దశరథ మహారాజు గుణ, అయోధ్యా పురజనుల వర్ణన
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-40
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (18-01-2021)
మహారథుల సమూహం తనను ఎల్ల వేళలా
సేవిస్తుంటే,
వైకుంఠాన్ని శ్రీమహావిష్ణువు పరిపాలించిన విధంగానే, అయోధ్యా నగరాన్ని దశరథ మహారాజు కీర్తివంతంగా పరిపాలించేవాడు. వేద వేదాంతాలైన
ఉపనిషత్తుల అర్థం తెలిసినవాడు దశరథుడు. స్వయంగా అర్థాన్ని గ్రహించగల పాండిత్యముంది
ఆయనలో. పండితులను-వీరులను,
ధనం-గౌరవం ఇచ్చి, తనకనుగుణంగా మలచుకోగలిగిన
గుణవంతుడు. భవిష్యత్ లో జరగనున్న సంగతులను, మున్ముందుగానే పసిగట్టగల
శక్తిమంతుడు దశరథుడు. పట్టణ-పల్లె వాసులకు ఏం చేస్తే మేలుకలుగుతుందో, దాన్నే ఆలోచించి సమకూర్చగల సమర్థుడు. ఇక్ష్వాకుల వంశంలోని రాజులందరిలోనూ
అతిరథుడు-అగ్రగణ్యుడు. యజ్ఞ యాగాలు చేయడంలో ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తుంటాడు.
మనుష్యులకు,
పశుపక్ష్యాదులకు ఉపయోగపడాలని భావించి, బావులు-గుంటలు-తోటలు తవ్వించాడు. సమస్త ప్రజలను తనకనుకూలంగా మలచుకోగల నేర్పరి.
మహర్షులతో సరిసమానమైన వాడు. రాజర్షులలో శ్రేష్టుడు. యావత్ ప్రపంచం కొనియాడదగిన
శ్రీమంతుడు-కీర్తిమంతుడు. అతిశయించిన దేహబలం-కండబలం వున్నవాడు. శత్రువులను అవలీలగా
జయించినవాడు-జయించగలవాడు. మిత్రులు-విశ్వాసపాత్రులతో కలిమిడిగా వుంటాడు.
ఇంద్రియాలను జయించిన వాళ్లలో మొదటగా చెప్పుకోవాల్సినవాడు. పర్వతరాజైన హిమవంతుడి
ధైర్యంతో-ఆదిశేషుడి విద్యలతో పోల్చదగిన దశరథ మహారాజుకు సరితూగేవారు రాజ కులంలో
ఇంకెవ్వరు లేరంటే అతిశయోక్తికాదేమో.
అసలు-సిసలైన బంగారు రత్నాభరణాలను, విలువైన వస్త్రాలను ధరించి, ఇంద్ర కుబేరులతో
సరితూగుతూ,
ఆజ్ఞా రూపంలో సర్వత్రా వ్యాపించి, వైవస్వత మనువువలె పరాక్రమవంతుడై, జగజ్జనులను పాలిస్తూ, సత్యవంతుడై,
ధర్మ-అర్థ-కామాలను రక్షించే విధానం తెలిసున్నవాడిలా, అయోధ్యా పురాన్ని పరిపాలించేవాడు దశరథ మహారాజు. (దశరథుడు రాజ్యం చేస్తున్న
రోజుల్లో కొందరు జ్యోతిష్కులు ఆయన్ను కలిసి, శనైశ్చరుడు రోహిణీ
శకటాన్ని భేదించే ప్రయత్నంలో వున్నాడని-ఆయనట్లా చేస్తే పన్నెండు సంవత్సరాలు దేశంలో
దుర్భర పరిస్థితులు నెలకొనే ప్రమాదముందని చెప్పాడు. అది విన్న దశరథుడు, నక్షత్ర మండలానికి తన రథంపై పోయి, శనైశ్చరుడిని
ఎదిరించి-తాను జీవించి వున్నంతవరకు ఆయన రోహిణీ శకటాన్ని భేదించడం కుదరదని స్పష్ఠం
చేశాడు. అవసరమైతే యుద్ధం చేసి-ఆయన్ను గెలిచి-ఆయన ప్రయత్నాన్ని అడ్డుకుంటానని
హెచ్చరించాడు. దశరథుడి కోరిక మేరకు, ఆనాటినుండి శనైశ్వరుడు
రోహిణీ నక్షత్రాన్ని ఆనుకుని పోవడమే కాని భేదించే ప్రయత్నం చేయలేదు. అదీ దశరథుడి
ప్రజాహిత కాంక్ష.
అయోధ్యా పురంలోని బ్రాహ్మణులు
బాహ్యేంద్రియాలను-అంతరేంద్రియాలను, జయించినవారు. పరులను
వంచించాలనే దురాచారానికి దూరంగా వుంటారు. ఎటువంటి అనాచారానికి లోనుకాకుండా, సత్యాన్నే పలుకుతూ,
భగవత్ కథలనే వల్లించి కాలయాపన చేస్తూ, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, నిర్మల బుద్ధితో వుంటారు.
వేదాల్లో చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ, అడిగిన వారికి లేదనకుండా
శక్తికొలది దాన ధర్మాలు చేస్తుంటారు. అక్కడి వారెవరికీ, ఇతరులను యాచించాల్సిన పనేలేదు. ఆరంగాల
(శిక్ష-వ్యాకరణం-ఛందస్సు-నిరుక్తం-జ్యోతిష్యం-కల్పం) వేదాధ్యయనం చేయడం వారికి
నిత్య కృత్యం. పెద్ద మనసుతో పుణ్య కార్యాలను చేస్తూ, దేవర్షులతో-మహర్షులతో సమానంగా, సూర్య చంద్రుల
తేజస్సుతో-వర్ఛస్సుతో భగవధ్యానం చేస్తూ, సదాచార సంపన్నులై
మెలగుతుండేవారు.
(వాసుదాసుగారు ఈ వర్ణనను చేస్తూ రాసిన పద్యంలో: బ్రాహ్మణులను
ద్విజాతులని-వేదషడంగ పారగోత్తములని – అహితాగ్నులని – సహస్రదులని – మహామతులని –
సత్యవచస్కులని - హిమకరమిత్ర తేజులని - ఋషులని పోలుస్తారు. మరో పద్యంలో హృష్ఠ
మానసులని - శాస్త్ర చింతన పరాయణులని – స్వస్వతుష్టులని – త్యాగశీలురని - భూరి
సంచయులని వర్ణిస్తారు).
అయోధ్యా వాసులందరూ సంతుష్టిగల
మనసున్నవారే – ధర్మాన్నెరిగినవారే - శాస్త్ర సంబంధమైన ఆలోచనలు చెసే వారే.
దేవుడిచ్చిన దాంతోనే సంతృప్తి చెందేవారు. త్యాగ బుద్ధిగలవారు. నిజాన్ని మాత్రమే
చెప్పే గుణంగలవారు. తమకెంత అవసరమో అంత సంపాదన మాత్రమే చెసేవారు. అవసరాని సరిపోయే
ఆవులను, గుర్రాలను,
సిరి సంపదలను కలిగినవారు. కుటుంబం అంటే శాస్త్రాల్లో
ఎటువంటి నిర్వచనం చెప్పబడిందో, దానికనుగుణంగానే, పదిమంది (తను-తన తల్లి,
తండ్రి, భార్య-ఇద్దరు
కొడుకులు-ఇద్దరు కోడళ్లు-ఒక కూతురు-ఒక అతిథి) కంటే తక్కువున్న ఇల్లు ఆనగరంలో లేదు.
కొడుకులకు,
భార్యకు కడుపునిండా భోజనం పెట్టకుండా బాధించేవారు కానీ, దాన ధర్మాలు అనుదినం చేయనివారు కానీ, ఆ నగరంలో కనిపించరు.
అందమైన ఆ నగరంలో చెడ్డవారు కనిపించరు. పర స్త్రీలను ఆశించే వారు కానీ, భార్యతో కూడా నిషిద్ధ దినాలలో కామ క్రీడలు ఆడేవాడు కానీ, వేశ్యా లోలురు కానీ,
చదువురాదననివారు కానీ, నాస్తికులు కానీ అయోధ్యలో
లేనే లేరు.
No comments:
Post a Comment