Saturday, August 6, 2016

రామా చూచితి సీతను... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు...(మూడవ భాగం) :వనం జ్వాలా నరసింహా రావు

(Recovered and Reloaded)

రామా చూచితి సీతను...
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు  
       వనం జ్వాలా నరసింహా రావు
(మూడవ భాగం)
సూర్య దినపత్రిక (09-05-2016)

భరతుడు తన ఆజ్ఞ ప్రకారం తన పాదుకలను తీసుకుని అయోధ్యకు పోయిన తర్వాత అక్కడి పురజనులు తానిక్కడున్నానని తెలిసి వీలున్నప్పుడల్లా తన్ను దర్శించడానికి వచ్చే అవకాశం వుందని గ్రహిస్తాడు రాముడు. దానివల్ల ఆశ్రమవాసుల తపస్సుకు భంగం కలుగుతుందని భావిస్తాడు. ఈ అలోచనరాగానే, ఇంద్రియాలను జయించిన సత్యస్వరూపుడైన రామచంద్రుడు దండకారణ్యం చేరుకుంటాడు. విరాధుడిని చంపుతాడు.శరభంగుడిని దర్శిస్తాడు. సుతీక్షణుడిని చూస్తాడు. అగస్త్యుడిని, ఆయన తమ్ముడు సుదర్శనుడిని దర్శిస్తాడు. అగస్త్యుడు చెప్తే, ఆయన దగ్గరున్న ధనస్సును, ఖడ్గాన్ని, రెండంబుల పొదలను, పదునైన అక్షయ శరాలను సంతోషంగా తీసుకుంటాడు. మునీశ్వరుల దగ్గరుంటూ, వాళ్ల కోరిక మేరకు వారి తపస్సు భంగం చేసే రాక్షసులను సంహరిస్తానని అభయమిస్తాడు రాముడు.

పంచవటిలో సీతారామ లక్ష్మణులు తమ ఇష్టప్రకారం తిరిగే సమయంలో, జన స్థానంలో నివసించే కామ రూపిణి-భయంకర రాక్షస స్త్రీ-శూర్పణఖ, ముక్కు చెవులు కోసి వికార రూపం వచ్చేటట్లు చేస్తాడు లక్ష్మణుడు. ఇది తెలిసిన జన స్థానంలోని ఖర-దూషణ-త్రిషిరుడితో సహా పద్నాలుగు వేల రాక్షసులు వీరిపైకి యుద్ధానికి వస్తారు. లక్ష్మణుడి సహాయం లేకుండానే, రణరంగంలో పరాక్రమవంతుడైన రామచంద్రమూర్తి, పద్నాలుగు వేల మందినీ, కేవలం భుజబలంతోనే వధిస్తాడు. తన బంధువుల మరణ వార్త విన్న రావణుడు, కోపంతో, తనకు సహాయం చేయమని మాయలమారి రాక్షసుడు మారీచుడిని ప్రార్థిస్తాడు. మహా బల పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రమూర్తితో యుద్ధం చేయడం కీడని రావణుడికి సలహా ఇస్తాడు మారీచుడు. ఆ ఆలోచన మాను కొమ్మని బోధిస్తాడు. మృత్యువు ప్రేరేపిస్తుంటే,వాడిని తీసుకొని సీతారాములున్న చోటికి పోతాడు రావణుడు. వంచన చేసే స్వభావం కలిగిన మారీచుడు బంగారువన్నెగల జింక రూపంతో సీతకు కనిపిస్తాడు. ఆ జింక కావాలని సీత కోరితే, దాన్ని తేవడానికి పోయిన రాముడు అస్త్రంతో వధిస్తాడు. చస్తూ ’హా లక్ష్మణా’ అని అరుస్తాడు మారీచుడు.ఆ ధ్వని విన్న లక్ష్మణుడు అన్నకు సహాయం చేద్దామని వెళ్తాడు. ఒంటరిగా వున్న సీతను అపహరించుకుని పోతూ త్రోవలో అడ్డుపడ్డ జటాయువనే గద్దను చంపి లంకకు చేరి సీతను అశోక వనంలో వుంచుతాడు రావణుడు.

సీతను విడిపించే ప్రయత్నంలో రావణాసురుడి చేతుల్లో దెబ్బతిని,చనిపోవడానికి సిద్ధంగా వున్న జటాయువును చూసి, ఆయన ద్వారా తన భార్యాపహరణం గురించి విని ఎంతో బాధపడ్తాడు రాముడు. తన తండ్రికి ఎలాచేయాల్నో అదే రీతిలో, చనిపోయిన జటాయువుకు దహనసంస్కారాలు చేశాడు రాముడు. తనవల్ల కదా జటాయువుకింత దుఃఖం కలిగిందని బాధపడి విలపిస్తాడు.

 అడవులన్నీ వెతుక్కుంటూ పోయి, శ్రీరాముడు భయంకర-వికార స్వరూపుడైన కబంధుడనే రాక్షసుడిని చంపి దహనం చేసాడు. శాప విముక్తుడైన కబంధుడు, పంపా తీరంలో వున్న శబరిని చూసిపొమ్మని బోధించాడు. ఆమె శ్రేష్ఠ ధర్మమైన గురు శుశ్రూషను ఆచరించేదనీ, అతిథి పూజలాంటి సకల ధర్మాలను ఎరిగినందున, ఆ బోయసన్యాసినిని తప్పక చూడమనీ అంటాడు.

శత్రుసంహార దక్షుడైన రాజకుమారుడు శ్రీరామచంద్రమూర్తి శబరిని కలిశాడు. ఆమె నిండు శ్రద్ధా భక్తులతో సమర్పించిన ఆతిథ్యాన్ని కడు ప్రీతితో స్వీకరించాడు. సీతను వెతికే పనిలో తన అభీష్టం నెరవేరేందుకు శబరి చెప్పిన విధంగానే పంపా సరస్సు చేరుకుంటాడు రాముడు. పంపా తీరంలోని వనంలో హనుమంతుడనే వానరుడిని చూసి, ఆయన మాటపై గౌరవం వుంచి, సూర్య నందనుడైన సుగ్రీవుడితో స్నేహంచేసాడు రాముడు. తనకథ, సీత వృత్తాంతం మొత్తం ఆయనకు చెప్పాడు రామచంద్రుడు. చెప్పిన తర్వాత, సుగ్రీవుడు రాముడితో అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు.

తనకూ-తన అన్న వాలికి విరోధం కలిగిన విధాన్ని సుగ్రీవుడు రాముడికి వివరిస్తాడు. వాలిని చంపుతానని రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు. వాలి బల పరాక్రమాలు వినిపించి అంతటి బలవంతుడిని చంపగలడా రాముడని సందేహం వెలిబుచ్చుతాడు సుగ్రీవుడు. తనకు నమ్మకం కలిగేలా, ఓ పెద్దకొండలాగున్న దుందుభి అనే రాక్షసుసుడి కళేబరాన్ని చూపించి, దాన్ని చిమ్మమని రాముడిని కోరతాడు సుగ్రీవుడు. ఇంత చిన్న పరీక్షా అని చిరునవ్వుతో, దాన్ని అలకగా కాలిబొటనవేలితో, పేడును చిమ్మినట్లు, పది ఆమడల దూరంలో పడే విధంగా చిమ్ముతాడు రాముడు. వాలికంటే రాముడు బలశాలి అనే నమ్మకం కుదిరేందుకు మరో పరీక్ష పెట్టాడు సుగ్రీవుడు. సాల వృక్షాన్ని భేదించ మంటాడు. ఆయన కోరిక నెరవేర్చేందుకు, మళ్ళీ సందేహానికి తావులేకుండా వుండేందుకు, సాల వృక్షాలను ఛేదించి, అవుండే కొండను భేదించాడు. ఆయన బాణం రసాతలానికి పోయి తిరిగి ఆయన చేతిలోకి వచ్చింది. దాంతో సుగ్రీవుడు తృప్తిపడ్డాడు. తనపగ తీరబోతుందన్న నమ్మకంతో వానర రాజ్యం లభించబోతుందన్న ఆశతో, సంతుష్టి పడిన మనస్సుతో, రామచంద్రమూర్తిని తీసుకొని కిష్కింధకు పోయాడు.


ఆ వెంటనే బంగారువన్నె దేహ కాంతిగల వానరేశ్వరుడు-సూర్యపుత్రుడు, సుగ్రీవుడు సింహనాదం చేశాడు. ఆ ధ్వనిని విన్న ఇంద్రకుమారుడు వాలి సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి బయల్దేరతాడు.రాముడి సహాయం సుగ్రీవుడి కుందని తార ఆయనకడ్డుపడుతుంది.తమ్ముడితో సంధిచేసుకొమ్మంటుంది. ఇతరులతో యుద్ధం చేస్తున్న తనను ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఎందుకు చంపుతాడని తారను సమాధాన పరిచి సుగ్రీవుడిని యుద్ధానికి ఒప్పిస్తాడు. తన మిత్రుడిని తన ఎదుటే నొప్పిస్తుంటే కళ్ళారా చూసిన రాముడు, శరణాగత ఆర్తత్రాణపరాయణత్వం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని భావించి, ఒకే ఒక్క బాణంతో వాలిని నేలగూల్చుతాడు. వాలిని యుద్ధంలో చంపిన రాముడు, సుగ్రీవుడు కోరినట్లే,వాలి పరిపాలిస్తున్న వానర రాజ్యానికి, సుగ్రీవుడిని వాలి స్థానంలో ప్రభువును చేస్తాడు.

శ్రీరామచంద్రమూర్తి తన కోరిక నెరవేర్చడంతో సుగ్రీవుడు తను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం, మిక్కిలి బల పరాక్రమవంతులైన వానరులను, సీతాదేవిని వెదికేందుకు, నాలుగు వైపులకు పంపించాడు. వారిలో ఒకడైన హనుమంతుడికి, జటాయువు సోదరుడైన సంపాతి, సీతాదేవి లంకలో వుందని చెప్తాడు. ఆయన మాట ప్రకారం, సుమారు నూరామడల సముద్రాన్ని సునాయాసంగా దాటి రావణాసురుడేలే లంకా పట్టణానికి చేరుకుంటాడు హనుమంతుడు. లంక ప్రవేశించిన హనుమంతుడు, రావణుడి అంతఃపురం దగ్గరలోవున్న అశోక వనంలో శోకిస్తూ, తన భర్తనే ధ్యానిస్తూ, తపోబలంతో-శీల సంపత్తితో, నిజ వర్చస్సుతో ప్రకాశిస్తున్న సీతాదేవిని చూశాడు. అగ్నిహోత్రుడి మిత్రుడి కుమారుడైన హనుమంతుడు, సీతాదేవి తనను నమ్మేందుకు,శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన రామ ముద్రికను చూపిస్తాడు. దుఃఖ పడవద్దనీ,రాముడు త్వరలో వచ్చి సీతను చెరనుండి విడిపిస్తాడని అంటూ ఆమెను సమాధాన పరిచాడు. రామ లక్ష్మణులిరువురు సముద్రమెట్లా దాటుతారని-దాటినా, ఇంతటి బలశాలి రావణుడి నెట్లా జయించగలరని సందేహం వెలిబుచ్చుతుంది సీత. సూర్యపుత్రుడైన సుగ్రీవుడితో రామచంద్రమూర్తికి  స్నేహం లభించిన విషయం చెప్తాడప్పుడు ఆమెకు ధైర్యం కలిగేందుకు హనుమంతుడు.

ఒక్క వానరుడే ఇంత పనిచేస్తే, వానర సేనతో రామచంద్రమూర్తి వచ్చి,లంకనంతా ధ్వంసం చేయడంలో సందేహం లేదు అని రావణాసురుడనుకోవాలనీ-దాంతో సీతాదేవికి ధైర్యం కలగాలనీ భావించాడు హనుమంతుడు.  అందుకు ముందుగా రావణుడి బలమెంతో తెలుసుకునేందుకు, వాడిని యుద్ధానికి ఈడ్చి తన్నాలనుకుంటాడు హనుమంతుడు. అలా చేస్తే వాడికి తెలివొచ్చి సీతను అప్పగించి సమాధానపడ్తాడని తలుస్తాడు. వెంటనే హనుమంతుడు పరాక్రమంతో ఉపక్రమించి, అశోక వనం తలవాకిటున్న ద్వారాన్ని విరగ్గొట్టి,సేనానాయకులందరినీ-ఏడుగురు మంత్రి పుత్రులనూ చంపి, అక్షయ కుమారుడిని హతమార్చి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడతాడు. బ్రహ్మ వరంతో ఆ కట్లు తెగిపోయినట్లు తెలిసినా, రావణుడిని చూసి వాడితో మాట్లాడాలని భావించి, తనను ఈడ్చుకుంటూ పోతున్న రాక్షసులను చంపక విడిచిపెట్టాడు. సీతాదేవిని తప్ప తక్కిన లంకంతా భస్మం చేసి, శీఘ్రంగా రామచంద్రమూర్తికి సీతాదేవి వార్త తెలపాలని, లంక విడిచి మరలి పోతాడు హనుమంతుడు. ధీరాగ్రగణ్యుడైన శ్రీరామచంద్రమూర్తికి ప్రదక్షిణ చేసి, ’రామా చూసితి సీతను - శీలం విడవక జీవించి వున్న దానిని ’  అని చెప్తాడు.


No comments:

Post a Comment