Saturday, March 20, 2021

అసూయ చెందిన దుర్యోధనుడు, మాయాద్యూతం, పాండవుల అరణ్యవాసం...ఆస్వాదన-11 : వనం జ్వాలా నరసింహారావు

 అసూయ చెందిన దుర్యోధనుడు, మాయాద్యూతం, పాండవుల అరణ్యవాసం

ఆస్వాదన-11

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (21-03-2021)

ధర్మరాజు చేసిన రాజసూయ యాగానికి అతిథిగా వచ్చిన దుర్యోధనుడు, శకుని, మయసభా విశేషాలు చూడాలన్న కుతూహలంతో ఇంద్రప్రస్థంలోనే కొన్ని రోజులున్నారు. ఒకనాడు దుర్యోధనుడు ఒక్కడే సభకు పోయి, దాని అపూర్వ సౌందర్యానికి, మాయా విశేషాలకు ఆశ్చర్యపడ్డాడు. ఒకచోట స్ఫటికపు రాళ్ల కాంతులు కప్పిన నీటి మడుగును నేలగా భావించి, అడుగు వేసి ధరించిన వస్త్రాలు తడుపుకున్నాడు. అది చూసి ద్రౌపది, పాండవులు నవ్వారు.

మయసభ వల్ల మోసపోయి, అవమానం పాలైన దుర్యోధనుడు సిగ్గుపడి, హస్తినకు వెళ్లాడు. ధర్మరాజు ఐశ్వర్యానికి, చక్రవర్తిత్వానికి, పాండవుల పరాక్రమానికి దుఃఖంతో కుమిలిపోయాడు, అమితంగా అసూయ చెందాడు. అతడి దుఃఖ కారణం తెలుసుకున్న శకుని దుర్యోధనుడిని ఓదార్చాడు. పాండవుల సంపదను ఎలా దోచుకోవచ్చో చెప్పమని శకుని మామను సలహా అడిగాడు దుర్యోధనుడు. భవిష్యత్ ప్రణాళిక రచనకు ఇద్దరూ కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లారు.

సంగతి విని ధృతరాష్ట్రుడు అదిరిపడ్డాడు. దుర్యోధనుడి మనస్సులో ధర్మరాజాదుల మీద వున్న అసూయను అర్థం చేసుకున్నాడు. భూమండలం అంతా పాండవుల అధీనంలో వుండగా తానొక రాకుమారిడినై అధికారం లేని దీనుడిలా దీన్ని ఎలా చూడగలనని అన్నాడు దుర్యోధనుడు తండ్రితో. రాజసూయ యాగంలో తనను ధర్మరాజు కానుకలు అందుకునే పనిలో నియమించిన విషయం చెప్పాడు తండ్రికి. ఏఏ రాజు, ఏవిధంగా కానుకలు తెచ్చి ఇచ్చిందీ బాధగా చెప్పాడు. సకల రాజసమూహంలో దాయాదుల అతిశయం చూసి ఓర్వలేక తానెంత కృశించాడో చెప్పాడు. హరిశ్చంద్రుడు చేసిన రాజసూయ యాగం కూడా ధర్మరాజు చేసిన రాజసూయ యాగంతో సరితూగదని అన్నాడు.

దుర్యోధనుడిని ఓదార్చుతూ శకుని, ధర్మరాజు ఐశ్వర్యమంతా మాయాద్యూతం నెపంతో అపహరించి ఇస్తానని అన్నాడు. ధర్మరాజుకు జూదం అంటే ఇష్టమని, కాని అందులోని మోసం తెలియదని, తాను ద్యూతవిద్యలో నేర్పరినని, ధర్మరాజును సులభంగా ఓడించి అతడి రాజ్య సంపదనంతా దుర్యోధనుడికి ఇస్తానని, దుఃఖపడవద్దని అన్నాడు. శకుని అభిప్రాయాన్ని అంగీకరించమని తండ్రి పాదాలమీద పడి కోరాడు దుర్యోధనుడు. మేధావైన విదురుడితో కలిసి ఆలోచిద్దాం అని అన్నాడు ధృతరాష్ట్రుడు.

(“ఇది కురుపాండవ రాజ్య తంత్రంతో ముడివడి ఉన్నందున, తండ్రిగా ధృతరాష్ట్రుడికి శకుని సలహా అగీకారమే అయినా, రాజుగా మంత్రితో చర్చించాలి. కారణం, విదురుడి అంగీకారం ధృతరాష్ట్రుడి ప్రభుత్వ ముద్రకు ముఖ్యం” అని విశ్లేషించారు డాక్టర్ అప్పజోడు వేంకట సుబ్బయ్య గారు).

శకుని ప్రతిపాదించిన మాయాద్యూత ప్రయత్నానికి ధృతరాష్ట్రుడు అంగీకరించకపోతే తక్షణమే అగ్నికి ఆహుతిని అవుతానని బెదిరించాడు దుర్యోధనుడు. అప్పటికప్పుడు శిల్పులను రప్పించి ఒక అమోఘమైన ద్యూత సభానిర్మానం చేయమని ఆదేశించాడు ధృతరాష్ట్రుడు. ఒంటరిగా కలిసినప్పుడు విదురుడికి శకుని, దుర్యోధనుల అభిప్రాయాన్ని చెప్పాడు. తానీ ప్రతిపాదనను అంగీకరించనని స్పష్టం చేశాడు విదురుడు. తలపెట్టిన చెడ్డ పనిని మాన్పించి కురుకులాన్ని రక్షించమని సలహా ఇచ్చాడు. విదురుడు విషయమంతా భీష్ముడికి కూడా చెప్పి ‘జూదం కూడని పని అన్నాడు.

విదురుడికి మాయాద్యూతం సమ్మతం కాదని అన్న తండ్రితో దుర్యోధనుడు, ధర్మరాజుతో జూదం ఆడడం చూడడమే తనకు ఒక యజ్ఞం అన్నాడు. ‘పాండవుల ఐశ్వర్యాన్ని ఏ పద్ధతిని అనుసరించైనా అపహరించాలి అన్నాడు. ధృతరాష్ట్రుడు ససేమిరా జూదానికి ఇష్ట పడలేదు. దుర్యోధనుడు పట్టుబట్టాడు. స్నేహంగా ఆడుకునే జూదం వల్ల దేవతలు కూడా దేవత్వాన్ని పొందుతున్నారని, అందువల్ల జూదాన్ని నడిపించడానికి శకునికి అనుమతి ఇచ్చి ధర్మరాజును హస్తినకు రప్పించాలని దుర్యోధనుడు అనగానే, ధృతరాష్ట్రుడు చాలాసేపు ఆలోచించి, చివరకు అంగీకరించాడు. విదురుడిని పిలిచి, ధర్మరాజును, అతడి తమ్ములను వెంటబెట్టుకుని హస్తినకు తీసుకు రావడానికి ఇంద్రప్రస్థం వెళ్లమన్నాడు. కపట జూదం వల్ల అనర్థం కలుగుతుందని మరీమరీ చెప్పి, దానిని వద్దని అని, ఇక ఈ చెడ్డపని తప్పించుకోవడం తనకు సాధ్యంకాదని నిర్ణయించుకుని, ధృతరాష్ట్రుడి ఆజ్ఞకు తలవంచాడు విదురుడు. ఇంద్రప్రస్థానికి వెళ్లాడు.

ధర్మరాజును చూసి తన రాకకు గల కారణం చెప్పాడు విదురుడు. ధృతరాష్ట్రుడు కట్టించిన ద్యూత సభను చూడడానికి వచ్చి, అందులో జూదం ఆడడం తగునా? అని అడిగాడు ధర్మరాజు. జూదం కారణంగా తమలో తమకు వైరం ఏర్పడక మానదని అంటూనే, ధృతరాష్ట్రుడి ఆజ్ఞ మీరలేక విదురుడి వెంట వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. తమ్ముళ్లతో, ద్రౌపదితో, ధౌమ్యుడు ఇతరులతో హస్తినాపురానికి వెళ్లాడు. వెళ్లిన మర్నాటి ఉదయం కొత్తగా నిర్మించిన అపురూపమైన సభలో సుఖాసీనులయ్యారంతా.

అప్పుడు, స్నేహంగా జూదం ఆడుకుందాం అని దుర్యోధనుడు ధర్మరాజుతో అన్నాడు. మోసం, జూదం క్షత్రియ ధర్మానికి తగినవి కాదని, ధర్మాన్ని ఆచరించే వాళ్లు వీటిని వదిలెయ్యాలని అన్నాడు ధర్మరాజు. మోసపు మార్గాలు అనుసరించే నీచపు జూదగాళ్లతో అసలే జూదం ఆడకూడదని కూడా అన్నాడు. జూదం ఆడే కళలో నేర్పరైన ధర్మరాజు లాంటి వారు జూదాన్ని నిందించడం తగదని అన్నాడు శకుని. ‘భయపడితే మానుకో అని శకుని అనగానే ధర్మరాజు జూదానికి పూనుకున్నాడు. జూదమాడడం తప్పని తెలిసి కూడా దైవ నిర్ణయానుసారం ధర్మరాజు అందుకు అంగీకరించాడు.

తన పక్షాన శకుని జూదం ఆడుతాడని చెప్పి, దుర్యోధనుడు కూచుని జూదం చూడసాగాడు. తనకిష్టమైన పాచికలు రూపొందించుకుని వరుస వెంట శకుని జూదంలో గెల్వసాగాడు. ధర్మరాజు తన సమస్త సంపదలను ఒడ్డాడు. ఓడాడు. పాండవుల సంపదంతా మాయాద్యూతంలో హరించి పోయింది. జరుగుతున్న అన్యాయాన్ని కళ్లారా చూస్తున్న విదురుడు దుర్యోధనుడిని మందలించగా, ఆయన్ను హద్దుల్లో వుండమని, తమకు బుద్ధులు చెప్పవద్దని బదులు చెప్పాడు. పాండవులతో వైరం మంచిది కాదని చెప్పి, విదురుడు మౌనం వహించాడు. పందెం ఒడ్డడానికి ఏమీ లేకపోవడంతో ధర్మరాజు ద్యూతవ్యసనానికి లొంగిపోయి రాజ్యాన్నంతా ఒడ్డి ఓడిపోయాడు. ఆ తరువాత వరుసగా సహదేవ నకుల అర్జున భీమసేనులను ఒడ్డి ఓడిపోయాడు. చివరకు తనను కూడా ఒడ్డుకుని ఓడిపోగా ఇక మిగిలింది ద్రౌపదీదేవి అన్నాడు శకుని. ద్రౌపదిని కూడా ఫణంగా ఒడ్డాడు. శకుని చేతుల్లో ఆమెను కూడా ఓడిపోయాడు. ఇక ఒడ్డడానికి ఏమీలేక దీనమైన ముఖంతో ఆట చాలించాడు.

వెంటనే దుర్యోధనుడు, దాసీజనంతో కలిసి తన ఇల్లు తుడవడానికి ద్రౌపదిని తీసుకురమ్మని విడురుడిని ఆజ్ఞాపించాడు. విదురుడు ఒప్పుకోకపోవడంతో ప్రాతికామి అనేవాడిని పిలిచి, ద్రౌపదిని తీసుకురమ్మని వాడికి చెప్పాడు. విషయం చెప్పి కౌరవేశ్వరుడి దగ్గరికి సభకు రమ్మని ద్రౌపదికి చెప్పాడు ప్రాతికామి. ధర్మరాజు అలా చేసినందుకు ఆశ్చర్యపడిన ద్రౌపది, ‘నా భర్త మొదట తన్నోడి తరువాత నన్నోడి నాడా? లేక ముందే నన్నోడి తరువాత తానోడినాడా?’ అని అడిగింది ప్రాతికామిని. సభకు తిరిగివచ్చి ఆమె ప్రశ్నను ధర్మరాజుకు వేశాడు ప్రాతికామి. ఆయన జవాబివ్వలేదు. ముందామెను సభలోకి తీసుకురమ్మని అన్నాడు దుర్యోధనుడు. ఆమె ప్రశ్న విషయం సభలో తేలుద్దాం అన్నాడు.

ద్రౌపది తాను ధరించిన ఏకవస్త్రంతో, కిందికి వున్న కోకముడితో ప్రాతికామి వెంట సభకు వెళ్లింది. ధృతరాష్ట్రుడి దగ్గర నిలుచున్నది. వెళ్లి ద్రౌపదిని తీసుకురమ్మని దుశ్శాసనుడికి చెప్పాడు దుర్యోధనుడు. తన దగ్గరికి వస్తున్న దుశ్శాసనుడిని చూసి, తాను రజస్వలనని, తనను తాకవద్దని, ఒకే బట్ట కట్టుకుని వున్నానని అని అన్నది ద్రౌపది. ఆ మాటలు వినకుండా దుశ్శాసనుడు ఆమెను బలవంతంగా తల వెంట్రుకలు పట్టి సభకు ఈడ్చి తెచ్చాడు. ద్రౌపది శ్రీకృష్ణుడిని స్మరించింది. అప్పుడు భీమసేనుడు ధర్మరాజుతో, అందరినీ ఓడిపోవడం ఉచితమే కాని, ద్రౌపదిని కపట జూదంలో పందెంగా ఒడ్డవచ్చా? అని అడిగాడు. అన్న అధర్మ మార్గాన నడిచాడన్నాడు.

దుఃఖిస్తున్న పాండవులను, దుశ్శాసనుడి చేత ఈడ్వబడి సభామధ్యంలో వున్న ద్రౌపదిని చూసి దుర్యోధనుడి తమ్ముడైన వికర్ణుడు తీవ్రంగా ఆక్షేపణ తెలియచేశాడు. కురువంశ పెద్దలైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు, కృపుడు మౌనంగా ఉండకుండా న్యాయం చెప్పాలి అన్నాడు. ద్రౌపదిని సభకు తీసుకురావడం అన్యాయమని వికర్ణుడు పలకగానే, కర్ణుడు పెక్కుమంది భర్తలుకల ద్రౌపదిని బట్టలు లేకుండా నగ్నంగా సభకు తెచ్చినా తప్పులేదని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు కలగచేసుకుని, దుశ్శాసనుడిని పిలిచి, పాండవులవి, ద్రౌపదివి వస్త్రాలు లాగి తీసుకొమ్మని ఆజ్ఞాపించాడు. పాండవులు ముందే తమ పైబట్టలు తీసి సభలో నిలిచారు.

దుశ్శాసనుడు నిస్సంకోచంగా ద్రౌపది కట్టుకున్న వస్త్రాన్ని నిండు సభలో విప్పాడు. కాకపోతే శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల అతడు విప్పుతున్నా, ముందు తొలగించబడ్డ వస్త్రం లాంటి వస్త్రమే ఎడతెగకుండా ఆమె వంటిమీద వుండడంతో విప్పలేక ఆగిపోయాడు దుశ్శాసనుడు. అప్పుడు ఆ అవమానాన్ని చూసి భీమసేనుడు కళ్లెర్ర చేశాడు. అందరూ వినేట్లు ఇలా అన్నాడు: (భావి భారత మహా సంగ్రామానికి ప్రాతిపదికైన భీముడి ప్రతిజ్ఞలలో ఇది మొదటిది). 

మ:      కురువృద్ధుల్ గురు వృద్ధ బాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో  

ద్ధురుడై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ

కర లీలన్ వధియించి,  తద్విపుల వక్షశ్శైలరక్తౌఘ ని

ర్ఝర ముర్వీపతి సూచు చుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్

         ఇదిలా వుండగా ద్రౌపది దుఃఖిస్తూ, తానడిగిన ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదని అన్నది. తాను దాసినా? కాదా? తెలియచెప్పమని సభాసదులను మళ్ళీ ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినవాడు ధర్మరాజే అని అన్నాడు భీష్ముడు. అదే సమయంలో, దుర్యోధనుడు ద్రౌపదిని తన తొడలమీద కూర్చోమని సైగ చేశాడు. ఆ సైగను చూసిన భీమసేనుడు అంతా వింటుండగా నిండు సభలో ఇలా అన్నాడు: (భావి భారత మహా సంగ్రామానికి ప్రాతిపదికైన భీముడి ప్రతిజ్ఞలలో ఇది రెండవది).

         ఉ:       ధారుణి రాజ్య సంపద మదంబున గోమలి గృష్ణజూచి రం

భోరు నిజోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు

ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత   

గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్ 

         భీష్మ, ద్రోణ, కృప, విదురులు ధృతరాష్ట్రుడి కుమారులకు కీడు కలిగిందని అనుకున్నారు. జరిగినదంతా తెలుసుకున్న గాంధారి విడురుడిని వెంటబెట్టుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి పోయింది. ధృతరాష్ట్రుడు గాంధారి సలహా మీద దుర్యోధనుడిని ద్రౌపది విషయంలో తప్పుబట్టి, మందలించాడు. ద్రౌపదిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆమెకు ఏమి వరాలు కావాల్నో కోరుకోమంటాడు. ధర్మరాజుకు దాస్యం నుండి విముక్తి చేయాలని మొదటి వరంగా, ఆయన నలుగురు తమ్ములను వారి ఆయుధాలతో, కవచాలతో, గృహాలతో సహా అందరికీ దాస్య విముక్తి చేయాలని రెండవ వరంగా కోరుకున్నది. మూడో వరం కోరుకోమన్నప్పటికీ వద్దని చెప్పింది.

అప్పుడు ధృతరాష్ట్రుడు ఆమె కోరినట్లే అంగీకరించి, ధర్మరాజును ఆయన రాజ్యం తీసుకుని ఎప్పటిలా ఇంద్రప్రస్థ పురానికి వెళ్లి సుఖంగా వుండమని చెప్పాడు. తన కొడుకు చేసిన అపకారాన్ని మరచిపొమ్మన్నాడు. ఆ విధంగా పాండురాజు రాజ్యాన్ని ఆయనకప్పగించాడు ధృతరాష్ట్రుడు.

         ధృతరాష్ట్రుడి ఆజ్ఞానుసారం తమ్ములు, ద్రౌపదితో కలిసి ధర్మరాజు ఇంద్రప్రస్థానికి వెళ్లాడు. దుర్యోధనుడికి ఇదంతా నచ్చలేదు. పాండవులను పునర్ ద్యూతంలో ఓడించి దేశం నుండి వెళ్లగొట్టాలని శకుని, దుశ్శాసనుడు, కర్ణుడితో కలిసి ఆలోచన చేశాడు. దానికి ధృతరాష్ట్రుడు ఒప్పుకుని, మళ్లీ జూదం ఆడడానికి ధర్మరాజును పిలుచుకు రమ్మని ప్రాతికామిని పంపాడు. గతంలో జరిగిన విషయం మరచిపోయి, ధర్మరాజు తమ్ములతో, ద్రౌపదితో కలిసి చాలా ఇష్టంగా హస్తినకు పోయాడు.

         హస్తినలో ధృతరాష్ట్రుడు నిర్మించిన ద్యూత సభలో ఎప్పటిలాగే అంతా కూర్చున్నారు. పందెం ఒడ్డి ఓడిన వారు జింక చర్మం, నార చీరెలు ధరించి, బ్రహ్మచర్య వ్రతం అవలంభించి, పన్నెండేళ్లు అరణ్యవాసం, పదమూడవ ఏట అజ్ఞాతవాసం చెయ్యాలని, అజ్ఞాత వాసంలో బయటపడితే మళ్లీ పన్నెండేళ్లు అరణ్యవాసం, పదమూడవ ఏట అజ్ఞాతవాసం చెయ్యాలని శకుని ధర్మరాజుకు చెప్పాడు. ఒప్పుకున్న ధర్మరాజు పందెం వేసి శకుని చేతిలో అధర్మంగా ఓడిపోయాడు.

         జూదంలో ఓడిన పాండవులు తమ రాజ్య సుఖాలను, బంధుమిత్రులను వదిలి ద్రౌపదీ సమేతంగా, తమతమ ఆయుధాలను ధరించి, హస్తినాపురం నుండి అరణ్యవాసానికి బయల్దేరారు. కుంతీదేవి తన ఇంట్లో వుంటుందని విదురుడు అన్నాడు. అప్పుడు కనిపించిన దుశ్శకునాలను గమనించిన నారదుడు, నాటినుండి పద్నాల్గవ ఏట భారత యుద్ధం జరుగుతుందని, మహా పరాక్రమశాలురైన పాండవులు విజయం పొందుతారని ఆశ్చర్యంగా పలికాడు.

         ఈ విధంగా పాండవులు ఇంద్రప్రస్థపురంలో 23 సంవత్సరాలు రాజ్యం చేసి పాపపు జూదంలో ఓడిపోయి, వేలాది బ్రాహ్మణులు వెంటరాగా అరణ్యవాసానికి వెళ్లారు.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, సభాపర్వం, ప్రథమ-ద్వితీయాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

 

No comments:

Post a Comment