Sunday, March 28, 2021

పుత్ర కామేష్టి చేసిన దశరథుడు .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-50 : వనం జ్వాలా నరసింహారావు

 పుత్ర కామేష్టి చేసిన దశరథుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-50

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (29-03-2021)

సంతాన లాభం అనుగ్రహించమని వేడుకొనిన దశరథుడితో ఋశ్యశృంగుడు, ఆయన కోరిన విధంగానే జరుగుతుందని అంటాడు. కీర్తికి స్థానాలైన నలుగురు కొడుకులు ఆయనకు కలుగనున్నారనీ, విచారించ వద్దనీ అంటూ, తదేక ధ్యానంతో కొంచం సేపు ఆలోచిస్తాడు. దశరథుడికి కొడుకులు పుట్టేందుకు అధర్వణమంత్రాలతో యాగాన్ని చేయిస్తానంటాడు. అధర్వణ మంత్రాల ప్రకారం అగ్నిహోత్రుడిని ఉద్దేశించి హోమం చేయిస్తే తనకు కొడుకులు పుడతారని ఋశ్యశృంగుడు చెప్పిన మనోరంజకమైన మాటలను విన్న దశరథుడు సంతోషించి యజ్ఞానికి పూనుకుంటాడు. యజ్ఞం చేస్తున్న సమయంలో, అక్కడకు, గంధర్వులు-దేవతలు-సిద్ధులు-ఇతర దేవతలు, పరమఋషులు, తమతమ హవిర్భావంకొరకై బ్రహ్మదేవుడితో కలిసి వచ్చారు. వచ్చిన వారంతా బ్రహ్మను చూసి, రావణాసురుడు తమను పెట్తున్న బాధలను ఆయనకు మొర పెట్టుకుంటారు.

రావణుడు పెట్టే బాధలను బ్రహ్మతో విన్నవించుకున్న దేవతలు

         "నమస్కారం చేసిన ప్రతివాడికి స్వాధీనుడవయ్యే బ్రహ్మదేవా! నీ దయను పరిపూర్ణంగా పొందిన రావణాసురుడు, బ్రహ్మ వర బలంతో తననెవ్వరూ-ఏమీ చేయలేరని, గర్వంతో మమ్ములను బాధలకు గురిచేస్తున్నాడు. భుజబలంతో వాడినెదిరించి యుద్ధం చేసే సమర్థత మాకు లేదు. పోనీ, ఎలాగైనా వాడిని చంపుదామంటే, దేవతలవల్ల వాడికి చావు లేకుండా నీ విచ్చిన వరాన్ని మేము గౌరవించి, వాడిని చంపకుండా విడిచిపెట్టి, వాడి చేతిలో చెప్పరాని బాధలు పడుతున్నాం. వాడు మమ్మల్నే కాదు-ముల్లోకాలను మనోవ్యాకులంతో హాహా కారాలు చేసే విధంగా దుష్టుడుగా బాధిస్తున్నాడు. ఇంద్రుడిని స్వర్గంలో లేకుండా చేసే ప్రయత్నంలో వున్నాడు. నీ విచ్చిన వర బలంతో వసువులను, వ్రతులను, బ్రాహ్మణులను, యక్షులను చికాకుపరస్తున్నాడు. ఇది చేయొచ్చు-అది చేయకూడదని లేకుండా, వాడు చేసేవన్నీ చెడ్డపనులే. రావణాసురుడికి భయపడి సూర్యుడు వేడి కలిగించకుండా చంద్రుడి మాదిరి చల్లబడ్డాడు. వాయుదేవుడు వీచడం మానేశాడు. సముద్రుడు శుష్కించి భయంతో కదలడం లేదు. ఇక వాళ్ళ గతే అలావుంటే, మా సంగతి చెప్పేందుకేముంటుంది? వీడు బలహీనపడి జగాలన్నీ రక్షించబడే మార్గం లేదా?" అని దేవతలందరూ బ్రహ్మను వేడుకుంటారు. ఇలా తనను ప్రార్థించిన దేవతలతో, రావణాసురుడిని చంపే ఉపాయం తోచిందని సంతోషంతో అంటాడు బ్రహ్మ. దేవలతచేత, యక్షులచేత, దైత్యులచేతా, విద్యాధరులచేత, వసువులచేతా, ఆకాశ సంచారులచేత చావు లేకుండా మాత్రమే రావణాసురుడు తనను వరం కోరాడని, అంతకంటే తక్కువ వారైన మనుష్యుల చేతిలో చావు లేకుండా వరం కోరలేదనీ అంటాడు బ్రహ్మ. మనుష్యులు దుర్బలులనీ-వారికంటే వానరాదులు మరింత దుర్బలులనీ, వారు తననేమీ చేయలేరనీ అలక్ష్యంగా మాట్లాడాడు. కాబట్టి వాడి చావు మనిషి చేతిలో రాసిపెట్టి వుందని అంటాడు బ్రహ్మ సంతోషంగా. ఆవిధంగా బ్రహ్మ చెప్పగానే, రావణ వధకు ఉపాయమైతే దొరికింది కాని, వాడిని చంపగల మనిషెవ్వరని-ఎవరిని తాము ఆశ్రయించాలని ఆలోచనలో పడ్డారు దేవతలందరూ.

దేవతలకు ప్రత్యక్షమైన శ్రీ విష్ణుమూర్తి

దేవతలు తమను రక్షించేవాడెవరోనని తెలుసుకొనేలోపలే, శిష్టులను రక్షించేందుకు, దుష్టులను శిక్షించేందుకు, ధర్మాన్ని స్థాపించేందుకు, దశరథుడి అభీష్ఠాన్ని నెరవేర్చేందుకు, పరమ కరుణాలుడైన భగవంతుడు భూలోకంలో అవతరించదలచి దేవతలున్నచోటికే వచ్చాడు. భగవంతుడు, ఎప్పుడు దేవతలు తనను శరణుకోరుతారా-ఎప్పుడు వారిని రక్షించాలా, అని ఎదురుచూస్తున్న విధంగా ఆయనే వారిని వెతుక్కుంటూ వచ్చాడని దీనర్థం. యాచించిన తర్వాత యాచకుల కోరిక నెరవేర్చడం ఉత్తమ లక్షణం కాదనీ, తనను శరణుజొచ్చిన వారికట్టి శ్రమ కలిగించకూడదని, భగవంతుడే స్వయంగా వచ్చాడు. అయితే, సర్వజ్ఞుడైన భగవంతుడికి, రావణుడి విషయం తెలియదా అన్న సందేహం రావచ్చు. తెలిసికూడా వాడు పెట్టే బాధలనుండి దేవతలను ఎందుకు కాపాడలేదు? ఎవరైనా తమను తాము రక్షించుకుంటామన్న ధైర్యం వున్నంతవరకు, స్వప్రయత్నం చేస్తున్నంతవరకు, దైవ సహాయం అందదు. దైవమే పరమ గతి-దైవ సహాయం లేని పురుష ప్రయత్నం వ్యర్థమని ఎప్పుడు భారం భగవంతుడిపైన వేస్తారో అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. మనం భగవంతుడికెదురుగా పది అడుగులేస్తే ఆయన పదికోట్ల అడుగులు వేసి మనను చేరుకుంటాడు. ఇది అనివార్య విధి. దేవతలు రక్షకుడిని కోరుకున్నప్పుడే భగవంతుడికి తెలిసిపోయింది. ఆశ్రిత రక్షణకు సిద్ధమయ్యాడు . కాంచనచేలుడు, జగన్నాయకుడు, శుభకరమైన దేహకాంతికలవాడు, శంఖ చక్ర గధ భయ ముద్రలతో మనోహరమైన వాడు, విష్ణుమూర్తి ఆవిధంగా దేవతలున్నచోటుకు వచ్చాడు. వచ్చిన విష్ణుమూర్తి ఏకాగ్రమనస్సుతో బ్రహ్మ సమీపంలో వుండగా, దేవతలాయనకు నమస్కరించి, స్త్రోత్రం చేసి, ఆయన మనస్సును సంతోషపరచి, భక్తితో తమ బాధలు చెప్పుకున్నారు.

No comments:

Post a Comment