ఆస్వాదన-1
ఉదంకుడు, పౌష్యమహారాజు సంవాదం:బ్రాహ్మణులకు రాజులకు భేదం
కవిత్రయ విరచిత శ్రీమదాంధ్రమహాభారత కథలు
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (10-01-2021)
బ్రహ్మ సమానుడైన ఉదంకుడనే పైల మహర్షి శిష్యుడు అణిమాది అష్ట సిద్ధులతో కలిగిన జ్ఞానాన్ని
సాధించాడు. ఆ ఉదంకుడు గురువుగారికి ఇష్టమైన పని నెరవేర్చడానికి ఆయన ఆజ్ఞానుసారం, పౌష్యుడనే మహారాజు దేవేరి
కర్ణాభరణాలు దానంగా పుచ్చుకుని తేవడానికి పూనుకుని, అడవిలో ఒంటరిగా వెళ్తుంటే ఎదురుగా ఒక పెద్ద
ఎద్దునెక్కి వస్తున్న ఒక దేవతాపురుషుడిని చూశాడు. అతడు నియోగించిన ఎద్దుపేడ తిని, ఆ మహానుభావుడి దయపొంది, పౌష్యమహారాజు దగ్గరికి పోయాడు.
అతడిచ్చిన అర్ఘ్యపాద్యాది సత్కారాలు పొందాడు. తాను వచ్చిన పని రాజుకు చెప్పి, ఆయన భార్య ధరించిన కర్ణాభరణాలను దానం
ఇమ్మని కోరాడు.
సంతోషించిన పౌష్యమహారాజు, తన భార్య ఆ కుండలాలను ధరించి వున్నదని, ఆమె దగ్గరికి పోయి, తన మాటగా వాటిని ఆమెనుండి
గ్రహించమని చెప్పాడు. ఉదంకుడు రాణి నివసించే అంతఃపురం వెళ్లి, ఆమె కనబడకపోవడంతో
వెనక్కు వచ్చాడు రాజు దగ్గరికి. తన భార్య అపవిత్రులను చూడదని చెప్పగానే పరమ
పవిత్రుడైన ఉదంకుడికి అనుమానం వచ్చింది. తాను ఎలా అపవిత్రుడినయ్యానని ఆలోచించాడు.
అడవిలో దివ్యపురుషుడు చెప్పినట్లు ఎద్దుపేడ తిన్న తరువాత ఆచమనం చేయకపోవడం వల్ల
కలిగిన అపవిత్రతగా గుర్తించాడు. ఆచమనం చేసి రాణి దగ్గరికి పోగా (పరమ పతివ్రతైన)
ఆమె కనిపించి ఉదంకుడికి నమస్కారం చేసి, తన
కర్ణాభరణాలు ఇచ్చింది. తాను ధరించే ఆ కర్ణాభరణాలను తక్షకుడనే సర్పరాజు పొందాలని
కోరుకుంటున్నాడని, వాటిని అతడు అపహరించకుండా జాగ్రత్తపడమని ఉదంకుడికి చెప్పింది
రాణి.
రాణి చెప్పినట్లే జాగ్రత్త వహిస్తానని ఆమె దగ్గర సెలవు తీసుకుని
పౌష్యుడి దగ్గరికి వచ్చాడు ఉదంకుడు. ఆయన అతిథి కాబట్టి తన ఇంట్లో భోజనం చేసి
పొమ్మన్నాడు రాజు ఉదంకుడిని. ఉదంకుడు అంగీకరించాడు. భోజనం చేస్తున్నప్పుడు ఆయన
తింటున్న అన్నం, వెంట్రుక వల్ల అపవిత్రం కావడంతో, కోపగించిన ఉదంకుడు, అలాంటి అన్నం పెట్టిన రాజును గుడ్డివాడివి
కమ్మని శపించాడు. అప్పుడు పౌష్యుడికి కూడా కోపం వచ్చి, ఉదంకుడిని సంతానం లేనివాడివి కమ్మని ఎదురు శాపం
ఇచ్చాడు. తాను సంతానం లేకుండా వుండలేనని శాపాన్ని ఉపసంహరించుకొమ్మని కోరాడు
ఉదంకుడు.
ఈ సందర్భాన్ని విశ్లేషిస్తూ
డాక్టర్ దివాకర్ల వేంకటావధాని గారు ఇలా రాశారు: “పౌష్యుడు, ఉదంకుడు ఆవేశంతో పరస్పరం శాపాలు
ఇచ్చుకున్నప్పటికీ వారి చర్యలకు హేతువులున్నాయి. పరీక్షించేవి కళ్ళు కాబట్టి, వాటిని అన్నం పెట్టేటప్పుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు
కనుక గుడ్డితనం రావాలని శపించాడు ఉదంకుడు పౌష్యుడిని. ఉదంకుడు గురుదక్షిణ ఇచ్చి
సేవచేస్తే కలిగేది వంశాభివృద్ధి కాబట్టి పౌష్యుడు అతడికి అది లేకుండా శాపం
ఇచ్చాడు. ఇది ప్రసన్నకథాకలితార్థయుక్తి”.
ఉదంకుడు
శాపాన్ని ఉపసంహరించుకొమ్మని అనగా పౌషుడు అన్న ఆమాటలు చక్కటి పద్యంలో రాశాడు నన్నయ
కవి ఇలా:
ఉ: నిండుమనంబు
నవ్యనవనీతసమానము, పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము, జగన్నుత! విప్రులయందు; నిక్క, మీ
రెండును
రాజులందు విపరీతము; గావున విప్రుడోపు, నో
పం
డతిశాంతుఁడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపఁగన్
(లోకం
స్తుతించే ఉదంక మహామునీ! బ్రాహ్మణుల నిండు హృదయం అప్పుడే తీసిన వెన్నతో సమానంగా, మిక్కిలి మృదువుగా ఉంటుంది. మాట భయంకరమైన
ఇంద్రుడి వజ్రాయుధంతో సమానంగా వుంటుంది, పరుషమైనది. ఇది నిజం. మనసూ, హృదయమూ అనే రెండూ రాజులలో అందుకు విరుద్ధంగా
ఉంటాయి. రాజుల్లో మనస్సు వజ్రతుల్యంగా, పలుకు నవనీతంగా ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణుడు ఇచ్చిన శాపాన్ని
ఉపసంహరించుకోవడానికి శక్తుడవుతాడు. మిక్కిలి శాంత స్వభావం కలవాడైనప్పటికీ రాజు
ఉపసంహరించుకోవడానికి శక్తుడు కాదు).
ఈ సందర్భాన్ని, పద్యాన్ని విశ్లేషిస్తూ డాక్టర్
దివాకర్ల వేంకటావధాని గారు ఇలా రాశారు: “ఈ పద్యం సుప్రసిద్ధమైనది. మనోవాక్కుల
విషయంలో బ్రాహ్మణులకు, రాజులకు ఉండే భేదాన్ని
వివరిస్తున్నది. రాజు మనస్సు కఠినం కాబట్టి తానిచ్చిన శాపాన్ని ఉపసంహరించజాలనని
పౌష్యుడు చెప్పాడు. నన్నయ రుచిరార్థసూక్తి కిది ఉదాహరణ. మూలానికి భిన్నంగా, నన్నయ, విప్రుల పల్కులను ‘దారుణాఖండల శస్త్రతుల్య’ మని ఉపమించాడు. నన్నయ రచనలో శబ్ద గుణాలెక్కువ.
వాటిల్లో కూడా ప్రసాద గుణం విస్తారంగా ప్రయోగించబడుతుంది. బంధశైథిల్యం,
అర్థనైర్మల్యం అనే శబ్దార్థగుణాలను రెండింటినీ పోషించిన పద్యమిది. అందువల్లే
ప్రసిద్దమై ప్రజలనాల్కల మీద నిలిచింది”.
ఆ
తరువాత ఉదంకుడు పౌష్యుడికిచ్చిన శాప కాలాన్ని తగ్గించాడు. ఉదంకుడి దగ్గరనుండి మీద
తక్షకుడు కుండలాలను అపహరించి,
తక్షకరూపంలో నాగలోకానికి పోయాడు. ఉదంకుడు కూడా తక్షకుడిని వెంబడించాడు. పాముల
రాజులను స్తుతించాడు అక్కడ. అతడికి అప్పుడు ఒక దివ్య పురుషుడు కనిపించాడు. ఆయన
చెప్పినట్లే చేశాడు ఉదంకుడు. పర్యవసానంగా, తక్షకుడు, భయపడి కుండలాలను ఉదంకమహామునికి ఇచ్చాడు.
దివ్యపురుషుడి ఇచ్చిన గుర్రం ఎక్కి ఉదంకుడు గురువుగారి (పైలుడు) ఇంటికి వచ్చాడు.
గురువుగారి భార్య ఉదంకుడు ఇచ్చిన మణిమయ కుండలాలను ధరించింది.
ఆ
ఉదంకుడే, తక్షకుడు తనకు చేసిన అపకారానికి
ప్రతీకారంగా, జనమేజయుడికి సర్పయాగ బుద్ధి
కలిగించాడు.
ఇది కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, ఆదిపర్వం, ప్రథమాశ్వాసం
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment