Saturday, January 16, 2021

మృత సంజీవని నేర్చుకున్న కచుడు: కచదేవయాని కథ (ఆస్వాదన-2) .... వనం జ్వాలా నరసింహారావు

 మృత సంజీవని నేర్చుకున్న కచుడు: కచదేవయాని కథ

(ఆస్వాదన-2)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (17-01-2021)

వైవస్వత మనువు పుత్రిక ఇలా అనే ఆమెకు, చంద్రుడి కొడుకైన బుధుడికి పురూరవుడు జన్మించాడు. అతడు చక్రవర్తి అయ్యాడు. అతడు మదాంధుడై బ్రాహ్మణుల ధనాలను అపహరించాడు. పురూరవుడు చేసిన బ్రాహ్మణధనాపహరణాన్ని తొలగించేందుకు సనత్కుమారుడు బ్రహ్మలోకం నుండి దేవమునులతో కలిసి భూలోకానికి వచ్చాడు.

పురూరవుడు వారికి దర్శనం ఇవ్వడానికి నిరాకరించినందున అతడిని వెర్రివాడివి కమ్మని శపించారు మునులు. ఆ పురూరవుడి వంశంలో జన్మించాడు నహుషుడు. అతడు ప్రభువై ద్వీపారణ్య పర్వతాలతో కూడినదీ, నాలుగు సముద్రాలతో కప్పబడినదీ అయిన భూమండలాన్ని తన అపార బాహుబలంతో పాలిస్తూ నూరు యజ్ఞాలు చేసి, తన కీర్తి నలుదిశలకు వ్యాపింప చేసి, శత్రువులను జయించి, దేవేంద్ర పదవిని పొందాడు. ఇక్కడ నన్నయ ఒక చక్కటి పద్యం రాశాడు ఇలా:

మ:      చతురంభోదిపరీతభూవలయమున్ సద్వీప సారణ్యస

            క్షితిభృత్కం బగుదాని భూరిభుజశక్తిం జేసి పాలించుచుం

           గ్రతువుల్ నూ రొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్ నిర్జితా

           హితు డై యా నహుషుండు దా బడసి దేవేంద్రత్వముం బేర్మితోన్

         నహుషుడి భార్య ప్రియంవద. వారికి పుట్టిన ఆరుగురు కుమారులలో యయాతి అనేవాడు రాజై అనేక యజ్ఞాలు చేశాడు. శుక్రుడి కుమార్తె దేవయానిని పెళ్లి చేసుకుని ఇద్దరిని, వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ వల్ల పూరుడుతో సహా ముగ్గురు కుమారులను కన్నాడు. శుక్రుడి శాపం వల్ల ముసలితనం రాగా తనకొడుకులను పిలిచి తన ముసలితనం తీసుకుని యవ్వనం ఇమ్మన్నాడు. ఒక్క పూరుడే దానికి అంగీకరించాడు. తన యౌవనాన్ని తండ్రికి ఇచ్చాడు. యయాతి మహారాజు చరిత్రను కూడా సవివరంగా చెప్పాడు వైశంపాయనుడు.    

         దీని పూర్వరంగంలో, శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి దేవతల ప్రార్థన మీద బృహస్పతి కుమారుడైన కచుడు ఆయన దగ్గరికి వెళ్లాడు. శుక్రాచార్యుడి కూతురు దేవయాని అంటే ఆయనకు విపరీతమైన ప్రేమ కాబట్టి ఆమెను ప్రసన్నరాలుని చేసుకోమని కూడా వారు సూచించారు. కచుడి సౌకుమార్యాన్ని, వినయాన్ని, మెత్తదనాన్ని, తియ్యదనాన్ని చూసి శుక్రుడు అతడిని శిష్యుడిగా స్వీకరించాడు. కచుడు గురువును, ఆయన కూతురు దేవయానిని కొలిచి వారి ప్రేమను పొందాడు. అసూయ చెందిన రాక్షసులు ఒకనాడు కచుడు బయటకు (అడవికి) వెళ్లినప్పుడు అతడిని చంపారు. అప్పుడు దేవయాని కలవరపడుతూ తన తండ్రి దగ్గరికి వెళ్లి కచుడు రాలేదని చెప్పిన విషయాన్ని చక్కటి పద్యంగా రాశాడు నన్నయ ఈ విధంగా:

         ఉ:       వాడి మయూఖముల్ గలుగువా డపరాంబుధి గ్రుంకె, ధేనువుల్

నేడిట వచ్చె నేకతమ, నిష్ఠమెయిన్ భవ దగ్నిహోత్రముల్

పోడిగ వేల్వగాబడియె, బ్రొద్దును పోయె, గచుండు నేనియున్

రాడు, వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధ నొందెనో!             

         (సూర్యుడు పడమటి సముద్రంలో కుంకాడు. హోమధేనువులు ఒంటరిగా తిరిగి వచ్చాయి. చీకటి పడడం వల్ల నీ అగ్నిహోత్రాలు చక్కగా ఆహుతులను పొందుతున్నాయి. చాలా పొద్దుపోయింది. కచుడు మాత్రం తిరిగి రాలేదు. అడవిలో మృగ రాక్షస సర్పాల వల్ల బాధను పొందాడేమో!)

         ఈ సందర్భాన్ని, పద్యాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ దివాకర్ల వేంకటావధాని గారు ఇలా రాశారు: “సంధ్యా సమయాన్ని స్వభావోక్తిలో వర్ణిస్తూనే కచుడి మీద దేవయానికి గల అభిలాషను కూడా రమణీయంగా ధ్వనింప చేశాడు నన్నయ. తెలుగులోని మంచి పద్యాలలో ఇదొకటి. అందుకు కారణం నన్నయ రచనా శిల్పమే. ఈ పద్యంలో దేవయాని అభిలాష వ్యంగ్యం. దానికి ఆర్తి, అధిక్షేపం, శంక, దైన్యం, నిర్వేదం మొదలైన సంచారులు పోషకాలు. నన్నయ అలంకార వస్తుధ్వనులను రసధ్వనిలో పర్యవసింప చేసే కావ్య రచనా శిల్పం ఇందులో మకుటాయమానంగా ప్రసంనమౌతున్నది”.


         శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో విషయం తెలుసుకుని తన మృత సంజీవని విద్యతో కచుడిని బతికిస్తాడు. మళ్లీ ఇంకోసారి రాక్షసులు కచుడిని చంపి బూడిద చేసి దాన్ని మద్యంలో కలిపి శుక్రాచార్యుడితో తాగించారు. మళ్లీ దేవయాని తండ్రికి చెప్పి అతడిని బతికించమని ప్రార్థిస్తుంది. దేవయాని ఏడుపు విని తన పొట్టలోని కచుడిని బతికిస్తాడు. కడుపులోనుండి కచుడు బయటికి రావాలంటే శుక్రాహ్చార్యుడు చావాలి. అందుకే కచుడికి మృత సంజీవని విద్య నేర్పాడు. బయటకు వచ్చిన కచుడు విగతజీవుడై పడివున్న శుక్రాచార్యుడిని తాను నేర్చుకున్న విద్యతో బతికిస్తాడు. ఒకరోజున గురువు అనుమతి తీసుకుని దేవలోకానికి పోవడానికి సిద్ధపడ్డ కచుడితో దేవయాని తన ప్రేమను బయట పెట్టుతుంది. సంజీవనీ విద్యతో పాటుగా తనను స్వీకరించమని అంటుంది. నన్నయ ఈ సందర్భంగా రాసిన పద్యం ఇది:

ఉ:       నీవును బ్రహ్మచారివి, వినీతుడ, వేనును కన్యకన్; మహీ

దేవకులావతంస! రవితేజ! వివాహము నీకు నాకు మున్

           భావజశక్తి నైనయది; పన్నుగ నన్ను పరిగ్రహింపు సం

జీవిని తోడ శుక్రు దయ; చేయుము నాకు బ్రియంబు నావుడున్    

ఈ సందర్భాన్ని, పద్యాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ దివాకర్ల వేంకటావధాని గారు ఇలా రాశారు: “నన్నయ రచనలో ప్రసాద గుణానికి ప్రసిద్ధమైన పద్యమిది. దేవయాని తన మనసులోని మాటను అనురాగంతో, అకలుషంగా, అవక్రంగా, సూటిగా చెప్పే ఈ పద్యంలో బంధశైథిల్యం, అర్థవైమల్యం పోషించబడడం వల్ల శబ్దార్థ గుణాలను నన్నయ ప్రదర్శించి తన ప్రజ్ఞను చాటుకున్నాడు. గారాబంగా పెరిగిన గడుసరి పిల్లలలో కనిపించే గూఢమైన అహంకారం దేవయాని పాత్రకు జీవం. దానిని బీజంగా నాటాడు నన్నయ ఈ పద్యంలో”.

దేవయాని గురుపుత్రిక అయినందున చెల్లెలుగా భావిస్తున్నానని, పెళ్లి చేసుకోలేనని చెప్పాడు కచుడు. దానికి కోపం తెచ్చుకున్న దేవయాని సంజీవని విద్య అతడికి ఉపయోగ పడకుండా ఉండుగాక అని శపించింది. దేవయానిని బ్రాహ్మణుడు పెళ్లిచేసుకోకుండా ఉండుగాక అని ప్రతి శాపం ఇచ్చాడు కచుడు. దేవతల నివాసానికి (స్వర్గానికి) వెళ్లిన కచుడు తాను నేర్చుకున్న విద్యను సహ దేవతలకు ఉపదేశించి దేవతలకు మేలు చేశాడు. విధి వశాత్తు దేవయాని యయాతిని పెళ్లి చేసుకుంది.   

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

 

1 comment: