తార మాట వింటే వాలి బతికేవాడేనా?
వనం
జ్వాలా నరసింహారావు
ఆకాశవాణి
హైదరాబాద్ కేంద్రం శనివారం (09-01-2021) ప్రసారం
తన అన్న వాలిని శ్రీరాముడు చంపుతాడన్న నమ్మకం కుదిరింది సుగ్రీవుడికి. ఆ వెంటనే సుగ్రీవుడితో రాముడు, కిష్కింధకు పోదామనీ, ఉపేక్ష చేయవద్దనీ, సోదరుడిని యుద్ధానికి పిలువమనీ, భయపడవద్దనీ అంటాడు. రాముడు చెప్పినట్లుగానే సుగ్రీవుడు కిష్కింధకు పోయి దిక్కులు పిక్కలిల్లేట్లు సింహనాదం చేసి వాలిని యుద్ధానికి పిలిచాడు. ఆ ధ్వని విన్న వాలి మండిపడుతూ యుద్ధానికి వచ్చాడు. వారిరువిరికీ ఆకాశంలోని బుధ, అంగారక గ్రహాలకు లాగా ఘోరమైన ద్వంద్వయుద్ధం జరిగింది. అప్పుడు రామచంద్రమూర్తి గురిచూసి వాలిమీద బాణం వేద్దామనుకున్నాడు కాని, ఆకారంలో సమానంగా ఒకేవిధంగా వున్న వారిద్దరినీ చూసి ఎవరు సుగ్రీవుడో, ఎవరు వాలో పోల్చుకోలేక ఆగిపోయాడు. ప్రాణం తీద్దామనుకున్న బాణాన్ని సందేహంతో రామచంద్రమూర్తి విడవలేదు. ఇంతలో వాలి దెబ్బలకు బాధపడి, వాలి వెంటపడి తరుముతుంటే ఋష్యమూకానికి పరుగెత్తి పోయాడు సుగ్రీవుడు.
రాముడు
లక్ష్మణులను చూసి సుగ్రీవుడు సిగ్గుతో తలవంచుకుని ఇలా అన్నాడు. “నీ పరాక్రమాన్ని
నేను నమ్మేట్లు చేసి చూపించి, నన్ను
యుద్ధానికి పొమ్మని ప్రేరేపించి, శత్రువు
చేతిలో నన్నిలా చంపేట్లు చేయడానికి కారణం ఏమిటి? నా
శత్రువు చేతిలో నన్ను చంపించడంవల్ల నీకు కలిగే లాభం ఏంటి రామచంద్రా?
బలవంతుడా! మహాబుద్ధిమంతుడా! వాలిని చంపమని నిన్ను నేను కోరినప్పుడు చంపనని ముందే
చెప్పవచ్చుకదా? నువ్వు అలా చెప్తే నేను ఎప్పటిలాగా హాయిగా ఇక్కడే పడి వుండేవాడిని
కదా? నన్నెందుకు యుద్ధానికి పంపావు?
నన్ను చావుదెబ్బల పాలుచేయడానికా?”
ఏడుస్తున్న సుగ్రీవుడిని చూసి రామభద్రుడు,
“నా దివ్యబాణాన్ని విడవకపోవడానికి కారణం చెప్తా విను. రూపంలో,
వయస్సులో, ఎత్తులో,
చూడడానికి, వేషంలో, నడకలో,
కాంతిలో, మాటల్లో,
కంఠస్వరంలో, ధైర్యంలో,
మీరిద్దరూ సమానంగా వున్నారు. ఈ కారణాన మీలో వాలి ఎవరో,
సుగ్రీవుడు ఎవరో నేను గుర్తుపట్టలేక ప్రాణం తీసే బాణాన్ని వదలలేదు. ఇది ముమ్మాటికీ
నిజం. నా బాణం నిన్ను చంపితే, నా
బుద్ధిలేనితనం, పిల్లతనం,
శాశ్వతంగా నికిచి వుండేది కదా?
కార్యభంగమే కాకుండా శాశ్వతమైన అపకీర్తి వచ్చేది. నేను,
లక్ష్మణుడు, సీత నీకు వశపడి వున్నాం. మా క్షేమం నీ చేతిలో వుంది. కాబట్టి నీకు
నేను ద్రోహం చేయను. నా మాట నమ్ము. సందేహించవద్దు. మళ్లీ వాలి మీదకు యుద్ధానికి పో.
నాకు తెలిసేవిధంగా నువ్వేదైనా గుర్తు ధరించు. ఆ ఆమాత్రం నువ్వు చేస్తే,
నా బాణం దెబ్బకు వాలి కిందపడి చస్తాడు” అని చెప్పి లక్ష్మణుడితో “లక్ష్మణా!
గజపుష్పమాల తీగె పుష్కలంగా వుంది. అది స్పష్ఠంగా తెలిసేట్లు తెచ్చి ఇప్పుడే
సుగ్రీవుడి మెడలో వేయి”. అని రామచంద్రమూర్తి చెప్పగానే లక్ష్మణుడు దాన్ని తెచ్చి
సుగ్రీవుడి మెడలో వేశాడు.
ముందు
లక్ష్మణుడు, వెనుక వల, నీల,
తార, హనుమంతుడు రాగా రామచంద్రుడు బంగారు రేకులతో అలంకరించిన పెద్ద
విల్లును, సూర్యకాంతికల బాణాలను చేతిలో ధరించి బయల్దేరాడు. వాలిని
సంహరించాలన్న ఆసక్తితో వున్న శ్రీరాముడు వాలి పాలించే కిష్కింధను చూశాడు. ఈ విధంగా
అందరూ వాలి పాలించే నగరానికి సమీపంలో దట్టమైన అరణ్య ప్రదేశంలో చెట్ల గుంపులున్న ఒక
మరుగైన స్థలంలో నిలబడ్డారు. ఎలాంటి సింహనాదం నువ్వు చేస్తే,
కోపంతో మండిపడుతూ, వాలి యుద్ధానికి వస్తాడో,
అలాంటి సింహనాదం చేయమని సుగ్రీవుడితో
అంటాడు రాముడు. ఇలా రామచంద్రమూర్తి స్పష్టంగా తనకు చెప్పిన మాటలు విన్న సుగ్రీవుడు,
ఉరుములాగా గర్జిస్తూ, తన
కంఠధ్వనిని దిక్కులు పిక్కలిల్లేట్లు చేశాడు. గుండెలు పగిలేలా సుగ్రీవుడు చేసిన
సింహనాదాన్ని, ఆయన కఠోరమైన కంఠధ్వనిని విన్న వానరులు దిక్కుతోచక పరుగెత్తాయి. మేఘం
ఉరుములాగా సుగ్రీవుడి కంఠధ్వని క్షణ-క్షణం పెరగసాగింది.
సుగ్రీవుడి సింహనాదం అంతఃపురంలో వున్న
వాలి వినగానే అతడి మదం అణగిపోయింది. విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో వాలి
గ్రహణం పట్టిన సూర్యుడిలాగా హీనుడయ్యాడు. కోపాతిశయంతో మండుతున్న అగ్నిలాగా
వెలుగుతూనే కాంతిహీనుడయ్యాడు. భయంకరమైన సుగ్రీవుడి కంఠధ్వని తన చెవుల్లో పడగానే,
పట-పటా పండ్లు కొరికి, సుగ్రీవుడి మీదకు యుద్ధానికి
పోవడానికి సన్నద్ధమయ్యాడు. ఆ సమయంలో వాలి భార్య తార ఆయనను అడ్డుకుని ఆయనకు
మేలుజరిగే మాటలను తొట్రుపాటుతో ఇలా చెప్పింది.
“ఈ కోపాన్ని వదిలిపెట్టు. సూర్యోదయం
కాగానే నువ్వు యుద్ధానికి పోవచ్చు. ఇప్పుడే పోకపోతే నీకు వచ్చే అవమానం కానీ,
నీ విరోదికి కలిగే గౌరవం కానీ ఏమీ లేదు. ఆలోచించు. ఇప్పుడే పోతే వచ్చే నష్టం ఏంటి?
అంటావా? ఇప్పుడు యుద్ధానికి పోకూడదు.
దానికి కారణం ఏమిటంటావా? ఇంతకు
కొద్దిసేపటి క్రితమే నీ భుజబలం ముందు సతమతమై, బలహీనుడుడై
పరుగెత్తిపోయాడు. ఇంతలోనే మళ్లీ యుద్ధానికి నిన్ను పిలిచే ధైర్యం,
సాహసం ఎక్కడినుండి వచ్చింది?
కాబట్టి నాకు ఏదో సందేహం కలుగుతున్నది. అతడు చేస్తున్న సింహనాదం ఇదివరకు చేసినట్లు
లేదు. ఇప్పుడు, బలం, చలం,
బలమైన యత్నం, చాలా గొప్పగా కనిపిస్తున్నది. ఇలా కావడానికి కారణం ఏదో వుండాలి.
కారణం లేకుండా కార్యం వుంటుందా? ఏదో
బలిష్టమైన సహాయం దొరక్కుండా ఇలా మళ్లీ యుద్ధానికి రాడని నా అభిప్రాయం. బలిష్ట సహాయం
దొరక్కపోతే అలాంటి సింహనాదం చేయడు. బాగా ఆలోచించి,
పరీక్షించి, నిస్సందేహంగా బలిష్టుడని అనుకున్నవాడితో వస్తాడు కానీ,
అల్పులతో రాడు”.
“ఇంతకుముందే నేనీ వృత్తాంతాన్ని
విన్నాను. మన అంగదుడే నాకీ సంగతి చెప్పాడు. అతడు అరణ్యానికి పోయి మరలి
వచ్చేటప్పుడు మన వేగులవాళ్ళు చెప్పారట. రఘువంశంలో పుట్టిన రామలక్ష్మణులు అనేవాళ్లు,
నువ్వు పోలేని ఋష్యమూకంలో నీ తమ్ముడికి సహాయం చేయడానికి వచ్చారట.
వాళ్లలో రాముడనేవాడు శత్రువులపాలిటి కాలాంతకుడు. ప్రళయకాలాగ్నిలాంటివాడు.
ఉచితానుచిత విద్యల్లో సమర్థుడు. సుగ్రీవుడికి రక్షకుడైన వాడు నీకెందుకు కాకూడదని
అంటావా? నిన్నెందుకు శిక్షిస్తాడంటావా? సుగ్రీవుడు
ఆయన్ను ఆశ్రయించాడు. నువ్వు ఆశ్రయించలేదు. కాబట్టి నీకు ఆయన రక్షకుడు కాలేదు. అదే
కాకుండా, ఆయన్ను ఆశ్రయించిన సుగ్రీవుడికి నువ్వు విరోధివి. నిన్నెలా
రక్షిస్తాడు? సుగ్రీవుడు ఎప్పుడైతే అతడు శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించాడో,
అప్పుడే సాధువయ్యాడు. నువ్వు పోయి ఆశ్రయిస్తే నిన్నూ రక్షిస్తాడు. సర్వకల్యాణ
గుణాలకు రామచంద్రమూర్తి స్థానం. నేను నీ దోషాలు ఎత్తి చూపడానికి ఇవన్నీ చెప్పడం
లేదు. నా మాట విను. విని నడుచుకుంటే నీకు మేలు కలుగుతుంది”.
“రామచంద్రమూర్తితో విరోధం పెట్టుకోవడం
సరైంది కాదు. అది దోషం. దానివల్ల మేలు కలగదు. అందుకే,
నేను, నాకు తోచిన ఉపాయం చెప్తా విను. ఆ తరువాత నీకేది మంచిదో అదే చేయి.
సుగ్రీవుడికి యౌవరాజ్యం ఇచ్చేయి. వాడూ మహాబలవంతుడే. అలాంటి వాడితో నీకెందుకు అనవసర
విరోధం? నా మనవి విను. రామచంద్రమూర్తితో స్నేహం చేయడం నీకు శ్రేయస్కరం,
శుభకరం. అదెలా కుదురుతుంది అని అంటావా? నీ తమ్ముడిమీద
పగ వదలిపెట్టు. నువ్వాపని చేస్తే రామచంద్రమూర్తి నిన్ను ద్వేషించడు. నీకు
వాడొక్కడే తమ్ముడు. వాడు తప్ప నిన్ను అన్నా,
అని పిలిచేవాడు ఎవరూ లేరు. వాడు కూడా దుర్మార్గుడు కాదు. దుష్టుడు కాదు. ఉత్తమ
గుణాలు కలవాడు. నీమీద వినయవిధేయతలున్నాయే కాని,
నిన్ను వాడు ధిక్కరించేవాడు కాదు కదా? వాడు
నీకు తమ్ముడు కాదా? నీకేమైనా శత్రువా?
వాడు, నువ్వు ఒక్క గర్భంలో పుట్టారుకదా?
అతడిని గౌరవించి దగ్గర వుంచుకో. తమ్ముడి విషయంలో ద్రోహం మానుకో. ఇంద్రుడి
తేజస్సుకల రామచంద్రమూర్తితో విరోధం వద్దు. శాంతించు”
తార ఈ విధంగా ఎంత హితం చెప్పినా వాలి
చెవులకు ఎక్కలేదు. కాలం దాపరించినవాడు హితవాక్యాలు వింటాడా?
తార ఇలా చెప్పడంతో, వాలికి కోపం వచ్చింది. అలా
చెప్పడం తారకు తగదని ఆమెతో ఇలా అన్నాడు. “ఈ విధంగా మాట్లాడడం నీకు న్యాయమా?
వాడు నాకు తమ్ముడా? తమ్ముడే అయితే మితిమీరిన గర్వంతో
చెలరేగి, సింహనాదాలు చేసి,
పరాక్రమవంతుడనని భావించి నన్ను యుద్ధానికి పిలుస్తాడా?
ఇలాంటివాడిని ఎలా క్షమిస్తాను? శూరులకు
ప్రాణాలు తీపి అని అనుకుంటున్నావా? పరాజయం
అంటే ఏమిటో తెలియనివారికి, యుద్ధంలో
వెనుకడుగు వేయని, తిరస్కరించబడని వారికి,
విరోధులు చేసే అవమానం కంటే చావడమే మేలు. నామీదికి యుద్ధానికి వచ్చినవాడు శూరుడా?
సింహనాదాలు చేస్తాడా? నేనేమో బలహీనుడినా?
వాడి రంకెలు విని సహించేటంత ఖర్మ నాకెందుకు?
ఇక రామచంద్రమూర్తి నన్ను చంపుతాడని కదా నువ్వు భయపడ్తున్నావు?
నువ్వు భయపడాల్సిన కారణం లేదు”.
“ఆయన
నాకపకారం చేయడు. ఎందుకంటే, ఆయన ధర్మం
అంటే విశేష ప్రీతికలవాడు. మేలెరిగినవాడు. ఇలాంటివాడు నిష్కారణంగా నన్నెందుకు
చంపుతాడు? నువ్వు ఇతర స్త్రీలతో అంతఃపురానికి వెళ్లు. నామీద నీకున్న భక్తివల్ల
ఇంత చెప్పావని నాకు తెలుసు. యుద్ధానికి పోయి శత్రువును కొట్టి,
నీ మరది భుజబల గర్వం అణచి వస్తాను. వాడిని చంపను. నామాట నమ్ము. వాడికి బలం లేదు.
గొంతు లేదు. అలాంటివాడి సింహనాదాన్ని సహిస్తానా?
నా ప్రాణం మీద ఒట్టు పెడుతున్నాను. నా విజయం కాంక్షించి వెళ్లిపో” అని వాలి
చెప్పగానే తార ప్రదక్షిణ చేసి,
మంగళాశాసనాలు చెప్పి స్త్రీలతో సహా సన్నటి గొంతుతో ఏడ్చుకుంటూ అంతఃపురానికి
పోయింది. ఇలా తార ఇంటికి వెళ్లిపోగానే వాలి అసమాన కోపంతో ఉరు విడిచి పోయాడు.
అధిక రోషంతో విరోధిని చూడాలన్న కోరికతో
వున్న వాలికి సుగ్రీవుడిని చూడగానే ఉత్సాహం కలిగింది. వెంటనే,
కట్టువస్త్రాన్ని చక్కగా బిగించి,
కడుకోపంతో, సుగ్రీవుడికి ఎదురుగా పోయాడు. అలా వస్తున్న వాలిని బంగారుమాలిక
ధరించిన సుగ్రీవుడు, చూసి,
అదురు-బెదురూ లేకుండా ముందుకు పోయాడు. తనకెదురుగా వస్తున్న తమ్ముడిని చూసి వాలి,
కోపంతో తన ముష్టిని చూపిస్తూ, అది
అతడిని వజ్రంలాగా భేదిస్తుందన్నాడు. పరుగెత్తి పోవద్దని అన్న వాలికి సమాధానంగా తన
ముష్టిని చూపాడు సుగ్రీవుడు. వాలి తలను చింతకాయలాగా చేస్తానంటాడు. ఆ ఆమాటలకు
కోపించిన వాలి, సుగ్రీవుడిని సమీపించి గట్టి పిడికిలితో కొట్టాడు. ఆ దెబ్బకు
ప్రతిగా, తన శరీరం నుండి నెత్తురుకారుతున్నప్పటికీ,
ఒక చెట్టు పీకి గిరగిరా తిప్పి వాలిని కొట్టాడు సుగ్రీవుడు. ఆ దెబ్బకు
బలవంతుడైనప్పటికీ వాలి గడగడ వణికాడు. కలవరపాటు చెందాడు కాసేపు. వాలిసుగ్రీవులిలా
ఒకరినొకరు జయించగలవారిలాగా, భయపడకుండా,
వెనుదీయకుండా, ఆకాశాన సూర్యచంద్రుల్లాగా భూమ్మీద యుద్ధరంగంలో ప్రకాశించారు.
వాలి శౌర్యం క్రమంగా పెరగసాగింది.
సుగ్రీవుడి బలం క్రమంగా తగ్గసాగింది. అయినా సుగ్రీవుడు యుద్ధం చేస్తూనే వున్నాడు.
ఒకరినొకరు ముష్టిఘాతాలతో, చేతులతో,
చెట్లతో, కాళ్లతో, గోళ్లతో,
దీరుల్లాగా తమ ఇష్టం వచ్చినరీతిలో యుద్ధం చేశారు. ఒకరినొకరు సమీపించి
చెట్లతో కొట్టుకుంటూ, ఒకరినొకరు నేలమీద పడేసుకుంటూ,
పిడికిలి గుద్దులతో నొప్పించుకుంటూ,
వీర్యంగా తాకుతూ యుద్ధం చేశారు. సుగ్రీవుడి బలం క్రమక్రమంగా క్షీణించింది. వాలితో
దెబ్బలు తిని నలుదిక్కులా చూడసాగాడు.
తన స్నేహితుడు,
తాను అభయహస్తం ఇచ్చిన వాడు, తననే
నమ్మినవాడు, శరణాగతుడు,
సుగ్రీవుడు తన కళ్ళ ముందరే శత్రువు చేతిలో ప్రాణాంతక బాధ పడడం చూసిన శత్రుసంహరణ
దక్షుడైన శ్రీరాముడు, వాలిని చంపగల భయంకర బాణాన్ని తీసి
అల్లెతాటిలో చాలా వేగంగా కూర్చాడు. ఆ అల్లెతాటి శబ్దానికి ఆకాశంలో తిరిగే పక్షులు,
నేలమీద తిరిగే మృగాలు భయపడి తమ స్థానాల్లో వుండలేకపోయాయి. వజ్రాయుధంలాగా,
వేగంగా, పిడుగులాగా,
రామచంద్రమూర్తి విల్లు నుండి వెలువడిన బాణం వాలి రొమ్మును తాకింది. ఆ బాణం తాకగానే
ఇద్రధ్వజంలాగా బలం క్షీణించి, వాలి
నేలకూలాడు.
(వాసుదాసుగారి
ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment