Saturday, February 27, 2021

ధర్మరాజును ప్రశ్నిస్తూ నారదుడు చెప్పిన రాజనీతి విషయాలు (ఆస్వాదన-8) : వనం జ్వాలా నరసింహారావు

 ధర్మరాజును ప్రశ్నిస్తూ నారదుడు చెప్పిన రాజనీతి విషయాలు

(ఆస్వాదన-8)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (28-02-2021)

ఖాండవ దహనం తరువాత శ్రీకృష్ణార్జునుల దయవల్ల ప్రాణాలు కాపాడుకున్న మయుడు, వారిద్దరూ ధర్మరాజు దగ్గర వున్నప్పుడు వచ్చి నమస్కరించి, అర్జునుడికి ఏదైనా పని చేసి పెట్టాలని వుందని అన్నాడు. తాను దానవ శిల్పినని, వివిధ కళల్లో నేర్పరినని, వారికి ఇష్టమైన దాన్ని నిర్మించి ఇస్తానని ఆజ్ఞాపించమని కోరాడు. మయుడి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా ఒక మహాసభను నిర్మించి ఇవ్వమని చెప్పాడు శ్రీకృష్ణుడు. మయుడు అందమైన, అపూర్వమైన, అపురూపమైన సభా నిర్మాణానికి పూనుకుని, బిందు సరోవరం దగ్గర 14 నెలలు పరిశ్రమించి నిర్మించాడు. ఎనిమిది వేలమంది రాక్షస భటులతో దాన్ని మోయించి తెచ్చి ధర్మరాజుకు ఇచ్చాడు. అలాగే భీముడికి గదను, అర్జునుడికి శంఖాన్ని ఇచ్చాడు. ఒక మంచి ముహూర్తంలో ధర్మరాజు మయసభా ప్రవేశం చేశాడు. రాజ్యపాలన చేయసాగాడు

ఇలా వుండగా నారదుడు ఒకనాడు ధర్మరాజును, పాండవులను చూడడానికి వచ్చాడు. నారద మహర్షి పాండవులను కుశల ప్రశ్నలు అడిగిన అనంతరం ధర్మరాజుతో రాజనీతి విషయాలు ప్రస్తావించి, ఆయన ఏమేమి చేయాల్నో, చేస్తున్నాడో తెలుసుకున్నాడు. వాటి సారాంశం:

పూర్వీకులు ఏర్పరిచిన ధర్మపద్దతిని రాజు ఆచరించాలి. ధర్మాన్ని తెలుసుకుని, ధర్మార్థకామాలు ఒకదానికొకటి బాధించకుండ, కాలోచితాలుగా వాటిని విభజించి సేవించాలి. ధర్మం మీదనే మనస్సు నిలిపి, చేయాల్సిన రాజకార్యాలను స్వబుద్ధితో ఎల్లప్పుడూ అర్థరాత్రి దాటిన తరువాతే ఆలోచించాలి. ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరంగా యోగ్యులైన వారిని వారి-వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి, గౌరవ భావంగా స్థిరంగా నియమించాలి. పుణ్యాత్ములను, శాస్త్ర నియమాలు బాగా తెలిసినవారిని, రాజుమీద ప్రేమ కలవారిని, తాతతండ్రుల నుండి వంశపారంపర్యంగా కొలువు చేస్తున్న వారిని, బ్రాహ్మణోత్తములను రాజకార్య నిర్వహణకు మంత్రులుగా ఏర్పరుచుకోవాలి. రాజుకు విజయకారణమైన అతడి రహస్యాలోచనను ఆయన ప్రజల చెవిన పడకుండా జాగ్రత్త పడాలి. రాజు గారి పురోహితుడు పండితుడై వుండాలి. ధర్మాధర్మాలు తెలిసినవాడు, వివిధ శాస్త్రాలను బాగా అధ్యయనం చేసినవాడు, రాగద్వేషరహితమైన సమచిత్తం కలవాడై వుండాలి.

దీని భావాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు, ఇలా రాశారు: ‘ప్రాచీనకాలంలో పురోహిత వ్యవస్థ సత్త్వశుద్ధిని కూర్చి ధర్మపాలనకు, ప్రభు క్షేమానికి, ప్రజా క్షేమానికి విశేషంగా దోహదం చేసింది’.

పలు విధాలైన యుద్ధాలలో విజయాన్ని సాధించడంలో నిపుణులైన వారిని, ఎదిరించడానికి సాధ్యం కాని పరాక్రమం కలవారిని, విశ్వాసపాత్రులైన వారిని, గౌరవానికి అర్హులైన వారిని, రాజు మేలు కోరే వారిని సైన్యాధ్యక్షులుగా నియమించాలి. ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలియై, సమర్థుడైన మంత్రి తన పరిమితిమీరి, ఇతరులతో చేతులు కలిపి, రాజుకు వ్యతిరేకంగా ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. దీని భావాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు, ఇలా రాశారు: ‘అధికార పక్షంలో వుంటూ, అన్ని ప్రయోజనాలు పొంది, అధికంగా బలపడి, దురాశా దురహంకారాలు పెంచుకుని, అన్యులతో చేతులు కలిపి, అధికార పక్షాన్ని బలహీనపరిచే వ్యతిరేక వర్గాన్ని సృష్టించే వెన్నుపోటుదారులంతా ఈ కోవకు చెందిన మంత్రులే. కలియుగ రాజకీయాలలో వీరి సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. అలాంటి వారిని ఒక కంట కనిపెట్టి వుండడం మంచిదని నారదుడు ఆ కాలంలోనే హెచ్చరించాడు’.

ఆస్థానజ్యోతిష్కులు తమ శాస్త్ర పాండిత్యం వల్ల, స్వీయ ప్రతిభ వల్ల, దేవతా, అంతరిక్ష, భూసంబంధాలైన ఉత్పాతాలను (ఉప్పెనలు, భూకంపాలు, వానలు-వరదలు) కనిపెట్టి వాటికి విరుగుడు సూచించాలి. వైద్యులు సమర్థులై లోకానికి మేలుచేసే బుద్ధితో, ప్రజలమీద ప్రేమతో సేవలు చేయాలి. మనోవ్యాధులకు, శారీరక వ్యాధులకు వారు చికిత్స చేయగలగాలి. పన్నులు వసూలు చేయడం లాంటి ధనార్జన రూపక రాచకార్యాలలో పరిశుద్ధులైన వారిని, పాపరహితమైన చిత్తవృత్తి కలవారిని, నీతిమార్గంలో నడుచుకునేవారిని, రాగద్వేషరహితమైన సమబుద్ధితో వ్యవహరించేవారిని, నైపుణ్యం కలవారిని నియమించాలి. వ్యక్తుల యోగ్యతలకు అనుగుణంగా ఉన్నత, మాధ్యమిక, కింది స్థాయి ఉద్యోగాల్లో నియామకం జరగాలి. సేవకులందరికీ కొరతలేకుండా తగుజీతాలు సకాలంలో ఇవ్వాలి. రాజు కొరకు యుద్ధంలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు సరైన ఆర్ధిక సహాయం చేయాలి. (కుటుంబ పించను పథకం భారత కాలంలోనే వుండేదని భావించాలి).

ధనం మీద లోభ బుద్ధి కలవారిని, దొంగలను, స్నేహానికి యోగ్యులు కానివారిని, శత్రువుల పట్ల పక్షపాతం కలవారిని, ధైర్యం చాలని వారిని, దుర్మార్గులను, రాజకార్యాలు నిర్వహించడానికి పంపకూడదు. దొంగల భయం లేకుండా రాజ్యాపాలన చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులలో ముఖ్యులు ధనాశాపరులై, దొంగల దగ్గర డబ్బులు తీసుకుని వారికి రక్షణ కలిగించకుండా జాగ్రత్త పడాలి. (లంచగొండులైన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభువు ఎలా అప్రమత్తుడై ఉండాలో నారద మహర్షి అప్పుడే సూచించాడు). రాజుపాలనలో అనావృష్టి లేకుండా, ఎల్లప్పుడూ చెరువులు నిండి కళకళలాడాలి. ఉదారబుద్ధితో పేదరైతులకు ధాన్యపు విత్తనాలు, వర్తకులకు నూటికి రూపాయి మాత్రమే వడ్డీ చొప్పున ప్రభుత్వపరంగా అప్పులు లభించాలి. (నారద మహర్షి మాటలను బట్టి మహాభారత కాలంలోనే అధికాహారోత్పత్తికి విత్తనాలు, ఆర్థికాభివృద్ధికి తక్కువ వడ్డీతో రుణాలు ప్రభువులు ఇచ్చేవారని అర్థం చేసుకోవాలి). వికలాంగులను, అనాధలను దయతో పోషించాలి. మేలుచేసిన వ్యక్తులను ఉచితరీతిన సత్కరించాలి.

ఆదాయంలో నాల్గవ భాగాన్ని లేదా మూడవ భాగాన్ని లేదా సగభాగాన్ని మాత్రమేఖర్చు చేయాలి కాని అంతకు మించి చేయకూడదు. ఆయుధ శాలలు, ధనాగారాలు, అశ్వశాలలు, గజశాలలు, కోశాగారాల లాంటి వాటి పాలనలో ఎంతో నమ్మదగిన వారిని, రాజుపట్ల భక్తి కలవారిని, సమర్థులైన వారిని, నియమించాలి. ప్రజలంతా రాజును ప్రశంసించే విధంగా గురువులను, వృద్ధులను, గొప్ప వ్యాపారులను, ఆశ్రితులను, సజ్జనులను, పేదరికం రాకుండా కాపాడాలి. మంత్రులు, సైన్యాధిపతులు, హితులు, రాకుమారులు, పండితులు, ఆసీనులై వుండగా ప్రపంచమంతా ప్రశంసించే విధంగా ప్రతిదినం కొలువు తీరాలి. సమర్థులైన గూఢచారులను నియమించుకోవాలి. ఎదుటివారి ఎత్తుగడలను తెలుసుకోవాలి. ఆత్మరక్షణకు, శత్రు శిక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. సమబుద్ధితో లోక వ్యవహారాలు విచారించాలి.

ప్రపంచం మొత్తం వార్తమీదే ఆధారపడింది. అది లేకుంటే ప్రజలంతా పెనుచీకట్లో మునిగినట్లే. అందువల్ల ప్రభువు వార్తను బాగా నడపాలి. దీని భావాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు, ఇలా రాశారు: ‘వార్తలను సేకరించడం, ప్రసరించడం ప్రభుత్వ బాధ్యత. అది గొప్ప సామాజిక అవసరం కూడా. వార్తా నిర్వహణ సరిగ్గా లేకుంటే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అవగాహన కుంటుపడుతుంది. సమన్వయం లోపిస్తుంది. అంతా అంధకారంలో వున్నట్లు వుంటుంది. అందువల్ల ప్రభువు వార్తను సమర్థవంతంగా నిర్వహించాలి’.

నాస్తికత, అసత్యమాడడం, ఏమరుపాటుతనం, సోమరితనం, తెలివితక్కువ వారితో కార్యాలోచన చేయడం, అతికోపం, అధిక కాలం దుఃఖపడడం, చేయాల్సిన పనిని గురించి అతి దీర్ఘంగా ఆలోచించడం, ఆలస్యంగా చేయడం, జ్ఞానులను గుర్తించక పోవడం, ప్రయోజనకరమైన విషయాలలో ప్రయోజనభంగకరమైన ఆలోచనలు చేయడం, నిర్ణయించిన పనులు చేయకపోవడం, రహస్యాలోచనలు బయటపడకుండా కాపాడలేకపోవడం, శుభకార్యాలు చేయకపోవడం, ఇంద్రియ సుఖాలలో తగులుకోవడం అనే పద్నాలుగు రాజదోషాలను వదిలిపెట్టాలి.

అలానాడు ధర్మరాజుకు నారద మహర్షి చెప్పిన రాజనీతి విషయాలు చాలావరకు ఇప్పటికీ, ఇన్ని వందల, వేల సంవత్సరాల తరువాత కూడా అన్వయిస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వాస్తవానికి నారదుడు ధర్మరాజును అవన్నీ చేస్తున్నావుకదా అని ప్రశ్నించాడు. ఆ విధంగా నారద మహర్షి అభిషిక్తుడైన ధర్మరాజు తన రాజ్య ప్రజలకు ఎలాంటి పరిపాలన అందివ్వాలో తెలియచేశాడు.               సమాధానంగా ధర్మరాజు, తనకు చేతనైనంతవరకు అన్యాయమార్గాన్ని వదలి, మహాత్ముల చరిత్రలను ఆదర్శంగా వుంచుకుని, నారదుడి లాంటివారి ధర్మబోధవల్ల శుభాలైన వాటిని మనఃపూర్వకంగా ఆచరిస్తానని అన్నాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, సభాపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment