Saturday, February 20, 2021

పాండవులకు లభించిన అర్థరాజ్యం, ఇంద్రప్రస్థం నుండి పాలన (ఆస్వాదన-7) : వనం జ్వాలా నరసింహారావు

పాండవులకు లభించిన అర్థరాజ్యం, ఇంద్రప్రస్థం నుండి పాలన

(ఆస్వాదన-7)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (21-02-2021)

ద్రౌపదీ పాండవుల వివాహం అనంతరం ద్రుపదుడి విజ్ఞప్తి మేరకు పాండవులు ద్రుపదరాజ పురంలో ఇష్ట భోగాలు అనుభవిస్తూ సుఖంగా వున్నారు. పతివ్రత ద్రౌపదీదేవి భర్తలందరికీ సమానంగా సేవ చేస్తూ, వారికి, అత్తగారైన కుంతీదేవికి మిక్కలి సంతోషాన్ని కలిగించింది. ద్రౌపదీ పాండవుల వివాహ వార్త విన్న శ్రీకృష్ణుడు ద్వారకానగరం నుండి విలువైన కానుకలు పంపాడు. ఇలా ఒక సంవత్సరం గడిచింది. వీరిక్కడ సుఖంగా వున్న విషయం వేగులవాళ్ల ద్వారా దుర్యోధనుడికి తెలిసింది. మత్స్య యంత్రాన్ని కొట్టింది అర్జునుడని, కర్ణ శల్యులను ఓడించింది భీమార్జునులని చెప్పారు వేగులవాళ్లు. ఇది విని దుర్యోధనుడు వెలవెలబోయి మిక్కిలి దుఃఖించాడు. ద్రుపదుడి నుండి పాండవులను వేరు చేయడం ఎలాగా అని ఆలోచన చేశాడు. పాండవుల విషయం తెలిసిన విదురుడు చాలా సంతోషించి, ఆ వార్తను ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అతడు పైకి సంతోషం వ్యక్తం చేశాడు.

దుర్యోధనుడు విదురుడు తండ్రి దగ్గర లేని సమయం చూసి, ఆయనతో పాండవ పాంచాల విభేదనోపాయం ఆలోచించాడు. ఏంచేయమంటావని కొడుకును అడిగాడు ధృతరాష్ట్రుడు. పాండవులను పాంచాల రాజు దగ్గర ఉండకుండా చేయడం ఉచితమైన పని అంటాడు దుర్యోధనుడు. దొంగచాటు దెబ్బ తీద్దామంటాడు. ద్రౌపదికి పాండవుల మీద ద్వేషం కలిగిద్దామని, భీముడిని హతమార్చుదాం అని కూడా అంటాడు. వీటన్నిటి కంటే పాండవులమీద పరాక్రమం ప్రయోగించడమే తక్షణ కర్తవ్యమని, యుద్ధంలో ద్రుపదుడిని ఓడించి పాండవులను ఎక్కడా వుండనీయకుండా వెంట తీసుకుని రావడం మంచిదని కర్ణుడు సలహా ఇచ్చాడు. అయితే భీష్మ, ద్రోణ, విదురులు ఆ సూచనను అంగీకరించలేదు. కర్ణుడి యుద్ధ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు. పాండవులతో యుద్ధం చేయడం తగని పని అని, వారిని హస్తినాపురానికి పిలుచుకుని రావడం ఉత్తమమని ద్రోణుడు అంటాడు. పాండవులను వెంటనే రప్పించి ప్రేమతో వారికి అర్థరాజ్యం ఇమ్మని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు.

విదురుడి వాదనకు బలం చేకూరింది చివరకు. ధృతరాష్ట్రుడు సరైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. పాండవులకు సగభాగం రాజ్యం ఇస్తానని అందరి ముందరా చెప్పిన ధృతరాష్ట్రుడు పాండవులను పిలుచుకుని రావడానికి విడురుడిని పంపాడు. ధృతరాష్ట్రుడి అజ్ఞానుసారం విదురుడు ద్రుపదుడి పురానికి వెళ్లాడు. పాండవులను, ద్రౌపదిని, కుంతిని ధృతరాష్ట్ర మహారాజు హస్తినాపురానికి పిలుచుకుని రమ్మన్నాడని ద్రుపదుడితో ఆయన అనుమతి కోరుతూ అన్నాడు విదురుడు. అక్కడే వున్న శ్రీకృష్ణుడి, ద్రుపదుడి సమ్మతి తీసుకుని ధర్మరాజు హస్తినాపురం వెళ్లడానికి నిశ్చయించి, సైన్య సమేతంగా నగర ప్రవేశం చేశారు.  పాండవులు కురువంశపు పెద్దలందరికి నమస్కరించి, అందరితో కలిసిమెలిసి ఐదు సంవత్సరాలు గడిపారు.

ఒకనాడు భీష్మ, ద్రోణ, దుర్యోధనాదుల సమక్షంలో పాండవులకు అర్థ రాజ్యం ఇస్తున్నట్లు ప్రకటించాడు ధృతరాష్ట్రుడు. అని చెప్పి ధర్మరాజును రాజుగా అభిషేకించాడు. ఖాండవప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని అక్కడే స్థిరంగా ఉండమని చెప్పాడు. పాండవులు ఆయన ఆజ్ఞానుసారం ఖాండవప్రస్థానికి వెళ్లారు. శ్రీకృష్ణుడి ఆజ్ఞమేరకు ఇంద్రుడి ఆదేశానుసారం, దేవశిల్పి విశ్వకర్మ ఇంద్రప్రస్థం అనే పేరుకల మహానగరాన్ని నిర్మించాడు పాండవుల కోసం. ఆ పురంలో ధర్మరాజు తన నలుగురు తమ్ములతో ప్రవేశించాడు. ధర్మమే ప్రధానంగా ధర్మరాజు సంతోషంగా రాజ్యపాలన చేయసాగాడు. ధర్మజుడి ధర్మరాజ్యం గొప్పగా అభివృద్ధి చెందింది. ఒకనాడు నారదుడు వచ్చి ధర్మరాజాదులకు సుందోపసుందోపాఖ్యానం చెప్పి, స్త్రీల కారణంగా విరోధం రాకుండా ఐదుగురు అన్నదమ్ములు ద్రౌపది విషయంలో ఏదైనా ఏర్పాటు చేసుకొమ్మని చెప్పాడు. నారద మహాముని మాట ప్రకారం ద్రౌపది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సంవత్సరం వుండడానికి, ద్రౌపది వున్న ఇంటివైపు ఇతరులు వెళ్లకుండా వుండడానికి, ఒకవేళ ఎవరైనా వెళ్తే పన్నెండు నెలలు తీర్థయాత్రలు చేయడానికి అంతా అంగీకరించారు.

ఈ నిబంధనను సరైన కారణంతోనే అయినా, అనుకోకుండా ఒకసారి ఉల్లంఘించిన అర్జునుడు, అన్న వద్దని వారించినా, ఆయన అనుమతితో, పన్నెండు నెలలు తీర్తయాత్రలకు పోయాడు. ఆ తీర్ధయాత్రా సమయంలోనే ఉలూచి అనే నాగకన్యను ఆమె కోరిక ప్రకారం స్వీకరించి, సద్యోగర్భంలో ఇరావంతుడు అనే కొడుకును కన్నాడు. ఆ తరువాత మణిపురంలోని చిత్రాంగదను ప్రేమించి వివాహం చేసుకుని, ఆమెవల్ల బభ్రువాహనుడు అనే కొడుకును కని, అతడిని చిత్రాంగద తండ్రి చిత్రాంగదుడికి వంశం నిలిపేవాడిగా ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడి ప్రోత్సాహంతో, ఆయన అండదండలతో ఆయన చెల్లెలు సుభధ్రను పరిణయమాడాడు. వాస్తవానికి శ్రీకృష్ణుడే సుభద్రార్జునుల వివాహ వ్యూహాన్ని రచించాడు. సాక్షాత్తు దేవేంద్రుడి, శ్రీకృష్ణుడి సమక్షంలో వారి వివాహం జరిగింది. భార్యాసమేతంగా అర్జునుడు ఇంద్రప్రస్థానికి పోయి తల్లికి, ద్రౌపదికి సుభద్రను చూపించాడు. ఇద్దరూ వారికి నమస్కరించారు.  

పుణ్యవంతులైన సుభద్రార్జున దంపతులకు పాండవ వంశం నిలిపేవాడైన అభిమన్యుడు జన్మించాడు. పురోహితుడైన దౌమ్యుడి దగ్గర వేదం విద్యను, తండ్రి అర్జునుడి దగ్గర ధనుర్విద్యను నేర్చుకున్నాడు అభిమన్యుడు. ద్రౌపది కూడా వరుసగా పాండవుల వల్ల అయుడుగురు ఉప-పాండవులనే సుపుత్రులను పొందింది. వారి పేర్లు: (ధర్మరాజుకు) ప్రతివింధ్య, (భీముడికి) శ్రుతసోమ, (అర్జునుడికి) శ్రుతకీర్తి, (నకులుడి) శతానీక, (సహదేవుడికి) శ్రుతసేనుడు. అలా, అలా రోజులు గడిచాయి.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, అష్టమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 


No comments:

Post a Comment