Sunday, February 14, 2021

హనుమంతుడు చూసింది సీతాదేవే కదా? : వనం జ్వాలా నరసింహారావు

 హనుమంతుడు చూసింది సీతాదేవే కదా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (14-02-2021) ప్రసారం  

లంకా నగరంలో ఎందెందు వెతికి చూసినా సీత జాడ తెలియక పోవడంతో హనుమంతుడు దిగాలు పడ్డాడు. సీత కనపడలేదని చెప్తే కీడు తప్పదని, చెప్పకపోతే దోషం కల్గుతుందని, అంటే, చెప్పినా, చెప్పకున్నా కీడే! చెప్పాల్నా? వద్దా? అన్న మీమాంసలో పడ్తాడు. మనస్సు కుదుటపడలేదు. ఒక ఆలోచన చేస్తుంటే, దాన్ని బాధించే ఆలోచన మరోకటి వస్తున్నది. యోగ్యమైన నీతి ఏమిటా అని మరీ-మరీ ఆలోచించ సాగాడు. సీత జాడ కనుక్కోకుండా తాను కిష్కిందకు పోతే ప్రయోజనమేంటి? కాబట్టి ఇక్కడినుండి కిష్కిందకు పోకపోవడమే ఉత్తమమని నిర్ణయించుకున్నాడు.  లంకలోనే వుండి, సీతాదేవిని కనుక్కోలేక పోయినందున, ఓ చెట్టు క్రిందో, పుట్ట క్రిందో, నివసిద్దామనుకుంటాడు హనుమంతుడు. కందమూలాలు బాగాదొరికే సముద్రతీరానికి పోయి, అక్కడ చితి పేర్చుకుని, దాంట్లో చావడం మేలనికూడా భావిస్తాడు.

         లంకాధిదేవతను జయించడంతో శుభారంభం కలిగించి, లంకలో హనుమంతుడు ప్రవేశించాడన్న కీర్తిని తెచ్చిన ఆనాటి రాత్రి, సీతాదేవి దర్శన భాగ్యం లేకుండా వృధాగా పోతున్నదే అని దిగులుపడ్తాడు హనుమంతుడు. చచ్చేం సాధిస్తామనీ, ప్రాణాలొదిల్తే పెక్కు దోషాలు కలుగుతాయనీ, ప్రాణాలు విడువరాదనీ, బ్రతికుంటేనే శుభం కలుగుతుందనీ నిర్ణయానికొస్తాడు. వేరేవిధంగా కూడా ఆలోచిస్తాడు. సీత వుందో-లేదోనన్న సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు ఇంత అనర్ధానికి కారణమైన రావణుడిని పట్టుకుని చావకొట్తే మంచిదనీ, ఇదే వాడి పాపానికి తగిన ప్రాయశ్చిత్తమనీ భావిస్తాడు హనుమంతుడు. రావణుడిని పట్టుకుని, సముద్రమ్మీదేసి, ఈడ్చుకుని పోయి రామచంద్రమూర్తి ఎదుట నిలబెట్టుదామనుకుంటాడు.

         ఇలా పలుమార్లు అధైర్యంతో విచారపడ్తాడు. దిగులుపడ్తాడు. సీతకనిపించే దాకా వెతకాలనుకుంటాడు. ప్రాకారం పైనుండి నలువైపులా తేరిపార చూసిన హనుమంతుడికి అశోకవనం కనిపించింది. అక్కడింకా వెతకలేదుకనుక, వెతకాలనుకుంటాడు. ఈవిధంగా కొంచెంసేపాలోచించి, అశోకవనంలో సీత తప్పక వుంటుందని నిశ్చయించుకుని, ఉత్సాహంతో లేచి ధ్యానం చేస్తాడీవిధంగా: "రామచంద్రమూర్తికి నమస్కారం, లక్ష్మణస్వామికి నమస్కారం. విదేహ రాజపుత్రి, శ్రీరామ ధర్మ పత్ని సీతమ్మకు నమస్కారం. ధర్మరాజుకు, ఇంద్రుడికి, మరుత్తులకు, వాయువుకు, రుద్రులకు, సూర్యచంద్రులకు, సుగ్రీవుడికి నమస్కారం".....”నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్యై జనకాత్మజాయై” అని వాల్మీకం.

హనుమంతుడు లంకను జయించాడంటే యోగి దేహాన్ని జయించినట్లే. దేహం వశ పడగానే ఆత్మావలోకనం లభించదు. హనుమంతుడు సీత కొరకై వెతుకుతున్నప్పుడు మండోదరిని చూసి సీతని భ్రమిస్తాడు. అంటే ఆయన అన్వేషణలో, శోదించే సమయంలో, కనిపించిన ఆత్మ తేజస్సు లాంటి తేజస్సును "ఆత్మ"ని భ్రమించ కూడదు. మున్ముందు మిక్కిలి హెచ్చరికతో, నిష్కాముడై, జితేంద్రియుడై వెతకాలి. ఇలా వెతుకుతుంటే, స్వప్రయత్నం ద్వారానే కార్యం సాధ్యమౌతున్నదనే భావనంటే, అది తొలగి పోయే వరకు, ఆత్మ దర్శనం కలగదు. అందుకే కార్య సిధ్ధికై, సీత-రామ-లక్ష్మణులకు, మొక్కి, కార్యమారంభించినాడు. కాబోయే సీత దర్శనానికీ, జరిగిన రామ దర్శనానికీ, సుగ్రీవుడే కారణం కనుక ఆయనకూ నమస్కరించాడు. హనుమంతుడు సంపాతి (జటాయువు సోదరుడు) మాటలందు నమ్మకంతో రావణుడి అంతఃపురంలో సీతను వెతికినట్లే, సాధకుడు గురు వాక్యం మీద నమ్మకంతో, "దేహంలో ఆత్మాన్వేషణ" చేయాలి. కనపడక పోతే, ప్రయత్న లోపం జరిగిందనుకొని, నిరుత్సాహ పడకుండా, కనిపించే దాకా వెతకాల్సిందే!

ఈవిధంగా సమస్త దేవతలకూ నమస్కరించి, దిక్కులన్నీ తేరిపార చూసి, అశోకవనం పైనే దృష్టి సారించాడు. అనేక రాక్షసుల కాపలాలో పరిశుభ్రంగా వుంచబడి, మిగిలిన అన్ని వనాలకంటే మనోహరంగా వున్న ఆ వనంలో, సీత వుండడం నిశ్చయమని భావిస్తాడు. తన దేహాన్ని మరింత చిన్నదిగా చేసి, సీతాన్వేషణలో నిమగ్నమౌతాడు మళ్లా. సమస్త భూతాలను, పరాత్పరుడిని, భగవంతుడిని తనకార్యం సఫలమయ్యేటట్లుగా చూడాల్సిందని ప్రార్ధిస్తాడు హనుమంతుడు. ప్రార్థించి, ఆశతో ఎదురుచూడసాగాడు.

హనుమంతుడు మెల్లగా ఆ వుద్యానవనంలోని ప్రాకారం మీదకు గెంతుతాడు. అక్కడ నిలబడి అశోకవనాన్ని తేరిపార చూసాడు. దోరపండ్లతో, ముదిరిన పండ్లతో, కోకిలల, తుమ్మెదల, నెమళ్ల ధ్వనులతో నిండిన అశోకవనాన్ని చూసాడు హనుమంతుడు. ఆయన అలికిడికి చెట్లపైనున్న పక్షులు నిద్రలేచి కిల-కిల కూయడం మొదలెట్టాయి. హనుమంతుడు ఒక చెట్టు మీదినుండి మరో చెట్టు మీదికి దూకటంతో, ఆ అలికిడికి, కొమ్మలు కదిలి, పక్షులు లేచి, కిలకిల కూస్తూ, ఆకాశానికి ఎగిరిపోసాగాయి. హనుమంతుడు అశోకవనంలోని తీగల గుంపును చిమ్మాడు. చుట్టూ బంగారు చాయ ఉన్న చెట్లు చుట్టుకోగా, బంగారు గజ్జెలు ధ్వనించే "శింశుపావృక్షాన్ని" చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు హనుమంతుడు.

సీతాదేవి ఇక్కడకు తప్పక వస్తుందని నమ్మిన ఆంజనేయుడు, "శింశుపావృక్షాన్ని" ఎక్కి, ఆమెను చూద్దామని భావిస్తాడు. సీతాదేవి ప్రాణాలతో వుంటే తప్పక అశోకవనానికి వస్తుందని నమ్ముతూ, "శింశుపావృక్షం" పైన దాక్కుని అన్ని ప్రక్కలా చూస్తుంటాడు హనుమంతుడు. అన్నిరుతువులలో పూచే, కాచే చెట్లతో, అతిశయిస్తున్న అశోకవనాన్ని, "శింశుపావృక్షం" పైనుండి చూసాడు హనుమంతుడు. అగ్నిజ్వాలల్లాంటి ఎర్రని చెట్లనూ, ఆంజనేయుడు అశోకవనంలో చూశాడు. అన్నిరుతువుల్లో ఫలాలతో నిండి, సువాసనగల చెట్లతో, జింకలతో అలరారుతూ, రెండవ గంధమాదన పర్వతాన్ని తలపిస్తున్నదావనం. వనం మధ్యలో కైలాసపర్వతంలో, తెల్లగా, నిర్మలంగా, పగడాల మెట్లు, బంగారపు అరుగులు కలిగి, లమీదేవిలా ప్రకాశిస్తున్న, రమ్యమైన, కన్నుల పండువైన, వేయిస్తంబాల మేడను చూసాడు హనుమంతుడు అతిదగ్గరనుండి.

మాసిన చీరతో, ధైర్యం చెడిన మనస్సుతో, ఆహారం తీసుకోనందున శుష్కించిన దేహంతో,  నిట్టూర్పులతో, ఈమె సీతేనని గుర్తించలేని దేహకాంతితో, బాధిస్తున్న రాక్షస స్త్రీలమధ్యన కనిపించిందొక సుందరి హనుమంతుడికి. ఆ స్త్రీ, హోమధూమంతో కప్పబడి, అగ్నిశిఖలా అందంచెడి, మిక్కిలి బాధపడ్తూ కనిపించింది. ఒంటి చీరెతో, దుఃఖంతో, శుష్కించిపోయి, అంగారకుడు పట్టుకున్న కాంతి విహీనమైన రోహిణిలాగుంది. కన్నీళ్లు కాలువలు కారుతూ ముఖమంతా ఆవరించి, దుఃఖంతో శోషించి, వెక్కి, వెక్కి ఏడుస్తూ, రాక్షస స్త్రీసమూహాలనే చూస్తూ, ఒంటరిగా, వేటకుక్కలకు చిక్కిన ఆడజింకలా అల్లాడుతూ, నడుంవరకు వ్రేలాడుతున్న నల్లటి త్రాచుపాములాంటి ఒంటి జడతో, సంపూర్ణంగా మాసిన దేహంతో వున్న స్త్రీని చూసాడు హనుమంతుడు. ఆమె మిక్కిలి సుఖానికి యోగ్యమైన దానిలా, మిక్కిలి దుఃఖంపడే స్త్రీలా అనిపించింది హనుమంతుడికి.

ఆమె సీతాదేవేనని నిశ్చయించుకోవటానికి కారణాలు వెతుకుతాడు. ఆనాడు ఋశ్యమూకపర్వతం పైనుండి రావణుడు అపహరించుకుని పోతున్నప్పుడు చూసిన సుందరరూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. ఆ రూపమే ఈమెలో కనిపిస్తున్నదికదా అని మరల-మరల చూస్తాడు నిర్ధారణగా. ఆమెలో "స్థిరపడని, కుదుటపడని శ్రధ్ధ; సందేహం కలిగించే స్మృతి వాక్యమ్; క్షయించిన సంపద; కల్మషంతో కూడిన బుధ్ధి; విఘ్నమైనకార్యఫలంలో వుండే లక్షణాలను" చూస్తాడు హనుమంతుడు. ఈమె సీత కాదేమో, అవునేమో, లేక, రావణుడు బలాత్కారంగా తెచ్చిన స్త్రీలలో ఒకతేమో అనుకుంటాడు. సందేహం మాని, ఈమె సీతేనని నిర్ధారించుకుంటాడు. తన నిర్ణయానికి తానే కారణాలు వెతుక్కుని తృప్తి పడతాడు. తన నిర్ణయం సబబేనని తీర్మానించుకుంటాడు. 

శ్రీరామచంద్రమూర్తి జానకి సొమ్ములని వేటిని చూపించాడో, అలాంటివన్నీ, ఈమె సమీపంలో ఒకచెట్టు కొమ్మకు వ్రేలాడుతుండడం కనిపించాయి, మరోనిదర్శనంగా సీతాదేవి ఆభరణాలను, కోతుల ముందు పడవేసినతర్వాత, వారు వాటిని మూటగా కట్టి, రాముడొచ్చినప్పుడు అందచేసారు. ఎవరైనా తనను వెతుక్కుంటూ వస్తే, గుర్తించేందుకు ఆమే ఆపని చేసింది. ఈమె సీతేననటానికి అక్కడ కిష్కింధలో చూసిన ఆభరణాలలాంటివే ఇక్కడా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అక్కడ విడిచి మిగిలినవి గుర్తుపట్టెందుకు ఇక్కడ వేలాడకట్టిందని భావిస్తాడు. ఎన్నాళ్లుగానో నగలు ధరించనందున ఆమె ఒంటి మీద గుర్తులుకూడా కనిపిస్తున్నాయి. అంటే, శ్రీరాముడు, సీత సొమ్ములివి అని వేటిని చూపించాడో, అవి ధరిస్తే ఎలాంటి గుర్తులు పడతాయో, అలాంటివే ఈమె ఒంటిమీదున్నాయి. సీతాదేవి పారేసినవి కాకుండా, తొందరగా తీసేయలేనివి ఒంటిమీదే వుంచుకున్నది. అక్కడ చూసిన నగలిక్కడ లేవు, ఇక్కడున్నవక్కడ లేవు. అక్కడ ఎడమభాగానివి వుంటే, ఇక్కడ కుడివైపువి వున్నాయి. సందేహంలేదనుకుంటాడు హనుమంతుడు.

ఇంకా సందేహ నివృత్తికి కారణాలు వెతుకుతాడు. ఈమె సీతే అనడానికి మరోకారణం చెప్పుకుంటాడు హనుమంతుడు. ఈమె శ్రీరామచంద్రుడి హృదయేశ్వరి సీతాదేవి. సీతాదేవి  హృదయేశ్వరుడు శ్రీరామచంద్రుడు. ఇరువురు ఏకాభిప్రాయం కలవారే. ఆమె "ఔనన్నది" ఈయన కాదనడు. ఈయన ఔనన్నది ఆమె కాదనదు. ఆమె రామాభిమతానుసారిణి. సీతానుగ్రహం వస్తే రాముడి అనుగ్రహం వచ్చినట్లే అనుకుంటాడు. రాముడి హృదయేశ్వరి, రాణి, అయినందున, దూరదేశంలో మగడిని విడిచి వున్నప్పటికీ, ఆయన హృదయాన్ని మటుకు వదలకుండా నిలిచే వుంది. ఆయన హృదయాన్నెడబాయకుండా వుంది. సాముద్రికశాస్త్రం ప్రకారం రాముడికెలాంటి అవయవ సౌష్టవముందో, అట్టి వాడికి ఎలాంటి అవయవ సౌష్టవం కల భార్య వుండాల్నో, అలాంటి లక్షణాలన్నీ ఈమెలో వుండడం మరో నిదర్శనంగా భావిస్తాడు.

ఆమె ఈయనపై మనస్సు నిలిపింది. కాబట్టి వీరిమనసులు ఎక్కడ న్యాయంగా వుండాలో, అక్కడే వున్నాయి. దేహాలు మాత్రం వేరుగా వున్నాయి. మనస్సులు ఏకంగా వున్నాయి. అందుకే వీరిద్దరూ బ్రతకగలిగారు. అదే కాకపోతే ఇద్దరూ మరణించేవారే! (ఇదే జీవాత్మ-పరమాత్మ సంబంధమని అర్థం చేసుకోవాలి).

ఇంకా ఇలా అనుకుంటాడు: "రాముడు భూకాంతుడు కనుక బ్రతికాడు. సీతాదేవిని విడవడంవలన కలగాల్సినంత దుఃఖమే కలిగితే బ్రతికుండే వాడా? ఆత్మహత్య చేసుకోనక్కరలేదు. నిజంగా దుఃఖమే కలిగితే ప్రాణాలు వాటంతటవే శరీరాన్ని విడిచిపోయేవే. అలాంటప్పుడు సీత ప్రాణమెందుకు పోలేదు? ఆమెకు దుఃఖం లేకనా? సీత పరతంత్ర. భర్త ఆజ్ఞ లేకుండా మరణించలేదు. దేహమే ఆమెది, ప్రాణం రాముడి సొత్తే. ఆమె పోగొట్టుకోలేదు. పోతాయన్నా బిగపట్టుకోవాలి. రాముడు స్వతంత్రుడు. దేహాన్ని వదలాల్సి వుండాలి. కానీ చేయలేదే? అదే అసాధ్య కార్యం. రాముడు సీతను, వదిలి ఎలా వుండగలుగుతున్నాడు? జీవితేశ్వరైన సీత పోయిన తర్వాత నాకింకేమిపననుకొని, జీవుడు పోవాలనుకున్నా, పోనీయక బిగపట్టాడు. ఇది దుష్కరమేకదా! ఇంతటి అసాధ్యకార్యం సాధించిన రామచంద్రమూర్తి సామాన్యుడుకాడు. ఇదిచేయకలిగినవాడు ఎంతటి అసాధ్యమైన పనైనా చేయగలడు. లంకాప్రవేశం చేసి, సీతను చూసిన నేనే అసాధ్యకార్యం చేసానన్న గర్వంతో వున్నానే. కాని రాముడు చేసిన కార్యం ఎదుట నేనుచేసింది గొప్పకానేకాదు."

జానకీదేవిని చూసిన హనుమంతుడు ఇలా అనుకుంటూ, మాసిన చీరతో, స్నానంలేని ఒంటితో, నిద్రాహారాలు మాని, భర్తనే ధ్యానంచేస్తున్న పరమపతివ్రతను చూసే అదృష్టం తనకు కలిగిందికదా అని ఆనందిస్తాడు. వానరులందరూ బ్రతికినట్లేననీ, సుగ్రీవుడు కృతజ్ఞుడయినాడనీ, రామలక్ష్మణుల కార్యం నెరవేరిందికదా అని సంతోషపడ్తాడు. "రామచంద్రమూర్తి ఎంతగొప్పవాడోకదా! కాకుంటే ఇట్టి స్త్రీకి భర్తయ్యేవాడా! ఎంత జితేంద్రియుడు కాకపోతే ఈమెను విడిచి బ్రతుకుతాడా?" అని సంతోషంతో శ్రీరాముడి సామర్ధ్యాన్ని తనివితీరా పొగడుతాడు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

No comments:

Post a Comment