సీత దృష్టిలో రావణుడు గడ్డిపోచతో సమానమా?
వనం జ్వాలా
నరసింహారావు
ఆకాశవాణి
హైదరాబాద్ కేంద్రం శనివారం (20-02-2021) ప్రసారం
అశోకవనంలో
సీతాదేవిని చూసిన హనుమంతుడు ఆమెను చూసే అదృష్టం తనకు కలిగిందికదా,
రామలక్ష్మణుల కార్యం నెరవేరిందికదా అని సంతోషపడ్తాడు. ఉత్తమురాలైన
సీతకు ఎటువంటి కష్ఠమొచ్చిందని తల్చుకుంటూ మరీ-మరీ ఏడుస్తాడు.
ఏడుస్తూ అనుకుంటాడు:"ఈమె మహాపతివ్రత.
ఈమెకిట్టి ఆపద రాకూడదు. సీత ప్రకృతికతీత.
అందరిలాగా కర్మానుభవానికై పుట్టిందికాదు. అట్టి
ఈమెకే దిగులు సంప్రాప్తిస్తే కాలాన్ని అతిక్రమించే వారెవరైనా వుంటారా? అదెవ్వరికీ సాధ్యం కాదు. రామచంద్రమూర్తి నిశ్చయం, లక్ష్మణుడి
అభిప్రాయం ఎరిగిందికనుకనే, గుండెనిబ్బరంతో వుంది సీత.
రామచంద్రమూర్తికి సీత, సీతకు రాముడు, వయస్సులో,
స్వభావంలో, సాముద్రిక లక్షణాలలో, ఒకరికొకరు సరిగ్గా సరిపోయారు. ధర్మాత్ముడు, మహితాత్ముడు,
మహాత్ముడు, మిధిలానాధుడు, జనకుడి కూతురు సీత ఈమె. పరమపతివ్రతైన సీతే ఈమె.
సందేహంలేదు. ఇట్టిలక్షణాలు ఆమెలో తప్ప
మరొకరిలో వుండవు" అని కూడా అనుకుంటాడు.
వివాహకాలంలో
శ్రీరాముడికి పన్నెండేళ్లు,
సీతకు ఆరేళ్లు. అంటే రాముడి వయస్సులో సగం. శాస్త్రప్రకారం
తగినవయస్సే. ఇప్పుడు శ్రీరామచంద్రుడి వయస్సు ముప్ఫైతొమ్మిది సంవత్సరాలు, సీతకు ముప్ఫైరెండు. వధువుకు ఎనిమిదేళ్ళు వుంటే,
వరుడికి పదహారేళ్ళు వుండాలని విష్ణు స్మృతి. సీత-రాముడు వయస్సులో ఎలా ఈడూ-జోడో,
శీలంలోనూ అంతే. సాముద్రికం ప్రకారం, సార్వభౌమత్వ
చిహ్నాలు రాముడికున్నాయి. అట్టి వాని భార్యకల దానికే చిహ్నాలుండాలో అవన్నీ
సీతకున్నాయి. సూర్యవంశంలో ప్రసిధ్ధికెక్కిన వాడి కొడుకు రాముడైతే, చంద్రవంశంలో జగత్ప్రసిధ్ధికన్న జనకుడి కూతురు జనని-జానకి.
"స్మరణ
మాత్ర సంతుష్టాయ" అంటే స్మరించినంత మాత్రాన సంతోషించే వాడు రాముడు.
"ప్రణతి ప్రసన్న జానకి" అంటే ఒక్క నమస్కారంతో సంతోషించేది సీత. ఇట్టి
అపురూప దాంపత్యం లోకంలో ఎక్కడైనా వుందానని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. భక్తులకు
సీత-రాములిరువురూ సేవ్యులే. జగన్మాత "శ్రీదేవి", జగన్నాయకుడు
"విష్ణువు". ఒకరున్న చోటే రెండో వారుంటారు. వీరిరువురి తోనే ప్రపంచమంతా
వ్యాపించి వుంది. ఈశత్వం ఇద్దరిలో సమానమే. సర్వదా ఏకశేషులే! ఒకేమాటలో ఇరువురినీ
తెలిపేదే ఏకశేషం. ఇలా "సర్వకారణత్వం, సర్వవ్యాపకత్వం,
సర్వనియన్తృత్వం" లక్ష్మీనారాయణుల్లో, సీతారాముల్లో
వుంది. ఇరువురిలో, "ఉపాయత్వం,
ఉపేయత్వం" వున్నాయి. అందుకే సీతారాములిరువురూ సమానంగా సేవించాల్సిన వారేనని
గ్రహించాడు హనుమంతుడు.
రామచంద్రమూర్తి
చేసే కార్యాలన్నింటికీ మూలకారణం సీతాదేవే! చేసేది రాముడు, చేయించేది సీత.
నిగ్రహానుగ్రహాల రెండింటిలోనూ ఇదే నియమం. భగవంతుడు అనేకకోటి బ్రహ్మాండ నాయకుడు
కాగా అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు నాయకి లక్ష్మీదేవి. ఈ అనంత కోటి బ్రహ్మాండాలు ఆమె
మూలాన్నే నామరూపాలై,
స్థితిగలవై వున్నాయి. అట్టి ఈమెకు ముల్లోకాలు ఒక లెక్కకాదు. అయితే
లక్ష్మీదేవి, సీతాదేవి భగవంతుడి సహధర్మచారిణిగా, భగవత్ సంకల్పానుసారంగా, తదాజ్ఞావశవర్తియై, ఆయనకు పరతంత్రంగా వుంటుందని భావన.
సీతాదేవి
వృత్తాంతమంతా ఏకమై,
అనన్యమై, భగవత్ ప్రాప్తి ఎప్పుడా-ఎప్పుడా అని ఎదురు చూస్తుండే పరమభక్తురాలి-ప్రపన్నురాలి
చరిత్రే! అందుకే రామాయణాన్ని “సీతాయాశ్చరితమ్ మహత్” అంటాడు
వాల్మీకి. సీతాదేవి తాను చెరనుండి తప్పించుకోవటమే కాకుండా,
తన లాగా దుఃఖిస్తున్న దేవ,
గంధర్వ, నాగ మొదలైన జాతుల స్త్రీలను కూడా
విడిపించింది. సీతాచర్య నేర్పేదిదే! ఇతర
ఉపాయాలను వెతక్కుండా, దేహాభిమానం, స్వాతంత్ర్యం
వదిలి, స్వరక్షణాభారం భగవంతుడిమీద వేసి, "అనన్యార్హశేషత్వం, అనన్యశరణత్వం, అనన్యభోగత్వం" అనే అకారత్రయ సంపూర్తిని కలిగి,
సంసారంలో వుండే తరించేటందుకు "ప్రపత్తితోనో,
పరమభక్తితోనో" సాయుజ్యాన్ని పొందవచ్చని,
సీతాదేవి చరిత్ర వలన తెలుసుకోవచ్చు. అంటే,
భగవత్ప్రాప్తి కోరేవాడు, ఆయన అనుగ్రహం కొరకు
సీతాదేవిలాగా, భగవన్నామాన్ని వుచ్చరిస్తూ, స్వధర్మాన్ని వదలకుండా వుండడం తప్ప వేరే మార్గం లేదు.
సీతాదేవి
శ్రీరాముడినొక్కడినే చూడాలనుకుంటుంది. అంటే, ఇది,
"ఏకాగ్రభక్తి, ఏకభక్తి, అనన్యత్వాన్ని" గురించి చెప్పటమే. అలానే, భక్తుడు దేవతలెందరున్నా, తన ఇష్ట దైవాన్నే నమ్మి, "ఏకభక్తి, ఏకాగ్రభక్తి" కలవాడై వుంటాడు. అలానే భక్తులు, ప్రపన్నులు, తమ
కెన్ని కష్టాలొచ్చినా, విశ్వాసం వదలకుండా, భగవంతుడు రక్షించేదాకా, తమ "భక్తి-ప్రపత్తులే" తమకు
రక్ష అని భావిస్తారు. పతివ్రతలు తన భర్తకంటే ధనవంతులు,
విద్యావంతులు, రూపవంతులు, బలవంతులు, లోకంలో ఎందరున్నా, భర్తకంటే
అధముల్లాగానే ఎంచుతుందికాని, వారిని ప్రేమించదు.
దుఃఖం మీద, దుఃఖం
వస్తుంటే, పరితపిస్తున్న సీత కనిపించింది హనుమంతుడికి. సీత
సమీపంలోనే ఆమెకు దిగులు కలిగిస్తున్న వికార-ఆకారాల రాక్షస
స్త్రీలనెందరినో చూసాడు. సీత చుట్టూ తిరుగుతూ, అరుస్తూ, కేకలేస్తున్న రాక్షస స్త్రీలను చూసిన
హనుమంతుడి దేహం పులకరించింది. ఆయన కంటికి వారంత భయంకరంగా
వున్నారు. రాక్షసులింకా మేలుకునే వున్నారు కాబట్టి, చెట్టు మీదనే వుండిపోయాడు హనుమంతుడు. కాంతి తొలగిన ముఖమున్నప్పటికీ,
భర్తపరాక్రమం తలచుకుంటూ, ఆయన తనను తప్పక
రక్షిస్తాడన్న ధైర్యంతో కనిపించిందామె. మైమర్చిపోయే
సౌందర్యమున్న సీతను చూసి, కృతార్ధుడనైతినని, సంతోషంతో హనుమంతుడి కళ్లల్లో నీరు ప్రవహించింది. ఇదంతా రామలక్ష్మణుల
అనుగ్రహంతో లభించిందేకదా అని వారికి నమస్కరించి, సీతతో
మాట్లాడే సమయంకొరకు , చెట్టుకొమ్మపైనే వేచిచూడసాగాడు.
దాదాపు
రాత్రంతా గడిచిపోయి,
తెల్లవారుతున్న సమయంలో, రావణుడు సీతను
తలచుకుంటాడు. కంటికి ఇంపైన అశోకవనంలోకి, భూషణాలు ధరించిన రావణుడు, తనకున్న మహాసంపదను
ప్రదర్శించుకుంటూ ప్రవేశించాడు. కామాతిశయంతో కన్నుమిన్ను
కానని రావణుడు, సీత తనకు వశపడుతుందని, మూఢుడై
భావిస్తూ, పరస్త్రీల విషయంలో పాటించాల్సిన కనీస మర్యాదను
కూడా మరచి అశోకవనంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి సీతాదేవిని సమీపించాలని
అనుకుంటాడు. వాడిని చూసిన హనుమంతుడు, తను చూస్తున్నది
రావణుడినేనని అనుకుంటాడు. వాడిని పూర్తిగా చూసేందుకు, అనువైన
స్థలంచేరి , వాడెదురుగా కనిపించేవిధంగా, బలవంతుడు అయినప్పటికీ, వాడి తేజస్సు ముందర
తేజోహీనుడై కొమ్మల నడుమ దాగాడు.
రావణాసురుడు,
తనవైపు రావడం, దూరాన్నుండే చూసిన సీత,
వణకసాగింది. ఆలస్యం చేయకుండా, తన శరీరాన్ని భయంతో
కప్పుకుంటుంది. రావణుడిని చూసి తెల్లబోయింది. పవిత్రురాలైన సీతను, పాపాత్ముడైన రావణుడు, తన మరణదశ దగ్గరపడడంతో, సమీపించాడు. రావణుడు, తియ్యటిమాటలతో, తన మనసులోని ఆలోచనను, పతివ్రతా శిరోమణైన సీతకు
చెప్పాడు.
“సౌందర్యగనీ! నన్ను
గౌరవించు. నీవు భయపడాల్సిన అవసరంలేదు. నేను
రాక్షసుడనైనప్పటికీ, నీమీద కామంతో వచ్చానేకాని నిన్ను
చంపడానికి రాలేదు. నీకు పాపభయమక్కరలేదు. నువ్వు భయపడవద్దు. నన్ను అనుగ్రహ దృష్టితో గౌరవించు.
నీకు సరితూగే స్త్రీ ఈలోకంలో లేనేలేదు. నిన్ను
పొగడడం నాకు సాధ్యం కావడంలేదు. అజ్ఞానం వదలి నా భార్యవు కా.
పట్టపురాణివి కా. నామణులు, రాజ్యం, నీ సొత్తే”. ఇలా తనను పొగుడుకున్న రావణుడు ఆ
తరువాత శ్రీరాముడిని దూశించాడు.
దుష్ట
రావణుడిద్వారా ఇలాంటి మాటలు వినాల్సివచ్చెకదా అని, మనసులోనే
దిగులుపడుతుంది సీత. వీడు తన్ను తాకుతాడేమోనని భయంతో
వణకిందికూడా. వాడిని దహించగల శక్తి తనకున్నా, సాధ్వి అయినందున, సహించి వూరుకుంది. ఆపత్కాలంలో దేవుడిని ప్రార్థించినట్లే, పతివ్రతలకు
భర్తే దైవం కనుక, శ్రీరాముడిని తలచుకుంది. తనను వీడేమీ చేయలేడన్న ధైర్యం తెచ్చుకుని, తన కోసం
ఏడవకుండా, భర్తకు తనవల్ల దుఃఖం వచ్చింది కదా అని బాధపడింది.
చెప్పినా వినకుండా, తనకారణాన రావణుడు
సర్వనాశనమైపోతున్నాడే అని, వాడికొరకూ కన్నీరు కార్చింది.
ఇలా అనుకుంటూ, పరిశుధ్ధమైన చిరునవ్వుముఖంతో ఒక
"గడ్డిపోచ"ను తనకడ్డంగా
రావణుడి ముందు పడేసింది సీత.
రావణుడు
దుష్టుడైనా ప్రభువు,
క్షత్రియుడు. పైగా తన దగ్గరకొస్తున్నాడు
కాబట్టి వాడు అతిథే. అతిథిని సత్కరించాలని శాస్త్రాలు
చెప్పుతున్నందువల్ల తనకు లభించిన "తృణం" వాడివైపుకు వేసిందని ఒక భావన. "నిన్ను నేను
తృణప్రాప్రాయంగా చూస్తున్నాను. ఈ తృణం నన్నేమి చేయగలదో
నువ్వూ అంతే" అనేది మరో అర్థం. రావణుడు
పశువుతో సమానమనే అర్ధమొచ్చే రీతిలో వాడి భోగ్యవస్తువైన గడ్డిపోచ వేసింది సీత.
ఇలా ఎన్నో అర్ధాలను, విశేషాలనూ సెలవిస్తారు మన
పెద్దలు గడ్డిపోచను మధ్యలో వేయడంలో. అలా
రావణుడిని తృణప్రాయంగా చూసి కర్తవ్య బోధ చేసింది సీతాదేవి.
"రావణా!
నీవు మూఢుడివిరా! రామచంద్రమూర్తి నుండి నన్ను వేరుచేయడం నీకు చేతనవుతుందా? శ్రీరామచంద్రుడికి
నేను "అనన్య"ను. నన్నాయన నుండి వేరుచేయలేవు. నీవు అవివేకివి. నేను
రాముడి దానినైనా, ఆయన మీద ఆధారపడ్డ పరతంత్రనైనా, నేనే ఆయన్ను లోకానికెక్కువగా వుపయోగపడేటట్లు చేస్తున్నాను. ఆయన మహిమ
లోకమంతా తెలవడం నావల్లనే. నేనులేకపోతే, ఆయన ఉనికేలేదని
చెప్పాలి. నాభర్తను ఎడబాసి వగస్తున్న నాదగ్గరకు, నామగడిని
తెచ్చి విడువు. అలాచేస్తే నిన్ను "నయమతి" అంటారు. నేనుచెప్పినట్లు చేయి.
చేయకపోతే రాముడు నిన్ను చంపడం ఖాయం" అని అంటుంది.
మారీచుడు
రావణుడితో "జనకాత్మజ సంబంధంబున రాముండప్రమేయ పురుతేజుండయ్యె" నని
చెప్పాడు. అవివేకైన రావణుడికి అది అర్థం కాలేదని సీత గుర్తుచేస్తుందిక్కడ. యాచకులు
లేని దాతలు,
రోగులు లేని వైద్యులు లేనట్లే, ప్రపంచం
లేకపొతే భగవంతుడు లేనేలేడు. ప్రకృతిమూలాన్న తప్ప, భగవంతుడిని
తెల్సుకునే మార్గమే లేదు. ఆ భగవంతుడి శక్తే "లక్ష్మి". ఆమే
"మాయ". ఆమే "ప్రకృతి". ఆమె ’చిద్విలాసమే’ ప్రపంచం.
ఎప్పుడెప్పుడు విష్ణువు అవతారమెత్తుతాడో, అప్పుడన్ని
సమయాల్లో శ్రీదేవి ఆయనకు సహాయంగా రావాల్సిందే. విష్ణు దేహానికి అనురూపమైన దేహాన్ని
ధరిస్తుంది. ఆమె "అనన్య". అంటే, చీకటి-వెలుతురు
లాగా అన్యం కాకుండా వుంటుంది.
సీతాదేవి
కఠినంగా మాట్లాడుతుంటే,
కోపించిన రావణుడు, అనరాని పరుషమైన మాటలతో,
ఆమె పైన విరుచుకు పడ్డాడు. "జానకీ!
ఇదివరకు పన్నెండు నెలల గడువిచ్చాను నీకు. ఇంకా
రెండునెలలు మిగిలాయందులో. అంతవరకు నీమీద నమ్మకంతో
వేచిచూస్తాను. ఈలోపల నువ్వు నాభార్యగా, నాపడకెక్కకపోతే, గడువు తీరిన మర్నాడే, నా వంటవాళ్లు నిన్ను, నా ఉదయం భోజనంలో నంచుకోవటానికి
వండుతారు”. రావణుడి బెదిరింపు మాటలకు సీత భయపడలేదు. చాలా
రకాలుగా వాడిని బెదిరించింది. తానే వాడిని భస్మం చేయగలిగినా,
పరతంత్రురాలినైనందున అలా చేయడం లేదన్నది.
నయాన-భయాన, సీతాదేవి చెప్పిన మాటలు రుచించని రావణుడు, సీతను
నానా రకాలుగా నిందించాడు. అక్కడున్న నానారకాల రాక్షస స్త్రీలను ఆమెపైకి
పురుగొల్పుతాడు. సీతాదేవిని తనవశమయ్యేటట్లు చేయమంటాడు.
ఇట్లా బెదిరిస్తూ, రాక్షస స్త్రీలను
ఆజ్ఞాపిస్తూ, సీతను మళ్లీ, మళ్లీ
చూస్తూ, రాక్షస స్త్రీలు, తనచుట్టూ
సేవిస్తుండగా, సీతను అనుచితమైన రీతిలో మరోమారు బెదిరించి, మదనోద్రేకానికి గురై, తడపడ్తూ, బంగారంతో ప్రకాశిస్తున్న తన ఇంట్లోకి వెళ్లిపోతాడు రావణుడు.
(వాసుదాసుగారి
ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment