(Recovered and Reloaded)
నిర్మాణం రంగంలో చైనా దౌడు....తెలంగాణాకు సైదోడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ
దినపత్రిక (31-03-2016)
దుబాయ్, చైనా
దేశాలలో వున్న మౌలిక సదుపాయాలతో పోలిస్తే, ప్రపంచం
మొత్తం అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తున్న అమెరికా, తృతీయ ప్రపంచం దేశంగా మారిందని, రిపబ్లికన్
పార్టీ పక్షాన అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో వున్న డొనాల్డ్ ట్రంప్ చేసిన
వ్యాఖ్యలు మౌలిక వసతుల, నిర్మాణ రంగంలో చైనా
అభివృద్ధిని చెప్పకనే చెప్తున్నాయి. ట్రంప్
మాటల్లో చెప్పుకోవాలంటే, చైనాలోని రహదారులు, రైలు మార్గాలు, వందల మైళ్ల వేగంతో వెళ్లే
బుల్లెట్ రైళ్లు, ఆ దేశాభివృద్ధిని
సూచిస్తున్నాయి. అక్కడి నిర్మాణాలు
ప్రపంచాన్ని అబ్బురపడుస్తున్నాయి. ఈ నేపధ్యంలో....నిర్మాణ, మౌలిక వసతుల రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు చైనా ఎలా శ్రీకారం
చుట్టిందన్నది ఆసక్తికరమైన విషయమే!
మావో యుగం తరువాత, ఆర్థికరంగంలో వెనుకబడిన
చైనా, జిన్ పిన్ అధికారంలోకి రావడం దరిమిలా, గణనీయమైన
అభివృద్ధి సాధన దిశగా పయనించడం ప్రారంభమైంది. ప్రపంచ నిర్మాణ రంగంలో 1990 వరకు ఒక శాతం కలిగి ఉన్న
చైనా 2010 సంవత్సరానికి వచ్చే సరికి 15 శాతానికి చేరుకుంది. ప్రపంచం మొత్తంలో అతిపెద్ద వాటా కలిగిన దేశంగా ఇటీవలి సంవత్సరాలలో చైనా పేరు
తెచ్చుకున్నది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో, కొత్త కొత్త పద్దతులతో ప్రపంచ నిర్మాణ రంగాన్ని శాసించే దిశగా ముందుకు దూసుకుపోతున్నది. ప్రపంచంలోనే అమెరికా తరువాత
రెండవ అతిపెద్ద ఆర్థికంగా బలమైన దేశంగా, త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న దేశంగా చైనా
రికార్డుల్లోకి ఎక్కింది. సూక్ష్మ ఆర్థిక విధానంలో చైనా నిర్మాణ రంగం దూసుకుపోతున్నది. 2008లో చైనాలో జరిగిన ఒలింపిక్
క్రీడల సందర్భంగా అక్కడ జరిగిన నిర్మాణాలను చూసి యావత్ ప్రపంచం అబ్బురపడింది. బీజింగ్ లో నిర్మించిన
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ పోర్టు నిర్మాణ రంగంలో సంచలనం సృష్టించింది. అలానే, బర్డ్స్ నెస్ట్ పేరుతో
నిర్మించిన చైనా జాతీయ క్రీడా మైదానం నిర్మాణ రంగంలోనే ఒక మైలురాయిగా
మిగిలిపోయింది. కొన్నాళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కున్న చైనా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోడానికి
కారణం చైనా నిర్మాణ రంగం. చైనా నిర్మాణ రంగ పారిశ్రామిక వేత్తలు అంతర్జాతీయంగా వ్యవసాయ మార్కెట్ల
అన్వేషణకు దిగి ఇతర దేశాల కాంట్రాక్ట్ లను కూడా చేజిక్కించుకునే స్థాయికి
ఎదిగారిప్పుడు. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో, నిర్మాణ రంగ కార్యకలాపాల
విస్తరణకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. తమ దేశంలో ప్రాజెక్టులకన్నా ఇతర దేశాల ప్రాజెక్టులను
చేపట్టడం వల్ల గణనీయమైన లాభాలను కైవసం చేసుకోవడం ఇందుకు ప్రబల కారణం. ఇదిలా వుంటే, అంతర్జాతీయ నిర్మాణ రంగంలో 2015 వరకు 50 శాతం మేరకు, చైనాలోనే జరిగినట్లు
ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.
చైనా జాతీయ బ్యాంకులు
నిర్మాణ రంగంలో వున్న కంపెనీలకు సహాయం అందిస్తున్నాయి. ఆ మాటకొస్తే, విదేశీ కరెన్సీ నిలువలు
అత్యధికంగా ఉన్న బ్యాంకులు చైనా దేశానివే. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన అనేక నిర్మాణ సంస్థలకు రుణ
సదుపాయాలు లేకపోవడంతో వారికి చైనా బ్యాంకుల రుణ విధానం అందివచ్చంది. నిర్మాణ రంగంలో చైనా
సరికొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు దూసుకువెళుతున్నది. చైనా నిర్మాణ పరిశ్రమలు
ముందస్తు ఇళ్లను నిర్మించి సంచలనం సృష్టించాయి. భవన నిర్మాణాలకు అవసరమయ్యే బ్లాకుల నిర్మాణం చేపట్టాయి. వీటిని వర్దమాన దేశాలలో గృహ నిర్మాణ
రంగంలో వినియోగించవచ్చు. వీటి వ్యయం చాలా తక్కువ.
ముందస్తుగా తయారు చేసిన నిర్మాణ పరికరాలను వినియోగించి ఆ రంగంలో మౌలికమైన
మార్పులకు ద్వారాలు తెరిచింది. 2010లో యూ ట్యూబ్ లో నిర్మాణ రంగానికి సంబంధించి ఒక సంచలనాత్మక కథనం ప్రసారమైంది. కేవలం ఆరు రోజులలో నిర్మించిన
ఒక భారీ హోటల్ పై తీసిన వీడియో అది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హోటల్ మొత్తం 15 అంతస్థుల భవనం. ముందస్తు పరికరాలతో చైనాకు
చెందిన హూనాన్ ప్రావిన్స్ రాజధాని ఛాంగ్ షాలో దీనిని నిర్మించారు. ఇటుకలు, సిమెంటు వంటి సాంప్రదాయ
వనరులకు బదులుగా ముందస్తు పరికరాలతో భవన నిర్మాణాలు చేపట్టడమనేది గత కొంతకాలంగా
కొనసాగుతున్నది. సాంప్రదాయ నిర్మాణ పద్దతులకు విరుద్దంగా ముందస్తు పరికరాలతో చేపట్టిన
నిర్మాణాలు మెరుగుగా, నాణ్యతతో ఉండడంతో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతానికి ఈ ముందస్తు పరికరాల నిర్మాణాలు చైనాకే పరిమితమయ్యాయి. ఈ ముందస్తు నిర్మాణ పరికరాల
పరిశ్రమ విస్తరిస్తే అంతర్జాతీయ నిర్మాణ రంగంలో చైనాది ఇంకా పైచేయి అవుతుంది.
ఒక వైపు చైనాలో జరుగుతున్న అభివృద్ధి దేశ-దేశాల ప్రశంసలు
అందుకుంటున్నప్పటికీ, మరో వైపున, ప్రపంచ ప్రఖ్యాత
“టైమ్” మాగజైన్ తన
జనవరి సంచికలో ఆ అభివృద్ధిని వేరే కోణంలో విశ్లేషించింది. భవిష్యత్ లో చోటు
చేసుకోనున్న అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి చైనా కేంద్రమవుతుందని, దానిని ఆయన
"మేడ్ ఇన్ చైనా అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంగా" పిలవాల్సి వస్తుందని
ప్రముఖ రచయిత రానా ఫోర హార్ అభివర్ణించారు. తన వాదనకు మద్దతుగా ఆయన, నూతన సంవత్సరంలో
మొట్టమొదటి ట్రేడింగ్ రోజున, చైనా స్టాక్ మార్కెట్ కేవలం మూడున్నర గంటలే
తెరిచి వుందని, ఆ కాసేపట్లోనే, మార్కెట్
కుప్పకూలడం జరిగిందని రాశారు. దీనికి కారణం చైనా నిర్మాణ రంగం అని ఆయనన్నారు.
కాకపోతే అతి త్వరలోనే మార్కెట్ కోలుకున్నదని, స్థిరపడ్డదని...మళ్లీ అనతి కాలంలోనే పడిపోయిందని...ఇలా ఒడిదుడుకుల్లో
చైనా ఆర్థిక వ్యవస్థ వుందని ఆయనంటారు. ఏం జరగబోతుందో...భవిష్యత్
నిర్ణయించాల్సిందే!
ఇదిలా వుండగా...తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాలనుకుంటున్న
వంతెనలు, భూగర్భ సొరంగాలు, బహుళ అంతస్తుల
ఆకాశ హర్మ్య సముదాయాలు, రహదారుల నిర్మాణాలు...తదితర మౌలిక
సదుపాయాల నిర్మాణాలలో పెట్టుబడులు పెట్టేందుకు, నిర్మించేందుకు, చైనా దేశానికి
చెందిన పలు కంపెనీలు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో తెలంగాణ రాష్ట్రాన్ని
సందర్శించిన చైనా నిర్మాణ రంగ సంస్థల బృందం, రాష్ట్రంలోని
నిర్మాణ ప్రతిపాదిత పనుల స్థలాలను చూసి
రావడం కూడా జరిగింది. అలానే మూసీ నదిపైన నిర్మించ తలపెట్టిన వంతెన
ప్రాంతాన్ని, హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్మించ తలపెట్టిన
టవర్ ప్రతిపాదిత స్థలాన్ని కూడా సందర్శించింది. ఇలా అనేక విధాలుగా
నిర్మాణ రంగంలో పని చేయడానికి చైనా సంస్థలు ముందుకొస్తున్నాయి.
గత ఏడాది, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు
మాట్లాడుతూ, భారతదేశం, తెలంగాణ గురించే కాకుండా, చైనా నుంచి మొదలుకుని ప్రపంచ దేశాల ఆర్థిక గమనం గురించి కీలకమైన అభిప్రాయాలు
వెల్లడించారు. ‘‘దేనికైనా, ఎప్పుడైనా ఒడి-దుడుకులు సహజం. కాకపోతే వాటిని అధిగమించాలి. చైనా అలాగే చేసి, ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శంగా నిలిచింది.
30 సంవత్సరాల క్రితం చైనా వేరు. ఇప్పుడు మనం చూస్తున్న చైనా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ప్రపంచం యావత్తు చైనా వైపు
చూస్తున్నది. ప్రతీ ఒక్కరూ చైనా నుంచి నేర్చుకోవాలి. అసలు చైనా నుంచి నేర్చుకోకుండా వదిలిపెట్టే అంశమేమైనా
ఉన్నదా? ప్రతీ విషయాన్నీ చైనా నుంచి నేర్చుకోగలం". అని సీఎం అన్నారు. అలా ఆనాటి ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై
ముఖ్యమంత్రి భారతీయతను చాటిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర పురోగతిని విడమర్చి చెప్పారు. చైనా సాధించిన ప్రగతిని
కీర్తించారు.
ఆ సందర్భంలోనే, హైదరాబాద్ సహా తెలంగాణలోని ముఖ్యమైన నగరాల్లో
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని
చైనా కు చెందిన ఇన్ ఫ్రా కంపెనీలను సీఎం కోరారు. దరిమిలా చైనా దేశానికి చెందిన అంజు ఇన్ ఫ్రాస్ట్రక్చర్
డైరెక్టర్లు, రాడిక్ కన్సల్టెంట్స్ ప్రతినిధులు
ముఖ్యమంత్రిని హైదరాబాద్ లో కలిసినప్పుడు తెలంగాణలోని నగరాల్లో మౌలిక సదుపాయాల
కల్పనలో భాగస్వాములు కావాలనే ఆకాంక్ష వెలిబుచ్చారు. తమ సంస్థలు రహదారులు, బ్రిడ్జీలు, సస్పెన్షన్
బ్రిడ్జీల నిర్మాణంలో పాలుపంచుకోడానికి సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రికి కంపెనీల
ప్రతినిధులు చెప్పారు.
హైదరాబాద్
నగరంలో చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రణాళిక చైనా కంపెనీలకు నచ్చింది.
హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం – మంచిర్యాల
కార్పొరేషన్లలో కూడా అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో చైనా
కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. హైదరాబాద్ నగరంలో రహదారులు, బ్రిడ్జీలు, మూసీ నదిపై రహదారిని నిర్మించే
ప్రణాళిక కూడా చైనా కంపెనీలను ఆకర్షించింది. చైనా కంపెనీలు ఆసక్తి కనబరిచిన
మరి కొన్ని అంశాలలో....వరంగల్, నల్గొండ, కరీంనగర్ తదితర హైవేలకు అనుబంధంగా ఎక్స్ ప్రెస్
ఎలివేటెడ్ హైవేల నిర్మాణం; దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి; వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, గోదావరిఖని కార్పొరేషన్ల పరిధిలో
రింగు రోడ్లు, అంతర్గత రోడ్లు, వంతెనలు; గోదావరి నదిపై వంతెనలు; హైదరాబాద్ సమీపంలో
వున్న తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, షాద్ నగర్, వికారాబాద్, నర్సాపూర్ పట్టణాలను నగరంతో కలుపుతూ మౌలిక సదుపాయాల
కల్పన; గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్
వరంగల్ తో సహా అన్ని మునిసిపాలిటీ-కార్పొరేషన్లలో ఫ్లై ఓవర్లు, పెద్ద రహదారులు, స్కైవేలు, సివరేజ్, డ్రింకింగ్ వాటర్, గృహ నిర్మాణం తదితర అంశాలున్నాయి.
అంతర్జాతీయంగా నిర్మాణ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను
చాటుకుంటున్న చైనా నిర్మాణ రంగ నిపుణుల సహాయంతో తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల
కల్పనకు త్వరలోనే శ్రీకారం చుట్టడం జరుగుతుందని ఆశించవచ్చు. అదే జరుగుతే, ఈ
రాష్ట్రంలోని మౌలిక వసతులు కూడా ప్రపంచాన్ని ఆకర్షిస్తాయనడంలో సందేహం లేదు.End
No comments:
Post a Comment