటప్పుడు, నా విషయంలో ఎందుకు
అమిత్రుడవు కావాలి? ’మా రాముడు’ ఇంకా బాలక్రీడలలోనే
వినోదం పొందుతున్నాడు. పదహారు సంవత్సరాలింకా
నిండలేదు. అందుకే యుద్ధయోగ్యుడుకాదు. కమలనేత్రుడైన రాముడు, సూర్యాస్తమయంకాగానే, కమలాలు ముకుళించినట్లే, నిద్రతో కళ్ళు మూసుకుపోయేవాడు. రాత్రివేళలే సంచరిస్తూ - రాత్రులలో
ఎక్కువ బలవంతులైన రాక్షసులతో యుద్ధం ఎలా చేస్తాడు? విశ్వామిత్రా! యజ్ఞం రక్షించబడడమే కదా నీకు కావాల్సింది - దానిని
నేను నెరవేరుస్తాను. నా దగ్గర ఒక అక్షౌణి సైన్యముంది - ఈ సేననంతా తీసుకొని నీ వెంట
వస్తాను. నా భటులందరూ అస్త్ర-శస్త్ర విద్యలలో ఆరితేరినవారే - సమర్థులే - వీరులే -
రాక్షసులతో యుద్ధంచేయడానికి శక్తి వున్నవారే - మిక్కిలి సాహస వంతులే. సేనను
మాత్రమే పంపక, నేనూ కోదండధరుడనై యుద్ధ
భటులతో సహా వచ్చి, నీ యాగాన్ని నా
ప్రాణమున్నంతవరకూ రాక్షసులతో యుద్ధంచేసి రక్షించెదనని మాట ఇస్తున్నాను. నన్ను
నమ్ము. మునీంద్రా! నువ్వడిగిన పని, కాకలుతీరిన యోధులమైన మాకే కష్ఠసాధ్యమని అనుకుంటే, యుద్ధయోగ్యుడుకాని పసికూనను - విలువిద్య చక్కగా తెలియనివాడిని -
బలవంతుడెవరో, బలహీనుడెవరో, ఎవరితో ఎట్లా పోరాడాల్నో ఏమాత్రం తెలియనివాడిని - యుద్ధనైపుణ్యంలేని పాలబుగ్గల
పసివాడిని - మంచివారితో మెలగగలడేకాని, దుష్టుల నడవడి తెలియనివాడిని - రాముడిని నీవు రాక్షసులతో యుద్ధం
చేయడానికి తీసుకొనిపోవడం న్యాయమేనా?”
“కౌశికనందనా! కులం రీత్యా, గుణం రీత్యా నీచులు - ఉగ్గుపాలతో వంచన నేర్చినవారు - మనుష్యులను తినే
వారైన రాక్షసులను వధించేందుకు, గొప్ప కులంలో పుట్టి -
గొప్పగుణంకలవాడై - వంచనంటే ఏంటో తెలియనివాడైన సామాన్య మనుష్యుడు - పుట్టు
వెంట్రుకలు కూడా ఇంకా తీయని పసిబాలుడు రాముడు, సమర్థుడని, గొప్పమనస్సున్న
ఆలోచనాపరుడివైన నువ్వెట్లా అనుకున్నావయ్యా? మునీశ్వరా! మా రాముడు రాత్రివేళల్లో, పక్కలో ఎవరైనా లేకపోతే నిద్రపోడు – చీకట్లో వొంటరిగా పొమ్మంటే
ఏడుస్తాడు. అలాంటివాడు కారడవుల్లో - గుట్టల్లో - మిట్టల్లో, నీ వెంట ఎట్లా నడుస్తాడు? ఒకవేళ వాడు నడిచినా నామనసెట్లా సహిస్తుంది? వాడు నాప్రాణం - వాడు కష్ఠపడితే నాప్రాణం పోయినట్లే. రాత్రుల్లో
తల్లి దగ్గర పండుకొని, ఆమె చేయినే దిండుగా తన
తలకిందుంచుకొని, తల్లి రెండో చేతిని తనమీద
వేసుకొని, ఆమె చెప్పే కథలకు ఊ
కొటుతూ నిద్రపోయే బాలుడు, ముళ్ళలో - కటిక నేలపై
ఎట్లా నిద్రపోతాడయ్యా? వాడికింకా బుగ్గలు
గిల్లితే పాలుకారుతాయే! ఒకరి చాటున వుండవలసిన పసివాడు, అడవుల్లో కంద మూలాలు తింటూ, రాక్షసులతో యుద్ధంచేయడమంటే, అదెంత అసంభావితమైన కార్యమో ఆలోచించు. అయ్యా! శ్రీరామచంద్రమూర్తంటే
నాకు నాప్రాణంతో సమానం. వాడికి, నాకు ఎడబాటు కలిగిస్తే
నాప్రాణం ఈ దేహంలో వుండదు. నేను చనిపోవడం నీకిష్ఠంలేకుంటే రాముడిని
తీసుకొనిపోవద్దు. నాకిప్పుడు అరవైవేల ఏళ్ళ వయస్సు. లేకలేక బిడ్డలు పుట్టారు.
ఈవయస్సులో మమ్మల్ని వాడితో వేరుచేయవద్దు. నాకున్న నలుగురు కొడుకుల్లో ఒకడినే కదా
అడుగుతున్నానంటావేమో. నలుగురున్నా, జ్యేష్టపుత్రుడే నిజమైన పుత్రుడు. పైగా వాడు మిక్కిలి ధర్మాత్ముడు.
వాడినెట్లా పంపిస్తా? పంపితే ఎట్లా జీవిస్తా?".
(శ్రీ మహావిష్ణువు
అవతారమైన శ్రీరామచంద్రమూర్తి మహాత్మ్యాన్ని విశ్వామిత్రుడు చెప్పినప్పటికీ, దశరథుడింకా "మారాముడు", "పసిబాలుడు", "బాలక్రీడారాముడు"
అనే అంటాడు. పామరత్వంతో - పుత్రవ్యామోహాన్ని వదలలేకపోతాడు. పదహారేళ్ళుకూడా
నిండనివాడు రాముడంటాడు. మైనారిటీ తీరలేదనే అర్థం స్ఫురిస్తుందాయన మాటల్లో.
యుద్ధార్హుడు కాకపోవడానికి కారణం కేవలం వయసు తక్కువగా వుండడమే కాదు - రాక్షసుల
స్వభావం తెలియనివాడైనందున యుద్ధంచేయలేడని దశరథుడి ఉద్దేశం.
దశరథుడి మాటల ప్రకారం, శ్రీరాముడి కప్పుడు పదహారో సంవత్సరం నడుస్తున్నదనుకోవాలి. ఆ
వయస్సులోనే కొన్నిరోజులతర్వాత వివాహం జరిగింది. ఆ తర్వాత పన్నెండేళ్లు అయోధ్యలో
గడిపాడు. అయోధ్యకాండలో ఒకానొక చోట సీతాదేవి చెప్పిందాన్ని బట్టి, శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు ఆయన వయస్సు 28 సంవత్సరాలు.
అయితే, రావణుడితో భర్తవయసెంతో
చెప్తూ, వనప్రవేశసమయంలో రాముడికి
25 సంవత్సరాలనీ, తనకు 18 సంవత్సరాలనీ అంటుంది. మరో సందర్భంలో
అరణ్యానికి పోయే ముందర తనను చూడడానికి వచ్చిన శ్రీరాముడితో కౌసల్య అన్న మాటల
ప్రకారం, ఆయన కప్పుడు 17 సంవత్సరాల
వయస్సుండాలి. ఇదే నిజమైతే, శ్రీరాముడికి ఐదవ ఏటనే
పెళ్ళి జరిగుండాలి. విశ్వామిత్రుడి వెంట వెళ్ళే సమయంలో ఆయనకు ఉపనయనమయినట్లు
చెప్పబడింది. ఐదో సంవత్సరంలో ఉపనయనం జరగడం శాస్త్రవిరుద్ధం కాబట్టి, శ్రీరాముడు అరణ్యానికి పోయేటప్పుడు 8+17=25 సంవత్సరాల వయస్సని
గ్రహించాలి.
వాల్మీకిదొక విలక్షణమైన
శైలి. ఏ విషయాన్నీ ఒకేచోట సంపూర్ణంగా చెప్పడు. ఒక విషయాన్నే రెండు-మూడు
సందర్భాల్లో చెప్పాల్సివస్తే, అక్కడకొంచెం-అక్కడకొంచెం
చెప్తాడేకాని, మొదట్లోనే అంతా చెప్పడు.
మోసగాడని తలంపక, తనను ఎత్తుకుపోవడానికి
వచ్చిన రావణుడిని నిజమైన బ్రాహ్మణుడిగానే భావించిన సీతాదేవి, సత్యం చెప్పకపోతే శపిస్తాడేమోనని భయపడింది. వనవాసానికి వచ్చేటప్పటికి
శ్రీరాముడికి 25 సంవత్సరాలని చెప్పింది. అంటే: వనవాసం వెళ్ళేటప్పుడు 25 సంవత్సరాలనీ, విశ్వామిత్రుడివెంట పోయేటప్పుడు 12 సంవత్సరాలనీ అనుకోవాలి.
పన్నెండో నెలలో శ్రీరాముడి జననం - పన్నెండో ఏట విశ్వామిత్రుడితో వెళ్ళడం -
పన్నెండేళ్లు అయోధ్యా వాసం - పన్నెండేళ్లు అరణ్యవాసం - పన్నెండేళ్లు సీతాదేవి
వాల్మీకి ఆశ్రమంలో నివాసం. ఈ విచిత్రం తత్త్వ వేత్తలకే తెలవాలి - పామరుల
ప్రశ్నోత్తరాలు కేవలం యాధృచ్ఛికాలే. పదహారవ సంఖ్య గురించి వాల్మీకి వేసిన
ప్రశ్నలోనే వుంది కూడా).
యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్న రాక్షసుల వృత్తాంతాన్ని
విశ్వామిత్రుడిని అడిగిన దశరథుడు
ఒకవైపు రాముడిని పంపడం
ఇష్టంలేదని చెప్తూనే, మరోవైపు యజ్ఞాన్ని విఘ్నం
చేస్తున్న రాక్షసులగురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు దశరథుడు.
విశ్వామిత్రుడి యజ్ఞాన్ని చెరపాలనుకొంటున్న రాక్షసులెవరనీ, వారెవరి కొడుకులనీ, ఎవరి ఆజ్ఞప్రకారం
అలాచేస్తున్నారనీ, వారే విధంగా యుద్ధం
చేస్తారనీ - అస్త్రాలతోనా - శస్త్రాలతోనా - ముఖాముఖిగా ఎదురుగావుండా - చాటునుండా, వారి బలమెంత, వారి ప్రమాణాలెంత, వారి పేర్లేంటి, వారి ప్రభువెవరు, శ్రీరాముడైనా - సేనలతో వచ్చిన తానైనా వారు చేసే క్రియకు
ప్రతిక్రియ ఎట్లాచేయాలి అని అడుగుతాడు విశ్వామిత్రుడిని. జవాబుగా విశ్వామిత్రుడు:
" దశరథా! నువ్వు కుబేరుడి తమ్ముడు - పులస్త్యుడిమనుమడు - విశ్రవసుడి కొడుకైన
రావణుడి పేరు విన్నావుగా. వాడే బ్రహ్మవల్ల వరాలను పొందాడు - మిక్కిలి బలవంతుడు -
పరాక్రమంకలవాడు - రాక్షససేనా సమూహాలతో కూడినవాడై మూడులోకాలను వణికిస్తూ, గడగడలాడిస్తున్నాడు. వాడు రాజైనందున అల్పకార్యాలను, అలక్ష్యంగా-స్వయంగా యజ్ఞాలను పాడుచేయడం లాంటివి చేయకూడదు. అవిచేసేందుకు
వాడి మిత్రులను, సేవకులను పంపిస్తుంటాడు.
అలా వాడి ఆజ్ఞప్రకారం తాటకకొడుకులైన ఇద్దరు రాక్షసులు వచ్చి యజ్ఞం కొనసాగకుండా
విఘ్నం చేస్తున్నారు.
శ్రీరాముడిని
పంపేందుకు నిరాకరించిన దశరథుడు
విశ్వామిత్రుడి నోట
రావణుడి పేరు, తాటకీ పుత్రుల విషయం
వినంగానే, దశరథుడు భయపడ్డాడు.
విశ్వామిత్రుడు పాపరహితుడై, కళ్ళు తెరవని పసికందును -
నోరెరుగని బాలుడిని, రాక్షసుల చేతిలో వేసే
ఆలోచన ఎలాచేసాడని ప్రశ్నిస్తాడు. రాముడి సంగతటుంచి, ఆ పాపాత్ముల ఎదుట నిలువ బడడం తనలాంటి వాడికే సాధ్యంకాదే అంటాడు. తనపై
దయతలిచి తన కుమారుడిని ఊపిరితో ఉండనివ్వమనీ, తనకిప్పుడు విశ్వామిత్రుడే దైవమనీ, తనకు బిడ్డలనిచ్చినవాడికంటే వారిని బ్రతకనిచ్చిన వాడే ప్రస్తుతం దైవ
సమానుడని భావిస్తాననీ మరీ మరీ అంటాడు దశరథుడు. "మునీంద్రా! నువ్వే నా
తండ్రివని - రక్షించమని నిన్నడుగుతున్నాను. పుత్రుడికి పుత్రశోకం కలిగించడం
తండ్రికి తగదు. నేనెంత నిర్భాగ్యుడనో కనుకనే, ఏళ్ళబట్టి తపస్సుచేసి పొందిన కొడుకులను - ప్రయాస పొంది లభించిన
కొడుకులను, కళ్ళు తెరచీ-తెరవకముందే
రాక్షసుల పాలు చేయాల్సిన దురదృష్టం కలుగబోతోంది. యాచించడం నా కులవృత్తి, క్షత్రియ ధర్మం కాకపోయినా, వ్రతం చెడినా - ఫలితం దక్కాలన్న సామెత ప్రకారం, పుత్రబిక్షపెట్టమని ప్రార్థిస్తున్నాను. ఈ బాలుడిని నేను పంపించలేను
- క్షమించు" అని మనసులో మాట చెప్తాడు.
"దేవ జాతులైన దేవతలు
– కిన్నరులు – యక్షులు – కింపురుషులు - గంధర్వులు కూడా రావణుడితో యుద్ధంచేయలేరే!
మనుష్యులకది సాధ్యమా? రావణుడు, వీరుడని చెప్పుకొనే ఎవర్నైనా, దర్పమణుస్తాడు. సేనలతో కానీ - వంటరిగాకానీ, వాడినెదిరించి యుద్ధంచేయలేను నేను. దేవతలకు అసాధ్యులై - ఎవరికీ
అజేయులై మరణించిన వారైన సుందోపసుందుల కొడుకులు మారీచ-సుబాహువులు. వారు సామాన్యులు
కారు-యముడితో సరితూగేవారు. మిక్కిలిబలశాలులు. వారిచేతికిచిక్కితే యముడివశమైనట్లే.
వారు యుద్ధంలో ఆరితేరిన వారైతే, నాకొడుకేమో బాలుడు -
గురిచూసి కొట్టలేడు. కాబట్టి, నేను వాడిని పంపలేను.
వాళ్ళిదరిలో ఒకడితోనన్నా, నేను నా సేనలతో కలిసి
యుద్ధంచేస్తాను" అని కొడుకుపై నున్న వాత్సల్యంతో దశరథుడు నిష్ప్రయోజనమైన
మాటలు అనగానే, యజ్ఞంలోని అగ్నిలో
నెయ్యిపోసినప్పుడు వచ్చేమంటల్లాగా - కంట్లోంచి నిప్పులు కురిపిస్తూ
విశ్వామిత్రుడికి కోపమొచ్చింది.
No comments:
Post a Comment