Sunday, March 7, 2021

ఋశ్యశృంగుడితో అయోధ్య ప్రవేశించిన దశరథుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-47 : వనం జ్వాలా నరసింహారావు

 ఋశ్యశృంగుడితో అయోధ్య ప్రవేశించిన దశరథుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-47

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (08-03-2021)

అల్లుడితో తమ రాజు దశరథుడు అయోధ్యకొస్తున్నాడని తెలుసుకున్న పుర జనులు, సంతోషంతో, రాజాజ్ఞ ప్రకారం, పట్టణాన్ని చక్కగా అలంకరించారు. నగరంలో ప్రవేశించిన దశరథుడు, అలంకరించిన అయోధ్యను చూసి ఆనందంతో, నగారాల ధ్వనులమధ్య, ఋశ్యశృంగుడిని ముందుంచుకుని-వీధుల గుండా పోయి, మునీంద్రుడిని చూసి ప్రజలంతా సంతోషిస్తుంటే, భార్యలతో కలిసి అంతఃపురానికి చేరుకుంటాడు.

దశరథుడికి మూడొందల ఏభైమంది భార్యలున్నప్పటికీ, వెంట ముగ్గురినే తీసుకెళ్లాడు. అంతఃపురానికి చేరుకున్న దశరథుడు, శాస్త్రోక్తంగా ఋశ్యశృంగుడికి పూజలు చేసి, ఆయనను రాచనగరిలో వుంచి, తానిన్నాళ్లకు కృతార్థుడనైతిననీ-జన్మ సార్థకమైందనీ అనుకుంటూ-దైవాన్ని తల్చుకుంటూ, సంతోష పడ్తాడు దశరథుడు. శాంత తన భర్త ఋశ్యశృంగుడితో కలిసి రావడాన్ని కన్నుల పండుగగా కాంచిన అంతఃపుర కాంతలు చాలా సంతోషిస్తారు. రాజ పత్నులు, రాజు తననింతగా గౌరవించినందుకు ఆనందించిన ఋశ్యశృంగుడు ఋత్విజులతో కలిసి సంతోషంగా వున్నాడు.

అశ్వమేధ యాగం చేసే ప్రయత్నంలో దశరథుడు

తనలో లోపమేదీ లేనప్పటికీ, వానప్రస్థ కుమారుడిని చంపి శాపగ్రస్తుడు కావడమే తనకు సంతాన ప్రాప్తి కలగక పోవడానికి కారణమని-ఆ శాపమే సంతాన ప్రాప్తికి విఘ్నకరంగా, ప్రతిబంధకంగా మారిందని దశరథుడికి గుర్తుకొస్తుంది. తమకు కలిగిన పుత్ర వియోగ దుఃఖమే దశరథుడికి కూడా కలగాలని-పుత్ర వియోగ దుఃఖంతో అతడు కూడా మరణించాలని, ముని శపించాడు. బాల్యంలో జరిగిన ఆ సంఘటనను, చాలాకాలం మరిచిపోతాడు దశరథుడు. జ్ఞప్తికి వచ్చిన వెంటనే, పాప పరిహారార్థం, అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన చేస్తాడు. అనిష్ఠ పరిహారం కొరకు అశ్వమేధ యాగం చేయడంతో పాటు, ఇష్ట ప్రాప్తికొరకు పుత్ర కామేష్ఠి యాగం కూడా చేద్దామనుకుంటాడు. పుత్ర కామేష్ఠికి పూర్వ రంగంగా అశ్వమేధ యాగం చేయాలని దశరథుడి కోరిక. ఋశ్యశృంగుడు అయోధ్య చేరిన కొన్నాళ్లకు చైత్ర మాసం-వసంత ఋతువు ప్రవేశించింది. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు, దిన వార దోషాలు లేనందున, సంతాన ప్రాప్తికి ఉద్దేశించిన అశ్వమేధ యాగం ఆరంభానికి ముందు చేయాల్సిన "సాంగ్రహణి" కర్మను తనతో జరిపించాల్సిందిగా-దానికి ఋత్విజుడిగా వ్యవహరించాల్సిందిగా, ఋశ్యశృంగుడిని ప్రార్తించాడు దశరథుడు.

దశరథుడి కోరికను మన్నించిన ఋశ్యశృంగుడు, క్రతువుకు కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోమని, యజ్ఞాశ్వాన్ని వదలమని చెప్పగా, ఋత్విజులను-పండితులను-బ్రహ్మ వాదులను పిలిపించమని దశరథుడు మంత్రి సుమంత్రుడిని ఆదేశిస్తాడు. రాజాజ్ఞ మేరకు, సుమంత్రుడు, వాసుదేవుడిని-సుయజ్ఞుడిని-జాబాలిని-కాశ్యపుడిని-వశిష్ఠుడిని-బ్రహ్మ విద్యలో అసమానులైన ఇతర బ్రాహ్మణోత్తములను పిల్చుకుని వస్తాడు. వచ్చిన వారందరినీ దశరథుడు సగౌరవంగా స్వాగతించి, సబహుమానంగా సత్కరించి, వారిపట్ల తన భక్తిని చాటుకుంటాడు. తపస్సంపున్నులైన వారందరు, ఎంతో తపో మహిమ గలవారని, అలాంటి మహనీయుల కృప తాను కలిగున్నప్పటికీ దుష్ఠ గ్రహాలు తనకు సంతాన ప్రాప్తి లేకుండా చేశాయని, సంతానం లేని తనకు పుట్టగతులుండని, తనగతేం కానున్నదోనని చింతిస్తున్నానని, తన పరితాపం తీర్చాల్సిన భారం వారిపై మోపుతున్నానని, సంతానం కలిగేందుకు అశ్వమేధ యాగం చేయ తలపెట్టానని, అసమానుడైన ఋశ్యశృంగుడి మహిమతో తన మదిలోని కోరికలన్నీ నెరవేరుతాయన్న నమ్మకం తలకుందని అంటాడు దశరథుడు.

దశరథుడి మాటలు విన్నవారందరూ సంతోషంతో, ఆయన తలపెట్టిన కార్యం మంచిదని అంటారు. వారిలో ముఖ్యులైన వశిష్ఠుడు, ఋశ్యశృంగుడు, రాజు ఆలోచన గొప్పదని-ఫలితం తప్పక లభిస్తుందని-ఆలశ్యం చేయకుండా కార్యక్రమం ఆరంభించమని సలహా ఇస్తారు. కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోమనీ-యజ్ఞాశ్వాన్ని సంచారానికై వదలమనీ-సేవకులందరిని వారివారి పనుల్లో నియమించమని వారంటారు. ధర్మబుద్ధిగల దశరథుడికి నలుగురు కొడుకులు తప్పకుండా పుడతారని-ఆయన నిష్కల్మష సంకల్పం వ్యర్థం కాదని-సందేహం లేదని వారన్నప్పుడు, దశరథుడికి అప్పుడే కుమారులు కలిగినట్లు సంతోషం కలిగి, ఆనంద భాష్పాలు రాలాయి. బ్రాహ్మణులు చెప్పిన పనులన్నీ తక్షణమే చేయాలని, వస్తువులన్నీ సమకూర్చాలని, గురువులు చెప్పినట్లు యజ్ఞాశ్వాన్ని విడవమని, దానికి రక్షణగా పురోహితుడొకడిని పంపమని, సరయూ నదికి ఉత్తర దిశగా యజ్ఞశాల నిర్మించమని, శాంతి కార్యాలన్నీ చక్కగా నిర్వహించమని మంత్రులను ఆదేశిస్తాడు దశరథుడు.

తాను తలపెట్టిన యజ్ఞం సులభ సాధ్యమైంది కాదని, అందుకే రాజులందరు దీన్ని చేయ సాహసించరని, ఏ మాత్రం అపరాధం జరిగినా కష్టాలు తప్పవని, యజ్ఞ క్రమం తెలిసిన బ్రహ్మ రాక్షసులు మంత్ర-తంత్ర-క్రియా లోపాలు జరుగుతాయేమోనని ఎదురు చూస్తుంటారని, ఏ లోపం లేకుండా కనిపెట్టి వుండాలని, సమర్థులైన మంత్రులందరు శ్రద్ధగా పనిచేయమని దశరథుడంటాడు. రాజు తలపెట్టిన కార్యం విఘ్నం కాదని-తమకప్పగించిన పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగేటట్లు చూస్తామని మంత్రులు హామీ ఇచ్చిన తదుపరి బ్రాహ్మణులు శలవు తీసుకుని వెళ్లారప్పటికి.

No comments:

Post a Comment