Saturday, January 16, 2021

సుగ్రీవుడి పట్టాభిషేకం రామకార్యానికేనా? : వనం జ్వాలా నరసింహారావు

 సుగ్రీవుడి పట్టాభిషేకం రామకార్యానికేనా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (16-01-2021) ప్రసారం  

వాలి, సుగ్రీవులు యుద్ధం చేస్తుంటే దూరం నుండి రామచంద్రమూర్తి వేసిన బాణం తాకిడికి పెద్ద మూర్ఛ వచ్చినందున వాలి బాధతో నేలకొరిగాడు. అంతకు ముందే సుగ్రీవుడు కొట్టిన దెబ్బలకు వాలి కీళ్లు బాగా నొప్పి కలిగించాయి. దానికి తోడు, రామబాణం మేకులాగా శరీరానికి గుచ్చుకుంది. ఈ కారణాన కాళ్లలో బలం పోయి కదిలించలేక, బాణం బాధకు విలవిల్లాడాడు. ఇక అక్కడ కిష్కింధలో వున్న తారకు తన మగడు చనిపోయాడన్న వార్త తెలిసింది. వాలిని చూడాలన్న కోరికతో త్వరత్వరగా కొడుకుతో సహా కిష్కింధ వదిలి వచ్చింది. రామ బాణం దెబ్బకు పడిపోయిన భర్త పాదాల దగ్గరకు పోవాలనుకుంది. 

వాలిని దూరం నుండే చూసి, కీళ్లు సడలిపోగా, నడవలేక-నడవలేక, వాలిని సమీపించిన వాలిని, ఆయనను బాణంతో చంపిన శ్రీరాముడిని, పక్కనే వున్న లక్ష్మణుడిని, ఈ పనంతా వారితో చేయించిన సుగ్రీవుడిని చూసింది. వాలిని సమీపిస్తూనే, బాణం తాకిడికి నేలమీద పడివున్న ఆయన్ను చూసి, మూర్చిల్లి, నిలబడి, గాఢనిద్ర నుండి లేచినదానిలాగా “ప్రియనాథా! మనోహరా!” అని ఏడ్చింది. ఇలా ఏడుస్తున్న వదినను, చావడానికి సిద్ధంగా వున్న అన్నను, సుకుమారుడైన బాలుడు అంగదుడిని చూసిన సుగ్రీవుడు దుఃఖంతో వేడి కన్నీళ్లు కార్చాడు. తార అక్కడే వున్నా కొడుకు అంగదుడిని చూసి, “కుమారా! ఇక్కడికి రా. ధర్మప్రీతికల నీ తండ్రిని కరువుతీరా చూడు. ఇదే కడసారి చూపు. ఇకమీద నీ తండ్రిని నువ్వు చూడాలనుకున్నా ఆ అదృష్టం నీకు లేదు. ఇంక ఎవరిని నువ్వు నాయనా అని పిలుస్తావు?

         అలాగే వాలిని ఉద్దేశించి, “ఇదిగో, వీడే అంగదుడు. చూడు. సర్వకాలం ముద్దుగా పెంచుతే అలాగే పెరిగాడు. నీ ఎదుట మాట్లాడడానికే భయపడుతాడు. అలాంటప్పుడు, కోపం కల పినతండ్రికి సేవ ఎలా చేస్తాడో? చేయకపోతే ఏమవుతుందో? (భర్తమీద పడి) వానరేశ్వరా! వీడే నీ కొడుకు. కళ్ళు కొంచెం తెరిచి చూడు. ఎందుకేడుస్తున్నావని సమాదానపర్చు. వానరేంద్రా! నిన్ను చంపి రామభద్రుడు గొప్ప పని చేశాడు. అదేంటంటావా? సుగ్రీవుడికి చేసిన ప్రమాణం సార్ధకం చేసి ఆ అప్పు తీర్చుకున్నాడు. (సుగ్రీవుడిని చూసి) సుగ్రీవా! విరోధం పోయేట్లు అన్నను చంపావు. ఇక హాయిగా రుమతో, రాజ్యరమతో సుఖపడు. (మళ్లీ వాలిని చూసి) ప్రియా! నీ ప్రియురాళ్ళందరూ ఇక్కడ ఏడుస్తున్నారు. వాళ్లతో ఒక్క మాట మాట్లాడకూడదా?” అన్నది తార.

         అలా ఏడుస్తున్న తారతో హనుమంతుడు ఇలా అన్నాడు. “దేవీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడం మాను. ఎవరైనా కర్మకు తగ్గ ఫలితం అనుభవించక తప్పదు. పుణ్యకర్మకు శుభం, పాపకర్మకు కీడు కలిగించడానికి వారివెంట పరలోకానికి పోవడం జరుగుతుంది. అలాగే వాలి కూడా తన శుభాశుభ కర్మఫలం అనుభవించడానికి పోయాడు. దీనికోసం నువ్వు సుగ్రీవుడిని కాని, రాముడిని కాని నిందించాల్సిన అవసరం లేదు. వారు నిమిత్తమాత్రులే. నీ కొడుకు అంగదుడు బాలుడు. వాడు జీవించి వున్నాడు. అలాంటివాడిని నువ్వు కాకుండా మరెవ్వరు రక్షిస్తారు?

         “వాలికొరకు ఎందుకు ఏడుస్తున్నావు? అతడు లోకంలో చేయాల్సినవన్నీ చేసి లోకాన్ని వదిలాడు వాలి. అంగదుడికి, కపిశ్రేష్టులకు, భల్లూక శ్రేష్టులకు, కపిరాజ్యానికి నువ్వే దిక్కు. సమస్త భారం నీమీదే వుంది. ఏడవడం ఆపుచేయి. క్రమక్రమంగా నీ సహాయంతో నీ కొడుకు రాజ్యం చేయడం నువ్వు చూసి సంతోషిస్తావు. కాబట్టి ఇలా దుఃఖపడవద్దు. భవిష్యత్ లో నీకు, నీకొడుక్కు రాగల కష్టం ఏదీ లేదు. కాబట్టి వర్తమానంలో జరగాల్సింది ఆలోచించు. నీ కొడుకును తండ్రికి ఉత్తర క్రియలు చేయనివ్వు. అంగదుడు తండ్రికి సంస్కారం చేయగా అతడి రాజ్యాన్ని స్థాపించి నువ్వు దుఃఖం పోగొట్టుకుంటావు”.

         ఇలా వీళ్లు మాట్లాడుకునే సమయంలో కొంచెం ఊపిరికల వాలి మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ కళ్లు విప్పి, తన దగ్గర వున్న అంగదుడిని, అతడి సమీపంలో వున్న సుగ్రీవుడిని చూసి, స్నేహపూర్వకమైన మాటలతో స్పష్టంగా ఇలా అన్నాడు. “సుగ్రీవా! నీమీద పగసాధించానని నన్ను దూషించవద్దు. నీలో ఏదోషం లేదు. ఇదిలా జరగాలని వుండడం వల్ల నా ఫలం నన్ను బట్టుకుని యీడ్చి, బలవంతంగా జ్ఞానహీనుడిని చేసింది. అన్నదమ్ముల మర్యాద ప్రకారం మనం ఒక్కటిగా వుండలేకపోయాం. తమ్ముడా! ఇది దైవం చేసిన పని. దాన్ని తప్పించడం మన శక్యమా? ఇక నేను జీవించలేను. ఈ వానర రాజ్యాన్ని నువ్వు సంతోషంగా పాలించు. ప్రాణం, రాజ్యం, సంపద, భూమ్మీద మూడులోకాల పొగడ్తలు కన్న యశస్సు వదిలి స్వర్గానికి పోతున్నాను” అని అంటూ అంగదుడిని, తారను సుగ్రీవుడికి అప్పచెప్పాడు వాలి. తన మెడలోని బంగారు హారాన్ని సుగ్రీవుడికి ఇచ్చి దాన్ని ధరించమని చెప్పాడు వాలి. సుగ్రీవుడు తన మనస్సులో పూర్వం ఆయన మీద వున్న విరోధం, రోషం వదిలి శాంతించి, బంగారు సారాన్ని ఆయన ఆజ్ఞానుసారం తీసుకున్నాడు. ఆ తరువాత కొడుకు అంగదుడికి రకరకాల విధంగా నీతి, ధర్మం బోధించాడు వాలి. 

         ఈ విధంగా చెప్పి, వాడిగల బాణాల వల్ల బాధపడుతూ, గుడ్లు గిర-గిరా తిప్పుతూ, పళ్ళు తెలిసేట్లు నోరు తెరిచి వాలి ప్రాణాలను విడిచాడు. కోతి గుంపులన్నీ హా! హా! అని ఏడ్చాయి. ప్రభువు చనిపోగా కిష్కింధ పాడుబడినట్లు కాంతిహీనమై కనిపించింది. కొండలు, తోటలు, గుహలు, పూర్వం ఉన్నట్లుగా కాకుండా పాడుబడినట్లు అయిపోయాయి. ఆవుల మందకు రక్షణగా వున్న ఆబోతు చస్తే రక్షణ చెడ్డ ఆవులు భయంకరమైన సింహాలు వుండే అడవిలో దుర్బలులై ఘోషిస్తున్నట్లు వానరులు వాలికొరకై ఏడ్చారు. మరణించిన (వాలి) భర్త ముఖం చూస్తూ విస్తార శోక సముద్రంలో మునిగి ఏడుస్తూ, మగడిని కౌగలించుకుని తార నేలమీద పడింది.

ఇలా తార ఏడుస్తుంటే నీలుడు వచ్చి వాలి రొమ్ములో వున్న రామ బాణాన్ని లాగాడు. ఆ బాణం లాగడంతో వానర శ్రేష్టుడి గాయాల నుండి నెత్తురు కాలవల్లాగా పారింది. అప్పుడు తార వాలి శరీరం మీద వున్న ధూళిని తన కన్నీటి ధారలతో సర్వావయాలను కడిగింది. ఆ తరువాత తార అంగదుడిని దగ్గరకు తీసుకుని వాలిని చూపించి, “నీ తండ్రిని కళ్లారా చూశావా? పాపకార్యం వల్ల కలిగిన విరోధం ఈ రోజుతో దేహంతో వదిలాడు. కుమారా! ఇదే కడసారి, ఇక నీ తండ్రి ముఖం నువ్వు చూడబోవు. కాబట్టి మొక్కు. బాల సూర్యుడు లాంటి దేహం కలవాడు ఒక్కడే యమపురికి పోతున్నాడు”. అని చెప్పింది. తల్లి అలా చెప్పగా, అంగదుడు వాలిపాదాల మీద పడి, “తండ్రీ! నేను అంగదుడిని. నమస్కరిస్తున్నాను. అంగీకరించు” అని అన్నాడు.

         అంగదుడితో కూడి ఇలా తార దుఃఖపడుతుంటే, ప్రాణం పోయి తన అన్న నేలమీద పడివుండడం చూసిన సుగ్రీవుడు ఇదంతా తన వల్లే కదా జరిగిందనీ, తానే దీనంతటికీ కారణమనీ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. తార ముఖం చూస్తుంటే ఆయన హృదయం కళవళపాటు చెందింది. అప్పుడు సుగ్రీవుడు మెల్లగా రామచంద్రమూర్తిని సమీపించి, నిట్టూర్పు విడుస్తూ ఇలా అన్నాడు. “నువ్వు అన్న ప్రకారం నీమాట చెల్లించుకున్నావు. కపిరాజ్యం నాకు లభించింది. కాని రాజ్య సుఖాల మీద, ప్రాణం మీద ఆశ నశించిపోయింది. నా మూలంగా మా అన్న చచ్చి పడి వుండడాన్ని, బతకాలా-వద్దా అన్న సంశయంలో వున్న అంగదుడిని చూసిన తరువాత రామచంద్రా! నా మనస్సు రాజ్య భోగాల మీదకు పోవడం లేదు. దుఃఖం ఆపుకోలేక పోతున్నాను”. సుగ్రీవుడి మాటలు విని, రామచంద్రమూర్తి, సుగ్రీవుడిలాగే తానూ కళ్ళనీళ్ళ పర్యంతమై కొంచెం సేపు దుఃఖపడ్డాడు. తార దగ్గరకు పోయి ఆమెను ఓదార్చాడు. రాముడి ఓదార్పు మాటలకు తార దుఃఖం మానింది.

         దీనికే కరుణారసం అని పేరు. పరుల దుఃఖం తన దుఃఖంగా భావించి దుఃఖపడడమే కరుణ లక్ష్యం. ఈ అవతారంలో ఈ రసం విశేషంగా కనిపిస్తుంది. సీతకొరకు రామచంద్రమూర్తి ఏడ్చింది ఇలాంటి కారణం వల్లే అని అర్థం చేసుకోవాలి. ఇది దొంగ ఏడ్పు కాదు. మాయ అంతకంటే కాదు. నిజమైన దుఃఖం. ఆత్మార్థహానికై వచ్చింది కాదు. ఇలాంటి కరుణ కలవాడు కాబట్టే రామచంద్రమూర్తికి కరుణాకాకుత్థ్సుడని బిరుదు వచ్చింది. ఆశ్రితుల దుఃఖం ఆయన కొంచెమైనా సహించలేడు. ఇది భగవంతుడిలో కల కళ్యాణ గుణాల్లో ఒకటి. భగవంతుడు ఆశ్రిత వత్సలుడు. అందుకే ధృడంగా కావాలని ఎవ్వరేది కోరినా అనుగ్రహిస్తాడు. కాని, చెడ్డ కోరికలు కలవారు ఫలితాన్ని అనుభవించేటప్పుడు దుఃఖపడుతుంటే, అయ్యో! వీరిలాంటి పాపపు కోరికలు కోరి ఇలా దుఃఖపడుతున్నారే, వీళ్లెప్పుడు బాగుపడతారా? అని వారిలాగే తానూ దుఃఖపడతాడు.

ఆ తరువాత సుగ్రీవుడు సహాయపడుతుంటే అంగదుడు తన తండ్రికి చితిని పేర్చి, ఏడ్చుకుంటూ, పరలోకానికి పోతున్న వానర శ్రేష్టుడికి అగ్నిని చితిమీద వుంచాడు. అప్రదక్షిణంగా తిరిగాడు. వాలికి ఈ విధంగా సంస్కారాలు చేసి శాస్త్ర పద్ధతిలో నీళ్లు విడవడానికి చల్లని నీళ్లున్న నదిని చేరి తార, సుగ్రీవుడు అంగదుడితో కలిసి వాలికి నీళ్లు వదిలారు. వారితో సమానంగా రాముడు కూడా దుఃఖిస్తుంటే సుగ్రీవుడితో ప్రేత కర్మలు జరిపించారు. యుద్ధంలో చనిపోయిన అన్న వాలికి దహానాది కార్యక్రమాలు జరిపించి సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చాడు. మిగిలినవారంతా, స్త్రీలు, పౌరులు, కిష్కింధకు పోయారు.

         తడిబట్టలతో, దుఃఖభారంతో, బాధపడతున్న సుగ్రీవుడిని మంత్రులంతా సేవించారు. అందరూ కూర్చున్న తరువాత హనుమంతుడు రామచంద్రమూర్తితో “రఘుకులదీపకా! నువ్వు సమ్మతిస్తే సుగ్రీవుడు కిష్కింధ చేరి దివ్యౌషధులతో పవిత్ర స్నానం చేసి వానరులతో మిగిలిన పట్టాభిషేక కార్యక్రమం జరిపిస్తాడు. ఆయనకు మీరు పట్టాభిషేకం చేసి ఈ వానర సమూహాల కన్నీటికి సంతోషం కలిగించు” అన్నాడు. జవాబుగా రామచంద్రమూర్తి ఆంజనేయుడితో సుగ్రీవుడు వూరికి చేరి సుఖంగా పట్టాభిషిక్తుడై శాస్త్రవిధి తప్పకుండా వానర రాజ్యాన్ని పాలించాలని అన్నాడు.

ఇలా అని సుగ్రీవుడితో చెప్పాడిలా. “ఈ అంగదుడిని యువరాజుగా పట్టాభిషేకం చేయి. ఇతడికి యౌవరాజ్యం ఇవ్వడం సబబే. నిన్ను కిష్కింధకు పోయి పట్టాభిషేకం చేసుకోమంటే నా పని మరిచానని కాదు. దానికి సమయం ఇది కాదు. వానాకాలంలో మొదటిది శ్రావణ మాసం. అది మొదలు నాలుగు నెలలు వర్షాకాలం అంటారు. ఈ నాలుగు నెలలు దండయాత్రకు పనికిరావు. కాబట్టి నీ వూరికి పో. నేను, లక్ష్మణుడు ఈ గుహలో వుంటాం. కార్తీక మాసం రాగానే రావణ వధకు కావాల్సిన ప్రయత్నాలు, వానర సేనను పోగు చేయడం జరగాలి. నువ్విప్పుడు వూరికి పోయి నీ స్నేహితులు సంతోషించే విధంగా రాజువై సుఖపడు”.

         రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి సంకేతం ఇచ్చినట్లే అని సుగ్రీవుడు భావించాడు. రామచంద్రమూర్తి ఆజ్ఞ ఇవ్వగానే సుగ్రీవుడు కిష్కింధకు పోయాడు. అక్కడ ఆయనకు వానర గుంపులు, పౌరులు, సాష్టాంగ నమస్కారం చేశారు. తన అన్న అంతఃపురానికి పోయి, దుఃఖపడుతున్న తారను సమాధాన పరిచాడు. ఆ తరువాత బక్ష్యాలతో, మణులతో, వస్త్రాలతో, బ్రాహ్మణులను తృప్తి పరిచారు. తదుపరి, శాస్త్రంలో చెప్పిన విధంగా దర్భలు పరిచిన భూమ్మీద అగ్నిని నిలిపారు. పవిత్ర మంత్రాలతో హోమాలు చేయించి, మంత్రాలు తెల్సినవారు చిత్ర మాల్యాలతో ప్రకాశించే మేడలో మనోహరమైన బంగారు పీటమీద తూర్పు ముఖంగా సుగ్రీవుడిని నిలబెట్టారు. అనేక నదుల నుండి, ఉపనదుల నుండి, సముద్రం నుండి జలాలను తెచ్చి, బంగారుకుండలో పోసి, బంగారు పాత్రలను ఎద్దుకొమ్ములతో ఆ నీళ్లలో ముంచారు. ఆ తరువాత శాస్త్రంలో చెప్పినట్లు మైందుడు, ద్వివిదుడు, గంధమాదనుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలభుడు, శరభుడు సంతోషంగా సుగ్రీవుడిని, ఇంద్రుడిని అభిషేకించినట్లు మిక్కిలి సువాసన కల మంచినీటితో ప్రేమతో అభిషేకించారు. సుగ్రీవుడు సంతోషంగా పట్టాభిషిక్తుడై ఆ తరువాత రామచంద్రమూర్తి చెప్పిన విధంగా అంగదుడిని యువరాజుగా అభిషేకించగా అందరూ సంతోషించారు. సుగ్రీవుడిని పొగిడారు.

ఇప్పుడు కిష్కింధ అని చెప్పబడే ప్రదేశాన్ని చూస్తే, అదొక చిన్న పట్టణం లాగా కనపడుతుంది. కాని, వాలి-సుగ్రీవులు పాలించినది ఆ చిన్న పట్టణం కాదు. కిష్కింధా రాజ్యం అల్ప రాష్ట్రం కానే కాదు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment