Friday, March 5, 2021

హనుమకు చూడామణి ఎందుకిచ్చింది సీత? : వనం జ్వాలా నరసింహారావు

 హనుమకు చూడామణి ఎందుకిచ్చింది సీత?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (06-03-2021) ప్రసారం  

హనుమంతుడి సూచన మేరకు ఆయన వెంట రాముడి దగ్గరకు పోనని సీత అనటానికి కారణాలను వివిధ కొనాల నుంచి విశ్లేషించాడు హనుమంతుడు. హనుమంతుడు వాక్య విశారదుడు. తర్క పండితుడు. అందువల్ల, రామానుగ్రహం కొరకు, తాను చెప్పిన ఉపాయం మంచిదా, లేక, సీత చెప్పిన ఉపాయం మేలా, అని తర్క-యుక్తులతో, ఆలోచిస్తాడు. ఆమె చెప్పిందే బాగుందనుకుని, సీతాదేవితో ఇలా చెప్తాడు:

"దేవీ! ఇక్కడి సంగతులన్నీ, అంటే, నీవు నా ఎదుట రావణుడికి, రాక్షసస్త్రీలకు, నాకు చెప్పిన మాటలను, రామచంద్రమూర్తికి విన్నవించుకుంటాను. నీ ఏడ్పులు, వురిపోసుకునేందుకు నువ్వు చేసిన ప్రయత్నం కూడా చెప్తాను. నీ కష్టాలను చూసి, రాముడిపైనున్న భక్తితో నా వెంట రమ్మన్నానేకాని, వేరే కారణం లేదు. నన్ను తప్పుగా ఎంచక క్షమించు. నాతో నీవు రావడానికి అంగీకరించలేదు కనుక, నేనిక్కడకొచ్చినట్లు, నిన్ను చూసినట్లు, రామచంద్రమూర్తి నమ్మదగ్గ గుర్తేదన్నా ఇవ్వు. లేకపోతే నామాటలు ఆయన నమ్మడేమో! ఉత్తమాటలు నీవు నమ్మవని ఆయన ఉంగరం ఆనవాలుగా తెచ్చాను. అలాగే నీవుకూడా ఆయన్ను నమ్మించే గుర్తు ఏదన్నా ఇవ్వు తల్లీ!" అంటాడు హనుమంతుడు.

ఆంజనేయుడి మాటలు విన్న సీతాదేవి కళ్లనుండి నీరు కారుతుంటే, మెల్లగా హనుమంతుడితో, శ్రీరాముడికి మంచి గుర్తు చెప్తా వినమంటుంది. ఆ విషయాన్ని చెప్తున్నన్నంత సేపూ, ఎక్కువగా, సీత ప్రత్యక్షంగా ఆయనకు చెప్తున్నట్లే, ఆయన్నే సంభోదిస్తుంది. ఒక్కోసారి ఆయన్ను పరోక్షంలో వుంచుకున్నట్లుగా హనుమంతుడిని సంభోదిస్తుంది. మొదట రాముడిని వుద్దేశించి కధచెప్తుందీ విధంగా:

"పూర్వం చిత్రకూటంలోని, మందాకినీ తీరం దగ్గర నివసిస్తున్నప్పుడు, ఓనాడో కాకి, నన్ను మాంసమనుకుని, తనముక్కుతో పొడవగా, ఓ మట్టిపెళ్లను ఆ తుంటరి కాకిమీద విసిరాను. ఆ తరువాత నాతొడపైన తలవుంచి నీవు పడుకున్నావు. రామచంద్రమూర్తీ! నీవు నిదురించగానే, ముందు బాధపెట్టిన కాకే, నాదగ్గరకొచ్చి, నా స్తనాలను గీరి, ముక్కుతో నాకు బాధకలిగేటట్లు పొడిచింది. ఆ గాయం నుండి రక్తంకారి, ఆబొట్లు నిదురిస్తున్న నీపైన పడ్డాయి. ఆ పాపపు పక్షిపెట్టే బాధ సహించలేక, సుఖంగా నిద్రిస్తున్న నిన్ను లేపాను. నీవు లేచి, నా గాయాన్ని చూసి, కోపంతో, నాకెదురుగా వున్న కాకిని నెత్తురుతో తడిసిన గోళ్లతో చూసావు. నీవు  చూడగానే, కాకిరూపంలో వున్న ఇంద్రుడి కొడుకు, గాలిలాగా కొండ దిగి పరుగెత్తసాగాడు".

శ్రీరాముడిని పరోక్షంగా వుంచుకుని, హనుమంతుడిని సంభోధిస్తూ: "పరుగెడ్తున్న కాకిని చూసి, కోపంతో, దయను వదిలేసి, దర్భాసనంలోని దర్భను తీసి, దాన్నే బ్రహ్మాస్త్రంగా కాకిమీద వేసాడు రాముడు. ఆ దర్భపోచ ఆకాశంలో పోతున్న కాకిని వెంటాడింది. ఆ కాకి ముల్లోకాలు తిరిగి, ఎంతోమంది శరణు కోరింది. ఇంద్రుడు, బ్రహ్మాది దేవతలు, గొప్ప మహర్షులు, అందరూ దానిని కాపాడలేమని చెప్పారు. వేరేగతిలేక మళ్లీ తిరిగొచ్చి రాముడినే శరణుకోరింది. శరణు-శరణని భూమిపై సాగిలబడిన కాకిని చూసి, అది చంపబడాల్సిందే అయినా, దయతల్చి వదిలేసావు. ఆ కాకి నీ శరణుజొస్తే, దాన్ని చూసి నీవు, బ్రహ్మాస్త్రం వ్యర్థం కాదు, ఏమిస్తావని అడిగావు. అది తన కుడి కంటిని తీసుకొమ్మంది. ఆ భయంకర బాణం దాని కుడికన్ను హరించి వేసింది. కాకేమో చావుతప్పి కన్నులొట్టబోగా, రాముడినీ, దశరథుడినీ తలచుకుంటూ, నమస్కరిస్తూ పోయింది".

మళ్లీ రాముడిని ఉద్దేశించి మాట్లాడుతూ, "నరేంద్రా! నాకు చిన్న బాధకలిగితేనే, ఆ బాధ కలిగించిన కాకిపైన బ్రహ్మాస్త్రం ప్రయోగించావే! నిన్ను తిరస్కరించి, ఇంతకాలం, ఇంతబాధపెట్తున్న ఈ క్రూరుడిని ఎందుకు ఉపేక్షిస్తున్నావు? నిన్ను నాథుడిగాగల నేను అనాధలాగా పడి వున్నానే! ఇలా చేయడం నీకు ధర్మమేనా?" అని భావగర్భితమైన వాక్యాలు రాముడిని గురించి అన్న సీత, హనుమంతుడితో, రాముడి ఉపదేశ పాండిత్యం ఆచరించడంలో లేదా? అని అడగమంటుంది.

ఇలా శోకంతో కూడిన మాటలను, కళ్లల్లో నీరు కారుతుంటే, కలవరపడుతూ, అడుగుతున్న సీతాదేవిని చూసి, ఓదార్పు మాటలతో హనుమంతుడు, సీత కష్ట కాలం పోయిందనీ, దుఃఖం అంతరిస్తుందనీ, లంకనెప్పుడు భస్మం చేయాల్నా అని రామలక్ష్మణులిద్దరూ ఎదురు చూస్తున్నారనీ అంటాడు. సీతకు ద్రోహం చేసిన రావణుడిని బంధువులతో సహా చంపి శీఘ్రంగా అయోధ్యకు రామచంద్రుడు తీసుకుపోయే సమయం వచ్చింది అంటాడు.

"అమ్మా, నేను పోయి సీతాదేవిని చూశాననగానే, శ్రీరాముడు, లక్ష్మణుడు  సుగ్రీవుడు, వానరులైన నా స్నేహితులు, మాకేం చెప్పిందంటే, మాకేం చెప్పిందని అడుగుతారు. నీమాటలుగా, వారందరికీ ఏం చెప్పాలో చెప్ప" మని ఆంజనేయుడు అడుగుతాడు సీతను. దుఃఖంతో కన్నీరుకారుస్తూ, సీతాదేవి సమాధానమిస్తుంది హనుమంతుడికిట్లా:

"కుశలమడిగానని చెప్పు. నాకు బదులుగా ఇదిసీత నమస్కారమని రాముడికి మ్రొక్కు. మీ క్షేమ సమాచరం అడిగానని చెప్పు.  నేను రక్షించమని అడిగానని మాత్రం చెప్పవద్దు. నీవు మిత్ర శ్రేష్టుడవు. ఇదే నీవు నాకు చేయవలసిన ఉపకారం. వానరేంద్రా! నా దుఃఖం సమసిపోవాలి. ఇదే నాకు కావాల్సింది. దానికొరకు నామగడు, ఎలాంటి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించగలడో, అదంతా ఆయనతో చేయించాల్సిన వాడివి నీవే! ఆ భారం నీమీదే వుంది. ఒక్కమాటమాత్రం ఆయనకు మళ్లీ-మళ్లీ చెప్పు. ఎంత కష్టమైనా సహించి ఇంకొక్కనెల ప్రాణాలు బిగపట్టుకుంటాను. ఆపైన నేను నిల్పుకోవాలన్నా ప్రాణం నిల్వదు రామచంద్రా! అన్నానని చెప్పు. నన్నుధ్ధరించమను. తన సొమ్మును తనే కాపాడుకోవాలని చెప్పు".

తనమాటలుగా రామచంద్రమూర్తికి చెప్పమని ఎన్నో విషయాలు చెప్పిన సీతాదేవి, ఆ తర్వాత తన కొంగులో ముడివేసి దాచుకున్న "చూడామణి" ని తీసి, రామచంద్రమూర్తికిమ్మని హనుమంతుడికిస్తుంది. నిత్యమూ శ్రీరాముడికి పాదాభివందనం చేయడం సీతమ్మకు అలవాటు. అలా చేస్తున్నప్పుడు  చూడామణిని (నాగరం లేదా కొప్పుబిళ్ల) రాముడు చూస్తుండడంవల్ల దానిని ఆయన తేలిగ్గా గుర్తుబడతాడు. అందువల్లనే చూడామణిని ఇచ్చింది సీతమ్మ. ఆమె ఇచ్చిన ఆ జడబిళ్లను హనుమంతుడు తనవేలికి పెట్టుకున్నాడు. ఆ జడబిళ్ల ఆయన వేలికి ఉంగరంలాగా సరిపోయింది. తర్వాత ఆమెకు ప్రదక్షిణ చేసి, నమస్కరించి నిలబడ్డాడు. అసమానమై, ఉత్తములు మాత్రమే ధరించదగి, సీతాదేవి తన మహాత్మ్యం వల్ల ధరించిన, చూడామణిని, హనుమంతుడు, తన బుధ్ధిబలంతో పొంది, సంతోషించి, శ్రీరాముడి దగ్గరకు త్వరగా పోవాలన్న ఆలోచనలో పడ్డాడు.

చూడామణిని హనుమంతుడికిచ్చిన సీతాదేవి, ఈమణి రామచంద్రమూర్తికి బాగా తెలుసనీ, దీన్ని చూడగానే తనను, తన తల్లినీ, దశరథ మహారాజునూ, ఆయన స్మరించుకుంటాడనీ చెప్తుంది. వివాహ సమయంలో, దీనిని జనకమహారాజు తనతల్లి చేతికిచ్చాడనీ, ఆమె, దశరథుడు, రాముడు చూస్తుండగా, తనతలలో అలంకరించిందనీ అంటుంది. హనుమంతుడికి ఉత్సాహం కలిగేవిధంగా, చెప్పగలిగినంత చెప్పాననీ, ఇక ముందున్న కార్యం ఎట్లా చేస్తే బాగుంటుందో, అది ఆయన్నే ఆలోచించుకోమనికూడా చెప్తుంది.

ఆంజనేయుడి మనసంతా, ఎక్కడో వున్నదని గ్రహించిన సీత, తను చెప్పేది వినమనీ, శ్రీరామచంద్రమూర్తినీ, ఆయన తమ్ముడినీ, ఆయనకూ, తనకూ ముఖ్యులైన వారితో కూడిన సుగ్రీవుడినీ, వానరులందు పెద్దవారినీ, ధర్మ పద్ధతిలో యధాచితంగా క్షేమాన్ని విచారించానని చెప్పమంటుంది. మహాబలవంతుడైన శ్రీరాముడు, ఏవిధంగా, మోయలేని ఈ దుఃఖ సముద్రాన్నుంచి తన్ను దరిచేరుస్తాడో, ఆ విధానాన్ని తెలుసుకుని, ఆ పద్ధతిలోనే ఆయన్ను ఒప్పించి, కీర్తిమంతుడివి కమ్మని చెప్తుంది. తాను దేహాన్ని చాలించకముందే, తనమగడు తన్నెట్లా రక్షించగలడో ఆలోచించి, బుధ్ధి, చమత్కారాలున్న హనుమంతుడు, ఆయనకు నచ్చచెప్పి పుణ్యం కట్టుకొమ్మని అడుగుతుంది.

సీతాదేవి చెప్పిన మాటలన్నీ, హితమైనవిగా, యుక్తియుక్తంగా, నిర్దోషమైనవిగా, ప్రయోజనంతో కూడినవిగా వున్న మంచిమాటలని భావించిన మారుతి చెప్పదలుచుకున్న మిగిలిన మాటలను ఆమెకు చెప్తాడు.

వానర, భల్లూకరాజైన సుగ్రీవుడు సీత నిమిత్తమై, గొప్ప సైన్యంతో రాముడికి సహాయపడేందుకు నిర్ణయించుకున్నాడనీ, ఆయనతో వచ్చేవారంతా అసమాన పరాక్రమవంతులనీ, దేవతలతో సమానులనీ, మనోవేగం కలవారనీ, దిక్కులలో, ఆకాశంలో సంచరించేవారనీ, వారంతా శీఘ్రంగా రాబోతున్నారనీ, ధైర్యం చెప్పాడు సీతకు హనుమంతుడు. "పరాక్రమవంతులు. సముద్రంతో, పర్వతాలతో వ్యాపించివున్న భూమండలాన్ని ఆకాశమార్గాన చుట్టిరాగల సమర్ధులు. వారికీ సముద్రం దాటడం చాలా చిన్నపని. వానరులలో సముద్రాన్ని దాటగల నాలాంటివారు చాలామంది వున్నారు. సుగ్రీవుడి దగ్గరున్నవారందరూ నాకంటే గొప్పవారో, సమానులో కాని తక్కువైన వాడొక్కడు కూడలేడు.

“రావణుడిని సేనలతో సహా చంపి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకుపోతాడు. మేమెప్పుడొస్తామా అని మా రాకకొరకు ఎదురుచూస్తుండు. ఏ సాహసం చేయొద్దీలోపల. మండుతున్న అగ్నిహోత్రం లాగా రామచంద్రమూర్తిని ఇక్కడ చూస్తావు. రాక్షసుడికేగతి పడ్తుందో చూడు. కొడుకులతో, చుట్టాలతో, మంత్రులతో చచ్చిపోయి రావణుడు నేలకూలగా చూసిన నీవు దుఃఖ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటావు. నీ మగడిని కలుస్తావు".

ఇట్లా పలురకాలుగా సమాధానపరిచి ప్రయాణానికి సిధ్ధపడిన హనుమంతుడు, సీతకు మరింత ధైర్యం కలిగేటట్లు మరికొన్ని మాటలు చెప్పాడు.

వాడిపోతున్న మడిలోని పైరుపై వానచినుకులు పడడంతో, పచ్చబడ్డట్లు, హనుమంతుడి ప్రియమైన మాటలు సీతకు మళ్లీ ప్రాణం పోసినట్లనిపించింది. బ్రతికాననుకుంటుంది. తన భర్తను ఎలా కలిసే వీలుందో అలానే చేయమని మళ్లీ కోరుతుంది హనుమంతుడిని. ఇంకా శ్రీరాముడిని ఉద్దేశించి ఇలా పలుకుతుంది:

"పరాక్రమంలో ఇంద్రుడూ, వరుణుడూ కలిసికట్టుగా వచ్చినా నీకు సమానం కారు. అంత పరాక్రమవంతుడవైన నీవు, నీ భార్యను, నీకు తెలియకుండా, దొంగతనంగా రాక్షసులెత్తుకునిపోయి, బాధపెట్టుతుంటే, శత్రువులాగా ఎలా వూరుకుంటున్నావు? ఇదేమన్న ప్రశస్తమైన కార్యమా? దశరథ రాజకుమారా! నీమనస్సును ఆకర్షించే శక్తి ఉన్నందునే, సముద్రజలాలలో కౌస్తుభంలాగా పుట్టిన చూడామణిని నేను దాచుకున్నాను. దీనిని చూడగానే నీవిరహాగ్నికూడా చల్లారాలి! ఇప్పుడు దీన్ని కూడా ఎడబాస్తున్నాను. ఇక ఈ దుఃఖసాగరంలో నేను ప్రాణాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. అలాగైతే ఎందుకు పంపించానంటావా? ఇదివరదాకా దీని దర్శనం నీ రూపాన్ని స్మృతికి తెస్తుండేది. ఇప్పుడదిపోయి నిన్ను పిల్చుకొస్తుందన్న నమ్మకంతో పంపాను. ఇది సముద్రంలో పుట్టిందికనుక, సముద్రంవల్ల బాధలేకుండా నన్ను రక్షిస్తూ వచ్చింది. ఇక నన్ను రక్షించేవారెవ్వరు?"

సీత మాటలువిన్న హనుమంతుడు, రామచంద్రమూర్తి తప్పక ఆమె కష్టాలు తొలగిస్తాడనీ, ఆయన నిజంగా దుఃఖిస్తున్నాడనీ, ఆయన స్థితి చూసి లక్ష్మణుడు కూడా శుష్కిస్తున్నాడనీ, తాను ఇవ్వన్నీ ప్రమాణం చేసి చెప్తున్నాననీ, తనమాటలు నమ్మమనీ అంటాడు.

రామచంద్రమూర్తి గుర్తించే మరో జ్ఞాపిక ఇవ్వమని మళ్లీ అడుగుతాడు. తానిచ్చిన చూడామణిని మించిన గుర్తేమీలేదని, దానిని చూడగానే హనుమంతుడు తన దగ్గరకు వచ్చినట్లు నమ్ముతాడనీ సీత చెప్పడంతో, తనింక వెళ్లడానికి అనుమతినివ్వమంటాడు హనుమంతుడు. ఇలా అంటూనే, తనకు తలవంచి నమస్కరించి నిల్చిన హనుమంతుడు దేహాన్ని పెంచడం, సముద్రాన్ని దాటే ఉత్సాహాన్ని కనపర్చడం కళ్లారా చూసి, వెళ్లిరమ్మనీ, శుభం కలుగుగాక అని అంటూ సెలవిస్తుంది.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment