మధువానాన్ని పాడుచేయడం దేనికి సంకేతం?
వనం జ్వాలా
నరసింహారావు
ఆకాశవాణి
హైదరాబాద్ కేంద్రం శనివారం (20-03-2021) ప్రసారం
ఇంద్రజిత్తు
బ్రహ్మాస్త్రానికి కావాలనే పట్టుబడి, రావణుడి దగ్గరకు రాక్షసులతో
తీసుకునిపోబడి, రావణుడిని చూసి వాడికి నీతులు బోధించి, వాడి కోపానికి గురై, వాడి ఆజ్ఞానుసారం రాక్షసులు
హనుమంతుడి తోకకు నిప్పంటించిన తదనంతరం, లంకా దహనం చేసిన
హనుమంతుడు, సీతను చూసి ఆమె అనుమతి తీసుకుని, ఆమెకు అభివాదం చేసి, ఆశీర్వాదాన్ని పొంది, రాముడి
దర్శనం త్వరలో చేసుకోవాలన్న కోరికతో సముద్రాన్ని దాటి, మేఘంలా వున్న మహేంద్ర పర్వతాన్ని చూసి, సింహనాదం చేశాడు. హనుమంతుడి సింహనాదం, ఆవలి ఒడ్డున వుండి, దిగులుపడుతూ, ఎప్పుడు హనుమంతుడిని చూస్తామా అని
ఎదురుచూస్తున్న కోతులు విని సంతోషించారు. హనుమంతుడు పోయిన పనిని చేసుకొస్తున్నాడని
అంటాడు జాంబవంతుడు వానరులతో.
వానరులంతా హనుమంతుడు
వస్తున్నాడని సంతోషిస్తూ, స్నేహితుడిని చూడాలన్న ఆత్రంతో, ఆయన
ధ్వనిని వింటూ గంతులేసారు. వస్తున్న హనుమంతుడిని దూరాన్నుండే చూడాలన్న కోరికతో, ఒక శిఖరాన్నుండి అంతకంటే ఎత్తైన మరో
శిఖరానికీ, ఒక చెట్టునుండి అంతకంటే ఎత్తైన ఇంకో చెట్టుమీదకూ,
కొమ్మనుండి కొమ్మపైకీ,
కిలకిలా
అరుచుకుంటూ దూకసాగారు. తాము ఫలానా చోటున్నామని ఇతరులకు తెలపటానికి, పూచిన కొమ్మలను,
చేతుల్లోని గుడ్డలను వూపుతూ ఆనందించసాగారు వారంతా. ఇంతలో సింహనాదం చేస్తూ
హనుమంతుడొచ్చాడు. మేఘంలా వస్తున్న హనుమంతుడిని చూస్తూ, ఆకాశంవైపు చేతులు జోడించి నిల్చున్నారు
వానరులందరూ. హనుమంతుడిని చూసి,
ఆయన
దగ్గరకు చేరారు మిత్రులందరూ. జ్ఞానవృధ్ధుడు, వయోవృధ్ధుడైన జాంబవంతుడికీ, యువరాజైన అంగదుడికీ, తనకంటే వయసులో పెద్దవారికీ, భక్తితో నమస్కరించాడు హనుమంతుడు.
ఏం చెప్తాడో
విందామని తహతహలాడ్తున్న వానరుల మనస్సు కుదుట పడేటట్లు రెండే-రెండు మాటలు చెప్తాడు
ఆరంభంలో: "చూచితి-సీత"నని. ఆ తర్వాత అంగదుడి చేయిపట్టుకుని, మహేంద్ర పర్వతం మీద, అందరూ కూర్చునే వీలున్న రమ్యమైన
ప్రదేశానికి తీసుకుపోతాడు. ఆప్పుడందరూ వింటూ వుండగా: "దయాహీనులైన
రాక్షసస్త్రీల రక్షణలో వున్న సీతను చూసాను. అశోకవనంలో, భర్తను చూడాలన్న కోరికతో, ఆ పతివ్రత మాసిపోయిన వెంట్రుకలతో, ఆహారంలేక శుష్కించింది" అనగానే
అమృత సమానమైన ఆమాటలకు పోయిన ప్రాణాలు తిరిగొచ్చినట్లు సంతోషంతో, మిగిలినదంతా వినే ఓపికలేక ఎగురసాగారు
కొందరు. మరి కొందరురు గెంతులేశారు. ఇంకొందరు కిలకిలా అరుచుకుంటూ, తోకలను నేలకేసికొట్టారు. హనుమంతుడిని
కౌగలించుకుని, "తండ్రీ
బ్రతికించావు" అని అరిచారు. కోతుల మధ్యనున్న అంగదుడు హనుమంతుడితో, ఆయన ఎలా పోయాడో, ఏం
చేసాడో, ఎట్లా చూసాడో, అదంతా
వివరంగా చెప్పాలని అడిగాడు. సముద్రాన్నెట్లా దాటింది,
లంకలోకెట్లా ప్రవేశించింది, సీతనెట్లా చూసింది, రావణుడెట్లా కనిపించింది, అదంతా
వివరంగా చెప్పమని అడుగుతాడు.
సీతాన్వేషణకు
లంకకు పోయివచ్చిన విధమంతా క్షుణ్ణంగా కపులకు వివరించిన హనుమంతుడు, తన వానర మిత్రులతో ఇలా అంటాడు: "శ్రీరామచంద్రమూర్తి
అనుగ్రహంచేత, మీ అందరి ప్రోత్సాహం వల్ల, నావన్తుగా
మీరు నాకు అప్పగించినపని, లంకకు వెళ్లి సీతను చూసి రావడం పూర్తయింది. ఇక తక్కినకార్యం మీవంతు.
రావణుడు అల్పుడనీ, సులభ సాధ్యుడనీ, భావించవద్దు. వాడి తపోబలంతో, లోకాలను నిల బెట్టగలడు. సంహరించనూ గల
సమర్ధుడు. జానకిని తగిలినా వాడింకా దగ్ధమై పోలేదంటే, అది
వాడి తపోబలమే! వాడి తపోమహిమ సీతాదేవి పాతివ్రత్యం కంటే గొప్పదనడంలో అర్థం, వాడిని రాముడు,
సుగ్రీవుడు ఏమీ చేయలేరని కాదు. రావణుడు దగ్ధమైపోకుండా వున్నాడంటే అది వాడి
తపోబలంవల్ల కాదు. వాడు ఆమెను తాకినప్పుడు ఆమె కోప్పడలేదు. ఆమె నిజంగా కోపమే
తెచ్చుకుంటే, ఆ కోపాగ్ని, నిజమైన అగ్నిహోత్రుడి అగ్నికంటే
తీవ్రమయిందవుతుంది. సీత తనంతట తానుగా రావణుడిని నాశనం చేయ సంకల్పించలేదు కనుకనే
వాడింకా జీవించి వున్నాడు".
"లంకలో జరిగిందంతా
చెప్పాను. ఇక జరగాల్సింది మీరు ఆలోచించండి. సీతాదేవిని తీసుకొచ్చి, రామచంద్రమూర్తి దగ్గరకు పోతే మంచిదని నా
అభిప్రాయం. జాంబవంతుడితో సహా మీరంగీకరిస్తే అలానే చేద్దాం. ఆమె అక్కడ ఏడుస్తూ
వుండడం, ఆ వార్త చెప్పగానే రామచంద్రమూర్తి దుఃఖపడడం, ఈ
సన్నివేశం మనం కళ్లప్పగించి చూడడం నాకు నచ్చలేదు. రావణుడిని,
వాడి బలగాన్నీ, నేనొక్కడినే
చంపగలను. మీరుగూడా నావెంట వుంటే చెప్పాల్సిన పనేలేదు. కార్యం సులభమైపోతుంది. మనం
రావణుడిని చంపి సీతను తెస్తే,
రాముడికేమీ
అపకీర్తి రాదు. మనం ఆయన సేవకులం. సేవకులు చేయాల్సినపనికూడా ప్రభువే చేయాలా? సేవకులకు సాధ్యపడకపోతేనే ప్రభువు చేయాలి. అన్నీ ప్రభువే
చేసుకుంటే సేవకులతో పనేమిటి? నేనొక్కడినే నిర్భయంగా
లంకా నగరమంతా తిరిగి బూడిదయ్యేంతవరకూ కాల్చాను. రామచంద్రుడి పేరు,
సుగ్రీవుడి పేరు, లక్ష్మణుడి పేరు, మహా
పరాక్రమవంతులైన మీ అందరి పేర్లూ, అన్నిచోట్లా
అదేపనిగా చెప్పాను. నేను రామచంద్రమూర్తి దాసుడననీ, పేరు హనుమంతుడనీ, వాయుపుత్రుడననీ,
అందరూ
వినేటట్లు చెప్పాను. రహస్యంగా ఏపనీ చేయలేదక్కడ".
"మా ఇద్దరిమధ్య జరిగిన
సంభాషణలోని అన్నివిషయాలనూ, ఆమె
అడిగినవన్నీ తెలియచేసాను. సీతాదేవి మహాత్మ్యం చేత, ఆమె
అసమానమైన పాతివ్రత్యంచేత, తమోగుణంకల
రావణుడు ఇంతవరకూ దుర్మరణం పాలుకాలేదంటే వాడుగొప్పవాడనే అనాలి. అయితే భర్త
చేతులతోటే రావణుడిని చంపించి, ఆ కీర్తి ఆయనకు దక్కేలాచేసి
వీరపత్నిననిపించుకోవాలన్న ఆమె వ్రతమే ఆ రావణుడినింతవరకూ కాపాడింది. వాడందుకే ఇంకా
శాపగ్రస్తుడు కాలేదు. వీటన్నిటికీ ప్రతిక్రియగా ఏది న్యాయమని తోస్తే అదేచేద్దాం.
ఆలోచించండి" అని హనుమంతుడనగా, అంగదుడు
తన అభిప్రాయం చెప్పసాగాడు.
హనుమంతుడు, సీతను చూసివచ్చాడే కాని, పిలుచుకుని రాలేదనడం బాగుంటుందేమో
ఆలోచించమని అంటాడు అంగదుడు. ఇట్టివాడు ఉత్త చేతులతో రాముడి వద్దకు పోతే
మంచిదికాదేమో నని తన అభిప్రాయమంటాడు అంగదుడు. అంగదుడి ఆలోచన బాగున్నప్పటికీ, రామచంద్రమూర్తి అభిప్రాయం తెలుసుకుని, ఆయన చెప్పినట్లు చేస్తే బాగుంటుందని
జాంబవంతుడు సలహా ఇస్తాడు.
జాంబవంతుడి
సలహా బాగున్నదని అంగదుడు, హనుమంతుడు, తక్కినవారందరూ అంగీకరించి, హనుమంతుడు ముందుండగా మహేంద్ర పర్వతాన్ని
విడిచి బయల్దేరారు. రామచంద్రమూర్తికి ఎప్పుడు సహాయం చేద్దామా అన్న కోరికతో, ఆకాశ మార్గాన పోతున్న వారికంటికి అందమైన
మధువనం కనిపించింది. మధువనం పటిష్టమైన కాపలాలో భద్రంగా కాపాడబడుతున్నది.
సుగ్రీవుడి మేనమామ "దధిముఖుడు" దాంట్లోనే కాపురముంటూ, కాపలావారికి నాయకుడిగా వున్నాడు. ఆ
వనాన్ని చూస్తూనే వానరులంతా,
అక్కడున్న
తేనె తాగాలన్న కోరికతో యువరాజైన అంగదుడి అంగీకారమడిగారు. జాంబవంతుడు, ఇతర వానర ప్రముఖులు, సరేననడంతో వారందులోకి దూరారు.
లోపలికి
పొమ్మని అంగదుడు అనుమతి ఇవ్వగానే,
వానరులందరూ
నాట్యం చేస్తూ, సంతోషంతో గెంతులేస్తూ, వళ్లు తెలియకుండా ఆటలాడుతూ, పాటలు పాడుతూ, మీసాలు తిప్పుకుంటూ, వేడుకలాడుకుంటూ, ఊగుతూ,
తూలుతూ, మధు వనంలోకి
దూరారు. యధేఛ్చగా తిరుగుతూ, తృప్తితీరా తేనెతాగారు. దానితో బాగా మత్తెక్కింది వానరులందరికీ.
వనాన్నంతా కలియబెట్టి, చెట్లకున్న పళ్ళన్నీ నేలరాలకొట్టి, చిందరవందర చేసారా మధువనాన్ని. దధిముఖుడు
బలవంతంగానన్నా వాళ్లను నివారించి వనాన్ని రక్షించాలనుకున్నాడు. సైన్యం వెంటరాగా, కోపంతో వీళ్లను అడ్డుకునే ప్రయత్నం
చేస్తే, వానరులు
వాళ్లను మోకాళ్లతో కుమ్మారు, పిడికిళ్లతో గుద్దారు, కొట్టారు, ముడ్డిచూపించారు. ఇది చూసి అక్కడికి
వచ్చిన అంగదుడు, తనకు వరుసకు
తాతైనప్పటికీ, గౌరవించాల్సిన
వాడైనప్పటికీ, తేనెతాగిన
మత్తులో, దధిముఖుడిపైన
పడి గుద్దులుగుద్ది వదిలిపెట్టాడు.
అంగదుడే
ముందుండి మధువనాన్ని పాడుచేసాడని సుగ్రీవుడికి చెప్పాలనుకుంటాడు దధిముఖుడు.
అలాచెప్తే సుగ్రీవుడు వీళ్లను తప్పక దండిస్తాడని భావిస్తాడు. తనవెంట ఇతర వనపాలకులు
వస్తుంటే, నిమిషంలో
సుగ్రీవుడి దగ్గరకు అకాశ మార్గాన వెళ్లాడు దధిముఖుడు. అక్కడున్న రామలక్ష్మణ
సుగ్రీవులను చూసి, ఏడ్చుకుంటూ
అల్లుడైన సుగ్రీవుడికి నమస్కరిస్తాడు.
మధువనంవైపు
ఎన్నడూ రాని వానరులు, ఇప్పుడు
దక్షిణ దిక్కునుండి తిరిగి వస్తూ ఆ వనాన్ని పాడుచేసారని పిర్యాదు చేసాడు. వారక్కడ
తేనెతాగారనీ, పళ్ళన్నీ తిన్నారనీ, తాగగా
మిగిలిన తేనెను పారపోసారనీ, ఇదేమిటని అడ్డంపోయిన కావలివారిని
వెక్కిరించి కొట్టారనీ, చెప్పాడు. వనపాలకులు వెళ్లి బలవంతంగా వానరులను వెళ్లగొట్టే ప్రయత్నం
చేస్తే, వాళ్లు
కోపంతో పిడికిళ్లతో గుద్దారనీ, కాళ్లతో కుమ్మారనీ, ముడ్లు చూపారనీ, సుగ్రీవుడు రాజన్న సంగతికూడా
మరిచిపోయి ప్రవర్తించారనీ, అన్నాడు.
జరిగిన
సంగతినీ, దధిముఖుడి పిర్యాదునీ, అక్కడే
వున్న లక్ష్మణుడికి వివరిస్తాడు సుగ్రీవుడు. దక్షిణ దిక్కుగా పోయిన వానరసేనకు, ఆలోచన
చెప్పేవాడు జాంబవంతుడైనప్పుడు, హనుమంతుడు
రక్షకుడైనప్పుడు, ప్రభువేమో అసమానబలుడైన అంగదుడే అయినప్పుడు, వారికప్పచెప్పిన
పని సఫలమయిమడనడంలో ఆశ్చర్యం లేదనుకుంటాడు. ఆ విషయమే చెప్పాడు లక్ష్మణుడితో
సుగ్రీవుడు. వానరులు సీతాదేవిని చూడకపోయినట్లైతే, బ్రహ్మదత్తమైన మధువనాన్ని కళ్లతో
చూసే ధైర్యమైనా వుంటుందా? ఈ
మాటలు విన్న రామలక్ష్మణులు సంతోషంతో గగుర్పాటుపడ్డారు.
రామలక్ష్మణులకు
ఇలా చెప్పిన సుగ్రీవుడు, దధిముఖుడితో
వానరులు మధువనంలో స్వేచ్ఛావిహారం చేసారంటే, వారుమంచి కార్యం సాధించి వుంటారనీ, కాబట్టి వాళ్లను క్షమించాలనీ, క్షమించాననీ అంటాడు. హనుమంతుడు, ఇతరులు ప్రవర్తించిన విధం, సీతాదేవిని చూసేందుకు వారుచేసిన
ప్రయత్నం, రామలక్ష్మణుల
సన్నిధిలోనే తాను వినదల్చుకున్నానని వానరులందరికీ చెప్పి, వాళ్లను
త్వరగా రమ్మని కబురుచేస్తాడు సుగ్రీవుడు. రామలక్ష్మణులను చూసి, సీతాన్వేషణ
కార్యం సఫలమయిందికదా అని ఆనందించాడు సుగ్రీవుడు.
దధిముఖుడు, పరిచారకులతో ఆకశానికెగిరి, మధువనానికి ళ్లిపోయాడు.
అంగదుడిని గమనించి, అతడి
వద్దకువెళ్లి, చేతులు
జోడించి నమస్కరించాడు దధిముఖుడు. తాను చేసిన అపరాధాన్ని మన్నించమని వేడుకుంటాడు.
అజ్ఞానంతో చేసిన తప్పులు క్షమించమని, వాళ్లు ఈ వనంలోకి వచ్చిన వార్తను
పిన తండ్రి సుగ్రీవుడికి తెలిపి వచ్చాననీ అంటాడు. ఆయన సంతోషించి, వాళ్లను
త్వరగా రమ్మని కబురంపాడని కూడా చెప్పాడు దధిముఖుడు.
దధిముఖుడు
చెప్పిన మాటలు విన్న అంగదుడు వానరులతో, ఈ విషయాలన్నీ రామలక్ష్మణులకు కూడా
తెలిసే వుంటాయనీ, ఎట్లాగూ
తేనెతాగి అలసట తీర్చుకున్నాం కనుక, ఇక్కడ చేయాల్సిన
పనికూడా ఏమీలేదుకనుక, పిన తండ్రిని చూట్టానికి పోదామా అని అడుగుతాడు. అంగదుడు చెప్పినట్లే
చేస్తామనీ, సుగ్రీవుడిని చూడటానికి పోదామనీ వానరులందరూ అంటారు.
వానరులు ఆకాశమార్గాన, వేగంగా పోయి సుగ్రీవుడుండే ప్రదేశానికి చేరుకున్నారు.
(వాసుదాసుగారి
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment