Monday, August 8, 2016

మహోద్యమమే మానవతావాదం : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
మహోద్యమమే మానవతావాదం
నవ తెలంగాణ (23-06-2016)
వనం జ్వాలా నరసింహారావు

మానవతావాదం అనాదిగా సాగుతున్న ఒక మహోద్యమం. విజ్ఞాన సముపార్జనకవసరమైన సూక్ష్మాతిసూక్ష్మ విషయాలకు సంబంధించిన ప్రతి అంశం, సంస్కృతీ-సాహిత్యాల సాంప్రదాయిక నేపధ్యం మీదనే ఆధారపడి వుండే రీతిలోనే మానవతావాద ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. మేధావులు, సాహిత్యాభిలాషులు, శాస్త్రీయ దృక్ఫధంతో ఆలోచన చేసిన పలువురు, శతాబ్దాల పూర్వమే, మానవ విలువల పరిరక్షణకు ఆరంభించిన ఆ మహోద్యమం ఈ నాటికీ ప్రత్యక్షంగా-పరోక్షంగా వాటిని కాపాడేందుకు దోహదపడుతూనే వుంది. క్రైస్తవమత మానవతావాదమనీ, సాంస్కృతిక మానవతావాదమనీ, సాహితీ మానవతావాదమనీ, రాజకీయపరమైన మానవతావాదమనీ, మతపరమైన మానవతావాదమనీ రకరకాల పేర్లతో-ఎవరికి నచ్చిన విధంగా వారు పిలువసాగారు. రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది. అలా కానప్పుడు, ఏదో ఒక రూపంలో, మానవ విలువలు కాపాడబడేందుకు నిరంతర పోరాటం జరుగుతూనే వుంటుంది. ఆ పోరాటానికి మొదలు-చివర అంటూ ఏమీలేదు. పండితులైనా-పామరులైనా సంభాషించుకునేది వ్యావహారిక భాషలోనే గాని గ్రాంథికంలో కాదు. రచయితకు, పాఠకుడికి మధ్య వుండాల్సిన సంబంధం సంభాషణ లాంటిదే. ఇరువురు మాట్లాడు కుంటున్నప్పుడు ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థంకాకపోతే సంభాషణకు అర్థంలేదు. పదిమందితో చదివించగలిగిన రచనే సాహిత్యమవుతుంది. రచయిత రాసింది పాఠకుడికి అర్థంకాకపోతే అసలు భాషే కాదంటాడు జీన్ పాల్ సాత్రే తన "సాహిత్యం అంటే ఏంటి" అన్న పుస్తకంలో. "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న విషయం అందరికీ తెలిసిందే. రచనంటే కేవలం సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు. ఉత్పత్తిదారుడుకీ (రచయిత), వినియోగదారుడుకీ (పాఠకుడు) మధ్య తలెత్తనున్న ఘర్షణ.

దక్షిణాది ప్రాచీన భాషలైన తమిళం, తెలుగు సాహిత్యాల మధ్యనున్న సంబంధం, వాటిని మాట్లాడేవారి మధ్యనున్న అనుబంధం, మానవ విలువలపై ఎంతగానో ప్రభావం చూపిందనాలి. అతి ప్రాచీనకాలంనాటి భాషల్లో ఇప్పటికీ వాడుకలో వుండి, వ్యావహారిక భాషగా-సాహిత్యంగా ఉపయోగంలో వున్న వాటిలో తమిళం, తెలుగు భాషలను పేర్కొనాలి. సంస్కృతం, లాటిన్ భాషల్లో సంభాషించు కోవడం దాదాపు లేనట్లే. కొద్ది మార్పులతో గ్రీకు భాష ఇంకా వాడుకలో వుందనాలి. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు వారిప్పుడు నివసించని ప్రదేశమంటూ లేదు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలాగా తెలుగువాడి ప్రాంతమయింది. కేవలం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోనే కాకుండా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్.. .... .... ఇలా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు, అమెరికాతో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న తెలుగువారు ఎందరో వున్నారు. ఈ మధ్యనే ఎవరో అన్నారు... .... ... ఒకనాటి ముక్కోటి తెలుగువారు, ఆరుకోట్లకెదిగి, ఎనిమిదికోట్లు దాటి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది-ఇరవై కోట్లకు చేరుకున్నారని. ఎవరి లెక్కలు వారివి. అమెరికా కాలిఫోర్నియా లోని సిలికాన్ వాలీనిప్పుడు తెలుగు వాలీగా పిలవాలి.

తెలుగువారు నివసించే ఏ ప్ర్రాంతంవారైనా మాట్లాడే భాషను "తెనుగు" అని, "తెలుగు" అని, "ఆంధ్రము" అని అంటాం. ఈ ప్రాంతంలో నివసించేవారిని ఒక తెగగానో, సమాజంగానో, దేశీయులుగానో గుర్తించేందుకు బహుశా అలాంటి పదప్రయోగం చేసుండాలి. భాషాపరమైన పదప్రయోగాలు చాలాకాలం తర్వాతే వాడబడ్డాయి. దక్షిణ దిక్కును తెలిపే "తెన్" అనే ద్రావిడ పదం ఆధారంగా "తెనుగు" ఉత్పన్నమైందని కొందరు భాషా కోవిదుల అభిప్రాయం. ద్రావిడులు తెలుగుదేశానికి ఉత్తర దిక్కుగా నివసించారని తెలియచేసే ప్రయత్నంలోనే, దక్షిణాది వారు మాట్లాడే భాషను "తెనుగు" అని సూచించారు. కాకపోతే శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు ఆ సూచనకంతగా లభ్యంకాలేదు. "త్రి లింగ" నుండి తెలుగు ఆవిర్భవించిందని అందరూ అనుకుండేదే. త్రి లింగ కూడా "త్రి-కళింగ" నుండి వచ్చిందే. ఒక తెగవారినో, భాష మాట్లాడేవారినో, సంస్కృతిని పాటించేవారినో పరోక్షంగా ప్రస్తావించడానికి అలా వాడి వుండవచ్చు. లేదా గుర్తించడంలోనే పొరబడి వుండవచ్చు. మధ్య ప్రాంత ద్రావిడ జాతికి చెందిన గోండ్-భిల్లీ భాషలకు, తెలుగుకు అవినాభావ సంబంధముందని కొందరంటారు.


ఆదిమానవులు తొలిరోజుల్లో ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే తెలుగు మాట్లాడే ప్రాంతంలో కూడా, అత్యధిక సంఖ్యలో జంతువులను ఆరాధించి-పూజించే వారు. జంతువు లక్షణాలను-గుణాలను దైవానికి ఆపాదిస్తూ, ఆ దైవాన్నే పూజించే "జూమోర్ఫిజం" అనే మతాన్ని అనుసరించేవారు. భగవంతుడిని సగం జంతువు గానూ, సగం మనిషి ఆకారంలోనూ కొలిచేవారు. ఉదాహరణకు నరసింహుడు, హనుమంతుడు చెప్పుకోవచ్చు. తర్వాత కాలంలో "టోటమిజం" లాంటి సిద్ధాంతం వాడుకలోకి వచ్చింది. మానవులకు జంతువులతోనూ-వృక్షాలతోనూ, జన్మజన్మల అవినాభావ సంబంధముందని నమ్మేవారు దానిని నమ్మినవారు. దాని స్థానంలో గ్రామ దేవతలను ఆరాధించడం మొదలయింది. దేశ ద్రిమ్మరులుగా వుండే తెగలవారు వ్యవసాయం వృత్తిగా జీవించడం మొదలుపెట్టడంతో, వర్షాలు పడడానికి, పంటలు పండడానికి, సుఖ జీవనం గడపడానికి రకరకాల రూపాలలో గ్రామ దేవతలను కొలిచేవారు. మైసమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, పొలిమేర దేవత లాంటి పేర్లతో పిలిచేవారు. జంతు బలీ ఇచ్చేవారు.

దక్కన్ పీఠభూమినే దక్షిణాపథం అనేవారు. దానికి ఆగ్నేయ దిక్కుగా ఆంధ్ర ప్రాంతముంది. వింధ్య పర్వతాలను దాటి దక్షిణ ప్రాంతానికి తొలుత వలస వచ్చిన ఆర్యుడు అగస్త్య మహాముని అంటారు. శివలింగాన్ని మొదట కనుగొన్నది ఆయనేననీ, అందువల్లనే ఆంధ్రలోని ఎన్నో శివాలయాలలో వున్న శివలింగాలను అగస్త్యేశ్వరం అనికూడా పిలుస్తారని అంటారు. ఆపస్తంబ ధర్మ సూత్రాల ప్రకారం, క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో, ఆంధ్ర ప్రాంతంలో వైదిక మతం వేళ్లూనుకోసాగింది. భగవత్-భాగవత మతం కూడా ప్రచారంలోకి వచ్చింది. శ్రీకృష్ణుడి బోధనలను తెలియచేస్తూ, క్రమేపీ వైష్ణవ మతంగా రూపాంతరము చెందిందే భాగవత సిద్ధాంతం. సాంఖ్య-యోగ ఆధారంగా భాగవతమతం వుందని భావించినప్పటికీ, దాంట్లో తాత్త్విక చింతనకు సంబంధించిన పలు అంశాలు నిగూఢంగా వున్నాయి వాస్తవానికి. కులాలకు అతీతంగా, అన్ని కులాలవారు పాటించే మతంగా భాగవతం మొదట్లో ప్రచారంలో వున్నప్పటికీ, బ్రాహ్మణుల జోక్యంతో, బ్రాహ్మణ్యం ఆవిర్భవించడంతో, భాగవత మతం, బ్రాహ్మణ్యం కలిసిపోయాయి. కులాల గుర్తింపు మొదలయింది. ఆంధ్ర ప్రాంతంలో అతిపురాతనమైంది, ఎక్కువమంది అనుసరించేది శైవమతం. దాని ప్రభావం కూడా ఎక్కువే. అలానే శాక్తేయ మతాన్ని కొందరు అనుసరించేవారు. వీరశైవం వున్నా దాని ప్రభావం అంతగా లేదనవచ్చునేమో. బ్రాహ్మణుల మూలాన భాగవతమతం వారి చేతుల్లోకి పోయినప్పటికీ, బ్రాహ్మణుడి కర్తవ్యం సాధారణంగా వైదిక పూజలు జరిపించడానికే గాని, కులాధిక్యకతకు ప్రతిరూపం కావడం మాత్రం కాదనాలి.

తెలుగు మాట్లాడేవారి మతపరమైన నమ్మకాలు-సంప్రదాయాలు తెలుగు భాషమీద, అదేవిధంగా తెలుగు భాష మతపరమైన చారిత్రాకాంశాలమీద ప్రభావం చూపించి వుండాలి. రాజుల-చక్రవర్తుల ప్రోత్సాహంతో, స్వయంగా వాళ్లే ఒక మతాన్ని నమ్మి అనుసరించడంతో, దాని ప్రభావం జన బాహుళ్యం పైనా, వారి జీవన శైలి పైనా, మానవ విలువల పైనా స్పష్టంగా పడసాగింది. పర్యవసానంగా వైదిక మతం మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానంగా, ఎవరికైనా ఆ సిద్ధాంతాలు పాటించడం తేలికైనటువంటిదిగా, అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. అదే హిందు మతంగా వాడుకలోకొచ్చింది. బహూశా ఎన్నో మతాలకు మాతృకయింది. ప్రపంచ భాషలకు సంస్కృతం ఎలానో, ప్రపంచంలోని మతాలన్నిటికీ హిందు మతం అలానే మాతృకనాలి. అందుకేనేమో మార్క్స్ తన గతి తార్కిక భౌతికవాదంలో ఎన్నో సందర్భాల్లో పరోక్షంగా వైదిక సిద్ధాంతాలను అన్వయించుకుంటాడు. ఒక్కో యుగంలో ఒక్కోరకంగా తెలుగు భాష వాడుకలో వుందని కొందరి నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా కలియుగంలో తెలుగును "కళింగ ఆంధ్ర భాష" అనీ, "రౌద్ర ఆంధ్ర భాష" అనీ ఏర్పాటుచేసింది శాతకర్ణులకు చెందిన నందివర్ధనుడు-ఆయన శిష్యుడు దేవలరాయ అని అంటారుఇలా ఇంతవరకూ చెప్పుకున్నవాటిలో కొన్ని విన్నవీ-కన్నవీ కావచ్చు, ఇంకొన్నిటికి ఆధారాలుండవచ్చు, మరికొన్నిటికి బలమైన సాక్ష్యాధారాలు లేకపోవచ్చు--- ---- ---- వాస్తవాలూ కావచ్చు. అయితే ఈ నమ్మకాల్లో, గాథల్లో, మౌఖికంగా ప్రచారంలో వున్న వాటిల్లో, కొంతలో కొంత వాస్తవం వుందనేది మాత్రం వాస్తవమే. భాషకున్న వ్యాకరణ నిర్మాణం-నిబంధనలు-మౌలికమైన పదజాల ఒరవడిని పరిగణలోకి తీసుకొని, తెలుగు భాషను అతి ప్రాచీనమైన ద్రావిడ జాతి భాషలకు చెందినదిగా శాస్త్రవేత్తలు-పరిశోధకులు-భాషా కోవిదులు-పండితులు నిర్ణయించారు. మధ్య ప్రాంత ద్రావిడ జాతి భాషల్లో బహుశా తెలుగు ఒక్కటే అతిపెద్ద వాడుక భాషగానూ, భౌగోళికంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన భాషగానూ, ఉత్తర-దక్షిణాల మధ్య వారధిగా వుండే భాషగానూ, ఆర్యుల-ద్రావిడుల మధ్య వారధిగా వుండే భాషగానూ పేర్కొనడం అతిశయోక్తికాదేమో.

ద్రావిడ భాషకు చెందినదే అయినప్పటికీ, తెలుగుపై సంస్కృత భాష ప్రభావం అధికంగా వుంది. వాడుకభాషపైనా, గ్రాంథిక భాషపైనా కూడ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అచ్చ తెలుగులో రచనలు చేసినవారు అరుదనాలి. అందుకే మనందరికీ కవిత్రయం నన్నయ-తిక్కన-ఎర్రా ప్రగడ అయితే, శ్రీ శ్రీ గారి కవిత్రయం మాత్రం తిక్కన-వేమన-గురజాడలు. తెలుగు భాషపై సంస్కృతం ప్రభావం పడకుండా అభిమానం చూపిన మొదటి వాడు తిక్కన అని శ్రీ శ్రీ అభిప్రాయం. ఇక ఆధునిక కాలంలో తెలుగు భాష వాడకంలో-ఉపయోగంలో హద్దులనేవి గాని, ఎల్లలనేవి గాని అసలు లేనేలేవు. ఒక వైపు సంస్కృతం ప్రభావం ఇంకా తెలుగు మీద పడుతున్నప్పటికీ, ఎక్కువ ప్రభావం ఆంగ్ల భాషదే అనాలి. నాగరికులందరూ ప్రస్తుతం మాట్లాడుతుండే తెలుగును "తెంగ్లీష్" అనాలి-ఎందుకంటే, అది ప్రధానంగా తెలుగు-ఇంగ్లీషులు కలిపిన భాష కాబట్టి. తమిళం అంతే. ఇంగ్లీష్ పదజాలం లేకుండా ఈ రోజుల్లో బహుశా ఏ భాషా లేదేమో. "వేర్ సెంచరీస్ కో ఎగ్జిస్ట్" అనే భారత ఆంగ్ల సినిమాను రూపొందించిన కృష్ణస్వామి "ఇంగ్లీష్ భారతీయ భాషనీ-దక్షిణ భారతీయ భాషనీ" అంటాడు.


ఇలా మతం, భాష, సాహిత్యం దేని కవే మానవ విలువల పరిరక్షణకు దోహదపడుతున్నాయి. మనిషి తాను భగవంతుడితో మమేకం కావడానికి, తన మూర్తిని భగవంతుడిలో-ఆయన మూర్తిని తనలో చూసుకుంటూ, తద్వారా క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం పాటుపడుతూనే వుంటుంది.End

No comments:

Post a Comment