ఋశ్యశృంగుడి చరిత్రను మరింత వివరించిన సుమంత్రుడు
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-46
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (01-03-2021)
ఋశ్యశృంగుడి చరిత్రను మునీంద్రులకు
సనత్కుమారుడి మాటలుగా తెలిపిన సుమంత్రుడు, వారికి ఆయన చెప్పిన
మరికొన్ని విషయాలను కూడా దశరథుడికి తెలియచేస్తాడీవిధంగా: " పాల సముద్రంలో
చంద్రుడిలాగా,
ఇక్ష్వాకుల వంశంలో ధర్మాత్ముడు-సత్యాత్ముడైన దశరథ మహారాజు
జన్మిస్తాడు. ఆ దశరథుడికి శాంత అనే కూతురు కలుగుతుంది. దరిమిలా దశరథుడికీ, అంగరాజు కుమారుడైన రోమపాదుడికీ స్నేహం కుదురుతుంది. పిల్లల్లేని రోమపాదుడికి
తన కూతురైన శాంతను దత్తతిస్తాడు దశరథుడు".
(అంగ దేశానికి రాజధానైన "చంపా నగరం" ఇప్పటి భాగల్పూర్ సమీపంలో
వుండేది. మొంఘిర్ నుండి ఏభై మైళ్లు తూర్పుగా ప్రయాణించి, హ్యూయన్ సాంగ్,
చంపా నగరానికి చేరుకున్నట్లు దాఖలాలున్నాయి.
"చంప" భాగల్పూరుకు పాత పేరు).
"రోమపాదుడికి చిత్రరథుడనే పేరుకూడా వుంది. ఆయనకు, దశరథుడికి స్నేహం కుదిరిన తర్వాత, కుమారులు లేని దశరథుడు తన
బాధను ఆయనకు వివరిస్తాడు. కొడుకులు పుట్టేందుకు తాను యజ్ఞం చేయదల్చానని-ఆ యజ్ఞం
నిర్విఘ్నంగా కొనసాగించేందుకు శాంత భర్త ఋశ్యశృంగుడిని తన వెంట అయోధ్యకు పంపమని-పుత్రులు
లేని తన దుఃఖాన్ని తొలగించి తన వంశ ప్రతిష్ఠను స్నేహితుడైన రోమపాదుడు కాపాడమని
వేడుకుంటాడు దశరథుడు. దశరథుడి కోరిక మేరకు, ఋశ్యశృంగుడిని సంప్రదించి, భార్యా సమేతంగా ఇద్దరినీ దశరథుడితో పంపుతాడు రోమపాదుడు. దశరథుడు ఋశ్యశృంగుడితో
యజ్ఞం చేయించుకుంటాడు. ముందుగా దశరథుడి ప్రార్థన మేరకు, ఋశ్యశృంగుడు ఋత్విజుడు గా వుండడానికి అంగీకరించి, యజ్ఞాన్ని నిర్విఘ్నంగా చేయిస్తాడు. సంతానం కొరకు-స్వర్గలోక ప్రాప్తికొరకు, దశరథుడు యజ్ఞం చేసినందువల్ల, స్థిరమైన-కీర్తిమంతులైన, వంశ ప్రతిష్ఠ నిలిపే నలుగురు కొడుకులను కంటాడు దశరథుడు". ఇలా జరిగిందంటూ
బ్రహ్మ పుత్రుడైన సనత్కుమారుడు ఋషులెందరో వినే విధంగా, ఎప్పుడో-పూర్వ యుగంలోనే చెప్పబడింది. ఆయన చెప్పిన విషయాన్ని ఋషీశ్వరులు
చెప్పుకుంటుంటే,
తాను వినటం జరిగిందని సుమంత్రుడంటాడు దశరథుడితో. ఇంద్ర
సమానుడైన దశరథుడిని చతుర్విధ సేనలతో రోమపాదుడి దగ్గరకు పోయి, సాదరంగా ఋశ్యశృంగుడిని ఆహ్వానించి-తెచ్చి, తన కోరిక నెరవేర్చు
కొమ్మని సలహా ఇస్తాడు మంత్రి సుమంత్రుడు.
(తనకు తెలిసిన విషయాన్ని ఇంత కాలం దశరథుడికి చెప్పకుండా, సుమంత్రుడెందుకు దాచిపెట్టాడని సందేహం కలగొచ్చు. ఆకలిగొన్నవాడికి అన్నం పెట్తే
దాని విలువ తెలిసినట్లే,
అవసరం కలిగి అడిగినప్పుడే, తెలిసిన విషయాన్ని చెప్పడం మంచిదన్న వుద్దేశంతో ఇన్నాళ్లూ వూరుకున్నాడు
సుమంత్రుడు. సనత్కుమారుడు ఈ విషయాలను వెల్లడించేనాటికి రోమపాదుడు పుట్టనేలేదు.
భగదవతారం గురించి ఋషులకు-మునులకు తెలిసినా, సందర్భం వస్తేనే ఆ
విషయాలను బయట పెట్తారుగాని,
ఎప్పుడు పడ్తే అప్పుడు అందరికీ చెప్పరు. అవతార విషయం ఒక దేవ
రహస్యం. అందుకే ఋషులు ఆ విషయాన్ని సుమంత్రుడికి చెప్పలేదేమో).
ఋశ్యశృంగుడిని తీసుకొచ్చేందుకు ప్రయాణమైన దశరథుడు
సుమంత్రుడి సలహా విన్న దశరథుడు, వశిష్ఠుడికి విషయాన్నంతా తెలియ పరుస్తాడు. సుమంత్రుడు చెప్పిందంతా సత్యమేనని, ఆయన సలహా పాటించమంటాడు వశిష్ఠుడు. ఎక్కడే లోపం కలిగితే, ఏ ప్రమాదమొస్తుందోనని,
అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు దశరథుడు. అంతఃపుర
స్త్రీలను,
బుద్ధిమంతులైన తన మంత్రులను, భార్యలను వెంట తీసుకుని పోతాడు దశరథుడు. దారిలో నదులను-పర్వతాలను దాటుకుంటూ, రోమపాదుడి చంపా నగరానికి చేరుకుంటారు. వెళ్లిన వెంటనే, ముందుగా ఋశ్యశృంగుడి దర్శనం చేసుకుని, తర్వాత రోమపాదుడి వద్దకు
వెళ్తాడు దశరథుడు. ఆయన రాకకు సంతోషించిన రోమపాదుడు, సకల మర్యాదలు చేసి,
సాదరంగా తోడుండి, ఋశ్యశృంగుడి దగ్గరకు
తీసుకుని పోతాడు దశరథుడిని. "పవిత్ర చరిత్రా" అని ఋశ్యశృంగుడిని
సంబోధిస్తూ-తన ఆప్తమిత్రుడిగా-బంధువుగా దశరథుడిని ఆయనకు పరిచయం చేస్తాడు. దశరథుడు
తన కుమార్తె శాంతను తనకు దత్తత ఇచ్చిన విషయాన్ని తెలియపర్చి, తానేవిధంగా ఆయనకు మామగారినో-అలానే దశరథుడు కూడానని అంటాడు. ఋశ్యశృంగుడు
మామగారివలెనే దశరథుడిని గౌరవిస్తాడు. చంపా నగరంలో వారం రోజులుండి, ప్రయాణానికి సిద్ధమై,
కూతురిని-అల్లుడిని తన వెంట అయోధ్య చూసేందుకు పంపమని
రోమపాదుడిని అడుగుతాడు. ఋశ్యశృంగుడికీ విషయాన్ని చెప్పి, ఆయన అంగీకరించిన తర్వాత, సహృదయుడైన ఆయనను-భార్య
శాంతతో సహా,
అయోధ్యకు వెళ్లి రమ్మని కోరాడు రోమపాదుడు.
మామగారి వద్ద వీడ్కోలు తీసుకుని, ఋశ్యశృంగుడు ప్రయాణం కావడం-దశరథుడు, రోమపాదుడు ఒకరికొకరు
బహుమానాలిచ్చుకోవడం – పొగుడుకోవడం - నమస్కరించుకోవడం జరిగింతర్వాత, అందరు కలిసి బయల్దేరుతారు. తామొస్తున్న సంగతి ముందుగానే తెలియచేసి-వెళ్లే
సరికి నగరమంతా అలంకరించి,
అంగరంగ వైభోగంగా తీర్చిదిద్ది, రంగవల్లులు పెట్టి,
పూల తోరణాలు కట్టే ఏర్పాట్లు చేయిస్తాడు దశరథుడు.
No comments:
Post a Comment