ద్రౌపది స్వయంవరం, పాండవులతో ద్రౌపది వివాహం
(ఆస్వాదన-6)
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (14-02-2021)
వారణావత నగరంలో లాక్షాగృహ దహనం తరువాత నేర్పుగా ఆ ఇంటినుండి క్షేమంగా
బయటపడి, అక్కడి నుండి
గంగానదిని దాటి దక్షిణ దిక్కుగా అడవిలో పోయారు పాండవులు. అడవిలో, భీమసేనుడు హిడింబాసురుడిని చంపి, హిడింబిని వివాహమాడి ఘటోత్కచుడు అనే
కొడుకును కన్నాడు. ఆ తరువాత కొన్నాళ్లు ఏకచక్రపురంలో వున్నారు. అక్కడే బకాసురుడిని
సంహరించాడు భీముడు. ఆ తరువాత తల్లి కుంతీదేవి సూచన మేరకు దక్షిణ పాంచాల దేశానికి
బయల్దేరారు.
మధ్యలో, బ్రాహ్మణ
వంశానికి అలంకారప్రాయమైన ధార్మికుడు,
ప్రసిద్ధుడైన ధౌమ్యుడిని పాండవులు తమ పురోహితుడిగా స్వీకరించారు. అతడిని
పురోహితుడిగా పొందినందుకు పాండవులు సమస్త భూమండల రాజ్యాన్ని పొందినంత
సంతోషపడ్డారు. ఆయన ఆశీర్వచనం తీసుకుని దక్షిణ పాంచాల దేశానికి బయల్దేరారు. తమ
ముందు అక్కడికే వెళ్తున్న బ్రాహ్మణులు ద్రౌపదీదేవి స్వయంవరాన్ని గురించి వీరికి
తెలియచేశారు. ఆ స్వయంవరం చూడడానికి, దక్షిణలు పుచ్చుకోవడానికి అక్కడికి
వెళ్తున్నామని, పాండవులను
కూడా అక్కడికి రమ్మని చెప్పారు వారు. ఆ బ్రాహ్మణులతో కలిసి వెళ్తుంటే, దారిలో
వారికి, వేదవ్యాసుడు ఎదురయ్యాడు. తనకు నమస్కరించిన పాండవులకు శుభం కలగబోతున్నదని
చెప్పాడు వ్యాసుడు. ద్రుపదుడి నగరానికి చేరిన పాండవులు ఎవరూ గుర్తించకుండా ఒక
కుమ్మరి ఇంట్లో బ్రాహ్మణుల లాగా విడిది చేశారు. ఇదిలా వుండగా పాంచాల రాజు
ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదిని అర్జునుడికి ఇవ్వాలని ప్రయత్నించి, పాండవుల కొరకు వెతికాడు కాని వారు
వారణావత నగరంలో లాక్షాగృహదహనంలో చనిపోయారని విని బాధపడ్డాడు.
ఈ నేపధ్యంలో ద్రౌపదీదేవి స్వయంవరాన్ని ప్రకటించాడు ద్రుపద మహారాజు.
ఆకాశంలో కట్టిన మత్స్య యంత్రాన్ని విల్లు ఎక్కుబెట్టి ఐదు బాణాలతో ఎవడు పడగొడుతాడో
అతడే ధర్మప్రకారం ద్రౌపదికి భర్త అవుతాడని చాటింపు వేయించాడు. ఈ చాటింపు బ్రాహ్మణ
వేషంలో వున్న పాండవులు కూడా విన్నారు. స్వయంవరానికి సమస్త భూమండలంలో కల
రాజకుమారులంతా వచ్చారు. దుర్యోధనాదులు,
కర్ణుడు, అశ్వత్థామ,
శల్యుడు, విరాటుడు, అక్రూరుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలైనవారు వచ్చారు. వచ్చినవారిలో బ్రాహ్మణ
వేషధారులైన పాండవులు కూడా వున్నారు. బ్రాహ్మణ శ్రేష్ఠుల మధ్య కూచున్న వారిని
శ్రీకృష్ణుడు గుర్తించి అర్జునుడు తప్పక మత్య్స యంత్రాన్నికొట్టి ద్రౌపదిని
చేపట్టగలడని నమ్మాడు.
రాజకుమారులంతా విల్లుఎక్కుబెట్టడానికి ప్రయత్నం చేసి, విఫలమై, సిగ్గుపడి, ఆ ప్రయత్నం మానుకున్నారు. కొందరు రాజకుమారులు
దాని దగ్గరికే పోలేదు. మత్స్య యంత్రాన్ని భేదించడం బ్రహ్మాదులకైనా అలవికాదని
కొందరు రాజులు భావించి అక్కడినుండి వెళ్లిపోయారు. శిశుపాల, జరాసంధ, కర్ణులు అల్లెతాటిని ఎక్కించగలిగినా ధనుస్సును
ఎక్కుపెట్టలేక బలం చెడి సోలిపోయారు. వీరందరినీ చూసి, అర్జునుడు ధర్మరాజు అనుమతి తీసుకుని, బ్రాహ్మణ సభ
మధ్య నుండి బయటకు వచ్చి, ధనుస్సు
దగ్గరికి వెళ్తుంటే అతడి ఉత్సాహానికి బ్రాహ్మణులు ఆశ్చర్యపడ్డారు. కొందరు
బ్రాహ్మణులు, ఇతడు గొప్పవాడని, విలువిద్యలో
నేర్పరి అని, అందుకే ఈ
పనికి పూనుకున్నాడని, సామాన్యుడైతే
ఇలా పూనుకుంటాడా? అని అనుకున్నారు. అర్జునుడిని గురించి ఇంకా ఇలా అనుకున్నారు:
మ: అమితోత్సాహుడు
దీర్ఘ బాహుపరిఘుం డత్యంతతేజస్వి స
ద్విమలాచారుడు
విప్రభక్తిపరు డీ విప్రుండు విప్రప్రసా
దమునన్
విప్రుల కెల్ల సంతసముగా దత్కరసంసిద్ధి ను
త్తముడై
పొందెడు మంచు నుండిరి దయన్ ధాత్రీసురుల్ ప్రీతు లై
(అపరిమితమైన ఉత్సాహం కలవాడు, దీర్ఘమైన బాహువులు కలవాడు, మిక్కిలి తేజస్సు కలవాడు, శ్రేష్టం, నిర్మలమైన నడవడి కలవాడు, బ్రాహ్మణ భక్తి కలవాడు అయిన ఈ బ్రాహ్మణుడు,
బ్రాహ్మణుల అనుగ్రహంతో బ్రాహ్మణులందరికీ సంతోషం కలిగే విధంగా కార్యసిద్ధి
పొందుగాక!)
ఈ పద్య భావాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు, ఇలా రాశారు. “అర్జునుడు ధనువు
దగ్గరికి పోతున్న సమయంలో బ్రాహ్మణ వర్గం వాళ్లు అతడి గురించి భావించిన పద్ధతులను
మూడు రకాలుగా ఒక క్రమంలో చిత్రించడం నన్నయ కథాకథనశిల్పం. ఒక వర్గంవారు ఆర్జునుడిని
గురించి, రాకుమారులే ఎక్కుపెట్టలేని విల్లును
చేపట్టి, మత్స్య యంత్రాన్ని కొట్టడానికి
విఫలుడై, బ్రాహ్మణ వర్గాన్ని నవ్వులపాలు
చేయడానికి పూనుకున్నాడని భావించారు. మరో వర్గంవారు, రాకుమారులకంటే బలవంతుడు కాబట్టే
ప్రయత్నిస్తున్నాడని అన్నారు. మూడో రకం వాళ్లు విజయుడి విజయం తధ్యమని అన్నారు. ఈ
బ్రాహ్మణ వర్గాల వారి వ్యాఖ్యలు అర్జునుడి సామర్థ్యాన్ని, విజయాన్ని ప్రకాశింప చేసే వస్తుధ్వని
విశేషాలు”.
ఆ తరువాత
అర్జునుడు ధనుస్సును సులభంగా సంధించి, ఐదు బాణాలతో ఆ మత్స్య యంత్రాన్ని ఒక్క క్షణంలోనే పడగొట్టాడు. అది
చూసి బ్రాహ్మణ, క్షత్రియులంతా ఆశ్చర్య పడ్డారు.
బ్రాహ్మణులు పెద్దగా కేకలు వేశారు. ఆ సమయంలో ధర్మరాజు తమ్ములు నకుల సహదేవులు
వెంటరాగా ఇంటికి వెళ్లిపోయాడు. అప్పుడు ద్రౌపదీదేవి విలాసంగా నడుచుకుంటూ వచ్చి, ఆర్జునుడిని పూలదండతో పూజించింది. అప్పుడు
దుర్యోధనుడు మొదలైన రాజులంతా కోపించి విజృంభించారు. ద్రుపదుడు మోసగాడని
ఆరోపించారు. బ్రాహ్మణుడి (అర్జునుడు) మీదికి పోకుండా, ద్రుపదుడి మీదికి దండెత్తి వచ్చారంతా. ఈ
సన్నివేశాన్ని విశ్లేషిస్తూ డాక్టర్
అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు, ఇలా రాశారు. “దుర్యోధనుడి అహంకారం, కులాహంకారం, కుత్సితనీతి, అధర్మ ప్రవృత్తి ఈ సన్నివేశంలో
బయటపడ్డాయి.
అప్పుడు
అర్జునుడు, భీముడు కలిసి శత్రు సైన్యం మీద విరుచుకు పడ్డారు. భీముడు అర్జునుడికి
సహాయంగా నిలిచాడు. వాళ్ళిద్దరి మహావిజృంభణం చూసిన కృష్ణుడు బలరాముడితో వారెవరో
బయటపెట్టాడు. ఇంతలో కర్ణుడు ఆర్జునుడిని ఎదుర్కున్నాడు. శల్యుడు భీముడితో
తలపడ్డాడు. భీమార్జునులదే విజయం అయింది. ‘వీరెవరో, ఎక్కడ వుంటారో’ అని ఆశ్చర్యంతో అంటున్న
దుర్యోధనుడితో కృష్ణుడు,
సాటిలేని ఈ పరాక్రమశాలిని గెలవడం ఎవరికీ సాధ్యం కాదన్నాడు. ఈ
సన్నివేశాన్ని విశ్లేషిస్తూ డాక్టర్
అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు, ఇలా రాశారు. “మహాభారతంలో శ్రీకృష్ణుడు పాఠకులకు
మొట్టమొదట కనిపించేది ఈ ఘట్టంలోనే. ఆయన మహనీయ వ్యక్తిత్వం, సర్వజ్ఞత, చతురత కనిపించేది కూడా ఈ ఘట్టంలోనే. ఆయనే
మొదలు పాండవులను గుర్తుపట్టాడు. అర్జునుడి సామర్థ్యాన్ని అతిచతురంగా శ్లాఘించి, అన్యుల అసమర్థతను అవహేళన చేశాడు”.
భీమార్జునులు
ద్రౌపదితో సహా ఇంటికి వచ్చి తామొక బిక్ష తెచ్చాం అని తల్లి కుంతికి నివేదించారు.
ఎప్పటిలాగానే ఆమె, ‘దానిని మీరైదుగురు ఉపయోగించుకోండి’
అన్నది. ఆ తరువాత కుంతీ-ధర్మరాజుల మధ్య ధర్మ విచారణ జరిగింది. ధర్మరాజు తమ్ముల
అభిప్రాయం కూడా తెలుసుకుని,
వేదవ్యాసుడి మాటలు జ్ఞప్తికి తెచ్చుకుని, పెద్దల మాట ప్రకారం ఐదుగురం ద్రౌపదిని వివాహం చేసుకుందాం అన్నాడు. ఆ
తరువాత శ్రీకృష్ణుడు, బలరాముడు పాండవులను చూసిపోవడానికి
వచ్చారు. (మహాభారతంలో ఇదే శ్రీకృష్ణ పాండవుల ప్రథమ సమావేశం). శ్రీకృష్ణుడు
ఆర్జునుడిని పొగిడాడు. ఇక ముందు వారికి మేలు కలుగుతుందని చెప్పి వెళ్లిపోయారు.
ద్రుపదుడు
పాండవుల విషయం కనుక్కుని రమ్మని ధృష్టద్యుమ్నుడిని పంపాడు. చాటునుండి తాను చూసిన, తనకు అర్థమైన మేరకు వారిని గురించిన వివరాలు
చెప్పాడు ధృష్టద్యుమ్నుడు ద్రుపదుడికి. ద్రౌపది వారి దగ్గర ఆనందంగా వున్న విషయం
కూడా చెప్పాడు. కాని వారెవరయిందీ ఇదమిత్థంగా చెప్పలేకపోయాడు. ద్రుపదుడు అప్పుడు
వారి విషయం కనుక్కుని రమ్మని పురోహితుడిని పంపాడు. తమ విషయం తెలుసుకుని ద్రుపదుడు
ఏం చేస్తాడని అడిగాడు ధర్మరాజు. ద్రుపదుడి ఆహ్వానం మేరకు పాండవులు ఆయన పంపిన
బంగారు రథాలెక్కి ఆయన ఇంటికి పోయారు. వారున్న విధానం చూసిన ద్రుపదుడికి వారు
అత్యుత్తమ క్షత్రియ వంశ శ్రేష్టులని గ్రహించాడు. వారి నిజస్థితి తెలియచేయమని
ధర్మరాజును అడిగాడు ద్రుపదుడు. తాము క్షత్రియులమని, పాండురాజు పుత్రులమని, తాను పెద్దవాడు ధర్మరాజని, మిగతావారు భీమార్జుననకులసహదేవులని చెప్పాడు. అర్జునుడు
తన కుమార్తెకు భర్త అయ్యాడని సంతోషించాడు ద్రుపదుడు. ‘స్వయంవరంలో లభించిన
ద్రౌపదిని అర్జునుడు ధర్మపద్ధతిలో వివాహం చేసుకుంటాడు’ అని అంటాడు ద్రుపదుడు.
అలాకాదని, ఆ కన్యను తాము ఐదుగురం వివాహం చేసుకుంటామని, ఇది తమ తల్లి ఆజ్ఞ అని అన్నాడు ధర్మరాజు. ఒకే
ఆడది పలువురు మగవారికి భార్య కావడం ఆచారం కాదని అన్నాడు ద్రుపదుడు. ఇలా ద్రుపద
ధర్మజులు సందేహపడుతుండగా, వేదవ్యాస మహాముని అక్కడికి వచ్చాడు. ధర్మరాజు
ధర్మతత్త్వం తెలిసినవాడని,
ధర్మ మార్గం తప్పి మాట్లాడడని, వేరే ఆలోచన మాని ద్రౌపదిని ఐదుగురికి ఇచ్చి వివాహం
చెయ్యమని చెప్పాడు వేదవ్యాసుడు. ద్రౌపదిం పూర్వ జన్మ వృత్తాంతాన్ని, ఆయా జన్మలలో
ఆమె ఐదుగురు భర్తలు కావాలని కోరుకున్న విషయాన్ని, ఐదుగురు భర్తలలో ఒక్కొక్కరితో కలయిక
ఉన్నప్పటికీ తనకు కన్యాత్వం కావాలని అడిగిని విషయాన్ని కూడా చెప్పాడు. ’పూర్వపు
మహాత్ములలో కూడా ఇలాంటి చరిత్రలున్నాయి. అందువల్ల పాండవులైదుగురికి ద్రౌపదినిచ్చి
వివాహం జరిపించు. ఇది దైవ నిర్ణయం’
అని చెప్పాడు వేదవ్యాసుడు. ద్రౌపదీ పాండవుల పుట్టుక వెనుకనున్న దివ్యరహస్యాలను
తెలుసుకోవడానికి ద్రుపదుడికి వేదవ్యాసుడు దివ్యదృష్టి కూడా ఇచ్చాడు.
ఆ తరువాత ఒక
పుణ్యదినం నాడు ద్రౌపదీ పాండవుల వివాహం వైభవంగా జరిగింది. మొదట ధర్మరాజుకు
ద్రౌపదినిచ్చి వివాహం చేయించాడు ద్రుపదుడు. ఐదుగురిని వివాహం చేసుకున్నా కన్యాత్వం
చెడకుండా ఈశ్వరుడి వల్ల వరం పొందిన ద్రౌపది మళ్లీ కన్యాత్వం పొందగా, ఆమెను వరుసగా భీమార్జుననకులసహదేవుల కిచ్చి
వివాహం చేయించాడు ద్రుపదుడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, ఆదిపర్వం, సప్తమాశ్వాసం
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment