Saturday, March 13, 2021

హనుమ నీతులు రావణుడికి రుచించలేదా? : వనం జ్వాలా నరసింహారావు

 హనుమ నీతులు రావణుడికి రుచించలేదా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (13-03-2021) ప్రసారం  

హనుమ, ఇంద్రజిత్తు మధ్య జరిగిన భీకర యుద్ధంలో, ఇంద్రజిత్తు హనుమంతుడిని "బ్రహ్మాస్త్రం"తో బంధించిన తర్వాత, రాక్షసులు, తాళ్లతో, పగ్గాలతో తిరిగి కట్టేయగానే, బ్రహ్మాస్త్ర బంధాలు తెగిపోయాయి. బ్రహ్మాస్త్ర బంధాలు మరో బంధాలతో కలిస్తే, ఆ బంధాలు విడిపొయినట్లే!  ఇంద్రజిత్తు ఆలోచన చేస్తున్నప్పుడే, రాక్షసులు కోతిని తాళ్లతో కట్టి, కట్టెలతో కొట్తూ, పిడికిళ్లతో గుద్దుతూ తీసుకునిపోయి, రావణుడి ముందర నిలబెడ్తారు. "తెచ్చాం కోతిని" అంటారు. వెంటనే ఆ సభలో వున్నవారందరూ: "వీడెవడు? ఎక్కడనుండి వచ్చాడు? ఎవరు పంపారు? ఏం పనుండి వచ్చాడు? ఎందుకిలా చేసాడు?" అని ఒకరితో ఒకరు అనుకుంటుంటే, ఇంకొందరు మదించిన గర్వంతో హేళనగా మాట్లాడసాగారు. "కట్టేయండి, కొట్టండి, కాల్చండి, మింగండి" అనడం మొదలెట్టారు వాళ్లు. ఇవన్నీ వింటూనే హనుమంతుడు, రావణుడి సభా మంటపాన్ని చూసాడు.

అదే సమయంలో హనుమంతుడిని రావణుడు చూసాడు. మంత్రి శ్రేష్టులను, పెద్దలను, వీడెవ్వడో తెలుసుకోమని కోరాడు రావణుడు. కానీ హనుమ మంత్రులకు నేరుగా జవాబు చెప్పడు. రావణుడితోనే మట్లాడుతాడు. రావణుడిని లక్ష్యపెట్టడు, నిర్లక్ష్యంగా చూశాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు ఆయన్ను గురించి "ఏమి రూపం,  ఏమి తేజం, ఏమి బలం, ఏమి ధైర్యం" అని అనుకుంటాడు. రాజులకుండాల్సిన చిహ్నాలన్నీ వున్నాయే ఇతడికి అనుకుంటాడు. ఇట్టివాడు ధర్మ విరుధ్ధమైన పనులే చేసి వుండకపోతే, స్వర్గాన్ని కూడా తన శక్తి, యుక్తులతో పరిపాలించేవాడుకదా! అని భావిస్తాడు. వీడుకోపించి, పరాక్రమించి, లోకాలన్నీ ప్రళయకాలంలోని సముద్రం లాగా చేయదల్చుకుంటే ఆ తేజస్సును అడ్డగించే వారుండరు కదా! అనుకుంటాడు.

ఎదురుగా వున్న ఆంజనేయుడిని, ఎగాదిగా చూసి ఆలోచనలో పడ్డాడు రావణుడు. కైలాసపర్వతాన్ని పెళ్లగించినప్పుడు, తనను శపించిన నందీశ్వరుడే ఈ రూపంలో వచ్చైనా వుండాలి లేదా, తన శత్రు పక్షంలోని బాణుడన్నా కోతిరూపంలో వచ్చి వుండాలని సందేహిస్తాడు. లంకకేపనిమీద వచ్చాడు? వీడిని పంపిందెవ్వరు? ఉద్యానవనాన్ని ఎందుకు పాడుచేసాడు? రాక్షస స్త్రీలనెందుకు బెదిరించాడు? యుధ్ధమెందుకు చేసాడు? ఈ విషయాలన్నీ అడగమని తన ముఖ్యమంత్రి అయిన ప్రహస్తుడిని ఆజ్ఞాపించాడు. వెంటనే అతడు ఆంజనేయుడిని ప్రశ్నిస్తాడు. భయపడవద్దనీ, నిజం చెప్పితే వదిలిపెట్తామనీ, అసత్యం చెప్తే ప్రాణాలతో వదలమనీ అంటూ, హనుమంతుడినెవరు తమ రాక్షసనగరానికి పంపించారని ప్రశ్నిస్తాడు ప్రహస్తుడు. రాక్షసరాజు నగరానికి ప్రవేశించిన కారణం సర్వం విన్నవించమంటాడు ప్రహస్తుడు.

ప్రహస్తుడడిగిన ప్రశ్నలకు తనవృత్తాంతాన్నంతా చెప్తా వినమంటాడు. తానే ఆకారంలో కనిపిస్తున్నాడో, ఆ జాతివాడినేననీ, దుర్లభమైన రాక్షసరాజు దర్శనంకోరి ప్రమదావనాన్ని పాడుచేసాననీ అన్నాడు. యుద్ధం చేయడానికి రాక్షసులొస్తే తన్ను కాపాడుకోవటానికి మాత్రమే వారితో పోరాడానంటాడు.  తనను ఎవరు కూడా అస్త్రాలతో కట్టెయ్యలేరనీ, తానే కావాలని పట్టుబడ్డాననీ చెప్పాడు. "బ్రహ్మ చేత నీవొక్కడివే వరాలు పొందలేదు. నేనుకూడా ఇట్టి వరాలు పొందినవాడినే. రాక్షస రాజును చూడగోరి బ్రహ్మాస్త్రానికి పట్టుబడ్డాను. రాక్షసులు నన్ను తాళ్లతో కట్టినప్పుడే ఆ అస్త్ర బంధాలూడిపోయాయి" అంటాడు. శ్రీరామచంద్రమూర్తి బంటుననీ, రాక్షసరాజుకు కొన్ని క్షేమకరమైన మాటలు చెప్తా వినమనీ హెచ్చరికగా అంటాడు హనుమంతుడు. 

"సుగ్రీవుడి ఆజ్ఞానుసారం నిన్ను చూడటానికి ఈ పట్టణానికి వచ్చాను. నీ తమ్ముడు వానర రాజు, సుగ్రీవుడు నీ కుశలవార్త అడిగాడు. నీకు ఇహపరాలలో సుఖం కలిగించే ధర్మ వాక్యాలను చెప్పి పంపాడు. దానిని నీకు చెప్తా విను. చతురంగ బలాలున్న దశరథుడనే మహారాజున్నాడు. అతడి పెద్దకొడుకు పేరు శ్రీరామచంద్రుడు. తండ్రి ఆజ్ఞప్రకారం ఆయన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు తోడురాగా దండకారణ్యంలోకి వెళ్లాడు. ఆయన భార్య ఒకనాడు అడవిలో కనిపించక పోయేసరికి, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి వెతుక్కుంటూ ఋశ్యమూక పర్వతం వద్దకు వచ్చారు. సుగ్రీవుడు సీతను వెతికిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రాముడు వాలిని చంపి, సుగ్రీవుడికి వానరరాజ్యం ఇస్తానని వాగ్దానం చేసి, ఇచ్చిన మాట ప్రకారమే యుద్ధంలో వాలిని చంపి, సుగ్రీవుడిని రాజును చేసాడు. వాలి ఎవరో, ఎట్టివాడో నీకూ తెలుసు . అలాంటివాడు ఒక్క రామబాణానికి చచ్చాడు. ఆ తర్వాత సీతను వెతికేందుకు వేలాదివేల వానరులను అన్ని దిక్కులకూ పంపాడు సుగ్రీవుడు. వానరవీరులు, సీతాదేవిని అన్నిప్రదేశాల్లో వెతుకుతున్నారు. సుగ్రీవుడి దగ్గర నాలాంటివాళ్లు అనేకమంది వున్నారు. నన్నొక్కడిని జయించడమే నీకింత కష్టమైతే, వారందరూ ఒక్కసారే వస్తే నువ్వేమి చేయగలవో ఆలోచించుకో. నేను వాయుపుత్రుడిని. పేరు హనుమంతుడు. సీతాదేవిని వెతుక్కుంటూ నూరామడల సముద్రాన్ని దాటి ఇక్కడకు వచ్చాను. ఆమెను నీ ఇంట్లో చూసాను. నేను చెప్తున్నదంతా సత్యం”.

"విధానాన్ననుసరించి ధర్మశాస్త్రాలను చక్కగా అధ్యయనం చేసావు. ప్రపంచం మెచ్చేరీతిలో తపస్సు చేసావు. ఇంత గొప్పవాడివి, పరపురుషుల స్త్రీలను బాధపెట్టడం ధర్మమా? రాక్షసవంశాన్ని నీ ఈ అధర్మ కార్యం కూకటివ్రేళ్లతో నాశనం చేసే విపత్తుకు దారితీయదా? నీవంటి బుధ్ధిమంతుడు, ఇలాంటి పనులు చేయవచ్చా? రామచంద్రమూర్తి కోపంగా వదిలే బాణాలకు, లక్ష్మణుడి బాణాలకు, నీవేకాదు దేవదానవులందరు కలిసి ఎదిరించినా నిలువలేరు. శ్రీరామచంద్రమూర్తికి కీడుచేసిన వారెవ్వరైనా, ముల్లోకాల్లో ఎక్కడైనా ప్రాణాలతో వుండడం సాధ్యమేమో నీవే ఆలోచించు. నిన్ను జయించి కారాగృహంలో బంధించిన కార్తవీర్యార్జునిడిని ఓడించి, ఇతర రాజులందరినీ ఇరవై ఒక్క సార్లు చంపిన పరశురాముడిని అరగడియలో బాణప్రయోగం లేకుండానే ఓడించాడాయన".

"ధర్మమైనదీ, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు పనికొచ్చేదీ, సుఖలాభాలతో కూడినదైన సుగ్రీవుడి మాటలు విను. జానకీదేవిని రాముడికివ్వు. ఆమె ఎక్కడుందో చూశాం. వున్న స్థలం తెలిసిపోయింది. మిగిలిన కార్యం రామచంద్రమూర్తే చేస్తాడు. రామచంద్రమూర్తి చూసిరమ్మన్నాడే కాని తీసుకుని రమ్మనలేదు కాబట్టి ఒక్కడినే వెళ్తున్నాను. సీతాదేవిని నేను చూసాను. ఆమె స్త్రీయేకదా అని నువ్వనుకుంటే అదిపొరపాటు. నిన్ను చంపడానికి నీ మెడకు చుట్టుకున్న ఆడ త్రాచుపాము. ఆమె దగ్గరకు పోతే చస్తావు. నిన్ను చంపటానికి ఆమే చాలు. నిన్ను చంపకుండా ఆమెవదలదు కాబట్టి, ఆమెను నువ్వువదులు"

"రావణా! ఎంతో కష్టపడి తపస్సు చేసావు. అది మర్చిపోయి, పాడుచేసే పనులెన్నో చేసావు. నీ తపస్సు వ్యర్ధమై పోతున్నదని మర్చావు. నీ తపఃఫలంతో దేవదానవులెవ్వరూ నిన్ను జయించకుండా వరం పొందావు. ఆ వరాలేవీ నిన్నిప్పుడు రక్షించలేవు. ఎందుకో చెప్తా విను. నువ్వు దేవతలతో, దానవులతో, రాక్షసులతో, గంధర్వులతో, నాగులతో చావకుండా వరం పొందావు. సుగ్రీవుడు అమరుడు కాదు, అసురుడూకాదు, గంధర్వుడుకూడ కాడు, దానవుడూ కానే కాదు, నీవరాలు నిన్నెట్లా రక్షిస్తాయని అనుకుంటున్నావు? చీకటి, వెలుతురు ఒకేసారి రానట్లే, పాప-పుణ్యఫలాలు రెండూ ఒకేసారి అనుభవించలేం. నువ్వు పుణ్యఫలం అనుభవించుతున్నంత వరకూ, పాపఫలం దరికిరాదు. ధర్మఫలం అధర్మఫలాన్ని చెరిపేపేస్తుంది. అధర్మఫలం ఇంకా నీకనుభవంలోకి రాలేదు. నీ తపస్సు నీకు దీర్ఘాయువు ఇవ్వాలి. కాని, నువ్వుచేసిన పరస్త్రీ అపహరణనే పాపపు పనివల్ల త్వరగా చావాలి. ఈ రెండూ ఏకకాలంలో జరుగవు కాబట్టి, నీ చావింతవరకూ ఆగింది. నీ వ్రతఫలంగా దేవదానవుల చేతుల్లో చావులేకుండా వరం కోరావు. నరవానరులను నిషేధించావు. నీ తపఃఫలం వారినుండి నిన్ను కాపాడదు. ఇక నీ పూర్వపుణ్యం పూర్వపాపాన్నే హరిస్తుంది. కాని ఇప్పుడు చేస్తున్న పాపకార్యాలనుండి నిన్ను రక్షించదు. నీవు బలవంతంగా ఎత్తుకొచ్చిన సీతాదేవిని, ఇతర స్త్రీలను ఎవరివారికి వారిని అప్పగిస్తే నీ దోషం పోతుంది. తపఃఫలం పుణ్యమనుభవించినకొద్దీ క్షీణిస్తుంది. శాశ్వతంగా మిగిలిపోదు. నీ తపఃఫలం ఎంతవరకు అనుభవించాలో, అంతా ఇప్పటివరకూ అనుభవిస్తూ వస్తున్నావు. అది పూర్తయింది. ఇకనుండి నీవు చేసిన పాపఫలం నేటినుండే అనుభవిస్తావు”.

“జనస్థానంలో వున్న నీ తమ్ములందరూ చావడంతో మొదలయిందినీ పాపఫలం అనుభవించేరోజు. తర్వాత నీ స్నేహితుడు వాలి చచ్చాడు. అతడి విరోధి సుగ్రీవుడు రాముడికి మిత్రుడయ్యాడు. ఇవన్నీ నీకు అరిష్టసూచనలే! ఇవన్నీ ఆలోచించి, నీకేదిమంచిదని తోస్తే అదే చేయి. నీ అధర్మఫలాన్ని, నేడే, ఇక్కడే, ఇప్పుడే, నిన్ననుభవించేటట్లు, నామాటలను యదార్థం చేయగలను. నేనొక్కడినే లంకానగరాన్నంతా నాశనంచేయగలను. మీలో ఎవ్వరూ నన్ను బాధపెట్టగలిగేవారు లేనేలేరు. మీ శస్త్రాస్త్రాలు నన్నేమీ చేయలేవు. ఇంద్రజిత్తు దగ్గరున్న బ్రహ్మాస్త్రం పనికూడా అయిపోయింది. అదిమళ్లీ ఉపయోగపడదు”.

“జానకీదేవికి ద్రోహం చేసినవాడిని, తానే చంపుతానని ప్రతిజ్ఞ చేసాడు శ్రీరాముడు సుగ్రీవుడి ముందర. అందుకే ఈ విషయంలో నేనేమీ చేయలేకపోతున్నా. నీ వశమందున్న జానకి ఉత్తమస్త్రీ. ఆమె లంకంతా పాడుచేసేందుకు వచ్చిన కాళరాత్రి. ప్రళయకాలంలో కాళరాత్రి ఏ విధంగా లోకాన్నంతా నాశనం చేస్తుందో, అట్లాగే, ఈమె లంకంతా నాశనం చేయబోతున్నది. నీ మెడలో తగులుకున్న యమపాశం ఈమె. నువ్వు బ్రతకాలనుకుంటే, లంకను కాపాడుకోవాలంటే, ఆమెను వదిలి పెట్టడమొక్కటే మార్గం".

హనుమంతుడు మొదలు పెట్టినప్పుడు అనునయంగా చెప్పాడు. రావణుడి ముఖకవళికలను కనిపెట్టి, భయపడే మాటలనడం ప్రారంభించాడు. "సృష్టించేవాడు బ్రహ్మ, సంహరించేవాడు రుద్రుడు" కదా! అయితే ఇవి రామ కార్యాలుగా హనుమంతుడు చెప్పడంలో అతిశయోక్తి లేదు. తగిన కారణం వుంది. అనంతకోటి బ్రహ్మాండానికి "పరబ్రహ్మం" ఒక్కడే! అతనికి సమానుడూ, అధికుడూ, ఎవరూ లేరు. గడ్డిపోచ కదలాలన్నా ఆయనే కారణం. ఆయనే సృష్టికొక అధికారిని, సంహరించటానికొక అధికారిని నియమించాడు. "బ్రహ్మ, రుద్రులు" నిమిత్తమాత్రులు. భగవంతుడైన "విష్ణుమూర్తి", రజోగుణం విశేషంగా వుండే జీవులందు ప్రవేశించి వారితో సృష్టి కార్యాన్ని, తమోగుణం వున్నవారిలో ప్రవేశించి సంహార కార్యాన్ని, సత్వగుణం వున్నవారిలో ప్రవేశించి రక్షించే పనినీ చేస్తాడు. అందుకే సమస్త ప్రయోజకర్త వాస్తవానికి ఆ "భగవంతుడే".

"ఓ రాక్షసరాజా! చిల్లరదేవుళ్ల మాట అటుంచు. నీ మీద ప్రేమతో వరాలిచ్చిన స్వయంభు, చతురాస్యుడైన బ్రహ్మదేవుడైనా, ముక్కంటి త్రిపురాంతకుడు అయిన రుద్రుడైనా, ముప్పైమూడుకోట్ల దేవతలకు అధిపతైన ఇంద్రుడు, మహేంద్రుడైనా, లేక ఈ ముగ్గురూ కలిసొచ్చినా, యుద్ధంలో రాముడి బారినుండి నిన్ను రక్షించలేరు. శరణాగతియే నీకు రక్షణ. ఆయన్నే శరణుకోరు".

ఇలా హనుమంతుడు చెప్పుకుంటూ పోతుంటే సహించ లేకపోయాడు రావణాసురుడు. రావణాసురుడు హనుమంతుడిని చంపమని ఆజ్ఞాపించాడు. విభీషణుడు, రాజాజ్ఞ నీతికి విరోధమనీ, దోషమనీ చెప్పుతాడు. మెత్తటి మాటలతో, రాజుకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. విభీషణుడు చెప్పినదంతా సత్యమేనని ఒప్పుకుంటాడు రావణుడు. కోతికిష్టమైన అవయవం తోకైనందున, దానిని కాల్చి పంపితే వీడికది తగిన శిక్షని తలుస్తాడు. తోకను కాల్చి వూరంతా తిప్పమని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. వెంటనే, రాక్షసులు పాతగుడ్డలు తెచ్చి, చముర్లో తడిపి, తోకకు చుట్టసాగారు. హనుమంతుడు తన దేహాన్ని పెంచసాగాడు. రాక్షసులు తోకకు నిప్పంటించారు. హనుమంతుడు తనతోకతో వాళ్లను కొట్టాడు. హనుమంతుడి తోక కాలుతుంటే, పిల్లలు, పెద్దలు, స్త్రీలు సంతోషించారు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment