రాజకీయాలలో లోపిస్తున్న గౌరవ మర్యాదలు
వనం
జ్వాలా నరసింహారావు
సాక్షి దినపత్రిక (13-01-2021)
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు, అందునా
ప్రత్యేకించి ఎన్నికైన ప్రజా ప్రతినిథులు పోషించాల్సిన పాత్ర బహుముఖమైనదని, అతి సున్నితమైనదని, అత్యంత క్లిష్టమైనదనే
విషయాన్ని ఇటీవలి కాలంలో చాలామంది గౌరవ రాజకీయ నాయకులు మరచిపోవడం చాలా బాధాకరం. ఒక
రకంగా అది కత్తిమీద సాము వంటిది. హుందాగా, గంభీరంగా, బాధ్యతగా ఉంటూ
రాజకీయ నాయకులు ఇతరులను నొప్పించక, తానొవ్వక నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది.
క్రమేపీ రాజకీయాలలో మర్యాదలనేవి మంటగలుస్తున్నాయి. దీనికి కారణం ఒకరా, ఇద్దరా, ఒక
పార్టీవారా, అన్ని పార్టీలవారా అంటే జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ‘తిలాపాపపం, తలా పిడికెడు’. కాకపొతే
కొందరైతే అదే పనిగా విమర్శలు గుప్పిస్తుంటారు అదొక జీవనోపాధిలాగా!
ఇటీవల ఒక ముఖ్యమైన సమావేశంలో మాట్లాడిన ఉపరాష్ట్రపతి ఎం
వెంకయ్యనాయుడు రాజకీయాలలో సభ్యత, మర్యాద, మన్నన అనేవి
మూడు ప్రధానమైన మౌలిక సూత్రాలని, వీటికి కట్టుబడి రాజకీయాలు సాగిస్తేనే అవి
అర్థవంతంగా,
క్రియాశీలకంగా సాగుతాయని, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే గౌరవ మర్యాదలు, చర్చించడం, తార్కిక
విశ్లేషణ, సరైన
నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు.
కానీ, ఈ మధ్య చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలను
గమనిస్తుంటే,
కొందరు
రాజకీయ నాయకుల వ్యవహార శైలిని చూస్తుంటే, మర్యాదలనేవి ఎప్పుడో
మంట కలిశాయని విస్పష్టంగా తేలుతున్నది. కొందరు రాజకీయనాయకులు బహిరంగంగా
మాట్లాడేటప్పుడు, అందునా వారికంటే ఎన్నో రెట్లు ఎక్కువ గౌరవప్రదమైన
తమ ప్రత్యర్థుల ప్రస్తావన తెచ్చినప్పుడు,
ప్రత్యక్షంగా-పరోక్షంగా వారి పేర్లను ఉటంకించిన సందర్భాలలో మర్యాద అన్న మాటను పూర్తిగా
విస్మరించి అసభ్యకరమైన పదజాలాన్ని అలవోకగా ఉపయోగిస్తున్నారు. కొందరు జాతీయ పార్టీల నాయకులైతే తమ
ప్రత్యర్థులను విమర్శించే సందర్భంలో సహనం కోల్పోతున్నారు. మైకుల ముందు ఊగిపోయి ఏం
మాట్లాడుతున్నామో తెలియని స్థితిలో, కనీస గౌరవ మర్యాదలు కూడా పాటించడంలేదు. ఏకవచన
పిలుపులు,
వ్యక్తిగత
దుర్భాషలు,
ప్రాసలతో
కూడిన పదబంధాలను వాడుతూ, పత్రికల్లో
రాయలేని తిట్లను తిడుతూ, అపహాస్యం చేస్తున్నారు. ప్రజల మధ్య వైషమ్యాలను
సృష్టిస్తున్నారు.
ఈ ధోరణి అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఈ
మధ్య కాలంలో కొంచెం ఎక్కువ మోతాదులో
కనిపిస్తున్నది. మొన్న-మొన్న దుబ్బాకలో, తదనంతరం గ్రేటర్
హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో, ముగిసిన తరువాత ఒక జాతీయపార్టీ
అధ్యక్షుడైన వ్యక్తి, సాక్షాత్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టం
వచ్చినట్లుగా దుర్భాషలాడుతూ, మర్యాద పరిమితులను దాటిన భాషలో అనునిత్యం విషం కక్కుతున్నారు.
ముఖ్యమంత్రినే కాకుండా, వారి కుటుంబ సభ్యులపై కూడా తిట్లు, శాపనార్ధాలతో
మాటల దాడి చేశారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర నాయకుడెవరూ గతంలో ఇలా వ్యవహరించిన
దాఖలాలు లేవు. రాజకీయ నాయకులు ప్రత్యర్థిని మాటల తూటాలతో, వాగ్బాణాలతో
మట్టి కరిపించవచ్చు. తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టవచ్చు. ఎత్తులకు పైఎత్తులు
వేయవచ్చి. కానీ, ప్రత్యర్ధులపై వ్యక్తిగత దూషణ, బురద జల్లడం
చాలా దుర్భరమైనది, దురదృష్టకరమైనది.
ఇలాంటి
రాజకీయ నాయకులు గత వర్తమాన చరిత్ర నుండి రాజకీయ గుణపాఠాలు నేర్చుకోవాల్సిన ఆగత్యం
ఎంతైనా వున్నది. మన దేశంలో కొందరు యువ-మధ్య వయస్సు నేతలు సహనం కోల్పోయిన
సందర్భాల్లో, ప్రత్యర్థులపై అభ్యంతరకరమైన భాషతో మాటల దాడి చేసిన సందర్భాలలో, ఆ పార్టీకి
చెందిన సీనియర్ నాయకులు జోక్యం చేసుకొని వారిని మందలించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.
ఉదాహరణకు 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత,
కేంద్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో, అప్పటి
కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ హైదరాబాద్ లో పర్యటించి, ముషీరాబాద్, ఆర్టీసీ
క్రాస్ రోడ్ వద్ద జరిగిన సభల్లో ప్రసంగించారు. ఆ సందర్భంలో జార్జి
ఫెర్నాండెజ్ ఇందిరాగాంధీని ‘నిరంతర
అబద్ధాలకోరు’ అని విమర్శించారు. ఈ విషయం అప్పడు ప్రధానమంత్రిగా ఉన్న మొరార్జీ
దేశాయ్ కు నిమిషాలలో వేగులవారి ద్వారా తెలిసింది. దీంతో మొరార్జీ జోక్యం చేసుకొని
జార్జి ఫెర్నాండెజ్ ను సుతిమెత్తగా మందలించారు. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల మాజీ
ప్రధానిగా ఇందిరాగాంధీ గొప్పతనాన్ని, హుందాతనాన్ని, సుదీర్ఘ
రాజకీయ అనుభవాన్ని తక్కువ చేసి మాట్లాడినట్లు అవుతుందని చెప్పారు. ‘నిరంతర అబద్ధాలకోరు’
అనేదానికి బదులుగా ‘ఇందిరాగాంధీ చాలా అరుదుగా నిజాలు మాట్లాడతారు’ అని సభ్యతగా అంటే
బాగుంటుందని జార్ని ఫెర్నాండెజ్ కు సలహా ఇచ్చారు. అప్పట్లో ఈ విషయం పత్రికలలో
ప్రముఖంగా వచ్చింది కూడా. ఆ రోజుల్లో రాజకీయాలంటే అలా ఉండేవి మరి. మొరార్జీ దేశాయ్
లాంటి అరుదైన రాజకీయ నాయకుల గొప్పతనం కూడా అలానే ఉండేది. ఆరోజులు మారాయి,
మారుతున్నాయి!
ఇంతెందుకు, గతేడాది
మనదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనపుడు ప్రజలు సంఘటితమై దాన్ని ఎదుర్కోవాలని, సంఘటిత
శక్తిని ప్రదర్శించడానికి కొవ్వొత్తులు వెలిగించాలని, పళ్లాలు గరిటెలు
పట్టుకొని చప్పుళ్లు చేస్తూ సంఘీభావం ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
పిలుపునిచ్చారు. దీంతో ఆయన్ను కొందరు ప్రతిపక్ష నాయకులు, వ్యక్తులు ఎగతాళి చేసి
మాట్లాడారు. ఆ సందర్భంలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు
బహిరంగంగా వారి చర్యలను ఖండించారు. దేశ ప్రధానిని అలా విమర్శించడం ఎవరికీ తగదని
హితవు పలికారు. ప్రధానిని అపహాస్యం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కూడా
డీజీపిని కోరారు. అలా మొరార్జీ తరహా లాంటి ఉన్నతుల వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి కేసీఆర్
ఎంతో హుందాతనంగా వ్యవహరించారు. రాజకీయాలలో ఆయన అరుదైన వ్యక్తిత్వం ఒక మినహాయింపు
అనాలి.
ఇపుడు తెలంగాణలో ప్రతిపక్షం అంటే, అధికారంలో
ఉన్న పక్షాన్ని అందరికంటే ఎక్కువగా తిట్లుతిట్టడం అనే స్థాయికి దిగజార్చారు జాతీయ
పార్టీల్లో ఇపుడున్న కొందరు పెద్ద నాయకులు. అధికార పార్టీపై సహజంగా ఉండే
కొద్దిపాటి వ్యతిరేకతను చూసి, అదే తమ బలం అనుకుంటున్నారు. తాము ఇంతకాలం
ముఖ్యమంత్రిని ఇలా తిడుతుండబట్టే ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని కూడా
అనుకుంటున్నారు. ఇది వారి అవివేకం. ఇదే సమయంలో ఇలా మాట్లాడుతున్నా వ్యక్తి మరొక అడుగు ముందుకేసి మాట్లాడుతూ, ’’ఈ
ముఖ్యమంత్రి మా జాతీయపార్టీ నాయకత్వం ముందు నేలపై సాష్టాంగపడి మెప్పించినా,
పొర్లుడు దండాలు పెట్టినా, మేం మాత్రం అతన్ని, అతని
కుటుంబాన్ని వదిలిపెట్టం. అందరినీ జైలుకు పంపుతాం’’ అంటున్నారు.
అయితే, ఇతను వాడుతున్న భాష అదే జాతీయ పార్టీలోని మిగతా
నాయకులను ఇబ్బంది పెడుతున్నది. అతడు ఏమాట జారినా, మీడియాకు పార్టీలోని వారంతా ఏం సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి వస్తుందో అనే
సంశయం వారిలో నెలకొంది. ఇలా దూషిస్తున్న వ్యక్తి తమ పార్టీలోని రాజకీయాలకు అతీతమైన
కొందరి నాయకుల నుండి ఇంకా ఏమీ నేర్చుకోకపోవడం కూడా పలువురిని ఆశ్చర్యానికి గురి
చేస్తుంది. అదే సమయంలో ఆ జాతీయపార్టీ అధినాయకత్వం కూడా ఇలా అనైతికంగా మాట్లాడున్న
వ్యక్తిని నిశ్శబ్దంగా చూస్తుండటం దురదృష్టకరం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో
ఇలాంటి అనారోగ్యకర పరిణామాలను అందరూ ఖండించాల్సిందే.
గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా
ఉన్నపుడు,
అప్పుడు
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయి, పీవీ ప్రభుత్వాన్ని అనునిత్యం
విమర్శించేవారు. కానీ, ఐక్యరాజ్య సమితి వద్ద కాశ్మీర్ సమస్యపై
మాట్లాడేందుకు మన భారతదేశ ప్రతినిధిగా ప్రతిపక్ష నాయకుడు వాజ్ పేయినే నియమించి..
ఇదీ పీవీ ఠీవీ అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారాయన. అప్పటి రాజకీయ నాయకుల్లో పరస్పర
గౌరవం అలా ఉండేది. అయితే, అప్పుడు కూడా
విమర్శలు మామూలే. నెహ్రూ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడిగా వాజ్ పేయి
పార్లమెంటు లోపలా, బయటా విమర్శిస్తూనే ఉండేవారు. జనతా ప్రభుత్వం
హయాంలో నెహ్రూ చిత్రపటాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయం నుంచి
తొలగిస్తున్నపుడు, వాజ్ పేయి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ
చిత్రపటాన్ని మళ్లీ అదే కార్యాలయానికి తీసుకెళ్లి అదేచోట పెట్టించాడు. ఇదీ పాలక, ప్రతిపక్షాల
గౌరవం అంటే. ఇదే ఈరోజు వరకూ వారి
వ్యక్తిత్వాల గురించి మనమంతా మాట్లాడుకునేలా చేసింది.
మనదేశంలో ప్రధానమంత్రి, లేదంటే
రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కొన్ని ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి అఖిలపక్ష
సమావేశాలను ఏర్పాటు చేయడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం మనం చూశాం.
ఇందులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజా ప్రయోజనాల కోసమే అయినప్పటికీ, రాజకీయ
పార్టీల మధ్య ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష సమావేశాలు విజయవంతంగా జరిగేవి. ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒకానొక (వావిలాల గోపాల కృష్ణయ్య లాంటి
వారున్నాప్పటి) రోజుల్లో ట్రెజరీ బెంచీలకు చెందిన మంత్రులు, విప్ లు
ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్లి వారడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తే
ప్రజోపయోగకరంగా వుంటుందో చర్చించిన సందర్భాలు వున్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో అధికార
పార్టీ ప్రయత్నించినా, ప్రతిపక్షం సరైన స్ఫూర్తితో స్పందిస్తుందా అనే
సందేహం ఉంది.
ఒక రాజకీయ పార్టీ అస్తిత్వం దాన్ని నడిపే
నాయకత్వం,
వారు
పనిచేసే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. నాయకత్వం సత్ప్రవర్తన, నైతికతతో ఉంటే
వారు ప్రజల గౌరవాభిమానాలను పొందుతారు. దుర్భాష వినడానికి అత్యంత వినోదంగా
అనిపిస్తుందేమో కానీ, ఆ భాషలో ప్రజా ప్రయోజనం ఉండదు. రాజకీయ
ప్రత్యర్థులు అనుసరిస్తున్న విధానాలపైగానీ, ప్రజా
సమస్యలపైగానీ విమర్శిచవచ్చు. కానీ, నిరాధారణమైన ఆరోపణలతో ప్రత్యర్థులను వ్యంగంగా
పేరు పెట్టి పిలవడం, తిట్టడం, శరీరాకృతిని
చూపుతూ అవహేళన చేయడం అనేవి ప్రజా జీవితంలో ఉండే నాయకులు ఏనాడూ అనుసరించకూడదు.
అయితే, రాజకీయాల్లో
సరిగ్గా, నైతికంగా ప్రవర్తించమని ఈ నోటిదురుసు నాయకులకు ఎవరు చెప్పాలి. అదే
పార్టీలోని సీనియర్ నాయకులు మాత్రమే ఈ రకమైన నోటిదురుసు నాయకులకు సభ్యత, మర్యాద, మన్నన నేర్పాల్సి
ఉంటుంది. తమ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎదురైన సమస్యలు, వాటిని
పరిష్కరించిన తీరు ఎలా ఉండేదో చెప్పాలి. అలాంటి క్లిష్ట సమయాల్లో తాము సంయమనంతో
వ్యవహరించిన విధానాన్ని కూడా చెప్పాలి. అపుడైనా ఇలాంటి నోటి దురుసు నాయకుల్లో.
కొంత మార్పు ఉండొచ్చేమో. అయితే వారి సహజ ప్రవర్తనను వదిలి, సత్ప్రవర్తనతో
మెదలాలని కోరితే మాత్రం వారు ఇష్టపడతారా? తొండి మాటలు, తిట్ల
పురాణాలు తాత్కాలికంగా విజయంగా కనిపించినా, శాశ్వతంగా మన
స్థాయిని దిగజార్చి, మనల్ని భూస్థాపితం చేస్తాయనే విషయాన్ని వారు
ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇదే
సందర్భంలో, సాక్షాత్తూ సీఎం పదవినే కించపరుస్తూ, ఏకవచనంతో మాట్లాడటం ఎంతవరకు సమంజసం, ఇంకెంత కాలం ఈ
అనైతిక విమర్శలు? ఇంకెన్నాళ్లు ఈ తిట్లు, దండకాలు? అని కూడా
తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
రాజకీయాల్లో ఇంతవరకు ఎవరూ వాడని ఈ భాషను
తాత్కాలికంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తారే తప్ప, ఆ భాష
మాట్లాడిన వ్యక్తిని మాత్రం అభిమానించరు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిని
అసలే నమ్మరు. దీర్ఘకాలంలో వారిని ప్రజా నాయకుడిగా కూడా అంగీకరించరు. ఏదేమైనా
ఆద్యతన భవిష్యత్తులో ఏది పార్లమెంటరీ భాషో, ఏది కాదో
అనేది పునర్నిర్వచనం చేయాల్నేమో!!!
No comments:
Post a Comment