విభీషణుడి రాజనీతి రావణుడికి నచ్చలేదా?
వనం జ్వాలా నరసింహారావు
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం
(27-03-2021) ప్రసారం
శ్రీరామ, లక్ష్మణ, సుగ్రీవ, హనుమంత, అంగడ, తదితర వానర నాయకులు సేన సముద్రాన్ని దాటే ఉపాయం ఆలోచిస్తున్న
సమయానికి లంకలో రావణుడు, హనుమంతుడు ఒక్కడే
చేసిన అసాధ్యమైన, కార్యాలను తలచుకుంటూ, రాక్షస వీరులను
"హనుమంతుడు అతిశయించిన శక్తితో ఎవరికీ సాధ్యపడని లంకాపురంలో ప్రవేశించి, నన్ను తృణంకంటే
నీచంగా ఎంచి, నా ఇంట్లో
ప్రవేశించి, సీతను చూసి, గోపురాలను విరగతన్ని, నేలకూల్చి, రాక్షసులను చంపి
పట్టణాన్ని భీభత్సంగా కాల్చాడు. అయిందేదో అయింది. దానికి విచారపడి ప్రయోజనం లేదు
కదా! ఇక జరగాల్సిన పని గురించి చెప్పండి. నేనేం చేయాలి? నేనేం చేస్తే నాకు, మీకు మేలు కలుగుతుంది?” అని అడిగాడు.
రావణుడు ఈ విధంగా చెప్పగా, రాక్షసులు,
చేతులు జోడించి ఇలా అన్నారు. “రాక్షసేశ్వరా!
పట్టిసాలు, శక్తులు, ఋష్టులు, పరిఘములు, శూలాలు నిండిన గొప్ప సైన్యం నీకుండగా
నువ్వెందుకు ఇలా విచారిస్తావు? యుద్ధంలో సమస్త దిక్పాలకుల
గర్వం అణచి ఇంద్రలోకానికి పోయి నువ్వు ఇంద్రుడిని జయించలేదా? యమపురిలో ప్రవేశించి, మృత్యుదేవతను కలవర పర్చలేదా?
లోకం దిగ్భ్రమ పొందేట్లు జయించలేదా? రాక్షసేశ్వరా!
నువ్వే ఏ ఆలోచనా చేయనక్కర లేదు. ఏ కార్యమూ చేయాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా
వుండు. వానరులందరినీ ఒక్క ఇంద్రజిత్తే చంపగలడు”.
సభలో వున్న రాక్షసులందరూ చెప్పిన తరువాత
మంత్రులు, ఇతర ప్రముఖులు వారి అభిప్రాయాలను కూడా చెప్పారు. అందులో ముఖ్యుడైన ముఖ్య సేనానాయకుడు ప్రహస్తుడు తనకు ఆజ్ఞ ఇస్తే ఇప్పుడే
పోయి రామలక్ష్మణులను హతం చేస్తానని అంటాడు. తానొక్కడినే ఈ నిమిషంలో పోయి వానర సమూహాలు
ఆకాశానికి ఎగిరిపోయినా సరే, సముద్రంలో దాగినా సరే, పాతాళానికి పోయినా కూడా పట్టుకుని చంపుతాను అంటాడు దుర్ముఖుడు. వజ్రదంష్ట్రుడు అనే వాడు తానొక్కడే ఎవరి సహాయం
లేకుండా లక్ష్మణ సుగ్రీవుడితో సహా రాముడిని ఇప్పుడే చంపుతాను. అది చూసి వానరులందరూ బెదిరి సంతాపంతో పరుగెత్తుతారని అన్నాడు.
కుంభకర్ణుడి కొడుకు నికుంభుడు తన భుజబల
పరాక్రమంతో యుద్ధరంగంలో రాముడిని, లక్ష్మణుడిని, హనుమంతుడిని, సుగ్రీవుడిని చీల్చి పారేస్తాను.
మిగిలిన వానర సైన్యమంతా తునాతునకలుగా చిటికలో ఖండిస్తానని చెప్పాడు. ఇలా వజ్రహనుడు,
యజ్ఞహుడు, నికుంభుడు, రభసుడు, మహాపార్శ్వుడు, రశ్మికేతువు, సూర్యశత్రువు,
సుప్తఘ్నుడు, మహోదరుడు, అగ్నికేతుడు,
ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, అతికాయుడు, విరూపాక్షుడు, ధూమ్రాక్షుడు,
దుర్ముఖుడు, వజ్రదంష్ట్రుడు, ఇలా అందరూ మాట్లాడారు. ఇలా అయుధాలు ధరించి పౌరుషపు మాటలు పలుకుతున్న
వారిని ఆపుచేస్తూ విభీషణుడు అన్నకు నమస్కారం చేసి ఇలా అన్నాడు.
"రాజనీతిలో కార్యం
సాధించడానికి సామ, దాన, భేద అనే మూడు
ఉపాయాలున్నాయి. ఈ మూడు ఉపాయలతో కార్యం సాధించలేకపోతే అప్పుడు దండమనే నాలుగో ఉపాయం
అవలంభించాలని చెప్తున్నారు. మొదటి మూడు ఉపాయాలను ప్రయత్నించకుండా యుద్ధానికి దిగడం
శాస్త్రవిరుద్ధం. రాముడు నివారింపకాని పరాక్రమవంతుడు. అతడిని పరాక్రమంతో జయించడం
ఎలా సాధ్యం? వానరాధిపతైన సుగ్రీవుడు రాముడికి తోడుగా
వున్నాడని విన్నం కదా? చూశాం కదా? వానరసేన
ఎంతో, ఎలాంటిదో మనకు తెలుసు కదా? ఇలాంటప్పుడు
శత్రువులను అలక్ష్యం చేయవచ్చా? రాముడిమీదకు యుద్ధానికి
పోవడానికి కారణం ఏంటి? ఆయన మీకు చేసిన అపకారం ఏంటి? ముందు ఎవరెవరికి అపకారం చేశారు? రాముడు ఖరాదులమీదికి
దండెత్తి వచ్చాడా? ఖరుడు రాముడి మీదికి దండెత్తి పోయాడా?
ఖరుడే కదా పోయింది. తన ప్రాణానికి అపాయం కలిగినప్పుడు వారి
శక్తికొద్దీ తమ్ము తాము రక్షించుకొనడం సహజమే కదా? అలాగే
తన్ను తాను రాముడు రక్షించుకొంటే తప్పేంటి? రావణుడే కదా
ముందు పోయి ఎక్కడో అడవిలో వున్న రాముడి భార్యను అపహరించి తెచ్చాడు. ఇందులో అన్యాయం
ఎవరిది? కలహానికి కాలు దువ్వినవారెవ్వరు? సీతాదేవి ఇక్కడ లేకుంటే హనుమంతుడు ఇక్కడికి వచ్చేవాడా? అంతపని చేసేవాడా? ఇదెందుకు మీరు ఆలోచించరు?”.
"అన్నా!
రామచంద్రమూర్తి సామాన్యమైన బలం కలవాడు కాదు. సారవంతమైన మహా బలం కలవాడు. దేహబలానికి
తోడు ధర్మపు నడవడిలో ఆసక్తికలవాడు. ధర్మం వున్న చోటే విజయం వుంటుంది. కాబట్టి
ధర్మబలం, దాని వెంట దైవబలం కలవాడు అయిన రామచంద్రుడితో నువ్వు
అకారణంగా కలహానికి దిగడం సరైంది కానేకాదు. కాబట్టి సీతాదేవిని రాముడికి అర్పించు.
లంక శత్రువుల బారిన పడకముందే సీతాదేవిని రాముడికి అప్పచెప్పు. వానరసేన లంకకోటలు
లగ్గలు పట్టకముందే సీతాదేవిని శ్రీరాముడికి అర్పించడం గౌరవకరం. నువ్వు సీతాదేవిని
రాముడికి తిరిగి ఇవ్వకపోతే రాక్షసులతో సహా లంకానగరం నాశనమై పోతుంది. అన్నా! నీకు
మేలు కలుగుతుంది. మంచిమాటలే చెప్పాను కాని, దానికి
విరుద్ధంగా నేనేం చెప్పలేదు. సీతాదేవిని రామచంద్రుడి దగ్గరకు పంపించు".
విభీషణుడి మాటలు రావణుడికి కోపం
తెప్పించాయి. ఆ మాటలు విన్న రావణాసురుడు సభ చాలించి, అందరినీ పంపించి,
తన ఇంటికి పోయాడు. అతడి వెంటే, రావణుడి ఇంటికి
పోయిన విభీషణుడు తన మాటలుగా ఇలా చెప్పాడు. "అన్నా! ఏనాడైతే సీత ఈ వూరికి
దాపురించినదో ఆ దినం మొదలు లెక్కలేని అపశకునాలు లంకాపురంలో కనపడుతున్నాయి. ఈ
అపశకునాలకు కారణం సీత ఇక్కడ వుండడమే. సీతను శ్రీరాముడికి అర్పించు. అన్నా!
సీతాదేవిని ఇవ్వడం న్యాయమా? అన్యాయమా? ఇస్తే కలిగే ఫలం
ఏమిటి? ఇవ్వకపోతే కలిగే
నష్టం ఏమిటి? రాబోయేది అంతా
ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్లు చేయి. ఆలోచించకుండా తొందరపడి ఏదీ చేయొద్దు".
అని చెప్పాడు. తన తమ్ముడు చెప్పిన వాక్యాలు చెవిలో పడగానే రావణుడు కోపగించి
విభీషణుడిని విడిచి లోపలికి పోయాడు. అందరి ఎదుట అతడిని ఏమీ అనలేక తానే
వెళ్లిపోయాడు.
హితులైన వారు తనను అనాదరం చేసిన కారణాన, తానుగా చేసిన
సీతాహరణం పాప కార్యమైనందున, సీతమీద కల కామాతిశయం
వల్ల బుద్ధి నాశనం కావడాన, రావణాసురుడు
తేజోహీనుడై శుష్కించసాగాడు. ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తున్నది. ఇది అందరితో
కలిసి చేయాల్సిన పని. ఇప్పుడేం చేయాలి? అని మంత్రులతో, హితులతో
ఆలోచించడానికి, తాను చేసినది అందరికీ సమ్మతమే అని నిరూపించడానికి రావణుడు
సభకు పోయి తన వారందరినీ పిలిపించాడు. వారంతా, వున్నట్లుండి
తమను పిలిపించడం వల్ల ఏమి అపాయం వచ్చిందో అని రావణుడి క్షేమం విచారించడానికి
వచ్చారు. విభీషణుడు, శుకుడు, ప్రహస్తుడు కూడా
వచ్చారు. ఆ రాక్షసులలో ఒక్కడైనా గట్టిగా మాట్లాడినవాడు లేడు. అక్రమంగా వాదించేవాడు
లేడు.
అప్పుడు రావణుడు సేనానాయకుడైన
ప్రహస్తుడితో "సేనాపతీ! నువ్వు త్వరగా పోయి, నాలుగు రకాలైన యోధులను, వీరులైనవారిని, ఇదివరకంటే ఎక్కువగా
కాపలా పెట్టు" అని చెప్పగా అతడు రాజాజ్ఞ ప్రకారం పట్టణం లోపల, వెలుపల, అన్ని ప్రదేశాలలో
పట్టణం రక్షించడానికి వేర్వేరు రాక్షసులను వేర్వేరు స్థలాలలో వుండడానికి
నియమించాడు. "రాక్షసేశ్వరా! అన్ని
సేనలను అన్ని స్థలాలలో నిలిపాను. భయం లేదు. సందేహం లేకుండా మీ పని మీరు
చేయవచ్చు" అని ప్రహస్తుడు చెప్పాడు. రావణుడప్పుడు తాను చేయదల్చుకున్న కార్యం
గురించి చెప్పసాగాడిలా.
"రాక్షసులారా! ధర్మం, అర్థం, కామం....వీటిలో ఏది
చేయతగింది అని ఆలోచిస్తే ఏది చేసిన కీడు, మేలు, సౌఖ్యం, దుఃఖం, ప్రియం, అప్రియం కలుగునో అని విచారించి
మంచి-చెడు నిశ్చయించండి. మీ ఆలోచన ప్రకారమే పోవాలని అడుగుతున్నాను. ఇప్పుడు నేను
మీకు చెప్పబోయేదంతా ముందే చెప్పాలని నా మనసులో వుండేది. కాని కుంభకర్ణుడు నిద్రపోతున్నందువల్ల
చెప్పలేదు. ఆరు నెలలు నిద్రపోయి ఇప్పుడే మేల్కొన్నాడు కదా! కాబట్టి ఇప్పుడు
చెప్పుదామనుకున్నాను”.
రావణుడు రాక్షసులతో ఇలా చెప్పసాగాడు.
"రాముడి భార్య సీతను, దండకారణ్యంలో వుండగా
తెచ్చాను. ఎందుకు తెచ్చానంటారా....ముల్లోకాలలో వెతికినా అలాంటి అందగత్తె ఇంకొకరు
లేరు. ఆమెను నా భార్యగా చేసుకోవాలని భావించి తెచ్చానుకాని ఆమె ఇంతవరకు నా పానుపు
ఎక్కడానికి అంగీకరించలేదు. సీత నాకు లభించకపోతే నేను మదనతాపంతో చావడం తధ్యం.
కాబట్టి నేను బతికుండాలని అనుకుంటే నాకు తగిన ఉపాయం చెప్పండి. ఆ రాజకుమారులు
సీతాదేవి ఇక్కడ వున్న విషయం తెలుసుకుని సుగ్రీవుడి సారధ్యంలో వానరసేనతో సముద్ర
తీరానికి వచ్చి వున్నారు. మీరు నాకు చెప్పాల్సిన ఆలోచన ఏంటంటే, సీతాదేవిని తిరిగి
ఇవ్వడానికి వీల్లేదు...రాముడిని చంపాలి...దానికి తగ్గ ఉపాయం కావాలి”.
రావణుడి ఏడుపు విని కోపంతో కుంభకర్ణుడు
వాడితో ఇలా అన్నాడు. "రామలక్ష్మణులు ఇద్దరూ రక్షిస్తున్న సీతాదేవిని నువ్వు
ఎవరిని అడిగి ఎత్తుకొచ్చావు?
ఆలోచించిన తరువాతే ఏ పనైనా చేయాలికదా? పనైన తరువాత ఆలోచన చేస్తారా ఎవరైనా? కార్యం నువ్వు
చేయకముందు మా ఆలోచన అడిగితే నీకీ మనక్షోభ లేకుండా ఉపాయం చెప్పేవాళ్లం. అలా చేసి
వున్నట్లయితే మంచి జరిగేది. కార్యం చేసి, ఇప్పుడు ప్రాణం మీదకు వచ్చిన తరువాత
విచారపడితే లాభం ఏమిటి? నువ్వు దోషయుక్తమైన
పనిని, అపాయంతో కూడిన పనిని, చేశావు. నిన్ను
రాముడు అక్కడే చంపకుండా విడవడం అంటే నువ్వు నిజంగా అదృష్టవంతుడివే! నీతోడబుట్టిన
కారణాన నాకు ఇప్పుడు నీతో నిల్వక తప్పుతుందా? తప్పదు. రాముడి నెత్తురు నేను పూర్ణంగా
తాగుతాను. ఆ తరువాత నువ్వు సుఖపడు. రామలక్ష్మణులను చంపి వానరులందరినీ భక్షించి, తేల్పులు తీస్తూ, నీకు విజయం, సౌఖ్యం
కలిగిస్తాను".
రావణుడు
చేసిన పని మంచిదికాదని కుంభకర్ణుడు చెప్పడం వల్ల అతడికి కోపం వచ్చిందని గ్రహించిన
మహాపార్శ్వుడనే వాడు రావణుడితో “నీకోరికను యుద్ధం ద్వారానే తీర్చుకో. పగవారు
ఇక్కడికి వస్తే మేమే వాళ్లందరినీ చంపుతాం. సందేహం లేదు. నీ అంతట నువ్వు నీ కోరిక
ప్రకారమే నడుచుకో” అన్నాడు. రావణుడు చెప్పిన మాటలను,
కుంభకర్ణుడి వదరు మాటలను, వినీ-వినీ,
హితంగా, స్వప్రయోజనంగా విభీషణుడిలా అన్నాడు.
“వానరులు రాకముందే సీతను రాముడికివ్వు.
వానరులకంటే ముందే వాయువేగంతో, పిడుగుల గుంపుతో సమానమైన రామబాణాలు వచ్చి,
రాక్షసుల తలలు నేలపడవేస్తాయి. అవి రాకముందే సీతను రాముడికివ్వు.
అప్పుడు నీవల్ల రాక్షసులకు చేటు తప్పుతుంది” అంటాడు. విభీషణుడు పిరికివాడని
ఇంద్రజిత్తు నిందించాడు. ఇంద్రజిత్తు పిల్లవాడని, అతడి
బుద్ధి ఇంకా పరిపక్వం కాలేదని, మంత్రాలోచనలో యథార్థం
తెలుసుకునే శక్తి లేదని తేల్చేశాడు విభీషణుడు. హితం ఉపదేశించే విభీషణుడి ముఖం చూసి
(మృత్యుప్రేరితుడైన) రావణుడు కఠినమైన మాటలతో నిందించాడు మరోమారు. తమ్ముడివని
చంపకుండా వదులుతున్నాననీ, “పాపాత్ముడా! కులద్రోహీ! ఛీ...పో.
నా ఎదురుగా నువ్వు వుండవద్దు” అనీ అన్నాడు రావణుడు.
ఇలా కఠినంగా మాట్లాడిన అన్నమీద కోపంతో, ఇక ఈ
పాపాత్ముడి నేలమీద అడుగు పెట్టకూడదని, రావణుడి పంచప్రాణాలు పోతున్నాయా
అన్నట్లు ఆకాశానికి ఎగిరి విభీషణుడు ఆయనకు హితం బోధించాడు మళ్లీ. సీతను దొంగిలించి తెచ్చి అధర్మ కార్యం చేశావని
చెప్పాడు. “నన్ను వెళ్లిపోమ్మన్నావు. అలాగే పోతాను. నన్ను విడిచి రాక్షసులను, లంకను, నిన్ను చక్కగా నిర్విచారంగా కాపాడుకో. నీకు
మేలు కలుగుగాక!” అని వెళ్ళిపోయాడు. రావణాసురుడు చేసిన తెలివితక్కువ పని
విభీషణుడుని విడవడమే. రావణుడు విభీషణుడి రాజనీతి విన్నట్లయితే శత్రుపక్షంలో చేరి
వుండేవాడు కాదు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారంగా)