Saturday, March 13, 2021

ధర్మరాజు రాజసూయ మహాయాగం, శిశుపాల వధ (ఆస్వాదన-10) : వనం జ్వాలా నరసింహారావు

 ధర్మరాజు రాజసూయ మహాయాగం, శిశుపాల వధ

(ఆస్వాదన-10)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం (14-03-2021)

శ్రీకృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తూ రాజసూయాలోచనలో ధర్మరాజు నిమగ్నమై వుండగా, ద్వారాకనగరం నుండి శ్రీకృష్ణుడు కానుకలు తీసుకుని ఇంద్రప్రస్థ పురానికి వచ్చాడు. ధర్మరాజు ఆయనకు యధావిధిగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించాడు. తనను రాజసూయ యాగ కార్యక్రమంలో నియమించి అనుగ్రహించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు ధర్మరాజు. ఐశ్వర్యంలో దేవేంద్రుడి లాంటి వాడైన ధర్మరాజుకు సామ్రాజ్య బలం, దైవ బలం, మానవ బలం గొప్పగా అమరి వున్నాయని, అందువల్ల ఆయన యజ్ఞం చేయతగ్గవాడని శ్రీకృష్ణుడు అన్నాడు. తనతో సహా ఏఏ పనుల్లో ఎవరెవరు అవసరమౌతారో వారిని నియమించమని సూచించాడు. తమ్ముళ్ల అనుమతి కూడా తీసుకుని, ద్వైపాయనాదుల సమ్మతిని కూడా పొంది, ధర్మరాజు రాజసూయ యాగం చేయడానికి పూనుకున్నాడు. తమ్ములకు అవసరమైన బాధ్యతలు అప్పగించాడు.

అన్న ఆదేశానుసారం సహదేవుడి పిలుపు మేరకు భూమండలంలో వున్న రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు వచ్చి విడిది చేశారు. హస్తినాపురానికి ప్రత్యేకంగా పోయిన నకులుడి వెంట భీష్మ విదురాదులతో సహా దుర్యోధనాదులు అపార ధనరాసులతో వచ్చారు. వారందరినీ తగురీతి సన్మానించాడు ధర్మరాజు. తన బందుజనులలో దక్షిణలు, దానాలు ఇచ్చే విషయంలో కృపాచార్యుడిని, కార్యాకార్యాలను గురించి ఆలోచించడంలో భీష్మద్రోణులను, పదార్ధాల వినియోగంలో విదురుడిని, కానుకలు గ్రహించడానికి దుర్యోధనుడిని, ఆహార పదార్ధాల విషయంలో దుశ్శాసనుడిని నియమించాడు ధర్మరాజు. మిగిలిన సంబంధిత పనులకు కూడా తగువారిని నియమించి, ధర్మరాజు యజ్ఞదీక్ష వహించి, మహావైభవంగా యజ్ఞశాలలో ప్రవేశించాడు.

మూర్తీభవించిన అనంత వేదాల లాంటి వారైన మహామునులు పైలధౌమ్యులు, యాజ్ఞవల్క్యుడు, వేదవ్యాసుడు, సుసాముడు ప్రధాన ఋత్విక్కులుగా, మైత్రావరుణుడు, అచ్చావాకుడు సహాయ ఋత్విక్కులుగా, నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు సహాయులుగా, శ్రీకృష్ణుడి రక్షణలో రాజసూయం మనోహరంగా కొనసాగింది. అప్పుడు, భీష్ముడు రాజసూయ యాగాన్ని చూసి సంతృప్తి చెంది, ధర్మరాజుతో, స్నాతకుడు, ఋత్విజుడు, సద్గురుడు, ఇష్టుడు, భూపాలుడు, జ్ఞానసంపన్నుడు పూజించతగినవారని, ఇలాంటివారిలో అధికుడిని ప్రేమతో పూజించమని సలహా ఇచ్చాడు. అలాంటివారెవరో భీష్ముడినే చెప్పమని కోరాడు ధర్మరాజు. సమాధానంగా భీష్ముడు, యజ్ఞపురుషుడు, సర్వలోక పూజ్యుడు, అచ్యుతుడు అయిన శ్రీకృష్ణుడిని పూజించమని చెప్పాడు. భీష్ముడి మాట ప్రకారం ధర్మరాజు సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని పూజార్హుడైన శ్రీకృష్ణుడికి శాస్త్రోక్తంగా సమర్పించాడు.

ఇది చూసి సహించలేక శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు:

         మ:      అవనీనాథు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్‌ మహీ

దివిజుల్‌ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాథ! గాంగేయు దు

ర్వ్యవసాయంబునఁ గృష్ణుఁ గష్టచరితున్‌ వార్‌ష్ణేయుఁ బూజించి నీ

యవివేకం బెఱిఁగించి తిందఱకు; దాశార్హుండు పూజార్హుఁడే?   

         (ఈ సభలో ఎందరో మహారాజులు వుండగా, విశేషంగా పూజించతగిన పెద్దలు, బ్రాహ్మణులు పెక్కుమంది వుండగా, భీష్ముడు చెప్పిన చెడు నిర్ణయాన్ని అనుసరించి, చెడు ప్రవర్తన కలవాడైన శ్రీకృష్ణుడిని పూజించి నీ తెలివితక్కువ తనాన్ని ఇంతమందికి తెలియచేశావు. దాశార్హుడు పూజార్హుడా?)

         అంతటితో ఆగకుండా శ్రీకృష్ణుడిని పరిపరి విధాల నిందించడం కొనసాగించాడు. రాజసూయ యాగానికి వచ్చిన రాజులందరిని అవమానించాడని ధర్మరాజును దూషించాడు. ఒకవేళ ధర్మరాజు అజ్ఞానంతో ఇచ్చినప్పటికీ సిగ్గులేకుండా శ్రీకృష్ణుడు అర్ఘ్యాన్ని ఎలా తీసుకున్నాడని ఎద్దేవా చేశాడు. శ్రీకృష్ణుడిని పూజించడం అంటే నపుంసకుడికి పెళ్లి చేయడం లాంటిదన్నాడు. చివరకు సభనుండి లేచి వెళ్లిపోయాడు. ధర్మరాజు శిశుపాలుడి వెంట వెళ్లి అతడిని ఇంపైన మాటలతో బుజ్జగించి, పితామహుడైన భీష్ముడు అన్నీ ఆలోచించే శ్రీకృష్ణుడిని పూజార్హుడని చెప్పాడని, అది ఉచితం కాకుండా దోషం ఎలా అవుతుందని అన్నాడు. శిశుపాలుడికి నచ్చ చెప్తున్న ధర్మరాజుతో భీష్ముడు, అతడిని ఒప్పించే ప్రయత్నం చేయనవసరం లేదన్నాడు. అతడికి ధర్మతత్త్వం తెలుసుకోవడం సాధ్యం కాదన్నాడు. శిశుపాలుడిని తీవ్రంగా మందలించాడు. జగత్తుకు ఆధారమైన శ్రీకృష్ణుడు ముల్లోకాలలో నివసించే అందరికీ పూజార్హుడే అన్నాడు. అప్పుడు సహదేవుడిలా అన్నాడు:

         చ:       ఎడపక యర్ఘ్య మచ్యుతున కిచ్చితి; మిచ్చిన దీని కిం దొడం

బడ మని దుర్జనత్వమునఁ బల్కెడువీరుల మస్తకంబుపై

నిడియెద నంచుఁ దాఁ జరణమెత్తె సభన్‌ సహదేవుఁ డట్టిచో

నుడిగి సభాసదుల్‌ వలుకకుండిరి తద్దయు భీతచిత్తులై  

(శ్రీకృష్ణుడికి ఇచ్చిన అర్ఘ్యానికి తిరుగులేదని, దుర్బుద్ధితో దీన్ని కాదనే వీరుల తలమీద తన పాదం పెట్టి అణగతొక్కుతానని సహదేవుడు పాదాన్ని పైకెత్తగానే సబహసదులంతా భయభ్రాంతులై మాట్లాడకుండా వుండిపోయారు). అప్పుడు:

చ.       చెలువుగఁ బుష్పవృష్టి గురిసెన్‌ సహదేవుపయిన్‌; దివంబునన్‌

వెలయఁగ సాధువాదములు వించె; సభాసదులెల్ల విస్మయా

కులిత మనస్కులైరి; తన కుంచెయుఁ గృష్ణమృగాజినంబునుం

బలుమఱు వీచుచుం గలహబంధుఁడు నారదుఁ డాడె వేడుకన్‌

           (సహదేవుడి మీద అందంగా పూలవాన కురిసింది)

         శిశుపాలుడు సభలోకి వచ్చి మళ్లీ శ్రీకృష్ణుడిని, భీష్ముడిని తూలనాడాడు. ఇది విని కోపంతెచ్చుకున్న భీముడు శిశుపాలుడి మీదికి పోతుంటే భీష్ముడు ఆపి శిశుపాలుడి జన్మ వృత్తాంతం చెప్పాడు. శ్రీకృష్ణుడి వల్లే తన కొడుకుకు మరణం అని తెలుసుకున్న అతడి తల్లి శిశుపాలుడు చేసే వంద తప్పులను క్షమించమని కృష్ణుడిని వేడుకున్న సంగతి చెప్పాడు. అతడి చావు శ్రీకృష్ణుడి చేతిలో ఉన్నదన్నాడు. ఇంతలో శిశుపాలుడు మరించ రెచ్చిపోయి భీష్ముడిని, శ్రీకృష్ణుడిని తనతో యుద్ధానికి సిద్ధం కమ్మని అంటాడు. శిశుపాలుడు ఒకదానివెంట ఒకటిగా శ్రీకృష్ణుడిని నిందిస్తుంటే, కోపం తెచ్చుకున్న శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతడి శిరస్సు ఖండించాడు. శిశుపాలుడి శరీరం శ్రీకృష్ణపరమాత్మ శరీరంలో చేరిపోయింది.

         ఆ విధంగా రాజసూయ యాగం నిరాటంకంగా, సుఖంగా ప్రారంభమై, శ్రీకృష్ణుడి సంరక్షణలో సమాప్తం అయింది. వివిధ దేశాల నుండి వచ్చిన రాజులు, భీష్మద్రోణాదులు, ద్రుపదు, కర్ణుడు, శల్యుడు, ఇతరులు వారివారి దేశాలకు ధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు కూడా పాండవుల వీడ్కోలు మధ్య ద్వారకానగరానికి వెళ్లాడు.               

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, సభాపర్వం, ప్రథమ-ద్వితీయాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment