యజ్ఞ సంభారాలను సిద్ధం చేయిస్తున్న వశిష్ఠుడు
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-48
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (15-03-2021)
మొదటి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు
సాంగ్రహణేష్టిని జరిపించి,
మర్నాడు, శాస్త్రోక్తంగా
బ్రహ్మౌదనం,
మేధ్యాశ్వబంధనం, స్నాపనం, ప్రోక్షణం,
అశ్వ విమోచనం మొదలైన ’చత్వారస్సముక్షంతి’ అనే కార్యాలను
నెరవేర్చి,
ఆ తర్వాత ప్రతిరోజూ శ్రుత్యుక్తంగా సావిత్రాది కర్మాలను
చేస్తుండాలి. ఆవిధంగా మొదటి సంవత్సరం గడచిన తర్వాత, రెండో సంవత్సరం ఆరంభంలో అశ్వం యాగ స్థానానికి బయల్దేరాలి.
అశ్వాన్ని విడిచిన తర్వాత ఒక
సంవత్సరకాలం పూర్తయి,
తిరిగి వసంత రుతువు చైత్ర మాసం రాగానే దశరథుడు వశిష్ఠుడి
దగ్గరకు వచ్చి అశ్వం తిరిగొచ్చిందని తెలియచేస్తాడు. వశిష్ఠుడు చెప్పిన ప్రకారం
తాను యజ్ఞం ప్రారంభిస్తానని, యాగానికి విఘ్నం లేకుండా
ఆయన కాపాడాలనీ విజ్ఞప్తిచేస్తాడు. "మహాత్మా! నువ్వు మాకు గురువువు. అంతకంటే
మించి అసమానమైన స్నేహభావం మామీదున్నవాడివి. వంశపారంపర్యంగా మాతో ఎడతెగని స్నేహమే
ప్రధానమైందని భావించినవాడివి. మా క్షేమాన్నే ఎప్పుడూ కోరే నీవు కేవలం
పౌరోహిత్యాన్నే నిర్వహించడం కాకుండా, ఋత్విజుడి భారాన్ని కూడా
నిర్వహించి,
మీరే యాగ కార్యం సఫలమయ్యేలా చూడాలి" అని దశరథుడు
వశిష్ఠుడిని కోరుతాడు. రాజుకోరినవిధంగానే సర్వం తానే నిర్వహిస్తానని ఆయనకు మాట
ఇచ్చి, యజ్ఞ కార్యాలను పర్యవేక్షిందేకు నియమించిన వృద్ధ బ్రాహ్మణులను, నియమ వంతులైన ధర్మాత్ములను, స్థపతిసంఘాలను, శిల్పవిద్యాప్రవీణులను,
గుంతలు తవ్వేవారిని, ఇతరత్రా పనులు చేసేవారిని, వడ్రంగులను,
చిత్రకారులను పిలిచి, ఎవరెవరికి అప్ప
చెప్పాల్సిన పనులను వారివారికి అప్పగించి, ఇతర ఏర్పాట్లలో
నిమగ్నమయ్యాడు వశిష్ఠుడు.
"యాగ నిర్వహణకు వేలాది ఇటుకలు కావాలి కనుక వాటిని యాగశాల సమీపానికి తేవాలి.
ఉత్తమ బ్రాహ్మణులు,
ఋత్విక్కులు బసచేసేందుకు-వారికవసరమైన భక్ష్యభోజ్యపానీయాలు
నిలవచేసేందుకు,
విశాలమైన-ఎత్తైన రాజగృహాలు, అనువైన ఇతర రకాల భవనాలు నిర్మించాలి. అదేవిధంగా ఋత్విక్కులకు సహాయపడేందుకు
వస్తున్న బ్రాహ్మణుల విడిదికొరకు - వారికి భక్ష్యాన్నపానీయాలు వినియోగించేందుకు
అనువైన ఇళ్ళుకూడా నిర్మించాలి. యాగాన్ని చూసేందుకొచ్చే పౌరులకు దృఢమైన ఇళ్ళు
కట్టించి,
ప్రతి ఇంటిలో కావాల్సిన పదార్థాలన్నీ మళ్ళీ-మళ్ళీ అడగకుండా
ఏర్పాటుచేయాలి. ముందుగా అయోధ్య వాసులకు ఇలాంటి ఏర్పాట్లు చేసింతర్వాత
పల్లెటూళ్ళనుండి వచ్చేవారికి శాస్త్ర ప్రకారం, సగౌరవంగా అన్ని ఏర్పాట్లు
చేయాలి. వారిని పల్లెటూరువారేకదా అని అశ్రద్ధ చేయకూడదు."
"వీరూ-వారూ అనే తేడాలేకుండా, అన్నిజాతులవారినీ, అన్నితరగతులవారినీ,
వారివారియోగ్యమైన రీతిలో సత్కరిస్తూ, వారిని తృప్తిపరచాలి. కామంతో కానీ, కోపంతో కానీ ఎవరినీ
అవమానించరాదు. యజ్ఞ కార్యాలలో తిరిగేపనివాళ్ళను, శిల్పులను,
ఇతరులను అందరి లాగే గౌరవించాలి. వారెవరూ కూటికీ-నీళ్ళకూ
ఇబ్బందిపడకూడదు.చేయాల్సినపని చిన్నదైనా, పెద్దదైనా వదలకుండా
పూర్తిచేయాలి. చేసే ప్రతి పనినీ స్నేహంతో, ప్రీతితో చేయాలి. ఇదేదో
వెట్టికి చేస్తున్నామన్న రీతిలో చేయొద్దు." అని వశిష్ఠుడు పనులు చేసేందుకు
నియమించిన వారితో అనగా,
వారందరూ "మునీంద్రా! మీరు చెప్పిన పనులన్నీ చేసాం.
ఏలోపమూలేదు" అని జవాబిచ్చారు. ఇంకేమైనా పనులుంటే అప్ప చెప్పమని కోరారు.
రాజులను ఆహ్వానించేందుకు
సుమంత్రుడిని నియమించిన వశిష్ఠుడు
వశిష్ఠుడు సుమంత్రుడితో ఆయన స్వయంగా చేయాల్సిన పనులను, ఇతరులతో చేయించాల్సిన పనులనూ వివరిస్తాడు. "సుమంత్రా! నీకు అందరిగురించీ, వారి అవసరాల గురించీ క్షుణ్ణంగా తెలుసు. ఎవరిని ఏవిధంగా పిలవాల్నో, ఎలా ఆదారించాల్నో తెలిసినవాడివి నువ్వు. నువ్వు నీ అనుభవం ఆదారంగా, దేశంలోని ధర్మాత్ములైన-శిష్టులైన బ్రాహ్మణులను, రాజులను, వైశ్యులను, శూద్రులను, నానా వర్ణాల ప్రజా బాహుళ్యాన్ని యజ్ఞం చూసేందుకు రమ్మని శ్రద్ధగా-త్వరగా పిలిపించు." అని ఆదేశిస్తాడు వశిష్ఠుడు. అందరికంటే ముందుగా సత్యవిక్రముడు-దశరథుడి చిరకాల మిత్రుడు-శౌర్యవంతుడు-వేదశాస్త్ర ఆచారాలలో నిష్ఠగలవాడు-పండితులలో శ్రేష్ఠుడైన జనక మహారాజును సుమంత్రుడే స్వయంగా వెళ్ళి, సగౌరవంగా-సత్కారపూర్వకంగా తోడుకొని రమ్మని సూచిస్తాడు వశిష్ఠుడు. బ్రాహ్మణ విద్య-క్షత్రియ శౌర్యాలనే వాటిలో సజ్జనుడు-దశరథ మహారాజుకు మిక్కిలి ఇష్టుడు కాబట్టే జనక మహారాజును ఆయన యోగ్యతను బట్టి ప్రధమ ఆహ్వానితుడుగా తొలుత పిలవాలని వశిష్ఠుడు చెప్పడం విశేషం. తర్వాత పిలవాల్సినవారిలో కేకయరాజు పేరుచెప్తాడు వశిష్ఠుడు. ఆయన ఎల్లప్పుడూ ప్రియమైన మాటలే పలుకుతాడని, దశరథరాజు మేలుకోరుతాడనీ, ధర్మాత్ముడనీ, కైకేయి తండ్రి అనీ, దశరథుడికి మామగారనీ, అటువంటి కాశి రాజును కొడుకులతో కూడి రమ్మనాలని ఆహ్వానించమని సుమంత్రుడితో చెప్తాడు వశిష్ఠుడు. ఆయన వద్దకు ఇతరులను పంప వద్దని కూడా అంటాడు.
(జనక మహారాజు యోగ్యతవల్ల విశిష్టుడు - ఆయన తర్వాత స్నేహ
ధర్మాన్ని బట్టి కాశి రాజు ముఖ్యుడు. వీరిరువురి తర్వాత ఇతర సంబంధులు వరుసక్రమంలో
వస్తారు. బంధువులకంటే యోగ్యతలు - స్నేహం ముఖ్యమని దీనర్థం.).
జనక మహారాజు, కాశి రాజుల తర్వాత
సుమంత్రుడు స్వయంగా పిలవాల్సిన జాబితాలో అంగదేశపురాజు-మిగుల కీర్తిమంతుడు-దశరథుడి
స్నేహితుడు రోమపాదుడు,
కోసల రాజు-కౌసల్య తండ్రి భానుమంతుడు, సర్వశాస్త్రాలలో పండితుడు-శౌర్యవంతుడు-సుమిత్రా దేవి తండ్రి-భవిష్య జ్ఞానం
కలవాడైన దాత ప్రముఖులు. వీరందరిని సుమంత్రుడే స్వయంగా వెళ్ళి సత్కరించి
పిలుచుకురమ్మంటాడు వశిష్ఠుడు.
తూర్పుదేశపు రాజులను, సౌవీరరాజును,
సింధుదేశపురాజును, సురాష్ట్రపతులను, దక్షిణదేశపు రాజులను,
దూతలద్వారా పిలిపించమని వారికొరకు సుమంత్రుడు వెళ్ళవలసిన
అవసరం లేదని అంటాడు. వీరితో పాటుగా, దశరథ మహారాజు దూరపు
బంధువులను,
సమీప బంధువులను, భార్యలతో – మిత్రులతో –
తోటివారితో - చేతికి ఎదిగిన, ఎదగని బిడ్డలతో రమ్మనమని
పిలిచేందుకు మనుష్యులను పంపమంటాడు వశిష్ఠుడు. ఆయన చెప్పినట్లే పిలిచేందుకు, పిలిపించేందుకు సన్నద్ధమయ్యాడు సుమంత్రుడు. సుమంత్రుడు వెళ్ళిన తదుపరి, తమకప్పచెప్పిన పనులన్నీ కొరతలేకుండా పూర్తిచేస్తామని పనివాళ్లందరూ వశిష్ఠుడుకి
తెలియచేయడంతో సంతోషపడ్డ మహర్షి, తరువాత జరగాల్సిన
పనులగురించి వివరిస్తాడు వారికి. యాగానికి వచ్చేవారికి చిన్నా-పెద్దా అన్న తేడా
లేకుండా,
బహుమాన దృష్టి చూపి సగౌరవంగా దానాలు ఇవ్వాలనీ, అశ్రద్ధ చేస్తే దాతకు కీడని, ఇది సత్యమనీ అంటాడు
వారితో.
అయోధ్యకు వచ్చిన నానా దేశపు రాజులు
ఇలా వశిష్ఠుడు పనివారందరినీ
హెచ్చరిస్తుండగానే,
నానా దేశాల రాజులు వారికి తోచినవిధంగా, హారాలు-పలుతెగలకానుకలు,
తీసుకొని, అయోధ్యా నగరానికి
చేరుకున్నారు. రాత్రి-పగలు అన్న తేడా లేకుండా, సద్భావంతో రాజులందరూ
వచ్చారని పొంగిపోయాడు వశిష్ఠుడు. అదే విషయాన్ని సవినయంగా తెలియచేస్తాడు దశరథుడితో.
"రాజేంద్రా! దేశ దేశాలనుండి ఎందరో రాజులు నీ ఆజ్ఞను శిరసావహించి, నీయజ్ఞంకొరకై,
వేలకొలది కానుకలు తీసుకొచ్చారు. వచ్చిన వారందరినీ, ఎవరిని ఎలా ఆదరించాలో,
అలాంటి మర్యాదలతో ఆదరిస్తున్నాం. మీరు చేయించిన ఏర్పాట్లు
అందరికీ నచ్చాయి. ఇంతవరకు పూర్తి అయిన పనులను, యాగానికి సిద్ధంగా వున్న
స్థలాలను,
పరిశీలించేందుకు లేచి రండి" అని వశిష్ఠుడు, ఋశ్యశృంగుడు అనగానే దశరథుడు మంచి ముహూర్తంలో బయలుదేరి, యజ్ఞశాలకు వెళ్తాడు. వెంటనే బ్రాహ్మణులందరు ఋశ్యశృంగుడుని ముందుంచుకుని, సరయూనది ఉత్తర తీరంలో యజ్ఞకర్మను ఆరంభిస్తారు.
No comments:
Post a Comment