సీతమ్మ ఆజ్ఞాపిస్తే అగ్ని చల్లబడ్డాడా?
వనం జ్వాలా
నరసింహారావు
ఆకాశవాణి
హైదరాబాద్ కేంద్రం ఆదివారం (14-03-2021) ప్రసారం
రావణాసురుడి
అజ్ఞానుసారం, రాక్షసులు హనుమంతుడి తోకకు నిప్పంటిస్తుంటే, ఆయన తన తోకతో వాళ్లను
కొట్టాడు. తన తోక కాలుతుంటే, హనుమంతుడు
పరిపరివిధాలుగా ఆలోచించసాగాడు. "తాను ఏమి చేయాలిప్పుడు? తాను విడిపించుకోదల్చుకుంటే వీళ్లు
తనకడ్డమా? త్రాళ్లు
తెంచుకుని వీళ్ళందరినీ చంపాల్నా?
ఇదికోపగించుకునే
సమయం కాదు. ఏదిమేలో అదే ఆలోచించాలి. వీళ్లనెందుకు కొట్టాలి? రావణుడి ఆజ్ఞ ప్రకారమే వీళ్లు తనను
బాధిస్తున్నారే తప్ప, వాళ్ల
తప్పేమీలేదే! వాళ్లు తనకోవిధంగా మేలే చేస్తున్నారు. రాత్రివేళ మొత్తం లంకను చూడడం
సాధ్యపడలేదు. వీళ్లిప్పుడు తిప్పితే చూడొచ్చు. వీళ్లు రెక్కలు విరిచి కట్టితే
కట్టుకోనిద్దాం. నా దేహాన్ని కాల్చినా కాల్చవచ్చు. అటూ-ఇటూ ఈడిస్తే ఈడ్వవచ్చు.
వీళ్లు చేసేపనిని వడ్డీతో సహా తీరుస్తా" అనుకుంటాడు.
ఇలా హనుమంతుడు
ఆలోచిస్తున్నప్పుడే, అతడిని
వాడావాడా తిప్పారు రాక్షసులు. విజృంభించి శంఖాలు పూరిస్తూ,
చప్పట్లు కొడుతూ, తిట్టుకుంటూ,
కొట్టుకుంటూ, వూరంతా
తిప్పారు. రాక్షసులు తిప్పుతుంటే,
హనుమంతుడు
కష్టపడకుండానే, సందు-సందు,
గొంది-గొంది, వాడ-వాడ, వీధి-వీధి, రహస్య ప్రదేశాలు, ఇళ్ళకున్న దొడ్డి దోవలు, చిన్న-చిన్న ఇళ్లు, పెద్ద-పెద్ద మేడలు తిరిగి
చూశాడు. కొందరు రాక్షసస్త్రీలు పరిగెత్తుకుంటూ సీతాదేవి దగ్గరకు వెళ్లి ఆమెతో గుసగుసలాడిన
కోతిని, రాక్షసులు
పట్టుకుని, తోక కాల్చి
వూళ్లో తిప్పుతున్నారని ఆమెకు చెప్పారు. హనుమంతుడి మేలుకోరుకునే పతివ్రత సీతాదేవి, రాక్షసులను ఆయన చంపిన సంగతి గురించి
విని సంతోషించింది. ఆంజనేయుడి మేలుకోరి అగ్నిహోత్రుడిని ప్రార్ధిస్తుందిలా:
"నేను పతిసేవచేసే
స్త్రీనైతే, నిష్టతో తపస్సు చేసిన దాననైతే, నేను నిజమైన
పతివ్రతనే అయితే, ఓ
అగ్నిదేవుడా! నీవు హనుమంతుడిపట్ల చల్లబడాలి. సూర్యవంశ రాజుల్లో శ్రేష్టుడైన
శ్రీరామచంద్రమూర్తికి నామీద దయవుంటే, నాకింకా
కొంచెం భాగ్యం మిగిలే వుండి వుంటే, హనుమంతుడికి
చల్లగా అయిపో! మనసున్న రామచంద్రమూర్తితో సాంగత్యం నేనెప్పుడూ కోరేదాన్నైతే, మంచి
నడవడిగల దాన్నని హనుమంతుడు నన్ను నమ్మితే, ఆయనకు
శీతలుడవైపో. సుగ్రీవుడు త్వరగా ఇక్కడకు రావడం, నన్నీ శోకసముద్రం నుండి
దాటించడం నిజమైతే, హనుమంతుడికి
బాధలేకుండా చల్లగా అయిపో".
ఇదొక అగ్ని
పరీక్ష. సీతమ్మకేకాదు, రాముడికి కూడా! నేనే పతివ్రతనైతే, నాకు తపశ్శక్తి
వుంటే, అదృష్టవంతురాలిని అయితే, తార
వుత్తమరాలైతే, సుగ్రీవుడు సత్యవంతుడైతే, ఇవన్నీ నిజమైతే, అగ్ని తన సహజ స్వభావాన్ని ఉపసంహరించుకోవాలి. అంతేకాదు, చల్లబడిపోవాలి. అందరిపట్ల, అన్ని
విషయాలలో కాదు. కేవలం హనుమంతుడిపట్ల మాత్రమే చల్లబడమంది ఆ తల్లి. అంటే,
చక్కగా చల్లబడ్డాడు. ఆమె అన్న మాటలన్నీ సత్యమని నిరూపించేసాడు అగ్నిదేవుడు.
రామాయణంలో ఇదొక అత్యంత ఆశ్చర్యకరమైన సన్నివేశం. మరొక రహస్యం కూడా వుందిక్కడ.
శీతోభవ అని సీతమ్మ ఆజ్ఞాపిస్తే అగ్ని విధేయుడై చల్లబడ్డాడు హనుమంతుడి విషయంలో. మరి
సీతమ్మ దగ్ధోభవ దశానన అని అగ్నిని ఆజ్ఞాపిస్తే రావణుడు బూడిద అయ్యేవాడు కద!
అందువల్లనే ఆ తల్లి అన్నది, నాకు శ్రీరాముడి ఆజ్ఞ లేదు కనుక
అలా శపించడం లేదని. రావణుడికి గుండె పగిలేంత దిగులు పట్టుకుంది దీనివల్ల.
అంతేకాదు. ముందు కాలంలో సీతమ్మ అగ్నిప్రవేశం చేయవలసిన సమయంలో అగ్ని సీతమ్మను
దహించజాలడన్న విషయం కూడా రుజువయింది.
హనుమంతుడి
విషయంలో అగ్నిహోత్రుడు చల్లబడితే,
ఆమె
చెప్పినవన్నీ సత్యమేనన్న భావం పైమాటల్లో కలుగుతుంది. రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రం
సంధించి, నిన్ను
రూపుమాపుతానని సముద్రుడిని బెదిరించినా, తనస్వభావాన్ని
విడువలేనని చెప్పగలిగాడు ఆ వేళ సముద్రుడు. కాని, హనుమంతుడికి చల్లదనం కలిగించమని సీతాదేవి మాట
మాత్రంగా అడిగితే, అగ్ని
చల్లబడింది. ఎంతటి మహాత్ములైన పురుషులకు కూడా సాధ్య పడనిది, పతివ్రతలైన స్త్రీలకు సాధ్య పడుతుందని
దీనివలన తెలుస్తున్నది. సీత అగ్నిహోత్రుడిని ప్రార్థించిందేకాని, తనతపోబలంతో నువ్విట్లా కమ్మని శాసించలేదు.
స్త్రీలకు రక్షాకార్యం స్వధర్మం. బిడ్డలను రక్షించడానికి, భర్తకున్న స్వాతంత్ర్యం భార్యకూ వుంది.
ఇలా
ప్రార్ధిస్తున్న సీతాదేవికి,
హనుమంతుడికి
అపాయం లేదన్న సూచనలు రాసాగాయి. కాలుతున్న తోకనుండి మండే గాలి రాకుండా, మంచులాంటి చల్లటి గాలి వీచింది ఆమెవైపు.
అగ్ని తనను కాల్చకుండా చల్లబడిపోవడం చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు, కారణం తెలియక. అకస్మాత్తుగా అనిలుడు
శీతలుడైనాడేమిటా! అని ఆయనకు ఆశ్చర్యం కలిగింది.
సముద్రం దాటి వచ్చేటప్పుడు, ఎలాగైతే
సముద్రుడు, మైనాకుడు
శ్రీరాముడిపట్ల చూపిన ప్రీతిని,
అగ్నిహోత్రుడు
మాత్రం ఎందుకు చూపడనీ, ఇదంతా రామచంద్రమూర్తి మహిమేననీ, ఆయన పని చేస్తున్న
తనకు ఆయనెందుకు అపాయం కలుగనిస్తాడనీ, భావిస్తాడు.
పతివ్రతైన సీతాదేవి దయవలన, శ్రీరామానుగ్రహం
వల్ల, వాయుదేవుడికి
అగ్నిహోత్రుడు మిత్రుడైనందువల్ల తనపైన ప్రేమతో చల్లబడ్డాడనుకుంటాడు.
తోకమండుతుంటే
హనుమంతుడు ఏంచేయాలన్న ఆలోచనలో పడ్డాడు. లంకలోని పౌరులకు బాధకలిగిస్తే, ఈ బాధ రావణుడి మూలాన్నే జరిగిందని, ప్రజలందరూ వాడిపట్ల విరోధం పెంచుకుంటారు
కనుక, దానిమూలాన్న, వారిలో వారికి పడక, సీతాదేవిని రాముడికప్పగించమని
చెప్పేవారు కొందరుండవచ్చని హనుమంతుడు భావిస్తాడు. అందుకే ఈ రాక్షసులకు కొంచెం బాధ
కలిగించాలని నిశ్చయించుకుంటాడు. "ఈ నగరాన్ని
నాశనం చేస్తే, నేననుకున్న
పనులన్నీ అయినట్లే. నేనుపడ్డ శ్రమకు ఫలితం లభించినట్లే! నాకుపకారం చేస్తున్న, అగ్నిహోత్రుడికి ప్రత్యుపకారంగా
ఇక్కడున్న ఇళ్లన్నీ ఇవ్వడం న్యాయం" అనుకుంటూ ఇళ్లమీద తిరగడం ప్రారంభించాడు.
మెరుపులతో కూడిన మేఘంలా చలించక హనుమంతుడు లంకలోని, ఇల్లిల్లూ,
తోటతోటా, మేడమేడా తిరిగి, సర్వం కాల్చేసే కార్యక్రమంలో మునిగిపోయి, ఆనందించసాగాడు.
తన తరఫున ధర్మ
మార్గంలో రావణుడితో విభీషణుడి ఇల్లు తప్ప మిగిలిన వారి ఇళ్ళన్నీ కాల్చాడు. బలంగా
గాలి వీస్తుంటే, విజృ౦భించిన
హనుమంతుడు, ఇల్లిల్లూ
తగులబెట్టడంలో నిమగ్నమైపోయాడు. లంకా నగరమంతా కాలిబూడిదైపోయి, నేలకూలుతున్న పెద్దపెద్ద మేడలతో
నిండిపోయింది. రాక్షసుల ధ్వనితో ఆకాశం నిండిపోయింది. ఎన్నిళ్లుకాలినా, ఎంత
తగులబడినా, భూమిమీద పీనుగులెన్ని పడ్డా, ఆయనకు తృప్తి కలగలేదు. హనుమంతుడు లంకా
దహనం చేస్తుంటే, ఆ మంటలు
పెరిగి త్రికూట పర్వతం వరకూ వ్యాపించాయి. రాక్షసులు లంకానగరాన్నీ చూసి దుఃఖపడ్తూ
ఎవరీ వానరుడని ఆలోచనలో పడ్డారు. ఇది సామాన్యకోతి అనటానికి వీల్లేదు అనుకుంటారు.
వనాన్నిపాడుచేసి, రాక్షసులను చంపి, మేడలు, మిద్దెలు నేలమట్టం చేసి, ఇంకా మండుతున్న తోకతోనే, సూర్యుడిలాగా వెలుగుతూ, హనుమంతుడు త్రికూటపర్వతాన్ని చేరుకుని, శ్రీరాముడిని చూడటానికి పోదామనుకుంటాడు.
ఈ తతంగమంతా జరిగాక హనుమంతుడు,
మండుతున్న
అగ్నిని, తోకను, సముద్రంలో
ముంచి చల్లారుస్తాడు.
పట్టణమంతా
కాలి వుండడం గమనించి, ఎంత పాడు
పనిచేసాను! అని విచారించసాగాడు. లంకంతా కాల్చివేసి, ఆలోచనలేకుండా
తానెంతో చేయరానిపని చేశానే అని బాధపట్తాడు. ఆలోచనలేక సీతాదేవిని కూడా కాల్చి
స్వామిద్రోహం చేసినవాడినైనాననీ,
బాధపడ్తాడు
హనుమంతుడు. లంకంతా కాలి బూడిదయితే, ఆమంటల్లో సీత కూడా తగులుకుని నశించి వుండాలికనుక, తాను చేసిన పని తానే పాడుచేసాననీ,
తెలివిలేక జానకి వున్నదన్న ఆలోచనలేక క్రూరమైన పనిచేసి రామకార్యం పాడుచేసాననీ, కుమిలిపోతాడు హనుమంతుడు. ఇలా
ఆలోచిస్తున్న హనుమంతుడికి, దేహంలో
శుభశకునాలు కనిపించసాగాయి. కుడికన్ను, కుడిభుజం అదరడం, హృదయం ప్రసన్నం కావడంతో, వేరేవిధంగా ఆలోచిస్తాడిలా:
"సీతాదేవిని
అగ్నిదహించడమా? నా తెలివి
తెల్లారే ఆలోచనకదా ఇది! సీత రాక్షసస్త్రీలాంటిది కాదుకదా! అగ్నిని అగ్ని ఎలా
దహిస్తుంది? నాదేహాన్నే
కాల్చే సమర్ధత లేనివాడు అగ్నిహోత్రుడు. అలాంటిది సీతాదేవిని కాల్చేశక్తి
అగ్నిహోత్రుడికి వుందా? రామచంద్రమూర్తి
దాసుడనైన నేను, ఆయన కార్యంపైన
లంకాదహనం చేస్తుంటే, నా తోక
కొనవెంట్రుకలనైనా కాల్చనివాడు,
అలాంటి
మహానుభావురాలిని తాకగలడా?" సీతా
మహాత్మ్యం గురించి ఆలోచించసాగాడు అదేపనిగా. సరీగ్గా అదేసమయంలో, ఆకాశంలో తిరుగుతున్న ఋషులు,
చారణులు, మునులనుకుంటున్న మాటలు హనుమంతుడి చెవుల్లో అమృతం
పోసినట్లు వినిపించాయి. వారిలా అనుకుంటున్నారు: "ఆశ్చర్యం-ఆశ్చర్యం!
హనుమంతుడివల్ల అగ్నిదేవుడు, తోరణాలతో,
ప్రాకారాలతో, బురుజులతోసహా లంకానగరాన్నంతా దహించి వేసాడు.
మంటల్లో యావత్తూ మసి అయిపోయినా అశోకవనంలో సీత చెక్కు చెదర లేదే! ఎంత ఆశ్చర్యం? ఆమెను అగ్ని సమీపించనేలేదు" అన్న
మాటలను వింటాడు హనుమంతుడు.
శుభశకునాలు
కలగడంతో, సీతాదేవి మహాత్మ్యం ప్రత్యక్షంగా చూసినవాడు కావడంతో, ఋషుల మాటలవల్ల సీతాదేవి క్షేమంగా
వున్నదని తెలుసుకున్న హనుమంతుడు సంతోషిస్తాడు. అయినా ఆ మహాపతివ్రతను మరొక్కసారి
కళ్లారా చూసి, స్వయంగా
దర్శించుకుని, క్షేమసమాచారం
తెలుసుకుందామనుకుంటాడు. ఆ తర్వాత ప్రయాణమైతే, చేయాల్సిన పని నిర్విఘ్నంగా, సంపూర్ణంగా నెరవేర్చినట్లవుతుందని
తలుస్తాడు హనుమంతుడు. ఇలా తలచిన హనుమంతుడు, సీతాదేవి
వుండే ప్రదేశానికి పోయి, శింశుపావృక్షం
కిందున్న ఆమెకు నమస్కరించి, తను చేసిన
పూర్వ పుణ్యఫలంవల్ల, క్షేమంగా
వున్న సీతను మళ్లా దర్శించే భాగ్యం తనకు కలిగిందని చెప్తూ, తన ప్రభుకార్యం ఏదెట్లా చేయాలో, ఎట్లా
జరగాలో అవన్నీ అలానే చేయడం జరిగిందని అంటాడు.
ఇలాచెప్పి
బయల్దేరబోతున్న హనుమంతుడితో, తనభర్తపై తనకున్న ప్రేమను తెలిపే వాక్యాలను
మరోసారి చెప్పింది సీతాదేవి ఆయనతో. సీతచెప్పిన ఆ మాటలకు సరైన రీతిలో స్పందిస్తాడు
ఆంజనేయుడు. రామచంద్రమూర్తి వానర సైన్యంతో సముద్రాన్ని దాటివచ్చి, రాక్షసుల పొగరణచి, ఆమె శోకాన్ని నిర్మూలిస్తాడనీ, తనమాటలు నమ్మమనీ, దిగులుపడవద్దనీ సీతకు ఓదార్పు వచనాలు
చెప్తాడు హనుమంతుడు. సాహసంచేసి,
అపాయం
కలిగే ఎటువంటి పనీ చేయవద్దని సీతకు చెప్పి, తానిప్పుడే
రామచంద్రమూర్తిని చూడబోతున్నానని,
ఆమె
అనుజ్ఞ కోరుతూ ఆమెకు నమస్కరిస్తాడు.
సీత
అనుమతి తీసుకుని, ఆమెకు
అభివాదం చేసి,
ఆశీర్వాదాన్ని పొందిన హనుమంతుడు, రాముడి
దర్శనం త్వరలో చేసుకోవాలన్న కోరికతో అరిష్టమనే పేరున్న కొండనెక్కాడు.
సముద్రపు ఉత్తరగట్టు చేరేందుకు,
ఆ
పర్వతం మీదనుండి సన్నధ్ధుడవుతున్న హనుమంతుడి కాళ్లతొక్కిడికి, అక్కడున్న అడవిజంతువులు తత్తరలాడాయి.
కొండగుహల్లో వున్న సింహాలన్నీ బెదిరిపోయి దిక్కులు పిక్కటిల్లేటట్లు ధ్వని చేసాయి.
హనుమంతుడు సముద్రాన్ని దాటేందుకు,
ఆకాశానికి
లంఘించి ఎగరగానే, అక్కడున్న
విషం జ్వలించే సర్పాలు సందుల్లోకి దొర్లిపోయాయి. కిన్నరులు,
పన్నగులు, యక్షులు, కింపురుషులు ఆ
పర్వతాన్ని వదిలి ఆకాశానికి ఎగిరారు. పదియోజనాల వెడల్పు,
ముఫ్పై యోజనాల ఎత్తున్న ఆ పర్వతం నిమిషంలో నేల మట్టమైంది.
ఆకాశ మార్గంలో
పోతున్న హనుమంతుడు,
సముద్రంలో పోతున్న నావలా వున్నాడు. మబ్బుల్లో దోబూచులాడుకుంటూ
పోతున్నాడు. హనుమంతుడు, మేఘాలమధ్య చుట్టుకున్నప్పుడు
ఆకాశంలోని చంద్రుడిలా, మేఘాలను చీలుస్తున్నప్పుడు ఆకాశంలో
వెళ్తున్న గరుత్మంతుడిలా కనిపించాడు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం
మందరం ఆధారంగా)
No comments:
Post a Comment