వానరులను సృజించమని దేవతలను నియమించిన బ్రహ్మ
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-54
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (26-04-2021)
విష్ణుమూర్తి యజ్ఞ సభనుండి
అంతర్థానమైన తర్వాత జరిగిన మొదటి కార్యం ప్రాజాపత్య పురుషుడు పాయసం తీసుకొని
ఆవిర్భవించి,
దశరథుడికివ్వడం. ఇక రెండో కార్యం బ్రహ్మ వానరులను సృజించమని
దేవతలను నియమించడం.యజ్ఞంలో హవిర్భావాలను తీసుకొని బ్రహ్మాదిదేవతలు తమతమ స్థానాలకు
మరలిపోయేటప్పుడు,దేవతల క్షేమం కోరి శ్రీమహావిష్ణువు భూలోకంలో జన్మించేందుకు సంకల్పించాడు కనుక, ఆయనకు సహాయపడేందుకు,
బలవంతులను-కామరూపులను-గోళ్ళు,కోరలు ఆయుధాలుగా కలవారిని-అసహాయశూరులను సృజించమని, దేవతలను ఆదేశిస్తాడు బ్రహ్మ.
"పండితులు (హనుమంతుడు
లాంటివారు)-నీతిమంతులు (సుగ్రీవుడు లాంటివారు)-అతిశూరులు-వాయువేగంలాంటి గమనవేగం
కలవారు-ఎందులోనూ అడ్డులేనివారు-విష్ణు పరాక్రమంతో సమానమైన పరాక్రమం
కలవారు-యుద్ధంలో జయింపశక్యంకానివారు-మాయాలక్షణాలు తెలిసినా మాయలుచేయనివారు-అస్త్ర,శస్త్రాలను తెలిసినవారు-ధైర్యవంతులు-భల్లూకాలు, వానరాలు,
గోలూంగాల లాంటి ఆకారంగల వారు-బలాధిక్యంలో దేవతలతో సమానమైన
వారు, కిన్నెర స్త్రీలకు-కింపురుష స్త్రీలకు-వానరస్త్రీలకు-యక్షస్త్రీలకు-దేవతాస్త్రీలకు-పన్నగ
భల్లూక స్త్రీలకు-పేరొందిన ఉత్తమ స్త్రీలకు వానరులుగా సృజించండి. వానరులైతేనే
రాక్షసులను చంపగలుగుతారు. ఇదిలా జరుగుతుందని నాకు తెలుసు. నాకు ఆవలింత
కలిగినప్పుడు జాంబవంతుడనే మహాబల పరాక్రమ సంపన్నుడు నా సంకల్పంతో పుట్టాడు. అతడు భల్లూకాలందరికీ
ప్రభువయ్యాడు" అని బ్రహ్మ దేవతలకు చెప్పాడు. సరేనన్న దేవతలు, బ్రహ్మ అలా చెప్పిపోగానే,సిద్ధులు-సాధ్యులు-కిన్నరులు-కింపురుషులు-ఋషులు-చారణులు-ఖేచరులు
మొదలైన వారందరూ వానర వీరులను, భల్లూక శూరులను
విస్తారంగా పుట్టించారు. వారందరూ, కానల్లో-కోనల్లో-పర్వతాలలో
సంచరించసాగారు.
ఇంద్రుడికి వాలి-సూర్యుడికి
సుగ్రీవుడు-బృహస్పతికి దారుడు-కుబేరుడికి గంధమాదనుడు- విశ్వకర్మకు
నలుడు-అగ్నిహోత్రుడికి నీలుడు-అశ్వనీకుమారులకు మైందద్విదులు-వరుణుడికి
సుశేణుడు-పర్జన్యుడికి శరభుడు-వాయుదేవుడికి మహాబలశాలి, గరుడవేగంకలవాడు,
వజ్రంలాంటి దేహంకలవాడు, ఆంజనేయుడు-రావణాసురుడిని
చంపాలన్న కోరికగల అనేకమంది మహాబలులు, మహావేగంకలవారైన ఎందరో
వానరులు జన్మించారు.
మేరుపర్వతం-మందరపర్వతంతో సమానమైన దేహాలుకలవారు, వీరులలో శ్రేష్ఠులు,
కోరిన రూపం ధరించగల శక్తిగలవారు, విశేష పరాక్రమంకలవారు,
ద్రుఢంగా-రోగాలు-నొప్పులు లేనిదేహంగలవారు, మరెంతో బల పరాక్రమాలున్న గోలాంగూలాలు-భల్లూకాలు-వానరులు లెక్కకు దొరకనంతమంది
జన్మించారు. ఏ దేవతకు ఏ రూపమో-ఏ దేవతకు ఎంతబలమో-ఏ దేవతకు ఎంత దార్ఢ్యమో, అదే రూపంతో-అదే బలంతో-అదే దార్ఢ్యంతో , ఆయా దేవతలకు వానరులు
పుట్టారు. ఋక్షస్త్రీలకు-కిన్నరస్త్రీలకు-పన్నగ స్త్రీలకు-
గరుడస్త్రీలకు-దేవతాస్త్రీలకు-దివ్యర్షి స్త్రీలకు-అప్సర స్త్రీలకు-కింపురుష
స్త్రీలకు-నాగ స్త్రీలకు-సిద్ధ స్త్రీలకు - విద్యాధర స్త్రీలకు-ముని
కాంతలకు-యక్షస్త్రీలకు,
దేవతలు కుమారులుగా జన్మించగా, వారందరూ,
భూమిపై వ్యాపించి, రాళ్లు - చెట్లు - గోళ్ళు
- కోరలు,
ఆయుధాలుగా చేసుకొని, నానా శస్త్రాస్త్ర
ప్రయోగాలను తెలుసుకున్నారు.
(దేవతల పుత్రులు కనుక స్వయంగానే శస్త్రాస్త్రజ్ఞానం కలవారే. కాకపోతే వాటితో
యుద్ధంచేయరు-చేయలేదు కూడా. వారి ఆయుధాలు నఖ-వృక్ష-శిలలు. శస్త్రాస్త్ర జ్ఞానం
పరులనుండి తమను రక్షించుకోవడానికే గాని, ఇతరులపై ప్రయోగించడానికి
కాదు. రామ రావణ యుద్ధంలో,
రామలక్ష్మణులు తప్ప వారి పక్షంలో అస్త్ర యుద్ధం చేసిన
వారెవరూ లేరు. శస్త్రాస్త్రాలు వానరులు ప్రయోగించడం స్వభావ విరుద్ధం. వారలా
చేసుంటే,
వానరులను రావణుడు స్వభావవానరులుకాదనీ - దేవతలనీ
తెలుసుకొనేవాడు. అప్పుడు వారివల్ల రావణుడికి బాధలేదు. దేవతలు పశుపక్ష్యాదులతో
కొక్కోక శాస్త్రం ప్రకారం,
ఆంతర సంభోగం ద్వారా సంతానం పొందారని భావించరాదు. తమ సంకల్ప
బలంతోనే - తామే ఆయా జాతి స్త్రీులయందు, ఆయా ఆకారాలు ధరించి, జన్మించారని అనుకోవాలి. కొంతకాలం పూర్వం, స్త్రీ - పురుష సంభోగం
లేకుండానే,
సంతానం దృష్టి - స్పర్శ - సంకల్పంతో కలిగేదని
విష్ణుపురాణంలో వుంది. రామచంద్రమూర్తి వధించిన వాలి ఆయనకెలా సహాయపడ్డాడని సందేహం
కలగొచ్చు.
వాలి-సుగ్రీవులిరువురూ రామకార్యార్థమే
పుట్టారు. ఇదొక రకమైన ఏర్పాటు. దీనినే "సమయ" మని అని పేరు. వాలి రావణ
వధకొరకు శ్రీరాముడికి సహాయపడేందుకు బదులు, రావణుడితో స్నేహం చేసాడు.
భవిష్యత్ లో రామ కార్యానికి ఉపయోగ పడబోయే సుగ్రీవుడికి హానిచేసి, అతడిని చంపే ప్రయత్నం చేసి, రామ కార్యాన్ని భంగపరచ
తలపెట్టాడు. ఈ కారణాన వాలి రాముడి చేతిలో వధించబడ్డాడు. వాలి వధానంతరం
సుగ్రీవుడితో:"వాలివలె నీవుకూడా సమయము పాటించకపోతే వాడి గతే నీకూ
పట్తుంది"అని రాముడు అంటాడు.ఈ సమయమనేది రామసుగ్రీవులకు ఋశ్యమూకంలోనే
జరిగిందికాదనీ-వాలి సుగ్రీవుల జనన కాలంలోనే జరిగిందనీ మరో కథ వుంది.ఈ విషయం
అంగదుడి ద్వారా తెలిసిందంటారు. వాలి పుట్టకపోతే-పుట్టినా సుగ్రీవుడితో
విరోధించకపోతే-విరోధించినా రాముడి చేతిలో చావకపోతే, రావణాసురుడి వధే జరుగకపోయేది. వాలి జన్మించి సుగ్రీవుడితో విరోధించడం వల్లే
సుగ్రీవుడికి-రాముడికి స్నేహం కలిగింది. అదే, వాలికి-రాముడికి
స్నేహమయినట్లైతే ప్రయోజనంలేకపోయేది.వాలి భయంతో, రావణుడు సీతను రాముడికి
అప్పచెప్పేవాడే. అంటే,
లోకోపద్రవం తగ్గేదికాదు. అపరాధికి శిక్షపడకపోయేది. వాలి
జననం-సుగ్రీవుడితో విరోధం-రాముడి చేతిలో చావు, రామ కార్యమే).
ఇలా జన్మించిన వానరులు, కొండలనైనా పిండికొట్టేందుకు-చెట్ల గుంపులను ఒక్కసారిగా చెదరగొట్టేందుకు-సూర్యుడినైనా
మింగేందుకు-ఒకచేత్తో భూమిని,మరోచేత్తో ఆకాశాన్ని పట్టుకొని తాళం
వేసేందుకు-సముద్రాన్ని బలవంతంగా కలగాపులగం చేసేందుకు,అవసరమైన బల పరాక్రమాలు కలిగి భూమంతా నిండిపోయారు.ఆవానరులు,గాలిలాగా మారి చేతికి చిక్కని మేఘాలను కూడా పట్టుకునే శక్తికలవారు.అడవిలో తిరిగే
మదించిన ఏనుగులనైనా బంధించగలరు.ఆకాశంలో విహరిస్తున్న పక్షులను కూడా
పడగొట్టగలరు.వారు కోరిన రూపాలు ధరించగలరు.తేజంతో ప్రకాశిస్తూ-బుద్ధివల్ల
పూజించబడుతూ-కీర్తిమంతులుగా-మంచి ధైర్యవంతులుగా-భయంకర వేగంతో- గొప్ప
శౌర్యంతో-పరాక్రమంతో ఆ వానర సేనానాయకులందరూ భూమిపై తిరగసాగారు. ఆ సేనానాయకుల
గుంపులలో,మిక్కిలి గొప్పవారైన సుగ్రీవుడులాంటివారు,వారికి నాయకుడై
వుండసాగారు.
ఈ వానరులకు కూడా ధైర్యవంతులు, శౌర్యవంతులు,
స్వామికార్యధురీణులు పుట్టారు. ఈ వానరులలో కొందరు ఋషవంతంలో,ఇతరులు వివిధ కొండ శిఖరాలలో,మరికొందరు అడవులలో సంచరించసాగారు. ఈ
వానర సమూహాలను రక్షించుతూ-వారందరికీ,ఇంద్రకుమారుడైన వాలి
రాజుగా వున్నాడు. యువరాజుగా సుగ్రీవుడు, మంత్రులుగా
హనుమంతుడు-నీలుడు-నలుడు వుంటూ శత్రు భయంకరులుగా ప్రసిద్ధిగాంచారు. వానరులలో కొందరు
వీరిని,వేరేవారిని మరికొందరు సేవిస్తూ వుండేవారు.గరుత్మంతుడితో సమానమైన వేగం కలవారు,యుద్ధంలో నిపుణులు,
నానా విధ దేవతల నానా విధ వేషాలను-చిహ్నాలను ధరించిన వానరులు, పులులకూ,
సింహాలకూ, సర్పాలకూ కూడా భయం
కలిగించే విధంగా అడవుల్లో తిరిగేవారు. మేఘ సమూహాలవలె బలసినవారై, కొండ శిఖరాలలాగా ఉన్నత దేహాలు కలిగి, బల గర్వాలతో, భయంకర ఆకారాలతో,
శ్రీరాముడికి సహాయం చేసేందుకొరకు జన్మించారా వానర
శ్రేష్ఠులు.
No comments:
Post a Comment