Sunday, February 21, 2021

ఋశ్యశృంగుడి చరిత్రను సవివరంగా దశరథుడికి చెప్పిన సుమంత్రుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-45 : వనం జ్వాలా నరసింహారావు

 ఋశ్యశృంగుడి చరిత్రను సవివరంగా దశరథుడికి చెప్పిన సుమంత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-45

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (22-02-2021)

ఋశ్యశృంగుడి చరిత్రను సవివరంగా చెప్పమని కోరిన దశరథుడితో, సుమంత్రుడు, ఇంతకుముందు చెప్పినదాన్నే మరింత సమగ్రంగా తెలియచేస్తాడీవిధంగా: "ఋశ్యశృంగుడిని తన రాజ్యానికి పిలిపించమని బ్రాహ్మణులిచ్చిన సలహాను అమలుపర్చేందుకు మంత్రుల సహాయం కోరాడు రోమపాదుడు. రాచకార్యాలను చక్కదిద్దే మంత్రులే ఈ కార్యాన్ని కూడా అమలు చేసే విధానం ఆలోచించి, ఋశ్యశృంగుడిని పిలిపించే ప్రయత్నాలు మొదలు పెట్టమని కోరాడు రోమపాదుడు. తన క్షేమాన్నే సదా కోరుకునే తన మంత్రులు-పురోహితులు, వారి బుద్ధి-చమత్కారాలను ఉపయోగించి, వంచన చేయకుండా, ఋశ్యశృంగుడిని, అంగ దేశానికి తీసుకుని రమ్మంటాడు రాజు వారితో. రాజు ఇలా అనగానే భయపడిన మంత్రులు, ఋశ్యశృంగుడి శాపానికి గురి కాకుండా వుండాలంటే, వంచనతో తీసుకుని రావడమే సరైన మార్గమని-లేకపోతే శాపానికి గురౌతామని, ఈ రెండు విధానాలు కాకుండా మరేదైనా ఉపాయం వుంటే చెప్పమని రాజును అడిగారు. పుట్టినప్పటినుండి ఇంతవరకూ స్త్రీలను ఋశ్యశృంగుడు చూడలేదు కనుక, వారెలా వుంటారో ఎరుగడని-అందువల్ల ఆయనను తీసుకునిరాగలిగేది స్త్రీలేనని మంత్రులంటారు. కుల కాంతలకు బదులు వార కాంతలైతే, ఏదో విధంగా వంచనతో వశపర్చుకుని, ఋశ్యశృంగుడిని తీసుకుని రాగలుగుతారని-ఈ పనికి వారినే పంపిద్దామని సలహా ఇస్తారు మంత్రులు. మంత్రుల సలహాను అంగీకరించిన రోమపాదుడు, ముఖ్యమైన వేశ్యలను ఈ పనికి ఎంపికచేసే బాధ్యతను వారికే అప్పగించాడు. రాజు చెప్పిన విధంగానే మంత్రులతో నియమించబడిన సమర్థులైన వార కాంతలు, ఋశ్యశృంగుడుండే వనానికి-ఆయన్ను చూసేందుకు వెళ్లి, వనలక్ష్మి దేవతలలాగా సంచరిస్తుంటారు"

"నగరంలోగాని-పల్లెల్లోగాని అందరికీ కనిపించే ఏ వస్తువునూ పుట్టినప్పటినుండి చూసినవాడు కాదు ఋశ్యశృంగుడు. స్త్రీలెలా వుంటారో అసలే తెలియదు. నియమ నిష్ఠలతో తపస్సు చేయడంలోనో-విరామం దొరికినప్పుడు తండ్రికి సేవలు చేయడంలోనో మాత్రమే సమయాన్ని గడిపేవాడు ఋశ్యశృంగుడు. ఆశ్రమాన్ని విడిచి ఎప్పుడూ-ఎక్కడకూ పోయినవాడు కాదాయన. ఇతిహాసాలు-పురాణాలు చదివి, స్త్రీలు ఎలా వుంటారోనని చదివిన వాడూ కాదు. అలాంటి ఋశ్యశృంగుడి దగ్గరికి వెళ్లాలంటే, అక్కడున్న విభండకుడు శపిస్తాడన్న భయంతో, వార కాంతలు చాలా దూరంలో వుండే, సరైన సమయం కొరకు ఎదురుచూశారు. అదృష్టం కొద్దీ, ఒకనాడు, వారున్న ప్రదేశానికి ఋశ్యశృంగుడు రావడం జరిగింది యాదృచ్చికంగా".

ఋశ్యశృంగుడిని వంచించి తోడుకొని వచ్చిన వేశ్యలు

         "తమ సమీపంలోకి వస్తున్న ఋషి పుత్రుడిని చూసిన వార కాంతలు, తమ సొగసులను సరి చూసుకుని, మనోహరమైన పాటలు పాడుకుంటూ, ఆయనకు చేరువగా పోయారు. దగ్గరకు పోతూనే, ఏమీ ఎరుగనట్లు ఆయనెవరని-పేరేంటని-నరసంచారం లేని అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నాడని, వినయంగా ప్రశ్నిస్తారు. సుందరాంగుల వినయ-విధేయతలకు, విలాసాలకు పొంగిపోయిన ఋశ్యశృంగుడు, తనింతవరకు ఇలాంటివారిని చూడకపోవడంతోను-ఇంత చక్కని మనోహర వాక్యాలను వినకపోవడంతోను, ఏదో వింతగా-కొత్తగా అనిపించి, వార కాంతల మాటలకు కరిగిపోయాడు. పేరు ఋశ్యశృంగుడని-విభండకుడనే ఋషి కౌరస పుత్రుడనని జవాబిచ్చి, ఆ సుందరాంగులను సమీపంలో వున్న తన ఆశ్రమానికి రమ్మని ఆహ్వానిస్తాడు. అలా వచ్చిన వారందరికీ, శాస్త్రోక్తంగా అర్ఘ్య పాద్యాది అతిథి సేవలు చేస్తానని అంటాడు. ఋశ్యశృంగుడి ప్రార్థన మన్నించామన్న రీతిలో, ఆ సాకుతో, ఆశ్రమానికి వెళ్లిన వార కాంతలను సాదరంగా ఆహ్వానించాడు ఋశ్యశృంగుడు. "తమనలా గౌరవించిన ముని కుమారుడితో తమవద్ద వున్న ఫలాలను తినిపించే నెపంతో, అతడి దగ్గరికి చేరి-కౌగలించుకుని-రొమ్ములకద్దుకుని, ముద్దుచేశారాయనను. ఋశ్యశృంగుడూ ఏమీ ఎరగని వాడైనందున, వారకాంతలిచ్చిన రుచికరమైన ఫలాలను-పిండివంటలను సంతోషంతో ఆరగించసాగాడు. ఋశ్యశృంగుడినిలా తమ వలలో వేసుకున్న సుందరాంగులు, విభండకుడు వస్తే తమను శపిస్తాడనే భయంతో, తమ అనుష్టానానికి సమయమైందని-తామింక అక్కడ వుండలేమని, అంటూ వేగంగా వెళ్లిపోయారు. వారలా వెళ్లగానే, వాళ్ల రూపాలనే తలచుకుంటూ, మనస్సు వికలమై పోయినవాడిలాగా, విచారంతో అడవిలో తిరగసాగాడాయన. క్రితం రోజు వారినెక్కడైతే కలిసాడో, అక్కడికే మర్నాడు వెళ్లి కలుస్తాడు ఋశ్యశృంగుడు వారిని.

తమ పాచిక పారినందుకు ఆనందించిన వార కాంతలు, ఋశ్యశృంగుడిని కౌగలించుకుని, శృంగార చేష్టలు చేసి, మనసు మెత్త పరిచి, తమ వెంట వస్తే సర్వ సుఖాలిస్తామని అంటారు. వారి మాటలు నమ్మిన ఋశ్యశృంగుడు తండ్రికి చెప్పకుండా వారివెంట పోతాడు. నిష్ఠాగరిష్ఠుడైన ఋశ్యశృంగుడితో వచ్చిన వేశ్యలు, నగర సమీపానికి వస్తూనే, తమరాక గురించి రోమపాదుడికి తెలియచేస్తారు. రోమపాదుడు వెంటనే బ్రాహ్మణులు తోడురాగా, ఋశ్యశృంగుడిని కలిసి, ఆయన్ను పిలిపించిన విషయాన్ని తెలియచేసి నగరానికి తీసుకునిపోతాడు. ఋశ్యశృంగుడు అలా కాలుపెట్టగానే, ఆయన మహిమను లోకాలకు తెలియచేసే విధంగా, ఆకాశంలో మబ్బులు కమ్మి-ధారాపాతంగా వర్షం కురిసి-చెరువులు, నదులు, కుంటలు నిండి, సముద్రం లాగా కనిపించసాగింది. వర్షాలు కురిసినందుకు సంతోషించిన రోమపాదుడు, తండ్రికి తెలియకుండా తీసుకొచ్చామన్న కోపం ఋశ్యశృంగుడికి రాకుండా వుండేందుకు, గుణవతి-సౌందర్యవతి-సదాచార సంపన్న-అందగత్తె-భర్తను రంజింప చేయగల నేర్పరి, అయిన తన కూతురు శాంతను, ఋశ్యశృంగుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. భార్య శాంతతో-మామగారి ఆదరణతో, రోమపాదుడి ఇంట్లోనే గృహస్థ ధర్మాన్ని అవలంభించి, సద్వృత్తితో కాలం గడుపుతుండేవాడు ఋశ్యశృంగుడు".

(వేశ్యలను స్పృషించినందువల్లా, వారిచ్చిన భక్ష్యాలను తినడం వల్లా, ఋషికి తపోహాని కలిగింది కాబట్టి, అతడు రోమపాదుడి రాజ్యంలో అడుగుపెట్టగానే వర్షాలెలా కురిశాయని సందేహం కలగొచ్చు. ఋశ్యశృంగుడికి స్త్రీలు అన్న జ్ఞానమే లేనప్పుడు, వాళ్ళు వేశ్యలా-కాదా అన్న జ్ఞానం అసలే వుండదు. అప్పుడు ఆయనకు మనసు చాంచల్యం కలిగిందనడానికి కారణంలేదు. రాగయుక్తమైన మనస్సుతో కూడని ఇంద్రియ వ్యాపారం ఫలకారి కాదు. నిర్మల బ్రహ్మచర్యంలో వున్న ఋశ్యశృంగుడు, సకల శాస్త్రాలు చదివాడు కదా, ఏమీ తెలియని అజ్ఞాని ఎలా అయ్యాడన్న సందేహం కలగొచ్చు. బ్రహ్మ వేత్త దేన్నిచూసినా, అది బ్రహ్మమే అనుకుంటాడు. దానికనుగుణంగానే ప్రవర్తిస్తాడు. చేసే పనులన్నీ మంచి బుద్ధితోనే చేస్తాడు. బ్రహ్మ వేత్త సర్వం బ్రహ్మమనే తలుస్తాడు కాబట్టి, అతని ఏ దోషం అంటదు).

 

No comments:

Post a Comment