ధర్మరాజు రాజసూయాలోచన, జరాసంధుడి వధ, పాండవుల ద్విగ్విజయ యాత్ర
(ఆస్వాదన-9)
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (07-03-2021)
ధర్మరాజును
చూడడానికి వచ్చిన నారదుడు మయసభను చూసి దాని గొప్పదనాన్ని పొగడిన తరువాత, ముల్లోకాలలో మయసభలాంటి సభను ఇంకెక్కడైనా
చూశారా అని నారదుడిని అడిగాడు ధర్మరాజు. నారదుడు తాను చూసిన దేవేంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల దివ్యసభలను గురించి వివరించి,
వాటిని వర్ణించి, అవి ఏవీ ఐశ్వర్య సౌందర్యాలలో మయసభకు
సరితూగవని చెప్పాడు. అలా వాటిని గురించి చెప్పిన తరువాత, హరిశ్చంద్రుడు
దేవేంద్రుడి సభలో వుండడానికి,
ధర్మరాజు తండ్రైన పాండురాజు యమసభలో వుండడానికి కారణం, హరిశ్చంద్రుడు రాజసూయ
మహాయాగం చేయడమేనని, పాండురాజు చేయకపోవడమేనని అన్నాడు. ఇది గ్రహించిన పాండురాజు, నారదుడు మానవలోకానికి వెళ్తున్నప్పుడు, తన
మాటగా ధర్మరాజును రాజసూయ యాగం చేయమని చెప్పమన్నాడు. అలా చేస్తే తనకు ఇంద్రలోక
సుఖప్రాప్తి కలుగుతుందని కూడా అన్నాడు. ఆ విషయాన్నే చెప్పిన నారదుడు ధర్మరాజును
రాజసూయ యాగం చేయమని, చేసి తండ్రిని దేవేంద్ర సభలో
వుండేట్లు చూడమని అన్నాడు.
నారద మహర్షి
పోయిన తరువాత ధర్మరాజు తన తమ్ముళ్ల వైపు చూసి, ధౌమ్య, వ్యాస, మిత్ర, బంధు, మంత్రుల ఎదుట తండ్రి కోర్కె తీర్చడం
సమంజసమని అంటూ వారి సలహా అడిగాడు. ఆలస్యం చేయకుండా రాజసూయ యాగం చెయ్యమని, దానివల్ల
పాపాలన్నీ తొలగిపోతాయని,
రాజులంతా ధర్మారాజు ప్రతాపానికి లొంగిపోతారని, ధౌమ్యాదులు అన్నారు. ఆ విధంగా రాజసూయ యాగం
చేయాల్నా, వద్దా అని డోలాయమానమైన మనస్సుతో వున్న
ధర్మరాజుకు నిశ్చయ బుద్ధి కలిగేట్లు ధౌమ్యాదులు చేశారు. ధర్మరాజు ఆ తరువాత తమ్ముల
సమ్మతి కూడా పొందాడు. రాజసూయ యాగం చేయడానికి పూనుకున్నాడు. యాగాన్ని నిర్విఘ్నంగా
నిర్వహించడానికి శ్రీకృష్ణుడే సమర్థుడు అని అనుకున్నారంతా. ‘మధుసూదనుడైన’ (మధువు
అనే రాక్షసుడిని సంహరించిన వాడు) శ్రీకృష్ణుడిని వెంటనే తీసుకురమ్మని సేవకులను
ద్వారకకు పంపాడు ధర్మజుడు.
ధర్మరాజు పంపిన
సందేశాన్ని అందుకున్న శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ పురానికి చేరుకున్నాడు. యోగక్షేమాల
విచారణ అనంతరం నారద మహాముని ప్రేరణను, రాజసూయ యాగం చేయాలన్న తన ఆలోచనను శ్రీకృష్ణుడికి తెలియచేసి, ఆయన ఆజ్ఞ కోసం వేచి వున్నానని అన్నాడు
ధర్మరాజు. శత్రు సంహారం చేయగల తమ్ముళ్లు వున్న ధర్మరాజే రాజసూయ మహాయాగం
చెయ్యడానికి సమర్థుడని స్పష్టం చేశాడు శ్రీకృష్ణుడు. ఆ తరువాత రాజులందరినీ జయించిన
మగధరాజైన జరాసంధుడి సామర్థ్యం గురించి వివరించాడు. చేది భూపతి శిశుపాలుడికి అతడికి
వున్న సంబంధం గురించి కూడా వివరించాడు. మహాబలవంతులైన హంస డిభకులు అనే సోదరులు
జరాసంధుడికి అండగా వున్న విషయం,
వారిద్దరినీ ఉపాయంగా చనిపోయేట్లు తాను చేసిన విషయం కూడా చెప్పాడు. జరాసంధుడిని
సంహరిస్తే ధర్మరాజు సామ్రాజ్య వైభవం స్థిరపడుతుంది అని, రాజసూయ యాగం చేయడం
సాధ్యమౌతుంది అని అన్నాడు శ్రీకృష్ణుడు.
జరాసంధుడి జన్మ
వృత్తాంతాన్ని కూడా చెప్పాడు శ్రీకృష్ణుడు. కొడుకుల్లేని మగధరాజు బృహద్రథుడిని
చండకౌశిక మహర్షి అనుగ్రహించాడు. కొడుకు పుట్టడానికి ఆయన ఇచ్చిన మామిడి పండును తన
కవల భార్యలకు ఇచ్చాడు బృహద్రథుడు. వారికి సగం-సగం శరీరంతో సగభాగం ముక్కలు
జన్మించాయి. వాటిని మాంసపు ముద్దలుగా భావించి బయట నాలుగు తోవలు కలిసే చోట
పారేయించారు ఆయన భార్యలు. ‘జర’ అనే రాక్షసి ఆ రెంటినీ కలిపగా అవి అతుక్కుని
బాలుడిగా రూపొందాయి. బృహద్రథుడికి ఆయన భార్యలకు పుట్టిన కొడుకుగా చెప్పి బాలుడిని
ఇచ్చింది జర. అతడిని కలిపింది ‘జర’
కాబట్టి అతడికి ‘జరాసంధుడు’
అని పేరు పెట్టారు. అతడు మహా బలవంతుడయ్యాడు. అతడిని రాజుగా చేసి బృహద్రథుడు
అడవులకు తపస్సు చేయడానికి పోయాడు.
జరాసంధుడిని
వధించడానికి, ధర్మరాజు అనుమతితో, భీమార్జునుల సహితంగా శ్రీకృష్ణుడు మధురకు
బయల్దేరాడు. ముగ్గురూ కపట స్నాతకవ్రతాన్ని స్వీకరించారు. నిరంతర ప్రయాణాలు చేసి
మగధ దేశంలో ప్రవేశించారు. గోరథం అనే పర్వతం ఎక్కారు. గిరివ్రజం అనే పురాన్ని
చూశారు. శ్రీకృష్ణుడు నగర ద్వారం నుండి గిరివ్రజపురాన్ని ప్రవేశించడానికి ఇష్టపడక, చైత్యకమనే కొండమీదికి ఎక్కాడు. అక్కడున్న
శత్రు సంకేతాలైన మూడు భేరులను పగులగొట్టారు. ద్వారంకాని మార్గంలో పురప్రవేశం
చేశారు. దారిలో పూలు, గంధం తీసుకొన్నారు. సిగల్లో పువ్వులు
అలంకరించుకున్నారు. చేతులకు గంధం పూసుకున్నారు. జరాసంధుడి మందిరంలోని గోశాలలో
ప్రవేశించారు. వీరిని చూసి జరాసంధుడు వారిని స్నాతకవ్రతులుగా (బ్రాహ్మణులు) భావించి, ఆహ్వానించడానికి ఎదురుగా వెళ్లాడు. వారితో
సంభాషణ అనంతరం, వారు బ్రాహ్మణులు కారని గుర్తించాడు. తాము
క్షత్రియజాతిస్నాతకులం అన్నారు వారు. జరాసంధుడు ఇచ్చిన అర్ఘ్యాన్ని అంగీకరీంచం అని
అన్నాడు శ్రీకృష్ణుడు.
క్షత్రియ
వంశాలన్నిటినీ ఉద్ధరించేవాడైన ధర్మరాజు ఆజ్ఞానుసారం క్షత్రియ కులాన్ని
రక్షించడానికి, అపజయం ఎరుగని శత్రువులను అంతం
చేయడానికి, దుర్మార్గులను దూషించడానికి వచ్చాం
అన్నాడు శ్రీకృష్ణుడు. భూమ్మీద వున్న ఉత్తమ క్షత్రియ రాజులను చెరబట్టి బలి ఇస్తూ,
అకారణంగా సాధుజనులను హింసిస్తున్న జరాసంధుడితో తమకు వైరం అన్నాడు. అందుకే ఆయన్ను
దండించడానికి వచ్చాం అన్నాడు. వెంటనే చెరలో వున్న రాజులందరినీ విడిచిపెట్టకపోతే తన
పక్కన వున్న భీమార్జునులు జరాసంధుడిని సంహరిస్తారని, రాజులందరినీ విడిపిస్తారని
అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలకు జరాసంధుడు అమితమైన కోపంతో తాను చేసింది ఉత్తమ
క్షత్రియ ధర్మం అన్నాడు. రాజులను వదిలిపెట్టనన్నాడు. తనతో యుద్ధం చేయమన్నాడు వారిని.
తమ ముగ్గురిలో యుద్ధానికి ఒక్కడిని కోరుకొమ్మన్నాడు శ్రీకృష్ణుడు. యుద్ధంలో తనకు
సరైన జోడు భీముడే అన్నాడు జరాసంధుడు.
భీమ జరాసంధుల
మధ్య భయంకరమైన మల్ల యుద్ధం జరిగింది. కార్తీక శుద్ధ పాడ్యమినాడు యుద్ధం మొదలైంది.
ఒకరినొకరు అవలీలగా ఎదుర్కున్నారు. యుద్దోత్సాహంతో పోరాటం సాగించారు. 14వ రోజున
జరాసంధుడి అలసటను గుర్తించాడు శ్రీకృష్ణుడు. భీముడిని ప్రోత్సహించాడు, రెచ్చగొట్టాడు. శ్రీకృష్ణుడు కర్తవ్య బోధ
చేయగానే తండ్రి వాయుదేవుడిని మనస్సులో ధ్యానించి, జరాసంధుడిని వంద సార్లు విసిరేశాడు.
జరాసంధుడిని సంహరించాడు భీముడు.
శ్రీకృష్ణుడు
జరాసంధుడు బంధించిన రాజులందరినీ విడిపించాడు. జరాసంధుడి కొడుకు సహదేవుడిని మగధ
రాజ్యానికి రాజును చేశాడు. జరాసంధుడి దివ్యరథం మీద, గరుత్మంతుడి సారథ్యంలో, మనోవేగ
వాయువేగాలతో శ్రీకృష్ణభీమార్జునులు ఇంద్రప్రస్థపురం ప్రవేశించారు. ఆ తరువాత
శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని దివ్యరథాన్ని ఎక్కి ద్వారకానగరానికి
వెళ్లాడు.
ధర్మరాజు తన
నలుగురు తమ్ములైన భీమార్జున నకుల సహదేవులను వరుసగా తూర్పు, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం దిక్కులను జయించడానికి పంపాడు.
అర్జునుడు ఉత్తర దిగ్విజయం చేశాడు. అర్జునుడి ఆజ్ఞకు లొంగి ఉత్తర కురుభూముల
రాజులంతా ధర్మరాజుకు కప్పాలు తెచ్చి ధన్యులయ్యారు. భీమసేనుడు పూర్వ దిగ్విజయం
చేశాడు. చేదిరాజైన శిశుపాలుడుతో సహా తూర్పు దిక్కున వున్న రాజులంతా కప్పం తెచ్చారు
ధర్మరాజుకు. సహదేవుడు దక్షిణ దిగ్విజయం, నకులుడు పశ్చిమ దిగ్విజయం చేశారు. ఆ దిక్కుల రాజులు సహితం కప్పం
కట్టారు. ఈ విధంగా భీమార్జున నకుల సహదేవులు విజయం సాధించారు.
ఈ విజయాల తరువాత
రాజసూయం చేయమని ఆయన ఆప్త మంత్రులంతా చెప్పారు. రాజసూయ మహాయాగం చేయడానికి తగిన సమయం
ఆసన్నమైందని అన్నారు వారంతా. శ్రీకృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తూ రాజసూయాలోచనలో
నిమగ్నమయ్యాడు ధర్మరాజు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, సభాపర్వం, ప్రథమాశ్వాసం
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment