Monday, August 8, 2016

గౌరవంలో రాజు, తండ్రి కంటే తల్లి తక్కువా? ..... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు తొమ్మిదవ భాగం అయోధ్య కాండ : వనం జ్వాలా నరసింహా రావు

(Recovered and Reloaded)

గౌరవంలో రాజు, తండ్రి కంటే తల్లి తక్కువా?
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
తొమ్మిదవ భాగం అయోధ్య కాండ

వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (27-06-2016)

భాతృ భక్తితో లక్ష్మణుడు చెప్పిన మాటలు విన్న కౌసల్య, శ్రీరాముడిని ఉద్దేశించి తమ్ముడు చెప్పిన విషయాలను గుర్తుచేసి, అతడికేది ధర్మమని తోస్తే అదే చేయమని సలహా ఇస్తుంది. అడవులకు పోవడమే మంచిదనుకుంటే అలానే చేయమని అంటూ కౌసల్య తన మనసులోని మాటలను చెప్పడానికి ఒక పద్యాన్ని"కవిరాజవిరాజితము" లోను, రెండు పద్యాలను "మత్తకోకిలము" వృత్తంలోను రాసారు కావి ఈ విధంగా:

కవిరాజవిరాజితము:
మనమున నాసవతాలు వచించిన మాటను బట్టి గృహంబున న
        న్న నయము దుఃఖములందు మునుంగు మ టంటయు నీకును ధర్మమొకో ?
        ఘనమతి ! ధర్మము సల్పఁ గ నీయెదఁ గల్గినచోఁ బరిచర్యల నన్
        దనుపఁ గ రాదొకొ, తల్లిని గొల్చుట ధర్మము గాదె తనూజులకున్ ? -22
ఛందస్సు:      "నగణము నారు జగణములు వగణము గలది కవిరాజ విరాజితము".
మత్తకోకిలము:    
                        నిండుబక్తి భజించి తల్లిని నిల్చి యింటనె మున్ను  వి
                        ప్రుండు కాశ్యపుఁ డన్మునీశుఁ డు  పొందఁ డే  సురలోకమున్,
                        దండిగౌరవమందు రేనికిఁ దక్కు  వౌనొకొ తల్లి ? నీ
                        వుండు మిందుఁ , బ్రవాసి  వౌటకు నొల్ల నాజ్ఞనొసంగగన్ -23
మత్తకోకిలము:     
                        నిన్నుఁ  బాసి  వసింపఁ గల్గిన నిశ్చయం బిది పుత్రకా !
                        యన్న  మేటికి  నీర  మేటికిఁ బ్రాణ  మేటికి  సౌఖ్య మం
                        చెన్న  నేటికి ? నీవు గల్గిన నిన్ని యున్నటు  దోఁ చుఁ గా,
                        తిన్న చో నునుఁ బచ్చికైన మదిం  బ్రియం బొనరించురా !-24
ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు.పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం:     నిన్ను (రాముడిని) ఆజ్ఞాపించినవాడు తండ్రిగాడు. నాకు (కౌసల్యకు) సహజవిరోధైన నా సవతి చెప్పిన మాటను మనస్సున నిలిపి, కన్న తల్లినైన నన్ను శాశ్వత దుఃఖంలో మునగమనడం నీకు ధర్మమా ?. అర్థం నాకు పరమార్థం కాదు. ధర్మమే అంటావా, రాజ్యం లేకపోయినా నాకు శుశ్రూష చేసుకుంటూ నా ఇంట్లో వుండు. కొడుకులకు మాతృసేవ ధర్మమేకదా ! పూర్వకాలంలో, కశ్యపు వంశంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడు, అందరిలాగా అడవులకు పోయి,ఏ తపస్సు చేయకుండా, ఇంట్లోనే వుండి, మాతృ శుశ్రూషచేసి, తపస్సుచేసి సాధించే స్వర్గసుఖాన్ని సాదించాడు. విశేష గౌరవంలో రాజుకంటే-తండ్రికంటే తల్లి తక్కువవుతుందా ? కాబట్టి నీ తండ్రి ఆజ్ఞకంటె నా ఆజ్ఞ తకువైందేమీకాదు. నువ్వింట్లోనే వుండమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. వూరు విడిచి పోయేందుకు నేను అనుజ్ఞనీయను. నిన్నొదలి నేను ఇంట్లో వుండడమే జరుగుతే, ఒకటి మాత్రం నిశ్చయం కుమారా ! నాకు అన్నమెందుకు ? నీళ్లెందుకు? చివరకు ప్రాణమెందుకు ? ఇక సుఖపడడం గురించి చెప్పాల్సిన పనేలేదు. రామచంద్రా,నువ్వు నాదగ్గరుంటే, ఇవన్నీ లేకున్నా వున్నట్లే. ప్రాణం సంతోషిస్తుంది-పచ్చిక తిన్నా నాకు సంతోషమే.

అడవులకు పోవాలనుకున్న కొడుకు నిశ్చయాన్ని, తండ్రి ఆజ్ఞ శ్రీరాముడు జవదాటడనే విషయాన్ని గ్రహించిన కౌసల్య కొడుకును ఆదరించి,దయతో దీవించాలనుకుని ఆశీర్వదించే ఘట్టంలో, శ్రీరాముడితో అన్న మాటలను ఒకచోట "మత్తకోకిలము" వృత్తంలో పద్యంగా మలుస్తారు కవి ఇలా:

మత్తకోకిలము:     
                        దేవతాయతనంబులన్ రుచి  దేఋ చైత్యములందు నీ
                        చే వరం బగు మ్రొక్కు లందుచుఁ జెన్ను మీరినయామహా
                        దేవతల్  ఋషియుక్తులై  వనిఁ ద్రిమ్మరం జనుచుండు  ని
                        న్వేవిధంబులఁ గాచుచుందురు  నిర్మలం బగుసత్కృపన్ - 25

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు.పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం:     దేవాలయాల్లో, నాలుగు బాటలు కలిసేచోట, నీచే (రాముడు) మొక్కులుగొంటున్న ఆ మహాదేవతలు,ఋషులతో సహా, అడవిలో తిరుగుతుండే నిన్ను వేయివిధాలుగా రక్షించుదురుగాక.


ఎట్టకేలకు శ్రీరాముడు అడవులకు పోవడానికి సమ్మతించాడు దశరథుడు. కొడుకుకు మేలుకలగాలని, శీఘ్రంగా తిరిగిరావాలని ఆశీర్వదించాడు. అయితే ఒక్క రాత్రి తనతో గడిపి అడవికి పొమ్మని కోరాడు. ఒక్కపూటైనా శ్రీరాముడితో హాయిగా గడపాలని వుందంటాడు. శ్రీరాముడు మరోసారి తన మనో నిశ్చయాన్ని తెలియచేశాడు తండ్రికి. ఆయన ప్రమాణం వ్యర్థం కాకుండా సార్థకమయ్యేవిధంగా తనను అడవికి పోనిమ్మని వేడుకుంటాడు. భరతుడికి రాజ్యభారం అప్పగించమని కోరాడు. అయోధ్యలో ఇంకేమాత్రం వుండి జాగుచేయ దల్చుకోలేదంటాడు. తనకొరకు తండ్రి క్రూరమైన నిట్టూర్పులు విడవొద్దంటాడు. ఇక్కడొక పద్యాన్ని "ఇంద్రవంశము" వృత్తంలో రాసారు కవి.

ఇంద్రవంశము:             
                    ధీమజ్జనుల్  మెచ్చెడి దేవరానతిన్
                    నేమంబుమైఁ దీర్పఁ గ  నేనుగోరిన
                    ట్లీ మేలిభోగంబుల నిచ్చగింపఁ జూ
                    భూమీశ  నాకై  యిటు పొక్క  నేటికిన్ - 26

ఛందస్సు:      ఇంద్రవంశ వృత్తానికి ద-త-జ-ర గణాలు తొమ్మిదో అక్షరం యతి.
తాత్పర్యం:     బుద్ధిమంతులు మెచ్చే నీ (దశరథుడి) ఆజ్ఞను నియమంతో,వ్రతంగా బూని నెరవేర్చే నేను, ఈ శ్రేష్ఠమైన భోగాలను కోరను సుమా ! రాజా,ఎందుకు నాకోసం వ్యసనపడతావు ?

ఎవరెన్ని మాటలు చెప్పినా గౌరవంగా అవన్నీ తిరస్కరించి,అరణ్యవాసం చేయడానికి సిద్ధమౌతున్న సీతారామ లక్ష్మణులకు నారచీరెలిచ్చి కట్టుకోమంటుంది కైకేయి. ఆమె ఇచ్చిన నారచీరెలను సంతోషంతో రామ లక్ష్మణులిద్దరూ కట్టుకుంటారు మొదట. పట్టు వస్త్రాలను కట్టుకొని వున్న సీత వాటిని తీసుకొని ఎగా-దిగా చేతిలో పెట్టుకొని చూస్తూ, అవెలా కట్టుకోవాలోనని ఆలోచిస్తుంటుంది. ఆ సమయంలో సీత నారచీరెలు కట్టకూడదని వశిష్ఠుడు నిషేదిస్తాడు. కైకను దుర్భాషలాడుతాడాయన కొంతసేపు. ఆమె నారచీరెలు కట్టరాదనీ, శ్రీరాముడికి బదులుగా మగడెక్కవలసిన సింహాసనాన్ని అధిష్టించాలనీ సూచిస్తాడు. సీత దానికొప్పుకోకుండా మగనివెంట అడవులకు పోవడానికే సిద్ధమౌతే, యావత్తు అయోధ్యా నగరమే శ్రీరాముడి వెంట పోతుందని అంటాడు వశిష్ఠుడు. చివరకు కైక కొడుకు భరతుడు కూడా వెళ్తాడని అంటాడు. ఇవేమీ పట్టించుకోకుండా సీత సంతోషంగా నారచీరెలు ధరిస్తుంది. అందరూ అది చూసి దశరథుడిని ఈసడించుకుంటుంటే, కైకనుద్దేశించి ఆయన అన్న మాటలను "మత్తకోకిలము" వృత్తాల్లో రెండు పద్యాలుగా రాసారు వాసు దాసుగారిలా:

మత్తకోకిలము:       
                         భూపచంద్రముపుత్రి యై ధరఁ బుట్టి సాధుచరిత్ర యై
                పాపమెద్ది  యెరుంగ  నట్టిది  బాల శ్త్రీమతి  యేరి  కే
                పాపముం  బచరించెనే  యిటు వల్కలంబులతోడుతన్
                దాపసిం  బలె  నెల్లరుం  గనఁ దా సభాస్థలి  నిల్వఁ గన్ !-27
మత్తకోకిలము: 
                  చేసినాఁ  డనె నీకు  బాసను  సీత  నారలతో  వనీ
         వాసముం  బచరింప, నీగతి బంది పెట్టెద  వేటికే ?
         తా  సుఖంబుగ  సర్వరత్న వి తాన సంయుత యై చనున్,
         గాసి  యేటికి  నొంద ? నారలు  గట్ట  కుండెడుఁ గావుతాత్న్- 28

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు.పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం:     మహారాజు కూతురై లోకంలోని వారివలె కాకుండా,భూమిలో పుట్టి, పతివ్రతై, ఏ పాపం ఎరుగని బాలశోభావతి సీత, ఈ ప్రకారం తాపసిలాగా నారచీరెలు కట్టి, అందరు చూస్తుండగా సభాప్రదేశంలో నిలబడడానికి, ఆమె చేసిన పాపం ఏంటి ? ఓసీ, సీతను నారచీరెలతో వనవాసానికి పంపుతానని నీకేమైనా నేను ప్రమాణంచేశానా ? ఎందుకిలా నిర్భందిస్తున్నావు ? యథా సుఖంగా, సమస్తాభరణాలతో పోవాల్చిందే. ఎందుకామె నిష్కారణంగా ఇబ్బందుల పాలుకావాలి ? కాబట్టి ఆమె నార చీరెలు కట్టుకోకూడదు.


No comments:

Post a Comment