Monday, August 8, 2016

రాముడు లేక ద్వారము తెరవని పుణ్యస్థలమైన అయోధ్య ...... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 11 వ భాగం అయోధ్య కాండ : వనం జ్వాలా నరసింహా రావు

(Recovered and Reloaded)

రాముడు లేక ద్వారము తెరవని పుణ్యస్థలమైన అయోధ్య
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
11 వ భాగం అయోధ్య కాండ

వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (11-07-2016)

దశరథుడికి ఉత్తరక్రియలు చేసిన భరతుడు, రాజకర్తలు అతడిని పట్టాభిషేకం చేసుకొమ్మని కోరినప్పటికీ, ఒప్పుకోక, అరణ్యవాసంలో వున్న శ్రీరాముడిని తీసుకొచ్చేందుకు అడవులకు ప్రయాణమైపోతాడు. పాదచారియైన భరతుడు రామాశ్రమాన్ని వెతికి, ఆయన్ను దర్శించుకుంటాడు. కుశల ప్రశ్నలనంతరం భరతుడు శ్రీరాముడికి దశరథుడు మరణించిన సంగతి తెలియచేస్తాడు. దశరథుడు మరణించిన విధానాన్ని రాముడికి చెప్పడానికి "తరలము" వృత్తంలో పద్యం రాసారు వాసు దాసుగారిలా:

తరలము:       నినుఁ దలంచియ యేడ్చుచున్ మరి నీదు దర్శనకాంక్షి యై,
                నినుఁ దలంగకయున్న బుద్ధిని  నేర కేమియుఁ ద్రిప్పఁ గా,
                ననఘ ! నీవిడనాడుటన్, భవ దార్తిపీడితుఁ డౌచు, నీ
                జనకుఁ డక్కట  యస్తమించెను  జాల నిన్నె స్మరించుచున్ -37
ఛందస్సు:      తరలమునకు స-భ-ర-స-జ-జ-గ గణాలు. 12 వ అక్షరం యతి.

తాత్పర్యం:     అన్నా ! నీ తండ్రి నిన్ను తలచుకుంటూ, ఏడ్చి-ఏడ్చి, నిన్ను చూడగోరి అది లభించనందున, నీ పైనే బుద్ధి దృఢంగా నిలిపి,దానిని మరలించ లేక, నువ్వు వదిలి వచ్చిన కారణాన నీ వియోగ బాధవల్ల, కష్ట పడుతు, రామా-రామా అంటూ నిన్నే స్మరించుకుంటు అస్తమించాడు. (దశరథుడి మరణ వార్తను కైక భరతుడికి చెప్పిన విధానానికి, భరతుడు రాముడికి చెప్పిన పద్ధతికి తేడా వుంది. తండ్రి మరణానికి కారణభూతుడు రాముడేనన్న అర్థం స్ఫురిస్తుంది కూడా. ఆయన చేసిన పని సరైందికాదని భరతుడి అభిప్రాయంగా చెప్పించాడు కవి. రాముడవై లోకాన్ని సంతోషపెట్టే బదులు దుఃఖపెడుతున్నావని భావన).

అయోధ్యకొచ్చి రాజ్యమేలమన్న భరతుడి ప్రార్థనను తిరస్కరించిన శ్రీరాముడు, తనకు బదులుగా తన పాదుకలను ఇచ్చేందుకు అంగీకరించాడు.అవి తీసుకొని భరతుడు అయోధ్యకు ప్రయాణమై పోతూ, దారిలో యమునా నదిని, గంగను దాటి శృంగిబేరి పురం గుండా సాగిపోతూ, అన్న-తండ్రి లేని,సంతోషహీనమైన అయోధ్యను వర్ణించడానికి "నిరానందయైన అయోధ్యాపురి వర్ణన" అన్న పేరుతో "మధురగతిరగడ" లో పద్యాన్ని రాసారు కవి ఇలా:

మధురగతిరగడ:      
పిల్లలు గూబలు పెల్లవుదానిని, మల్లడిగొను కరి మనుజులదానిని
శ్రీ లరఁ జిమ్మని చీఁ క ట్లలమఁ గఁ , గాలనిశాగతిఁ , గ్రాలెడిదానిని
గ్రహపీడితశశి కాంతారీతిని, మహమరి తేజము మలిగినదానిని
నిగిరిన క్రాఁ గిన యించుకనీళ్లను, సెగలను బొగిలెడి చిరువిహగములను
విలయముఁ గాంచువి విధమత్స్యములను, సెలయే రనఁ గను జెలఁ గెడిదానిని
సవమున బంగరు చాయల మండుచు, హవిసున నణఁ గిన యగ్నిని బోలుచుఁ
జెదరినగజములు జిట్లినధ్వజములు, బదరినవాజులు బగిలిన తేరులుఁ
గలిగి విరోధులు కలఁ చిన బెగ్గిలి, కలఁ గినదం డనగా దగుదానిని
ఫేనము ధ్వానము పెల్లయి పెద్దతు, పానును గాలియు బరిశాంతముగా
స్తిమితతఁ గాంచిన సింధుతరంగము, గుమి నా మ్రోఁ తలు గూడనిదానిని
యజనాంతంబున యాజకయూథము, యజనాయుధములు నన్నియుఁ బాయగ
వీతరవం బగు వేదిని బోలుచు, వాతతజనశూన్యం బవుదానిని
దినఁ బచ్చికఁ దలదిరముగ వ్రాల్పక, పెనుగోడియచన వెతలం గొనియెడి
గోవులమందనఁ గూడినదానిని, శ్రీవిలసితమయి స్నిగ్దతరం బయి
తేజును గూడుచు దివ్యతరం బయి, రాజిలునుత్తమ రత్న శ్రేణులు
తీరఁ గ రాలినఁ దేజము దూలిన, హార మొయనఁ గొమ రారినదానిని
జలిపినపుణ్యము క్షయ మయి పోవఁ గ, నిలఁ బడు చుక్కను నెనసినదానిని
బంభర కోటులఁ బలుసూనంబుల, సంభరిత మయి వసంతముకడపలఁ
గారున నగ్గికి గమరినతీఁ గల, తీరునఁ గాంతులు దీరిన దానిని
బేరము సారము పేరును లేమిని, ద్వారము తెరవని పణ్యస్థలమై
మరుఁ గఁ గఁ జుక్కలు మబ్బున శశితో, నెరిమాసినయా నిశ నగుదానిని
నుత్తకడవలును నుత్తపిడుతలును, గత్తరఁ గెడసిన కలుమందిరమున
దొరలెడికుండలుఁ దూలెడి గోడలు, జరుగుచుఁ బాడరు చలిపందిలి యన
వీరుని బెడిదపు వింటను నెక్కిడ, నారసమో యన నరకఁ గ వైరులు
బిగి చెడి నేలను వ్రీలినజ్యాలత, వగ వగ చెడి జిగి పాసినదానిని
నాహవశూరుం డశ్వవిభాండస, మూహంబులచేఁ బొలుపుగఁ దీర్చియుఁ
గలనికి నుపయోగము గా కుండుట, తొలఁ చు కిశోరము తోఁ బో ల్దానిని
గఛ్చపమత్స్యని కాయములొప్పఁ గ, నఛ్చం బయి శుష్కాంబుక మగుచును
గూలము దొరలగ గువలము వెడలఁ గ, హాళి చెడినకూ పాళిని బోలుచు
వగపునఁ జిర్చా భరణ విహీనుని, జిగిచెడు మే ననఁ జెలఁ గిన దానిని
జడికారున బహు జలధరసంతతి, విడువక క్రమ్మ ర విప్రభ నాఁ గను
నొప్పుచు నున్నయయోధ్యనుగనుగొని, యప్పుడు భరతుండలమటఁ జొచ్చెను                                                                            -38


ఛందస్సు:      నాలుగు మాత్రలు నాటిన గణములు, నాలుగు రెంటికి నలి విరమణలు గలసి మధురగతి కనలును జగణము, తొలగిన ధృతకౌస్తుభ కవిరమణము
అయోధ్యా కాండాంతంలో రెండు పద్యాలను "వనమంజరి" లోను, "కమల విలసితము" లోను రాసారు కవి. మొదటి పద్యంలో రాముడిని స్తుతిస్తూ రాయగా, రెండవ పద్యంలో కాండలో వున్న పద్యాల సంఖ్య 2604అనే అర్థం స్ఫురించే విధంగా రాసారు.

వనమంజరి:             గురుజనవాక్య సమాచరణాసమ కోపకామవిహీనధీ
                పరమకృపాశ్రయ నిశ్చలచిత్తక భ్రాతృవత్సల కామదా
                విరహిత దుఃఖసుఖాంతరచేతన విశ్వసన్నుత భూధవా
                నిరుపమదర్మవిధాయి దయామయ నిత్యహర్ష గుణోజ్జ్వలా -39

ఛందస్సు:      వనమంజరికి న-జ-జ-జ భ-ర గణాలు. 14 వ అక్షరం యతి.

తాత్పర్యం:    
తండ్రి వాక్యాన్ని పరిపాలించడంలో అసమానమైన వాడు-కీడుచేసిన వాడిమీదకూడా కోపంగాని, కామంగాని లేని బుద్ధిగలవాడు-ఉత్తమమైన దయకు నిలువనీడైనవాడు-ఎంత విపత్తు వచ్చినా, సంపత్తు వచ్చినా చలించని మనస్సుగలవాడు-సోదర ప్రీతికలవాడు-కోరినవారి కోర్కెలను తీర్చువాడు-ఇది సుఖమని, దుఃఖమని అంతఃకరణలో లేనివాడు-సమస్త ప్రపంచం పొగిడేవాడు-భూమికి భర్తైన వాడు-అసమానమైన ధర్మాన్ని అనుష్టానంతో విధించువాడు-దయాస్వరూపుడు-ఎప్పటికీ సంతోషమే కలవాడు-సౌశీల్య, సౌలభ్య కృతజ్ఞతాది కల్యాణగుణాలతో ప్రకాశించేవాడు శ్రీరాముడని అర్థం.

కమల విలసితము:            భువనదిఖరజ ముఖనయనాంక
                        ప్రవిదితపురకృత ప్రథితచరిత్రా
                        దివిజమనుజనుత స్థిరతరచిత్తా
                        ధవవర భవహర దశరథపుత్రా -40
ఛందస్సు:      కమల విలసితమునకు న-న-న-న-గ- గ గణాలు.


తాత్పర్యం:    భువనధికి అర్థం సముద్రం. ఇది నాలుగు (4) అంకెను సూచిస్తుంది. "ఖ" అంటే, ఆకాశం. ఇది సున్నాను (0) సూచిస్తుంది. శరజముఖకు కుమార స్వామి ముఖాలని అర్థం వస్తుంది. ఇది ఆరవ (6)అంకెను సూచిస్తుంది. నయన అంటే కళ్ళని అర్థం. ఇది రెండు (2) అన్న అంకెను సూచిస్తుంది. ఇవన్నీ కలిపితే 4062 అని ఏర్పడుతుంది. దీన్ని తిప్పి చదివితే 2604 వస్తుంది. అయోధ్య కాండలో 2604 పద్యాలున్నాయని అర్థం స్ఫురించేలా ఈ వృత్తాన్ని రాశారు కవి.


No comments:

Post a Comment