శ్రీ రామాయణ కథా ప్రారంభం.. అయోధ్యా పుర వర్ణన
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-39
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (11-01-2021)
సమస్త భూమండలాన్ని సంతోషకరంగా
పరిపాలించిన చక్రవర్తులలో - రాజులలో, తన అరవై వేలమంది
కొడుకులతో సముద్రాన్ని తవ్వించిన సగరుడినే, కడు పుణ్యాత్ముడిగా-చక్రవర్తి
శ్రేష్ఠుడిగా పరిగణించాలి. మిగిలిన రాజులందరు అతడిని అనుసరించి నడుచుకున్నవారే.
అలా ప్రసిద్ధికెక్కిన వారిలో మనువు కుమారుడు-ఇక్ష్వాకు మహారాజు వంశంలో పుట్టిన
సగరాది రాజులలో భూమ్మీద అవతరించిన రఘురాముడి చరిత్రే రామాయణం. భూలోకవాసులందరూ పూజించాల్సిన
గ్రంథం రామాయణం. ఈ వంశంలో పుట్టిన భగీరథుడు, బ్రహ్మను ప్రార్థించి -
బ్రహ్మ లోకంలో వున్న గంగను భూలోకానికి దిగేటట్లు చేసి - దాన్ని పావనం చేస్తాడు.
బ్రహ్మ అనుగ్రహానికి పాత్రుడైన వాల్మీకి మహర్షి, బ్రహ్మ లోకంలో వున్న రామాయణాన్ని, భూలోకవాసులను పవిత్రులను
చేసేందుకు అవతరింపచేశాడు. స్వర్గ సుఖాన్ని మాత్రమే కలిగించేది గంగైతే, ఇహలోక సుఖాన్ని - స్వర్గలోక సుఖాన్ని - మోక్షాన్ని కూడా ఇవ్వగలిగేది రామాయణం.
కాబట్టే,
గంగకంటే కూడా రామాయణం కడు పూజనీయమైంది. కాలిగోటికి-పూర్ణ
విగ్రహానికి ఎంత తేడా వుందో, గంగకు-రామాయణానికి అంత
తేడా వుంది. తన వద్దకు వచ్చిన వారినే పవిత్రం చేయగలిగేది గంగైతే, నగర-నగరానికి,
గ్రామ-గ్రామానికి, పల్లె-పల్లెకు, ఇంటింటికి పోయి,
ప్రపంచమంతా వ్యాపించి తనను సేవించిన వారందరినీ పవిత్రులను
చేయగలిగేది రామాయణం.
రామాయణం పఠించేవారు సాక్షాత్తు రామ
సేవ చేసినట్లే. విధిగా వేదాధ్యయనం చేయాల్సిన బ్రాహ్మణుడు ఈ రోజుల్లో నూటికి-కోటికి
ఒకడున్నాడో-లేడో. అలాంటి వారందరు రామాయణ పఠనం చేస్తే, వేద పఠనం చేసినట్లే. వాల్మీకి ఒక సామాన్య ఋషే కదా ! ఆయన రాసింది వేదం ఎలా
అవుతుందన్న ప్రశ్న అసమంజసం. చెప్పింది వాల్మీకే అయినా, వెలువడింది బ్రహ్మ ముఖం నుండి. కాబట్టి తప్పక విని తీరవలసిందే. అసూయ వల్ల, అశ్రద్ధ వల్ల,
సోమరి తనం వల్ల అలక్ష్యం చేసి వినకపోతే, పాపాత్ములతో సమానమవుతారు. వింటే సకల పాపాలు నశించిపోతాయి. రామాయణ పుణ్య
కావ్యాన్ని లోకంలో వ్యాపింపచేసే అధికారం మాత్రమే వాల్మీకికి వుంది కానీ, రచనలో కాని-ఫల ప్రదానంలో కాని అధికారం లేదని వాల్మీకే స్వయంగా-స్పష్టంగా
చెప్పుకుంటాడు. రామాయణ పఠనం పాపాలను హరించి వేయడమే కాకుండా, ధర్మ కాంక్ష కలవారికి ధర్మాన్ని- అర్థ కాంక్ష కలవారికి అర్థాన్ని - కామం అందు
ఆశ కలవారికి కామాన్ని ఇవ్వగలదు. బ్రహ్మ తనకిచ్చిన అధికారంతో శ్రీరామ జననం మొదలు
నిర్యాణం వరకు వివరిస్తానని, సంతోషంతో వినమని-తద్వారా
శుభం కలుగుతుందని అంటూ రామ కథను ప్రారంభిస్తాడు వాల్మీకి.
సరయూ నదీతీరంలో వున్న కోసల దేశంలో, ఎక్కడ చూసినా ధనధాన్యాలు రాసులు-రాసులుగా ఇంటింటా పడివుండి, ఒకరి ధనాన్ని-ధాన్యాన్ని మరొకరు ఆశించాల్సిన అవసరం లేనటువంటి
స్థితిగతులుండేవి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఆ దేశంలో ప్రజలంతా దేహ పుష్టి
కలిగి, సుఖసంతోషాలతో వుండేవారు. ధనధాన్యాది సంపదలతో మిక్కిలి భాగ్యవంతంగాను - మనువు
స్వయంగా నిర్మించినందున అందంగా, రమ్యంగాను - పన్నెండామడల
పొడవు, మూడామడల వెడల్పు,
వంకర టింకర లేని వీధులతోను - ఇరు ప్రక్కల సువాసనలు వెదజల్లే
పుష్పాలను రాలుస్తున్న చెట్లతోను - దారినపోయే వారి కళ్లల్లో దుమ్ము పడకుండా
తడుపబడిన రాజవీధులతోను అలరారుతుండే అయోధ్యా నగరమనే మహా పట్టణం ఆ కోసల దేశంలో
వుండేది. చక్కగా తీర్చి దిద్దిన వీధి వాకిళ్లతోను - తలుపులతోను - వాకిళ్లముందు
మంగళకరమైన పచ్చని తోరణాలు కట్టేందుకవసరమైన స్తంబాలతోను - నగరం మధ్యలో విశాలమైన
అంగడి వీధులతోను - శత్రువులను ఎదుర్కొనేందుకు కావాల్సిన రకరకాల ఆయుధ సామగ్రినుంచిన
భవనాలతోను-శిల్ప కళాకారుల సమూహాలతోను-వందిమాగధులు, సూతుల జాతివారితోను-శ్రీమంతులైన పండితులతోను-ఎత్తైన మండపాల పై కట్టిన
ధ్వజాలతోను-భయంకర శతఘ్నుల ఆయుధాలతోను-నాట్యమాడే స్త్రీ సమూహాలతోను-తియ్య మామిడి
తోపులతోను,
అందాలొలికే అయోధ్యా పురం "లక్ష్మీ పురం" నే
మరిపించేదిగా వుంది. "అయోధ్యా పురి" అనే ఆ స్త్రీ నడుముకు పెట్టుకున్న
ఒడ్డాణంలా వున్న ప్రాకారం,
అగడ్తలు, మితిమీరిన సంఖ్యలో వున్న
గుర్రాలు,
లొట్టిపిట్టలు, ఆవులు, ఎద్దులు,
ఏనుగులు, అనుకూలురైన సామంత రాజులు, కప్పం కట్టే విరోధులైన విదేశీ రాజులు, కాపురాలు చేస్తున్న నానా
దేశ వ్యాపారులు,
విశేష ధనవంతులైన వైశ్యులు, నవరత్న ఖచితమైన రాజుల ఇళ్లు, చంద్రశాలలున్న అయోధ్యా
నగరం స్వర్గ నగరమైన అమరావతిని పోలి వుంది.
నవరత్నాలతో చెక్కబడి విమానాకారంలో
కట్టిన ఇళ్లతోను-ఇంటినిండా ఆరోగ్యవంతులైన కొడుకులు, మనుమలు,
మునిమనుమలు, మనుమరాళ్లు, వయో వృద్ధులతోను-ఎత్తుపల్లాలు లేకుండా భూమిపై కట్టిన గృహాల్లో పుష్కలంగా పండిన
ఆహార పదార్థాల నిల్వలతోను-ఇంటింటా వున్న ఉత్తమ జాతి స్త్రీలతోను - నాలుగు దిక్కులా
వ్యాపించిన రాచ బాటలతోను-వాటి మధ్యనే వున్న రాచగృహాలతోను నిండి వున్న అయోధ్యా నగరం
జూదపు బీటలా వుంది.(నగరం మధ్యన రాజగృహం, అందులో కట్టడాలు, గాలి వచ్చేందుకు విడిచిన ఆరుబయలు,నలుదిక్కుల
రాచబాటలుండడమంటే చూసేవారికి జూదపు బీటలా వుంటుందని అర్థం).
నగరంలోని నీళ్లు చెరకు పాలల్లా
తియ్యగా - తేలిగ్గా - మంచి ముత్యాల్లా కనిపించే లావణ్యం లాంటి కాంతితో వున్నాయి.
మద్దెలలు,
వీణలు, ఉడకలు, పిల్లన గ్రోవులు,
సుందరీమణుల కాలి అందియలు-వీటివల్ల కలిగే ధ్వనులు
ఆహ్లాదకరంగా వుండేవి. ఎల్లప్పుడు ఆటపాటలతో, ఉత్సవాలతో, అలంకరించుకున్న స్త్రీలతో, ఆహ్లాద భరితంగా వుండేదా
వూరు. ఘోర తపస్సు చేసి సిద్ధిపొందిన వారికి మాత్రమే లభించే స్వర్గంలోని విమానాకార
ఇల్లు, అయోధ్యా నగర వాసులకు ఏ కష్టం లేకుండా దొరికాయి.
ఆ నగరంలోని శూరులు అడవులకు వేటకు
పోయేటప్పుడు,
సింహాలను-అడవి పందులను-ఖడ్గ మృగాలను, ముఖాముఖి కలియబడి తమ భుజ బలంతో-శస్త్ర బలంతో-ఒకే ఒక్క వేటుతో చంపగలిగే
గొప్పవారు. అయినప్పటికీ,
ఆయుధం లేకుండా-సహాయం చేసేవారు లేకుండా-ఒంటరిగా చిక్కిన
బలవంతుడైన శత్రువును కూడా క్షమించి విడిచిపెట్టగల దయా గుణమున్న శూరులు. భయంతో
దాగిన వారినికూడా వదిలి పెట్తారు. అయోధ్యా పురంలోని బ్రాహ్మణులందరు అవిచ్ఛిన్నంగా
అగ్నిహోత్రం కలిగుండే వారే - శమ దమాది గుణ సంపన్నులే - ఆరంగాలతో, నాలు వేదాలను అధ్యయనం చేసిన వారే - సత్య వాక్య నిరతులే - వేలకొలది దానాలు చేసిన
వారే - గొప్ప మనసున్న వారే. వీరందరు సామాన్య ఋషులైనా, గృహస్తులైనా,
నగర వాసులైనా, అడవుల్లో వుండే ఋషులకు
సమానమైన వారు.
(భగవంతుడు అక్కడ పుట్టినందువల్లే, ఆ పుణ్య నగరం
"అయోధ్య" గా కీర్తించబడింది. భగవంతుడైన విష్ణువు ఎక్కడుంటాడో, అదే పరమ పదం-ఆయన సేవే మోక్షం-అదే సర్వ కర్మలను ధ్వంసం చేస్తుంది. అయోధ్యలో మహా
విష్ణువు పుట్టినందువల్లే మనుష్యులందరు ముక్తులయ్యారని శివుడు పార్వతికి
చెప్పాడు).
No comments:
Post a Comment