Sunday, August 7, 2016

మమత మాయ! : వనం జ్వాలా నరసింహా రావు

(Recovered and Reloaded)
మమత మాయ!
వనం జ్వాలా నరసింహా రావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (24-05-2016)

          అయిదు రాష్ట్రాల్లో ఇటీవల వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాలైనా, ఆ మాటకొస్తే తెలంగాణ రాష్ట్రంలోని పాలేరు ఉప ఎన్నిక ఫలితమైనా... మరేదైనా... ప్రభుత్వ పనితీరుకు ఓటర్లు పట్టం కట్టారా? లేదా? అనేదే ప్రధానం. అన్నీ ఒక ఎత్తైతే, పశ్చిమ బెంగాల్‌ ఒక ఎత్తు అనాలి. అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడమే కాకుండా, ఒకనాడు అత్యంత ప్రతిభతో వెలిగిపోయిన వామపక్ష కూటమి ఘోర పరాజయం పొందడంతో పాటు, కాంగ్రెస్‌, బీజేపీలు తమ ఉనికిని చాటుకోగలిగాయి. బీజేపీ ఓట్ల శాతం పెరగడంతో పాటు, చాలాకాలం తరువాత శాసనసభలో అడుగుపెట్టనున్నది. కేరళలో ఓటమి చెందిన కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడ గణనీయమైన సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ రాజకీయ ముఖ చిత్రం గుర్తుచేసుకుంటే ఆసక్తికరమైన విషయాలు అవగతమౌతాయి.

          కాంగ్రెస్‌ పార్టీ యోధానుయోధుడు, సిద్ధాంత కర్త, ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు అని పేరు తెచ్చుకున్న సిద్ధార్థ శంకర రే మార్చి 19, 1972 నుంచి, జూన్‌ 21, 1977 వరకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సారథ్యం వహించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి అక్కడ స్థానం లేకుండా పోయిందనాలి. ముప్పై మూడేళ్లకు పైగా, ఏ పనైతే తన అధికారాన్నంతా పణంగా పెట్టినా కాంగ్రెస్‌ సాధించలేకపోయిందో, దాన్ని, అచిర కాలంలోనే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ సాధించి 2011 ఎన్నికల్లో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది. మమతా బెనర్జీ ఆషామాషీగా, హఠాత్తుగా అధికారంలోకి రాలేదు. ఎంతో కృషి, నిరంతర పోరాట ఫలితంగానే ఆమెకు ఆ అవకాశం ఇచ్చారు ఓటర్లు గత ఎన్నికల్లో. అలాగే మరో ఐదేళ్లపాటు తమ భవిష్యత్‌ను ఆమె చేతుల్లోనే పెట్టారు ఈ ఎన్నికల్లో కూడా బెంగాల్‌ ఓటర్లు. మమత కేవలం ముప్ఫై ఏళ్ల వయస్సులోనే సీపీఎం దిగ్గజం సోమ్‌నాథ్‌ ఛటర్జీని ఓడించి తొలిసారి ఎంపీగా గెలిచింది. ఆ తరువాత ఓడినా, గెలిచినా, గెలిచినప్పుడు కేంద్రంలో మంత్రి పదవి అనుభవించినా, కాంగ్రె్‌సతో కొంతకాలం, బీజేపీతో కొంతకాలం జతకట్టినా, వేరుపడినా, బెంగాల్‌ రాజకీయాలలో మాత్రం సుస్థిర స్థానాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. అదే ఆమెకు ఇప్పుడు విజయం చేకూర్చింది.

          ఇందిరా గాంధీ 1977 అత్యవసర పరిస్థితి అనంతరం వామపక్ష రాజకీయ పార్టీలన్నీ ఐక్యమై కమ్యూనిస్టు (మార్క్సిస్ట్‌) పార్టీ నాయకత్వంలోని వామపక్ష కూటమి నాలుగు దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగింది. వామపక్షాల ఐక్యతను, కూటమి అధికారాన్ని మమతా బెనర్జీ కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలో సవాలు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ను సీపీఎం నుంచి విముక్తి చేయాలన్న దృఢ సంకల్పంతో 1997లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాచేసి అఖిల భారత తృణమూల్‌ కాంగ్రెస్‌ను స్థాపించింది. ఈ పార్టీ అచిర కాలంలోనే సీపీఎంకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు తెచ్చుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ, సీపీఎంను గద్దె దింపడానికి అవకాశం వున్న అన్ని వనరులను ఉపయోగించుకుంటూ వచ్చింది. ఎన్డీయేతో జతకట్టింది. పడకపోతే బయటకొచ్చింది. 2001 ఎన్నికల్లో కాంగ్రె్‌సతో కలిసి పోటీ చేసింది. కమ్యూనిస్టు-లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ఓడించ లేకపోయింది. తన పార్టీ పక్షాన గెలిచిన ఏకైక లోక్‌సభ సభ్యురాలిగా 2004లో కేంద్ర మంత్రివర్గంలో చేరింది.


          పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పారిశ్రామిక విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మమత, ఆమె పార్టీ కార్యకర్తలు అక్టోబర్‌ 2005 లో ఆందోళన చేశారు. 2006 శాసనసభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గతంలో గెలిచిన స్థానాలలో సగం మాత్రమే గెల్చుకోగలిగింది. అయినా పోరాటం కొనసాగించింది. అదే సంవత్సరం ఆగస్టు నెలలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మమత నవంబర్‌ నెలలో టాటా మోటార్స్‌ కార్ల కర్మాగారం స్థాపన విషయంలో ఆందోళన చేసేందుకు సింగూరు వెళుతుంటే, మధ్యలో బలవంతంగా ఆపు చేసింది ప్రభుత్వం. శాసనసభ ప్రాంగణంలోకి వెళ్లి నిరసన తెలియచేసిందామె. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళనకు దిగి ఫర్నీచర్‌ను, మైకులను ధ్వంసం చేశారు. 2009 లోక్‌ సభ ఎన్నికలలో కాంగ్రె్‌సతో కలిసి ఉమ్మడిగా పోటీ చేసి, ఇరువురు కలిసి 26 స్థానాలను (మెజారిటీ) గెల్చుకుని రాబోయే రోజుల్లో సీపీఎంకు గడ్డు రోజులు రాబోతున్నాయన్న సంకేతాన్ని పంపారు.

          తృణమూల్‌ ఆందోళన ఫలితంగానే నందిగ్రామ్‌లో రసాయన కేంద్రం స్థాపన ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం విరమించుకోవాల్సి వచ్చింది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు మమత చేసిన కృషికి సింగూరు, నందిగ్రాం సంఘటనలు ఉదాహరణలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో జరిగిన మునిసిపల్‌ ఎన్నికలు, కలకత్తా కార్పొరేషన్‌ ఎన్నికలు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఘన విజయాన్ని చేకూర్చాయి. సీపీఎం పాలన పగ్గాలు జ్యోతిబసు చేతిలో వున్నంత కాలం మమత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. బుద్దదేబ్‌ పాలనలో తృణమూల్‌ ఎదుగుదలకు ఆస్కారం లభించింది. దీనికితోడు, దీర్ఘకాలం అధికారంలో వున్న పార్టీకి వ్యతిరేకత వచ్చింది. నందిగ్రాం, సింగూరు ఘటనలు, మరికొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు సీపీఎంకు తొలుత మునిసిపల్‌ ఎన్నికలలో పరాజయాన్ని చవి చూపాయి.

          ఆ తరువాత తృణమూల్‌ కాంగ్రెస్‌ తొలిసారిగా 2011 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ఘన విజయం సాధించింది. ఐదేళ్లు అధికారంలో వుంది. నెమ్మదిగా బెంగాల్లో పాతుకుపోయింది. మళ్లీ ఈ సారి జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచి అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష హోదా కూడా వామపక్ష కూటమికి దక్కకుండా చేసిన మమత భవిష్యత్‌లో బెంగాల్‌ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించనున్నారేమో! వేచి చూద్దాం.


No comments:

Post a Comment