Monday, August 8, 2016

పర్యావరణం కన్నా అభివృద్ధే మిన్న : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)

పర్యావరణం కన్నా అభివృద్ధే మిన్న
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (14-06-2016)

పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకునే వారి ఆలోచన, కేవలం చెట్లను మాత్రమే కాపాడితే సరిపోతుంది అనే విధంగానే వుంది తప్ప, మరే ఇతర కారణాల వల్ల కాలుష్యం వ్యాపించినా పరవాలేదనే విధంగా వుండడం దురదృష్ఠం. చెట్లను చెట్ల గానే వున్నచోటనే వుంచేసి, వాతావరణ కాలుష్యాన్ని ఇబ్బడి-ముబ్బడిగా పెంచేసి, ట్రాఫిక్ సమస్యలను మరింత జటిలం చేసి,తద్వారా దురుపయోగమయ్యే వాహనాల ఇంధనం విషయం ఆలోచించకుండా,వాహనాలు విడుదల చేసే కాలుష్యం, తదితర అంశాలను విస్మరించటం లాంటి వాటితో, ప్రజలను తప్పుదోవ పట్టించే పర్యావరణ పరిరక్షణకారుల విజ్ఙతని ప్రశ్నించాల్సిన అవసరం వుందేమో!. కేబిఆర్ జాతీయ పార్క్ పరిసర ప్రాంతాల్లోమల్టీ లెవల్ గ్రేడ్ సపరేటర్ల నిర్మాణం కొరకు, పార్కు బయట వున్న కేవలం ఓ రెండు వేల చెట్లను తొలగించటం వల్లనో, లేదా, మరో చోటుకు యధాతథంగా తరలించటం వల్లనో, వాతావరణంలో పెరిగే అవకాశాలున్న కార్బన్ డయాక్సైడ్ కాలుష్యం కన్నా, అక్కడి ట్రాఫిక్ కూడళ్ళ వద్ద ప్రస్థుత వేలాది వాహనాల ట్రాఫిక్ రద్దీ మూలంగా విడుదలవుతున్న కాలుష్యం చాలా ఎక్కువ. అదనంగా, ఈ పరిస్థితి ఇలానే కొనసాగుతే, రాబోయే రోజుల్లో పెరగనున్న వాహనాల సంఖ్య, తద్వారా విడుదలయ్యే కాలుష్య కారకాలు,వాటి వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు నిరోధించడానికి మల్టీ లెవెల్ గ్రేడ్ సపరేటర్ల నిర్మాణం తప్పనిసరి. అభివృద్ధి పధంలో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం పురోగమించాలి అని అనుకుంటే, కొన్ని కొన్ని పర్యావరణ పరమైన సమస్యలనూ అధిగమించాల్సిన ఆవశ్యకత వుంది. అలా కాకుండా ఏ కొద్ది మందో అడ్డుపడుతున్నారని, అందువల్ల ముందుకు పోకుండా ఆగి పోవటం సరైనది కాదు. పర్యావరణం వల్ల ప్రగతిని నిరోధించటం ఏ మాత్రం సమంజసం కానే కాదు.

          హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) సమగ్ర రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్‌డిపి) క్రింద పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు, కాలానుగుణంగా మారుతున్నఅవసరాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు, కొన్ని ప్రణాళికల్ని చేపట్టి అమలుచేయాలని సంకల్పించింది. జంట నగరాలలో కోటి మందికి పైగా జనాభా ఉన్నారు. వీరి సంఖ్య పెరిగేందుకూ ఆస్కారముంది. ఇందుకోసం, నగరంలోని వివిధ కూడళ్ళలో మల్టీ లెవెల్ గ్రేడ్ సపరేటర్ల నిర్మాణానికి తగు చర్యలు తీసుకునే కార్యాచరణ పథకం జిహెచ్ఎంసి రూపొందించింది. కెబిఆర్ జాతీయ పార్కు వద్ద సదరు పనులకు శంఖుస్థాపన చేయటం కూడా చేయడం జరిగింది.బంజారహిల్స్ వద్ద రమారమి 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జాతీయ పార్కు చుట్టు పక్కల నుండి అనుసంధానమౌతూ నగరంలో ఒక మూల నుండి మరో మూలకు చేరుకోటానికి వివిధ కోణాల నుంచి రోడ్లు విస్తరించి ఉన్నాయి. ప్రస్థుత పరిస్థితుల్లో ఇక్కడ వాహనాల రాకపోకలు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి.ఇటీవలి కాలంలో వాహనాల సంఖ్య వాటి తాకిడి కూడా ఇక్కడి కూడళ్ళలో పెద్ద సంఖ్యలో పెరగటం జరిగింది. ప్రస్థుత  ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల కాయాపన జరగటం,ముఖ్యంగా రద్దీ సమయంలో సమస్యలు తలెత్తటం తద్వారా విపరీత వాహనాల కాలుష్యం పెరగటం ఇక్కడ పరిపాటి అయ్యింది. ఈ నేపధ్యంలో మహా నగర పాలక సంస్థ కెబిఆర్ చుట్టు పక్కల ఆరు కూడళ్ళలో మల్టీ లెవెల్ గ్రేడ్ సపరేటర్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. తద్వారా నిత్యం ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు, సమయాన్ని వృదా చేయకుండా కొద్ది పాటి సమయంలోనే వాహనాల రాకపోకలు సునాయాసంగా సాగేందుకు ప్రణాళికల రూపకల్పన జరిగింది.

మహానగర పాలక సంస్థ నేతృత్వంలో నిపుణుల ద్వారా నిర్వహించిన అధ్యయన ఫలితాలు ఆశ్చర్యకరమైన అంశాలను వెల్లడించాయి. ఇదే పరిస్థితి కొనసాగే పక్షంలో తలెత్తే పరిణామాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ కేబిఆర్ పార్కు వ‌ద్ద జంక్ష‌న్ల‌లో ప్ర‌స్తుతం రెండున్న‌ర ల‌క్ష‌ల వాహ‌నాలు ప్ర‌తిరోజు తిరుగుతున్నాయి. 2035 నాటికి వీటి సంఖ్య ఐదున్న‌ర ల‌క్ష‌ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా. ఆరు ట్రాఫిక్ కూడళ్ళ వద్ద సాగే వాహన తాకిడిలో రోజుకు 33 వేల లీటర్ల ఇంధనం ఖర్చు అవుతోంది. ప్ర‌స్తుతం రెండున్న‌ర ల‌క్ష‌ల వాహ‌నాల‌తో ప్ర‌తిరోజు సుమారు 108 ట‌న్నుల కార్బ‌న్‌డైయాక్సైడ్ వెలువ‌డుతోంది. వీటితో పాటు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన  మిథేన్‌వాయువు, నైట్ర‌స్ఆక్సైడ్ కూడా ప్ర‌తిరోజు వెలువ‌డుతుంది. 2035 సంవ‌త్స‌రం నాటికి 456 ట‌న్నులకు పైగా  కార్బ‌న్‌డైయాక్సైడ్ రోజుకు విడుద‌ల‌వుతుంద‌ని అధ్య‌య‌నంలో తేలింది.ఇప్ప‌టికే తీవ్ర ట్రాఫిక్ జామ్‌లతో, వంద‌ల-వేల వాహ‌నాలలో ఈ మార్గంలో ప్ర‌యాణించేవారు ప్ర‌తిరోజు న‌ర‌కాన్ని అనుభ‌విస్తున్నారు. ఇది భయానకమైన పరిస్థితి. సమగ్ర రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‍ఆర్డీపి) ద్వారా రూపొందించిన ప్రణాళికల్లో పార్కు చుట్టు ప్రక్కల ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే సద్వినియోగపర్చుకోవటం జరుగుతుందని సూచించింది తప్ప జాతీయ పార్కుకు ఎట్టి పరిస్థితుల్లోను అవరోధం కలిగిస్తున్నట్లు నివేదించలేదు. మల్టీ లెవెల్ గ్రేడ్ సపరేటర్ల నిర్మాణం ఒకసారి పూర్తి అయిన పక్షంలో కాలుష్య కారకాల సంఖ్య పెద్ద మొత్తంలో తగ్గేందుకు దోహదపడుతుంది. తద్వారా పర్యావరణం పరిరక్షించబడుతుంది. కాలుష్య వత్తిడి రోజుకు 126 టన్నుల కార్బన్ డయాక్సైడ్ చొప్పున తగ్గేందుకు, సుమారు 72 శాతం కాలుష్యం నిరోధించేందుకు దోహదపడుతుందని అంచనా. లేదంటే రానున్న రెండు దశాబ్దాల్లో 2035 సంవత్సరం నాటికి రోజుకు 456 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అయ్యే అవకాశం ఉందని అధికారిక అంచనా. ఈ మల్టీ లెవెల్ గ్రేడ్ సపరేటర్ల నిర్మాణం పూర్తైన పక్షాన మెరుగైన వాహన రాకపోకలు కొనసాగటంతో పాటు 41 కోట్ల లీటర్ల ఇందనాన్ని రానున్న రెండు దశాబ్దాల్లో అనగా 2016నుండి 2035 లో పొందవచ్చని, వాహన కాలుష్యాన్ని కూడా తగ్గించ వచ్చని నిపుణుల అంచనా.


మహా నగర పాలక సంస్థ వివరణల ప్రకారం వివిధ జాతులకు చెందిన,వివిధ పరిమాణాల్లోని మొత్తం 2319 చెట్లను, తొలగించటమో, లేక,యధాతథంగా తరలించటమో చేసి, తద్వారా 6 ట్రాఫిక్ కూడళ్లను మెరుగు పర్చటం అన్న లక్ష్యంతో  ప్రణాళికలు రూపొందించటం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో తొలివిడతగా నాలుగు ట్రాఫిక్ కూడళ్ళను మాత్రమే ఏర్పాటు చేయాలని వాటి రూపకల్పనలో భాగంగా 1394 చెట్లను తొలగించటమో,తరలించటమో చేయాలని జీహెచెంసీ అనుకుంటున్నది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి కిప్పుడు కేవలం 181 చెట్లను మాత్రమే తొలగించాలని లేదా తరలించాలని తద్వార ప్రతిపాధిత ఫ్లై ఓవర్ల పునాదులను పటిష్టపరిచే వీలు కలుగుతుందని మహానగర పాలక సంస్థ ఆలోచన. మిగతా చెట్ల తొలగింపు సంగతి రెండవ దశలో నిర్ణయం జరుగుతుంది. వాస్తవానికి ఈ చెట్లు ఏండ్ల తరబడి ఎప్పుడో పురాతన కాలం నుంచి వస్తున్నవి కావు. ఓ దశాబ్దంన్నర కాలం క్రితం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వారు నాటినవి. జాతీయ పార్కు పరిథికి ఆవలి వైపున వున్నవే ఈ చెట్లన్నీ. పార్కు లోపలి ప్రాంతంలో ఒక్క చెట్టును కూడా ముట్టుకోవటం జరగటం లేదు. మహా నగర పాలక సంస్థ ప్రాజెక్టు ప్రతిపాధిత ప్రాంతానికి మూడు కిలో మీటర్ల పరిథిలో చెట్లు తొలగింపుకు పరిహారంగా కొత్తగా చెట్ల పెంపకానికి ప్రణాళికలు  సిద్ధంచేయడం జరిగింది. ఇందుకు 17 ప్రాంతాలను గుర్తించటం జరిగింది.

ఎస్ఆర్‌డిపిలో భాగంగా మొద‌టి ద‌శ‌లో నాలుగు జంక్ష‌న్ల‌లో చేప‌ట్టే మ‌ల్టీలేవ‌ల్ ఫ్లైఓవ‌ర్ల నిర్మాణం వ‌ల్ల కెబిఆర్ పార్కు వెలుప‌ల ఉన్న 1,394చెట్ల‌ను మాత్ర‌మే తొల‌గించ‌నున్నారు. వాల్టా చ‌ట్టం ప్ర‌కారం తొల‌గించిన చెట్ల స్థానంలో మూడింతల చెట్ల‌ను నాటాల‌ని, కేవ‌లం ఫ్లైఓవ‌ర్ల పిల్ల‌ర్ల క్రింద ఉన్న చెట్ల‌ను మాత్ర‌మే తొల‌గించాల‌ని, త‌ప్ప‌ని ప‌రిస్థితిలో తొల‌గించే చెట్ల‌ను తిరిగి ఇత‌ర ప్రాంతాల్లో నాటేందుకు ట్రాన్స్‌లొకేష‌న్ చేప‌ట్టాల‌ని ట్రీ ప్రొటెక్ష‌న్ క‌మిటి తీర్మానించింది. తొల‌గించే చెట్ల‌ను ట్రాన్స్‌లొకేష‌న్ ప‌ద్ద‌తిలో ఈ ప్రాంతానికి మూడు కిలోమీట‌ర్ల ప‌రిధిలోనే నాటాల‌ని, తొల‌గించే చెట్ల స్థానంలో దాదాపు మూడింతల చెట్ల‌ను నాటాల‌ని నిర్ణ‌యించింది. తొల‌గించే చెట్ల స్థానంలో నాటే చెట్లు క‌నీసం మూడు సంవ‌త్స‌రాలకు చెందిన 1.8మీట‌ర్ల ఎత్తు కూడా ఉండాల‌ని క‌మిటి ప్ర‌తిపాధించింది. నాట‌డంతో పాటు మూడేళ్ల పాటు వీటి సంర‌క్ష‌ణ కూడా చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేసింది. 1394 చెట్ల తొలగింపు ద్వారా ఉత్పన్నమయ్యే సుమారు 76 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను చెట్ల పెంపకం ద్వారా తగ్గించవచ్చని అంచనా.  1394 చెట్ల స్థానంలో అందుకు పరిహారంగా మూడింతలుగా చెట్లను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇవే కాకుండా పాదాచారులు నడిచే ప్రాంతాల్లో కూడా చెట్లు నాటే కార్యక్రమానికి మహా నగర పాలక సంస్థ సిద్ధం అయ్యింది. మల్టీ లెవెల్ గ్రేడ్ సపరేటర్ల పునాదుల పనులు ఆరంభం అయిన రోజు నుండి మూడు నెలల కాలంలో ఈ వర్షాకాలంలోనే చెట్లు నాటే కార్యక్రమానికి మహానగర పాలక సంస్థ సమాయత్తం అయ్యింది. వీటిలో రైన్ చెట్లు, పొగడ చెట్లు, గుల్ మొహర్ చెట్లు, సుబాబుల్, వేప, మామిడి, మర్రి,మేడి, రావి, మోదుగ, గానుగ, సిల్వర్ ఓక్, బాదం, చీమచింతకాయల చెట్ల లాంటివెన్నో వున్నాయి.

 పర్యావరణ అంశాలు ఒక్కోసారి అభివృద్ధిని నిరోదించేవిగా మారుతున్నాయి. మౌళిక వసతుల మెరుగు పరచడం ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. అలాగే పేదరికాన్ని నిర్మూలించేందుకు కూడా దోహదపడాలి. మన లక్ష్యం ఆర్థక అభివృద్ధి దిశగా సాగిన పక్షంలో పర్యావరణానికి కొద్దిపాటి నష్టం వాటిల్లినప్పటికీ కష్టంగా భావించడం సరైంది కాదేమో. కుజ్నెట్ కర్వ్స్ హైపోతీసిస్ ‘‘తొలుత కాలుష్యం కలిగించు...తరువాత బాగుచేయి’’ అనే పర్యావరణ సూత్రం అనుసరించి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తున్నప్పుడు, పర్యావరణం కొంత కలుషితమైనప్పటికీ ఆపైన సరిదిద్ధుకోవాలి. సమగ్ర రహదారుల అభివృద్ధి కార్యక్రమ (ఎస్‍ఆర్డీపి) లక్ష్యం, వర్తమానంలో కొద్ది పాటి కాలుష్యం కలిగే ఆస్కారం వున్నప్పటికీ, రానున్న రోజుల్లో కాలుష్యాన్ని సంపూర్ణంగా నిరోధించటం అని వక్కాణించి చెప్పవచ్చు. కాబట్టి ఈ ఎస్‍ఆర్డీపి ప్రణాళికను ఆహ్వానించాలి కాని అభిశంసించకూడదు. పర్యావరణ పరిరక్షణ ప్రాధన్యాతాంశమే.....ఐనప్పటికీ.....పర్యావరణం కన్నా అభివృద్ధే మిన్న.END


No comments:

Post a Comment