కురుపాండవ కుమారుల అస్త్ర విద్యా సందర్శనం
భారతంలో
ఒక అద్భుత ఘట్టం
ఆస్వాదన-4
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (31-01-2021)
కురు పాండవులు ఒక్కటిగా కలిసి విలువిద్యలు నేర్చుకున్న గురువులైన కృపాచార్యుల, ద్రోణాచార్యుల జన్మ వృత్తాంతం
ఆసక్తికరంగా తెలుసుకోవాల్సిన విషయం.
గౌతముడి అనే మహాముని కొడుకు శరద్వంతుడు మహా నిష్ఠతో తపస్సు
చేస్తున్నప్పుడు దాన్ని భగ్నం చేయడానికి దేవేంద్రుడు ‘జలపద’ అనే యౌవనవతిని పంపాడు. ఆమెను చూసి
పరవశుడైన శరద్వంతుడి వీర్యం ఒక రెల్లు గుంటలో జారిపడి రెండు భాగాలుగా చీలింది.
దాన్నుండి ఒక కొడుకు, ఒక కూతురు
పుట్టారు. ఒకనాడు వేటకు వచ్చిన శంతన మహారాజు వారిని చూసి, బ్రాహ్మణ పిల్లలుగా భావించి, ఇంటికి తీసుకుని
వచ్చి పెంచాడు. వారిలో ఒకరికి కృపుడని,
ఇంకొకరికి కృపి అని పేర్లు పెట్టాడు. ఒకనాడు శరద్వంతుడు వచ్చి వారు తన సంతానమని
చెప్పి, కృపుడికి
ఉపనయనం చేశాడు. వేదాలు, అస్త్ర శస్త్ర
విద్యలు నేర్పించాడు. అలాంటి కృపాచార్యుడిని భీష్ముడు కురుపాండవులకు గురువుగా
నియమించాడు.
భరద్వాజ మహాముని ఒకనాడు గంగానదిలో స్నానం చేస్తుండగా ఎదురుగా
మహావిలాసంతో, పెనుగాలికి చీర తొలగిన నిర్మలమైన దేహంతో ఉన్న ఘ్రుతాచి అనే అప్సరసను
చూసి కామించాడు. ఆ క్షణంలోనే అతడికి వీర్యస్ఖలనం కావడంతో ఆ వీర్యాన్ని తెచ్చి ఒక
కలశంలో పెట్టాడు. దాన్నుండే శుక్రుడి అంశతో ద్రోణుడు పుట్టాడు. ద్రోణుడు, పాంచాలరాజైన వృషతుడి కొడుకు
ద్రుపదుడు కలిసి వేదాలు చదువుకున్నారు. విలువిద్యలు నేర్చుకున్నారు. ఆ తరువాత
ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు కాగా,
ద్రోణుడు అగ్నివేశ్యుడి దగ్గర ధనుర్విద్యలు నేర్చుకున్నాడు. అనేక దివ్యాస్త్రాలు
పొందాడు. కృపుడి చెల్లెలైన కృపిని వివాహం చేసుకున్నాడు. అశ్వత్థామ అనే కొడుకును
కన్నాడు. తనను తాను పోషించుకోవడానికి ధనాపేక్షతో పరశురాముడి దగ్గరికి వెళ్లిన
ద్రోణుడికి తన దగ్గర వున్న శస్త్రాస్త్రాలను ఇచ్చాడు ఆయన. దివ్యాస్త్రాలను, వాటిని ప్రయోగించే మంత్రాలను
నేర్చుకున్నాడు పరశురాముడి దగ్గర. ఆ తరువాత ధన సహాయం కోరి స్నేహితుడైన ద్రుపద
మహారాజు దగ్గరికి పోతే, అతడు ఐశ్వర్యగర్వంతో అమర్యాద చేసి పంపాడు.
ఏమీ చేయడానికి తోచక ద్రోణుడు హస్తినాపురానికి వచ్చాడు. ఆయన వచ్చిన
సమయంలో కౌరవపాండవ కుమారులు చెండాట ఆడుకుంటూ వుండగా వారి బంగారు బంతి బావిలో
పడింది. అది బయటకు తీయలేక సతమవుతున్న సమయంలో ద్రోణుడు తన బాణపరంపర విద్యతో దాన్ని
బయటకు తీసి ఇచ్చాడు వారికి. ముందు ఒక బాణాన్ని బంతికి నాటుకునే విధంగా కొట్టి, ఆ బాణం చివర మరో బాణాన్ని, దాని చివర ఇంకొకదాన్ని, ఇలా బాణాల తాడు చేసి దాన్ని బయటకు
లాగాడు. రాజకుమారులు ఆశ్చర్యపడి ద్రోణుడిని తీసుకునిపోయి భీష్ముడికి జరిగినదంతా
చెప్పారు. తాను తన కొడుకుకు పాలు కూడా పోయలేని స్థితి, ద్రుపదుడి దగ్గరకు పోయిన సంగతి, అతడి తిరస్కారం, హస్తినకు రావడం అంతా చెప్పాడు.
ద్రోణుడికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసిన
భీష్ముడు కుమారులను అతడికి శిష్యులుగా సమర్పించాడు.
కుమారులందరికీ ద్రోణుడు విలువిద్య నేర్పసాగాడు. వీరితో పాటు సూతుడి
కుమారుడైన రాధేయుడు విలువిద్యా నైపుణ్యంలో అర్జునుడితో సమానంగా వుంటూ, అతడిని ద్వేషిస్తూ, దుర్యోధనుడితో స్నేహంగా వుండసాగాడు.
ద్రోణుడి దగ్గర ఏకలవ్య శిష్యరికం చేస్తూ విద్య నేర్చుకుంటూ, విలువిద్యా రహస్యాలన్నీ గ్రహిస్తున్న ఒక ఎరుకరాజు కొడుకును తనకు
గురుదక్షిణగా ఇవ్వమని అతడి కుడి చేతి బొటన వేలు తీసుకుంటాడు ద్రోణుడు. ఆ విధంగా
అర్జునుడికి సాటి ఎవరూ లేకుండా చేశాడు ద్రోణుడు.
శస్త్రాస్త్ర విద్యలన్నీ
సమగ్రంగా అభ్యసించి, కౌరవులు, పాండవులు ఆ విద్యలలో మంచి
నేర్పరులయ్యారు. వాళ్ల నేర్పును సభలో తెలుసుకునే ఏర్పాటు చేయాలని ద్రోణుడు
ధృతరాష్ట్రుడిని కోరాడు. దానికి ఆయన అంగీకరించి, కురుకుమారుల శస్త్రాస్త్ర విద్యా
ప్రదర్శనకు, అందమైన రంగస్థలాన్ని, శాస్త్రప్రకారం సర్వాంగ సుందరంగా సిద్ధం చేయించాడు.
ఒక మంచిరోజున శుభ ముహూర్తంలో వారి విద్యను వీక్షించడానికి అక్కడికి ధృతరాష్ట్రుడు,
గాంధారి, కుంతి, వ్యాసమహర్షి, బ్రాహ్మణ సమూహం, కృపాచార్యుడు, శల్యుడు, శకుని,
భీష్ముడు, విదురుడు
మొదలైన వారంతా వచ్చారు.
పాండవులు, కౌరవులు, ద్రోణాచార్యుడి వెనుక, ధర్మరాజు పక్కన వయో ధర్మాన్ని బట్టి
వరుసగా రంగమధ్యంలో నిలిచారు. ద్రోణాచార్యుడి ఆజ్ఞతో భీమ దుర్యోధనులు తమ గదా
కౌశలాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి చూపారు. రాబోయే కురుపాండవ మహాసంగ్రామాన్ని
స్పష్టంగా సూచించేదిగా వున్నది. ఆ తరువాత ద్రోణుడు తన ప్రియ శిష్యుడు ఆర్జునుడిని
అతడి ధనుర్విద్యానైపుణ్యాన్ని చూపమన్నాడు. అస్త్ర విద్యలన్నిటిలో నేర్పరైన
అర్జునుడు తన అస్త్ర విద్యా ప్రదర్శనను శోభాయమానంగా ప్రారంభించాడు. మొదలు అస్త్ర
విద్యా విచిత్రాలను ప్రదర్శించి, ఆ తరువాత గద, కత్తి మొదలైన
అనేక విధాలైన ఆయుధ విద్యలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆహుతులను ఆశ్చర్య
పరుస్తుండగా, కర్ణుడు తన విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని రంగ ద్వారంలో నిల్చి
భుజం చరిచాడు.
అలా ప్రవేశించిన కర్ణుడిని వర్ణిస్తూ చక్కటి పద్యం రాశారు నన్నయ కవి
ఇక్కడ ఇలా:
శా: సాలప్రాంశు నిజోజ్వలత్కవచు
శశ్వత్కుండలోభాసితున్
బాలార్క
ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రనిస్త్రింశు శౌ
ర్యాలంకారు
సువర్ణవర్ణు ఘనుఁ గర్ణాఖ్యున్ జగత్కర్ణపూ
ర్ణా
లోలద్గుణుఁ జూచి చూపఱు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్
(మద్ది
చెట్టులాగా ఎంతో ఎత్తైనవాడు,
సహజ కవచ కుండలాలతో బాగా ప్రకాశించేవాడు, బాల సూర్యుడిని పోలినవాడు, ధనుస్సును ధరించిన వాడు, మొలలో భయంకరమైన కత్తిని కట్టుకున్న వాడు, శౌర్యమే అలంకారంగా కలవాడు, బంగారు వన్నె కలవాడు, గొప్పవాడు, లోకం చెవులలో నిండి వ్యాపిస్తున్న మంచి గుణాలు
కలవాడు అయిన కర్ణుడిని చూసి ప్రేక్షకులంతా ఎంతో ఆశ్చర్య పడ్డాడు).
నన్నయ రాసిన ఈ
పద్యాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు ఇలా రాశారు:
“మహాభారతంలో ఇది ఒక ప్రసిద్ధ పద్యం. నన్నయ నాటకీయ రచనకు పతాకవంటి పద్యం.
హస్తినాపురరంగ మధ్యంలో ప్రేక్షకులు చూసిన కర్ణుడి మహనీయ వ్యక్తిత్వాన్ని, దీప్తిని
చదువరుల కంటికి కట్టినట్లు రాసిన చాయాచిత్రం లాంటి పద్యం. నన్నయ ప్రసన్నకథాకవితలో
స్థిరచిత్రవర్ణశిల్పానికి ఈ పద్యం ఒక మచ్చు తునక”.
తాను కూడా
అర్జునుడి లాగానే విద్యలు నేర్చుకున్నానని, ఆయన చూపిన అన్ని విద్యలు తాను కూడా ప్రజలు
మెచ్చుకునేలా చూపుతానని అంటాడు. ద్రోణుడి అనుమతితో అర్జునుడు చూపించిన
అస్త్రవిద్యా విశేషాలన్నీ అతి సులభంగా ప్రదర్శించాడు. దుర్యోధనుడు వెంటనే స్నేహ
హస్తం చాచాడు కర్ణుడికి. కర్ణుడు అలాగే అని సమ్మతించాడు. అర్జునుడితో ద్వంద్వయుద్ధం
చేయాలని వుందన్నాడు. అప్పుడు అర్జునుడికి, కర్ణుడికి వాగ్వివాదం అయింది. ఆ తరువాత
కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం మొదలైంది. ఇద్దరూ భీకరమైన అస్త్రాలను
ప్రయోగించుకున్నారు. ఉపసంహరించారు. ఈ సందర్భంగా కుంతి స్పందన అద్భుతంగా వర్ణించాడు
కవి నన్నయ.
ఇంతలో కృపాచార్యుడు
కలిగించుకుని, కర్ణార్జునుల మధ్య నిలిచి, అర్జునుడు పాండురాజుకు, కుంతీదేవికి పుత్రుడనీ, కర్ణుడు అతడితో యుద్ధం చేయాలనుకుంటే అతడి
తల్లిదండ్రుల వివరాలు చెప్పాలనీ,
ఇద్దరూ సమానులైతే అర్జునుడు ఎదిరిస్తాడనీ అంటాడు. ఇక్కడ కృపాచార్యుడు అన్న మాటల
పద్యం అద్భుతంగా రాశారు నన్నయ ఇలా:
చ: కురుకులజుండు పాండునకుఁ గుంతికిఁ
బుత్త్రుఁడు రాజధర్మ బం
ధుర చరితుండు నీ వితనితోడ రణం బొనరించెదేని వి
స్తరముగ నీదువంశమును దల్లిని దండ్రిని జెప్పు
చెప్పినన్
దొర యగుదేని నీ కెదిరి దోర్బలశక్తి నితండు
సూపెడిన్
కృపాచార్యుడు
అడిగినదానికి జవాబుగా, తాను సూతనందనుడినని, రాదేయుడినని
చెప్పడానికి సిగ్గుపడ్డాడు కర్ణుడు. వెంటనే దుర్యోధనుడు అర్జునుడితో యుద్ధం
చేయడానికి అర్హత రాజరికం అయితే తాను కర్ణుడిని అంగరాజ్యం ఇచ్చి రాజుగా చేస్తానని
అంటాడు. అప్పటికప్పుడే భీష్మధృతరాష్ట్రులకు చెప్పి, వారి అనుమతితో, బ్రాహ్మణులతో కర్ణుడిని అంగరాజ్యాభిషిక్తుడిని
చేయించాడు. ప్రతిగా తానేం ఇవ్వగలనని అన్న
కర్ణుడితో, దుర్యోధనుడు, లోకం కొనియాడేట్లు తనతో స్నేహం చెయ్యమంటాడు.
కర్ణుడు దానికి మనసారా అంగీకరించాడు. కర్ణుడు తండ్రి అక్కడికి వచ్చి కొడుకును దీవించాడు.
ఇంతలో
భీముడు కలిగించుకుని, అంగరాజ్యం కర్ణుడికి అనుభవ యోగ్యం కాదని
అధిక్షేపించాడు. కర్ణుడిని దూషించాడు. వెలవెల బోతున్న కర్ణుడికి అండగా దుర్యోధనుడు
వచ్చాడు. ‘వాయువు వల్ల పుట్టిన బీమా’ అని భీముడిని సంబోధిస్తూ, ఎత్తిపొడుపుగా అన్న మాటలను చక్కటి పద్యంగా రాశారు నన్నయ కవి ఇలా:
సీ:
శూరుల జన్మంబు సురల జన్మంబును
నేరులజన్మంబు నేరుగా నగునె
మొగిని
దధీచియెమ్మున బుట్టదయ్యెనే వాసవాయుధ మైన వజ్ర మదియు
గాంగేయు
డన మరి కార్తికేయుం డన నాగ్నేయు డన రౌద్రు డనగ శరవ
నోద్భవుం
డన గుహుం డుద్భవిల్లడె” శర స్తంబ జన్ముడు గాడె ధర్మవిదుడు
తే:
గృపుడు? ఘట సంభవుడు గాడె కీర్తిపరుడు వరుడు ద్రోణుండు?
విప్రులవలన బుట్ట
రైరె
సత్క్షత్రియులు ఘను లవని గావ? గడగి మీ జన్మములు నిట్ల కావే వినగ
ఇలా
అంటూ దుర్యోధనుడు, శూరుల పుట్టుక, దేవతల పుట్టుక, నదుల పుట్టుక తెలుసుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించాడు. కుమారస్వామి పుట్టుక, కృపాచార్యుడి పుట్టుక, ద్రోణుడి పుట్టుకలను ప్రస్తావించాడు. జన్మలతో
పని లేదని, కర్ణుడు దివ్య లక్షణాలు కలవాడని, సహజ కవచ కుండలాలు కలవాడని, సామాన్యుడు కాదని అంటాడు. తన బాహుబలంతో కేవలం
అంగ రాజ్యాన్నే కాకుండా,
సమస్త భూమండలాన్ని పరిపాలించ సమర్థుడు అని అన్నాడు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. దుర్యోధనుడు కర్ణుడిని
వెంటబెట్టుకుని ఇంట్లోకి వెళ్లాడు. పాండవులు, మిగిలిన అందరూ వెళ్లారు.
కుంతీదేవి
కర్ణుడిని చూసి గుర్తు పట్టినా, తన
ప్రేమ బయట పడకుండా జాగ్రత్త పడింది.
కర్ణుడిని
స్నేహితుడిగా పొందిన దుర్యోధనుడు సంతోషించి, ఇక అర్జునుడి వల్ల భయం లేదనుకున్నాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, ఆదిపర్వం, పంచమ-షష్టాశ్వాసాలు
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)
చక్కగొ వ్రాసారు. చిన్న సవరణ. ద్రోణద్రుపదులు ఇద్దరూ అగ్నివేశ ముని వద్ద సహాధ్యాయులుగా విద్యాభ్యాసం చేసారు. కర్ణుడూ ద్రోణశిష్యుడే.
ReplyDelete