Saturday, March 27, 2021

పాండవుల అరణ్యవాసం, కామ్యక వనం నుండి ద్వైత వనానికి (ఆస్వాదన-12) : వనం జ్వాలా నరసింహారావు

 పాండవుల అరణ్యవాసం,  కామ్యక వనం నుండి ద్వైత వనానికి

(ఆస్వాదన-12)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక, ఆదివారం సంచిక (28-03-2021)

జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం చేయడానికి ఉత్తర దిక్కుగా పయనించారు. భీష్మ, ద్రోణ, కృపాచార్య, విదురులెవరూ పాండవులకు జరిగిన అపకారాన్ని వారించలేదు. వెంట వస్తామన్న పురజనులను ధర్మారాజు వద్దని మరలిపోమ్మన్నాడు. అరణ్యం చేరుకున్న పాండవులు గంగానదీ తీరాన ‘ప్రమాణం అనే మర్రిచెట్టు కింద విడిది చేశారు. మర్నాడు ఉదయం అనేకమంది బ్రాహ్మణోత్తములు పాండవులతో పాటు అరణ్యవాసానికి సిద్ధమై వారి దగ్గరికి వచ్చారు.

తనను చూడడానికి వచ్చి వేదాంత పరమార్థాన్ని వివరించిన శౌనకుడనే బ్రాహ్మణ ఋషితో ధర్మరాజు, తాము చేసేది వనవాసం అనీ, తమతో అడవికి రావద్దని ఎంత చెప్పినా వినకుండా వస్తామన్న బ్రాహ్మణులకు ఆహారం ఏవిధంగా సమకూర్చి పెట్టాలని అడిగాడు. పూర్వకాలంలో భీమ, వైన్య, కార్తవీర్య, నహుషాదులు ఏవిధంగా సూర్యుడిని ఆరాధించి ఆహారాన్ని సాధించి ప్రజలను కాపాడారో, అలాగే, ధర్మరాజును కూడా సూర్యుడిని పూజించమని సలాహ ఇచ్చాడు శౌనకుడు.

పాండవ పురోహితుడైన ధౌమ్యుడు ధర్మరాజుకు 108 ఆదిత్యనామాలు సరైన ఉచ్చారణతో నేర్పించి ఉపదేశించాడు. ఆ ఉపదేశం ప్రకారం ధర్మరాజు గంగా జలాలలో నిలిచి నిష్టగా సూర్యుడి గురించి అష్టోత్తరశతనామాలు ఉచ్చరిస్తూ జపం చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజు తపస్సు నచ్చిందని, ఆయన అడవిలో వుండే 12 సంవత్సరాలు అక్కడ లభించే పండ్లు, కూరగాయలు, వేళ్లు ఆయన పాకశాలలో ద్రౌపదిచే వండబడి తరుగని నాలుగు రకాల వంటకాలుగా ఏర్పడగలవని చెప్పి ఒక రాగి పాత్ర ఇచ్చి మాయమయ్యాడు. నాటినుండి ద్రౌపది ఆ అక్షయ పాత్రలో వండిన శాకమూలాలతో బ్రాహ్మణులను తృప్తి పరిచాడు. ధృతరాష్ట్రుడు ఎప్పటికప్పుడు పాండవుల విషయాలను విడురుడిని అడిగి తెలుసుకుంటున్నాడు. ఒకానొక సందర్భంలో తన మాట ధృతరాష్ట్రుడు వినడం లేదని ఆయన్ను వదిలి పాండవుల దగ్గరికి పోయిన విదురుడు కొంతకాలం తరువాత ధృతరాష్ట్రుడి కోరిక మీద వెనక్కు వెళ్లాడు.

పాండవులు అక్కడి నుండి కామ్యక వనానికి వెళ్లారు. ఇదిలా వుండగా పాండవుల దగ్గరికి వెళ్ళిన విదురుడు మళ్లీ వెనక్కు వచ్చి ధృతరాష్ట్రుడికి సన్నిహితుడు కావడంతో దుర్యోధనుడికి అనుమానం వచ్చింది. ఒకవేళ పాండవులను వనవాసం నుండి వెనక్కు రమ్మంటారేమో అన్న అనుమానం కలిగింది. పాండవులమీద దండెత్తాలని నిర్ణయించిన దుర్యోధనుడు యుద్ధానికి బయల్దేరుతుండగా ఆ వృత్తాంతాన్ని దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్న వ్యాసమహర్షి అక్కడికి వచ్చి అది అధర్మం అని వారించి, ధృతరాష్ట్రుడికి పిర్యాదు చేశాడు. పాండవుల మీద వాత్సల్యం చూపమన్నాడు వ్యాసుడు. 

తన మాట కొడుకు వినడని ధృతరాష్ట్రుడు వ్యాసుడికి చెప్పాడు. ఆయన్నే దుర్యోధనుడికి ప్రబోధం చెయ్యమన్నాడు. ఆ పని మైత్రేయ మహర్షి వచ్చి చేస్తాడని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయాడు. కామ్యకవనంలో ధర్మరాజును కలిసి మైత్రేయ మహర్షి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. పాండవులను కలిసిన సంగతి చెప్పాడు. పాండవులతో విరోధం మానమని మైత్రేయుడు దుర్యోధనుడికి చెప్పాడు. జవాబుగా దుర్యోధనుడు తన తొడలమీద చరిచి చప్పుడు చేస్తూ, మైత్రేయుడిని పరిహసించాడు. దానికి కోపగించిన మైత్రేయుడు, జరగబోయే ఘోర యుద్ధంలో భీమ గదాఘాతం వల్ల దుర్యోధనుడి తొడలు విరుగుతాయని శపించాడు. ఆ తరువాత మైత్రేయుడు ధృతరాష్ట్రుడికి కిమ్మీరుడనే రాక్షసుడు భయంకరమైన అడవిలో ఎలా భీముడి చేతిలో సంహరించబడింది వివరించాడు.

ఇదిలా వుండగా, అడవిలో వున్న పాండవుల దగ్గరికి శ్రీకృష్ణుడి నాయకత్వంలో పాంచాల, యాదవ, వృష్ణి, బోజాంధకులైన బంధువులు వచ్చి దార్తరాష్ట్రులను నిందించారు. దృష్టద్యుమ్నుడు కూడా వచ్చాడు తన మేనల్లులతో. తనను స్తుతించిన అర్జునుడితో శ్రీకృష్ణుడు, తామిద్దరం నరుడు, నారాయణుడు అనే ఆది ఋషులమని, వారిలో నరుడు అర్జునుడని, తాను నారాయణుడినని, ఇద్దరూ గొప్ప శక్తి కలిగి మనుజలోకంలో అవతరించామని చెప్పాడు. శ్రీకృష్ణుడితో ద్రౌపది తనకు కౌరవ సభలో జరిగిన పరాభవాన్ని చెప్పి దుఃఖించింది. ఆ సమయంలో దుశ్శాసనుడి దుష్ట చేష్ట కంటే కర్ణుడు తనను పరిహసిస్తూ నవ్విన నవ్వు తన మనస్సును ఘోరంగా కాలుస్తున్నదని అన్నది. జవాబుగా శ్రీకృష్ణుడు, ద్రౌపదీదేవి హృదయ తాపం కారణంగా, అర్జునుడి బాణాలకు దార్త్రరాష్ట్రులు మృత్యు సదనానికి చేరక తప్పదని అన్నాడు. తాను ఆ సమయంలో అక్కడ లేకపోవడం వల్ల అనర్థం జరిగిందని, ఉన్నట్లయితే ఆ పాపపు జూదాన్ని ఆపుచేసేవాడినని అన్నాడు.

తాను మాయాద్యూతం జరిగిన సందర్భంలో లేకపోవడానికి కారణమైన సౌంభకాఖ్యానం చెప్పాడు. సాల్వుడి దండయాత్ర దగ్గరి నుండి అతడి సంహారం వరకు వివరించాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలోని సౌంభక వృత్తాంతం ఒక అద్భుత కల్పన. 20, 21 వ శతాబ్దాలలో విజ్ఞాన శాస్త్రం అత్యద్భుతంగా మానవ మేధకు కొత్త కొత్త విషయాలను నేర్పింది. సౌంభకం రోదసీ యానం చేయగల ఒక కృత్రిమ గ్రహం లాంటిది కావచ్చు.

ఆ తరువాత శ్రీకృష్ణుడు పాండవులను వీడ్కొని సుభద్ర, అభిమన్యుడుతో కలిసి ద్వారకకు వెళ్లాడు. దృష్టద్యుమ్నుడు తమ మేనల్లులతో కలిసి ద్రుపదనగారానికి పోయాడు. పాండవులు అక్కడి నుండి బ్రాహ్మణులతో కలిసి ద్వైతవనానికి వెళ్లారు. అక్కడ జాగ్రత్తగా వుండాలని తమ్ముళ్లకు చెప్పాడు ధర్మరాజు.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment