Saturday, February 27, 2021

హనుమ సీతకు విశ్వాసపాత్రుడయ్యాడా? : వనం జ్వాలా నరసింహారావు

 హనుమ సీతకు విశ్వాసపాత్రుడయ్యాడా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (27-02-2021) ప్రసారం  

రావణాసురుడు ఆజ్ఞాపించిన దరిమిలా, రాక్షసస్త్రీల బెదిరింపు మాటలను, సీత సమాధానాన్ని, త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతాన్ని శింశుపా వృక్షం మీద కూర్చుని విన్న హనుమంతుడు, ఈమె దేవలోకంలోని నందనవనంలో వుండాల్సిన స్త్రీగాని, మనుష్య స్త్రీకాదని తలుస్తాడు. వివిధ రకాల  ప్రత్యక్ష, పరోక్ష నిదర్శనాల వల్ల, తానూ చూసింది సీతనేనీ, రామచంద్రమూర్తి సందేశం వినే అర్హత ఈమెకే వుందనీ, హనుమంతుడు తీర్మానించుకుంటాడు. ఇంతవరకు సుగ్రీవుడు అప్పగించిన సీతాన్వేషణ పని సాధించిన హనుమంతుడు, ఇక శ్రీరాముడు చెప్పిన కార్యసాధన గురించి ఇలా ఆలోచించసాగాడు.

"సీతాదేవికి ఆమె భర్త యోగక్షేమాలు తెలిపి, ధైర్యం చెప్పడమే మేలైన పని. ఈమెకు ధైర్యం చెప్పి, ఈమె దుఃఖాన్ని నివారించడం నా ప్రధమ కర్తవ్యం. రామచంద్రమూర్తి సీతను ఎప్పుడు చూస్తానా అని ఆసక్తితో వున్నాడక్కడ వనంలో. ఆయన మాటలు ఈమెకు చెప్పి, ఓదార్చి, ఈమెచెప్పే మాటలు ఆయనకూ చెప్పి ఆయన్ను కూడా ఓదార్చాలి. ఇదే సరైన మార్గం." అనుకుంటాడు హనుమంతుడు.

"శ్రీరాముడి వృత్తాంతం ఈమెకు చెప్పడం ఆవశ్యకమే అయినా, ఎలా చెప్పాలి? అవకాశం చూసి, సీతాదేవిని ఓదార్చిపోవడమే మంచిది. ఎట్లాజరగాలది? నేను చిన్న ఆకారంలో వున్నాను. దాన్నిప్పుడు పెంచొద్దు. కోతినైన నేను మనుష్యులలా సంస్కృతం మాట్లాడవచ్చా? బ్రాహ్మణుడిలాగా సంస్కృతం మాట్లాడితే, నన్ను రావణుడిగా అనుమానించి అసలే మాట్లాడదేమో! మాట్లాడకుండా వూరుకుంటే, ఓదార్చాల్సిన ఆమెను ఎలా ఓదార్చాలి? మాట్లాడాలంటే, ఎలా, ఏమి మాట్లాడాలి? వేరేమార్గం లేదు. ఈమెకు తెలిసిన ప్రాకృతభాషలోనే మాట్లాడుతా. ఎలా చెప్పితే సీత నామాటలు చక్కగా వింటుంది, నన్ను చూడగానే సీత భయపడకుండా ఎట్లా వుంటుంది?"

ఇలా పరిపరి విధాల ఆలోచించిన హనుమంతుడు, బుధ్ధిమంతుడు కనుక, సరైన నిర్ణయానికొస్తాడు. తన్ను చూస్తేనే కదా సీత భయపడేది అనుకుంటాడు. కనిపించకుండా, కొమ్మల్లో దాక్కుని, సీత భయపడకుండా, రామచంద్రమూర్తిని, ధర్మంతోకూడిన, శుభాన్నిచ్చే, తియ్యటి మాటల్తో పొగిడి, ఆమె నమ్మేటట్లు చేస్తే మంచిదని భావిస్తాడు. తనమాటలను ఆమె ఎంతవరకు నమ్ముతుందో చూసిన తర్వాతనే, ముందు-ముందు ఏమిచేయాల్నో నిర్ణయించుకోవచ్చు అనుకుంటాడు. హనుమంతుడు, ఆమెను చూస్తూ, ఆమె మాత్రమే వినేటట్లు, చెట్టుచాటునుండి, తియ్యగా మాట్లాడసాగాడు.

దశరథుడి పేరు స్మరించేవారెవ్వరూ లంకలో వుండరు కాబట్టీ, ఆ ప్రస్తావన వచ్చినా కీర్తించే వారెవరూ లేరుకాబట్టీ, దశరథుడితో మొదలెట్టి ఆయన ఉదారకీర్తిని గురించిన మాటలు సీతచెవిలో పడేటట్లు చేసి, ఆమెమనస్సును ఆకర్షిస్తాడు హనుమంతుడు. ఈవిధంగా సీతాదేవి మనస్సును తనవైపు లాక్కొని, ఆతర్వాత ఇంకేమి చెప్తాడో విందామన్న ఆసక్తి ఆమెలో కలిగిస్తాడు హనుమంతుడు. పరేంగిత జ్ఞానిగా హనుమంతుడు సాక్షాత్కరిస్తాడు. ఎవరో తనమామగారిని పొగడ్తున్న మాటలు విన్న సీతాదేవి ఇంకేమి వినపడ్తుందో అని ఆలకించింది ఆసక్తిగా.

"దశరథ మహారాజు పెద్దకొడుకే శ్రీరామచంద్రుడు. (ఎవరో తన మగడిపేరు చెప్పుతున్నారే అని, ఇంకా ఏంచెప్తారో విందామని, మరింత ఆసక్తిగా మనస్సు పెట్టి వినసాగింది సీత). శ్రీరాముడు తండ్రి ఆజ్ఞప్రకారం, తమ్ముడు, భార్య తోడురాగా అడవులకెళ్లాడు. రావణుడు, మాయలేడి నెపంతో, మోసంచేసి, శ్రీరాముడి భార్యను అపహరించాడు. ఆమెను వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణులు వానర రాజైన సుగ్రీవుడితో స్నేహం చేసారు. వాలిని చంపి, రాజ్యాన్ని ఆయనకప్పగించాడు రాముడు. సీతాదేవిని వెతికేటందుకు, సుగ్రీవుడు పంపిన, పరాక్రమమవంతులు, కామరూపులైన వానరులనేకమందిలో ఒకడినైన నేను, జటాయువు సోదరుడు సంపాతి సలహామేరకు, ఆయన మాటలు నమ్మి, నూరామడల పొడవున్న సముద్రాన్ని దాటి లంకకొచ్చాను. సీతాదేవిని ఇక్కడ వెతుకుతున్న నాకు, నా పూర్వ పుణ్యఫలంవల్ల, శ్రీరాముడు చెప్పిన ఆకారం, వర్ణన, కాంతి, గుణం, సౌందర్యం వున్న పతివ్రత కనిపించింది”.

ఇలా హనుమంతుడు అంటున్న మాటలను విన్న సీతాదేవి, ఆశ్చర్యపడి, కుటిలాలకాలను సవరించుకుంటూ తలపైకెత్తి, ఎవరీ మాటలు చెప్పుతున్నారా అని చెట్టువైపు చూసింది. ఇదేమన్నా రావణుడి మాయేమో అనుకుని, భయం, భయంగా, రాముడిని స్మరించుకుంటూ, చెట్టు కింద, మీద, ప్రక్కన, సందుల్లో చూడసాగింది సీత. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతమ్మకు హనుమంతుడు చేసిన రామగుణగానం జీవివితంపైన ఆశలు చిగురింప చేసింది. సీతమ్మకు ఊపిరులూదింది.

రామనామస్మరణ వింటున్న సీతాదేవికి, చెట్టుకొమ్మల్లో కనిపించిన కోతిని చూడగానే వళ్లుజలదరించింది. తనకేం కీడు జరగబోతున్నదో అని భయపడింది. రామలక్ష్మణులను స్మరించి మెల్లగా ఏడ్చింది సీత. అయితే తాను చూసింది హనుమంతుడనే విషయం ఆమెకు తెలియదు. తాను  చూసింది వాస్తవంగా కోతేనని నిశ్చయించుకుంటుంది. రెండు చేతులు జోడించి, బ్రహ్మకు, అగ్నికి, బృహస్పతికి, నమస్కరించుతుంది. కోతిచెప్పిన మాటలన్నీ నిజం కావాలని, భిన్నంగా జరుగవద్దని కోరుకుంటుంది. సీతాదేవి మనస్సుకు తాను నిజమైన కోతేనన్న నమ్మకం కుదిరిందనీ, పూర్తిగా నమ్మకం ఇంకా కుదరలేదని భావిస్తాడు హనుమంతుడు.

తనమీద సీతకు కొంత విశ్వాసం కలిగిందన్న నమ్మకంతో, హనుమంతుడు పైకొమ్మనుండి కింది కొమ్మకు దిగి, వినయంతో, ఇలా అంటాడు సీతతో: "అమ్మా నన్ననుగ్రహించి  నువ్వెవరివో, ఎందుకిట్లా మాసిన పట్టువస్త్రం కట్టుకుని, కొమ్మను పట్టుకుని, నిలబడి వున్నావో చెప్పు తల్లీ? అమ్మా! ఎక్కడనుండి నీవిక్కడకు వచ్చావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? నీవు క్షత్రియస్త్రీవని కూడా నీ శుభచిహ్నాలు చూసి భావిస్తున్నాను. రావణాసురుడు బలాత్కారంగా ఎత్తుకొచ్చిన సీతవు కావుకదా! నిజం చెప్పు. నీవు రామచంద్రమూర్తి భార్యవన్న సందేహం కలుగుతున్నది. నా అభిప్రాయం నిజమేకద! చెప్పాలి" అని అడుగుతాడు హనుమంతుడు సీతాదేవిని. త్రిజట మాటలకు భయపడ్డ రాక్షస స్త్రీలు సీతను వదిలి ఎక్కడి వారక్కడే దూరంగా పోయారు కొంతసేపు. అందువల్లనే సీతతో మాట్లాడటానికి కొన్త సమయం దొరికింది హనుమంతుడికి.

హనుమంతుడు తన భర్తను కీర్తించినందుకు, సంతోషించిన సీత, ఆయనతో తన గురించి చెప్పసాగింది ఇలా:

"దశరధుడి కోడలను నేను. జనకరాజు కూతుర్ని. రామచంద్రుడి భార్యను. నాపేరు సీత. భోగ-భాగ్యాలన్నీ అనుభవిస్తూ పన్నెండు సంవత్సరాలు శ్రీరాముడింట్లో వున్నాను. పదమూడో ఏట దశరథుడు నా భర్తను రాజును చేయాలనుకున్నాడు. దశరథుడి ముద్దుల భార్య కైకేయి. రామచంద్రమూర్తిని అడవులకు పంపాలని కోరుతుంది. దశరథుడు భార్యకేమీ సమాధానం చెప్పలేక, అయిష్టంగానే తనపెద్దకొడుకును రాజ్యం వదిలి పొమ్మంటాడు. తండ్రిపైనున్న భక్తి, గౌరవాల వల్ల, శ్రీరాముడు, ఆయనతో కలసి మేమిద్దరం వనవాస దీక్ష తీసుకుని, భయంకరమైన అడవిలో ప్రవేశించాం. రాముడి భార్యనైన నన్ను, వంచనతో, రావణాసురుడు దొంగతనంగా ఎత్తుకొచ్చాడు. అందుకే ఇక్కడ దిక్కులేక ఏడుస్తున్నాను. పన్నెండు నెలలు గడువిచ్చాడు వాడిమాట వింటానికి. అందులో ఇన్కా రెండునెలలే మిగిలి ఉన్నాయి. ఆ గడువు ముగిస్తే చస్తాను. ఈ లోపల రామచంద్రమూర్తి రాకపోతాడా అన్న ఆశతో చావకుండా బ్రతికున్నాను".

సీతాదేవి మాటలను విన్న ఆంజనేయుడు, ఆమెను ఊరడిస్తూ,"దేవీ! రామచంద్రమూర్తి నీకోమాట చెప్పమని పంపినందువల్ల, ఆయన దూతగా నేనిక్కడకు వచ్చాను. ఆయన క్షేమమని నీతో చెప్పమన్నాడు. నీ క్షేమసమాచారం తెలుసుకుని రమ్మన్నాడు. లక్ష్మణుడు, నీకు సాష్టాంగ నమస్కారమని చెప్పమన్నాడు. వారిరువురూ కుశలం” అని చెప్పాడు. ఈమాటలను విన్న సీతాదేవి సంతోషపడి, తనువెల్ల పులకరిస్తుంటే శుభవార్త తెలిపిన హనుమంతుడిపై సీతాదేవికి ప్రేమకలుగుతుంది. ఒకర్నొకరు నమ్మి మాట్లాడుకోవడం ప్రారంభించారు. సీతాదేవి చెప్పిన మాటలను విన్న హనుమంతుడు, ఈమెకు తనమీద దృఢమైన నమ్మకం కుదిరిందన్న విశ్వాసంతో, ఆమెను బుజ్జగిస్తూ, ఆమె దుఃఖాన్ని అణచటానికి, కొద్ది-కొద్దిగా ఆమె దగ్గరకు పోసాగాడు. ఆయనలా దగ్గరకు వస్తుంటే, రావణాసురుడే ఈవేషంలో తనతో మాట్లాడడానికి వచ్చాడన్న భయం కలిగింది సీతాదేవికి. అప్పుడు హనుమంతుడితో ఇలా అంటుంది.

“నీవు నిజంగా రామదూతవే అయితే నాకు ప్రియమైన ఆయన గుణాలు వర్ణించు. అలాచేస్తే నాకు అమిత సంతోషం కలుగుతుంది. రావణుడైతే రామచంద్రుడిని కీర్తించడు కద!" సీతాదేవి తనను సందేహిస్తున్నదనుకున్న హనుమంతుడు, అది పోగొట్టడానికి, తియ్యటి మాటల్తో, రామచంద్రమూర్తిని కీర్తిస్తాడు. ఆయన గుణగణాలను వర్ణిస్తాడు వివరంగా.

"త్వరలో నువ్వు రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని లంకలో చూస్తావు. నేను మాయలమారి రావణుడిని కాను. నీకు కనిపిస్తున్న రూపమే నా అసలు రూపం. నేనుకోతినే. పేరు హనుమంతుడు. సూర్యపుత్రుడు, వానరరాజు అయిన సుగ్రీవుడికి మంత్రిని. అధముడను కాను. ఇలాంటి నేను నీకొరకై, రామాజ్ఞ ప్రకారం సముద్రాన్ని దాటాను. లంకలో ప్రవేశించాను. రావణుడి నెత్తిమీద దొంగచాటుగా కాకుండా, పరాక్రమంతో కాలుపెట్టాను. ఇదంతా చేసి నిన్ను చూడటానికి వచ్చాను. నన్ను నమ్ము. నేను నువ్వనుకుంటున్నట్లు రావణుడను కాను. సందేహం మాని, పరులతో ఎలా సంభాషించ వచ్చన్న అనుమానం లేక, నీ దాసుడైన నాతో, నీబిడ్డతో మాట్లాడినట్లే మాట్లాడు" అంటాడు హనుమంతుడు.

సందేహ నివృత్తి కొరకు హనుమంతుడిని ఈవిదంగా ప్రశ్నిస్తుంది సీత: "శ్రీరామచంద్రమూర్తికీ, నీకూ స్నేహమెలా కలిగింది? లక్ష్మణుడెట్లు తెలుసు నీకు? నరులు, వానరులు, ఒకరిని చూస్తే ఇంకొకరు బెదురుతారు కదా! ఎట్లా మీరిరువురూ ఒకచోట చేరారు? అన్నదమ్ములిద్దరికి ఎలాంటి గుర్తులున్నాయి? రాముడికీ, లక్ష్మణుడికీ తొడలెలా వుంటాయి? చేతులెట్లా వుంటాయి? నీవు నిజమైన వానరుడవే అయితే, రామదూతవే అయితే, వాస్తవం చెప్పి నన్ను మెప్పించు"

శ్రీరామ-లక్ష్మణుల చిహ్నాలేంటని సీతాదేవి హనుమంతుడికి వేసిన ప్రశ్న ఒక విషమ ప్రశ్న. అందులో రెండు భాగాలున్నాయి. చేతుల విషయం ఎవరైనా చెప్పొచ్చు. అందరికీ కనిపిస్తాయి కాబట్టి. "తొడలెలా వుంటాయని" కూడా అడుగుతుంది. అంటే మర్మాంగాలను గురించి ఆరా తీస్తున్నదన్న మాట. దీంట్లో గురువును పరీక్షించే తీరు కనిపిస్తుంది. జవాబు చెప్పేటప్పుడు ఔచిత్యం కనబరుస్తాడా? లేదా అని పరీక్షించ దల్చింది. దీనర్థం: "ఆచార్యుడు", భగవత్ తత్వాన్ని ఆమూలాగ్రంగా, రహస్యాలతో సహా తెలిసిన వాడై వుండాలని.

జవాబుగా హనుమంతుడు: "దేవీ! నా అదృష్టం కొద్దీ, నేను రావణుడను కానని నమ్మి, మౌనం చాలించి, నీభర్త గుర్తులు, లక్ష్మణుడి చిహ్నాలు, యోగ్యంగా, వాస్తవంగా చెప్పమని అడిగావు. చెపుతావిను” అని అంటూ ఆమెక నచ్చే విధంగా, మెచ్చే విధంగా అన్నీ సవివరంగా చెప్తాడు. ఆయన ఆత్మగుణాలనీ, దేహగుణాలను కూడా చెప్పాడు. హనుమంతుడు మొదట శ్రీరాముడి ఆత్మగుణాలను వర్ణించి, తర్వాత దేహగుణాలను వర్ణిస్తాడు. “తేజస్సు, యశస్సు, శ్రీ” ల వల్ల వ్యాపించిన వాడంటాడు. బ్రహ్మచర్య నిష్ఠ కలవాడంటాడు. రాముడిని వర్ణించిన హనుమంతుడు, ఆయన్ను గురించి చాలా నిగూఢ౦గా చెప్తాడు. హనుమంతుడు జయశీలుడు. పరీక్ష నెగ్గాడు. సీతకు విశ్వాస పాత్రుడైనాడు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందారం ఆధారంగా)

No comments:

Post a Comment