(Recovered and Reloaded)
పలికించిన వాడు రామభద్రుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (13-04-2016)
వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా
వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు
ఆంధ్ర వాల్మీకి-కవి
సార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. తాను రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని ఒంటిమిట్ట కోదండ
రామస్వామికి సరిగ్గా 108 ఏళ్ళ క్రితం, 1908 వ సంవత్సరం అక్టోబర్ నెల
9, 10, 11 తేదీలలో ఈ దేవాలయంలో అంకితమిచ్చారు. ఈ మహా కృతి
సమర్పణోత్సవానికి చాలామంది ప్రముఖులు వచ్చారు.
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం
తెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో-ఐదారు
దశాబ్దాల క్రితమే సంతరించుకుంది. ఇరవై నాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర
మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహా మహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను
సుబ్బారావు గారు, వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందః యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి
రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర
వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం,
"మందరం" అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు.
శ్రీ మదాంధ్ర వాల్మీకి
రామాయణం-గ్రంథోత్పత్తిని గురించి స్వయంగా వాసుదాసుగారే వివరిస్తూ, తన బాబాయి లక్ష్మణరావు గారికి నిరంతరం రామాయణ పారాయణం చేసే
అలవాటుండేదని, తనను కూడా శ్రీ రామాయణాన్ని పారాయణం చేయమని ప్రోత్సహించి, చేసే విధానాన్ని ఉపదేశించారని రాసుకున్నారు. ఆ విషయాలను
రాస్తూ వాసుదాసు గారు..."ఒక నాడు, బమ్మెర పోతన పలికిన "చెనకి చెరిచినాడు భాస్కరుడు గాకుండిన రామాయణము బండ్ల
కెక్కింపనా" అన్న వాక్యాలు నా మనస్సులో జొరబడ్డాయి. నేనెందుకు (మా) బమ్మెర పోతన సంకల్పాన్ని నెరవేర్చ రాదన్న భావన కలిగింది. వాల్మీకి సంస్కృత రామాయణం మూలంలోని 24, 000 శ్లోకాలకు, శ్లోకానికి ఒకటి చొప్పున, తెలుగులో 24,000 పద్యాలను రాయాలని సంకల్పించుకున్నాను. అయితే "శ్రేయాంసి బహువిఘ్నాని" అన్నట్లు
నేనెక్కడ? నా ఆరోగ్య మెక్కడ? రామాయణ రచనెక్కడ? అనుకొని, వూరి మధ్యలో నున్న శ్రీరామచంద్రుడే ఇక నాకు శరణ్యం అన్న
నిర్ణయానికొచ్చాను. ఆయన ఆదేశం ప్రకారం నడుచుకోవాలనుకొని, ఒకనాడు పారాయణం ముగిసిన తర్వాత, భగవత్ సన్నిధానంలో కూర్చొని, ఏం
చెయ్యాలనుకుంటూ, శ్రీమద్రామాయణం పుస్తకం ముందుంచుకుని, ప్రశ్న వేసుకున్నాను. ఆశ్చర్యకరంగా వచ్చిన సమాధానం
"ఉత్తిష్ఠ హరి శార్దూల, లంఘయస్వ మహార్ణవమ్" ("లెమ్మా హరిశార్దూలా, యిమ్మహితార్ణవము దాటుమీ") అన్న శ్లోక రూపంలో సమాధానం లభించింది. భగవత్ కటాక్షానికి పాత్రుడనయ్యానని భావించాను. 1900 వ సంవత్సరంలో, ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు, గ్రంథ రచన ఆరంభించాను”.
“భద్రాద్రి రామభద్రుడికి అంకితమిచ్చిన నా రచన
శ్రీకౌసల్యాపరిణయం నేటికీ (అప్పటికి) ఆయనకు అర్పించలేకపోయినందువల్ల, "ఒంటిమిట్ట" నేను పుట్టిన మండలంలోనే వుండడం వల్ల, శ్రీమదాంధ్ర భాగవతానికి ఇది జన్మస్థలం కావడంవల్ల, పోతనామాత్యుడు ఒకవేళ రామాయణం రాసి వుంటే ఆ రామభద్రుడికే
అంకితం ఇచ్చి వుండేవాడైనందువల్ల, ఆయన సంకల్పం నెరవేరుస్తున్న నేను ఆయన ఉద్దేశం నెరవేర్చడం
అభిలషణీయమై నందువల్ల,
"ఇంటి ముందరున్న పారిజాతం" ఒంటిమిట్ట కోదండ రాముడికే ఈ కృతిని అంకితం చేశాను. గ్రంథ రచనను కొనసాగిస్తుండగా, స్నేహితుడు
బ్రహ్మ శ్రీ క్రొత్తపల్లె పద్మనాభ శాస్త్రులు వారు ఒక సలహా ఇచ్చారు. వాల్మీకి రామాయణానికి యథా మూలం గా వున్న గ్రంథం ఇంతవరకు (అప్పటి
వరకు) లేదనీ, మూలాన్ని అనుసరించి గ్రంథముంటే ఎక్కువ పూజించబడుతుందని, సాధ్యమైనంత వరకు మూల గ్రంథాన్ని అతిక్రమించకుండా-విషయం లోపించకుండా రచించమని సూచించారు. సంస్కృతంలో "వాల్మీకి
రామాయణం" ఎలాగో, తెలుగులో నా రచన అలానే వుండేలా-అనుకునేలా, దీనికి "ఆంధ్ర వాల్మీకి రామాయణం" అని
పేరు పెట్టమని కూడా చెప్పారు. క్రొత్తపల్లె వారి సూచనను అంగీకరించి రచనను కొనసాగించాను. శ్లోక భావాన్ని మించి పద్యం మిగిలిపోయిన సందర్భంలో, పాదాన్ని పూర్తిచేయడానికి కొన్ని పదాలను ఎక్కువగా ఉపయోగించి
వుండవచ్చు కూడా. శ్లేషాలంకారాలున్న శ్లోకాలను తెనిగించేటప్పుడు, వాటికున్న అర్థాలన్నీ, ఒకే పద్యంలో వచ్చేట్లు
వీలైనంతవరకు ప్రయత్నం చేశాను. ఒక్కోసారి, శ్లోకానికి పద్యం కాకుండా, రెండు-మూడు శ్లోకాల భావాన్ని ఒక్క పద్యంలోనే చొప్పించే ప్రయత్నం
కూడా చేశాను. రాసేది లోకోపకారమైన గ్రంథం కాబట్టి సార్వజనీనంగా వుండాలన్నదే
నా అభిప్రాయం. ఈ కారణం వల్ల, మూలంలో గూఢంగా వున్న
సందర్భాలలో, దాని అర్థాన్ని విడమర్చి కొంచెం పెంచి రాసాను. ఏ కారణం వల్ల వాల్మీకి తన కావ్యాన్ని నిర్వచనం గా రాసారో, అదే కారణం వల్ల నేనుకూడా తొలుత దీన్ని నిర్వచనంగానే రచించాను”.
శ్రీమదాంధ్ర వాల్మీకి
రామాయణం రాయడం పూర్తి చేసిన తర్వాత ఎలా ఆ గ్రంథాన్ని ముద్రించింది, ఎవరి తోడ్పాటుతో జరిగింది, ఎవరికి-ఎప్పుడు-ఎలా అంకితమిచ్చింది వాసుదాసు గారి మాటల్లోనే తెలుసుకుందాం. అలనాటి ప్రముఖ దినపత్రిక "ఆంధ్ర
ప్రకాశిక" 17-10-1908 న ఆ నాటి విశేషాలను ప్రచురించింది కూడా.
ఈ విషయాలను తెలియ చేస్తూ, వాసు దాసు గారు: “ఇంత గొప్ప గ్రంథాన్ని
ముద్రించడం ఎలాగని నా స్నేహితులు కొందరు నాతో కలిసి ఆలోచన చేశారు. ఈ వార్త తెలుసుకున్న ఒక "స్వదేశీయ
ప్రభువు" గారు, తాను ఆ భారమంతా మీదేసుకుంటానని చెప్పి, ప్రతిఫలాపేక్ష లేకుండా, వాగ్దానాన్ని
నెరవేర్చుకొని, వేలాది రూపాయలు వ్యయం చేసి, ముద్రింపచేసి, "కృతి" కి,
"కృతి కర్త" కు చిరాయువు కలిగించారు. ఈ విషయంలో తన నిర్వ్యాజ
కరుణకు పాత్రులైన ఆ సత్ ప్రభువుగారికి శ్రీరాముడే సర్వ శ్రేయోదాయి అవ్వాలి. ఆ ప్రభువుగారు, తన పేరును ఇందులో
ప్రకటించడానికి నాకు అనుమతి ఇవ్వనందున ఆయనెవరో లోకానికి తెలియచేయలేక పోతున్నందుకు
విచారం వ్యక్తం చేస్తున్నాను”.
“గ్రంథ రచన పూర్తవగానే ముగ్గురు స్నేహితులం కూర్చొని, దీన్ని, కృతిపతైన ఒంటిమిట్ట శ్రీకోదండరాముడికి నివేదించి, లోకానికి తెలియచేయడం ఎలాగని ఆలోచన చేశాం. ఆ సమయంలో అనుకోకుండా, నా పాత స్నేహితుడు, కడప మండలం-పొద్దుటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్న బ్రహ్మ శ్రీ రాజ శ్రీ
వి. వసంత రావు గారు చెన్నపురికి వచ్చి, వార్త తెలుసుకొని, కార్యక్రమాన్ని మంచిగా
జరిపించాలని ప్రోత్సహించడమే కాకుండా, సహాయం చేసేందుకు
ముందుకొచ్చారు. ఆయనంతటితో ఆగకుండా, కడప మండలంలోని
స్నేహితులతో-హితులతో-భాషాభిమానులతో-దైవ భక్తిగలవారితో ఒక
ఆహ్వాన సభను ఏర్పాటు చేశారు. అందులో బ్రహ్మ శ్రీ మహారాజ శ్రీయుతులు నెమలి పట్టాభిరామరావు (కొచ్చిన్ సంస్థానంలో దివానుగా వుండేవారు), ఏ. పరశురామ రావు, వావిలికొలను రామానుజ రావు, సి. నంజుండప్ప, కే. గుండు రావు, కామసముద్రము నరసింహాచార్యులు, ఎన్. నరసింగరావు, సత్యధీరగురురాజప్రియ కౌకూరు రామచంద్రరావు, యమ్మనూరు నాగయ్య, ఆర్. గిరి రావు గార్లు, మహరాజ శ్రీయుతులు కొణదల
రామచంద్రారెడ్డి, విఠాయా గంటిసెట్టి గార్లు ఆహ్వాన సంఘ సభ్యులు. వీరికి సహాయపడేందుకు, శ్రీమదాయుర్వేదమార్తండ
భిషజ్మణి పండిత డి. గోపాలాచార్యులు గారు, మహారాజ శ్రీ పానుగంటి
రామారాయనింగారు, బ్రహ్మ శ్రీ రాజ శ్రీ గుమ్ముడూరు వేంకట రంగారావు గారు, వేంకట సుబ్బయ్య గారు, ఏ. జయరామరావుగారు, క్రొత్తపల్లి వేంకట
పద్మనాభ శాస్త్రి గారు ముందుకొచ్చారు”.
“ఇలాంటి మహనీయుల కలయికతో అలంకరించిన సభ ఎలాంటి కార్యాన్నైనా
చేయగలదు కదా ! పైగా, వీరి ప్రార్థనలను అంగీకరించి, గ్రంథ
సమర్పణ సమయంలో, సభాధ్యక్షుడిగా వుండడానికి "చిత్రనళీయం" లాంటి అనేక రూపక గ్రంథాలను రచించి, బళ్లారిలో న్యాయవాద వృత్తిలో వున్న, శతావధాని-ఉభయ వేదాంత ప్రవర్తకులు, మహారాజ రాజ శ్రీ
శ్రీమద్ధర్మవరము రామ కృష్ణమాచార్యులు గారు ఒప్పుకున్నారు. 1908వ సంవత్సరం అక్టోబర్ నెల 9, 10, 11 తేదీలలో-అంటే, కీలక నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి, బహుళ పాడ్యమి-విదియ తిథులలో "కావ్య సమర్పణ" జరుగుతుందని
పత్రికా ప్రకటన ఇచ్చింది ఆహ్వాన సంఘం. ఇలా ఆంధ్ర లోకానికి
వెల్లడి చేయడమే కాకుండా, హిత-కవి-పండితులందరినీ ప్రత్యేకంగా "విజ్ఞాపన
పత్రికల" ను పంపించి ఆహ్వానించారు. నా పాత స్నేహితులు, ఒంటిమిట్ట దేవాలయ ధర్మకర్త మహారాజ శ్రీ తిప్పన సుబ్బారెడ్డి
గారు, గ్రామ మెజిస్ట్రేట్ మహారాజ శ్రీ ఆకేపాటి సుబ్బారెడ్డి గారు, గ్రామంలో కావలసినన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయించి, దేవాలయాన్ని అలంకరించి కార్యక్రమానికి సిద్ధం చేశారు. సమాచారం తెలుసుకున్న చుట్టు-పక్కల
గ్రామ ప్రజలు కార్యక్రమం ఆరంభానికి ఒకరోజు ముందు కల్లా ఒంటిమిట్టకు రాసాగారు. మహాత్ముడైన బమ్మెర పోతన పేరు ఇప్పటికీ (అప్పటికీ) మండలంలో భక్తితో స్మరించబడుతుండం వల్ల, ఆ కవి పట్ట భద్రుడు ఎలాగైతే భాగవతాన్ని అర్పించాడో, అలానే ఎవరో శ్రీ కోదండరామస్వాముల వారికి శ్రీ రామాయణం
సమర్పించేందుకు వస్తున్నారని విన్న వారందరు, భక్తి ఆవేశంతో-బాలోన్మత్త పిశాచగ్రస్తులలాగా "రామ-రామ" అంటూ, అన్ని వర్ణాల వారు, చుట్టు-పక్కల పది యోజనాల నుంచి వచ్చారు. అధమపక్షం అలా వచ్చిన వారి సంఖ్య అయిదు వేల పైనే వుంటుంది”.
“ఆహ్వానాలందుకుని వచ్చిన వారిలో చాలామంది గొప్ప కవులు, విద్వాంసులు, అధికారులు, పూజ్యులున్నారు. రాలేక పోయినవారిలో కొందరు
గ్రంథావిష్కరణకు తమ ఆమోదం తెలుపుతూ ప్రత్యుత్తరమో-మాట
మాత్రంగానో తెలియ పరిచారు. కొందరు సందేశాలను పంపారు. ఇలాంటి వారిలో రాజ శ్రీ
రాయ బహదూర్ పి. అనంతాచార్యులవారు, విద్యా వినోద-విశారద-సి. ఐ. ఇ, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు బ్రహ్మ శ్రీ కొక్కొండ
వేంకటరత్నము పంతులు గారు, రస్సల్ కొండ డిప్యూటీ కలెక్టర్ మహారాజ శ్రీ జయంతి రామయ్య
పంతులు గారు, గుంటూరు జిల్లా కోర్ట్ మునసబు వావిలాల శివావధానులు గారు, పిఠాపురం ప్రధానోపాధ్యాయుడు కూచి నరసింహము పంతులు గారు, వైజాగ్ వకీలు బి. యాజులు గారు, కర్ణాటక పండితులు బ్రహ్మ శ్రీ సిద్ధాంతి శివశంకర శాస్త్రి
గారు ప్రముఖులు. చెన్నపురి కళాశాలలనుంచి ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజ సభ్యులు, కొందరు విద్యార్థులు వచ్చారు. పూర్వాచార
పరాయణుడు-ప్రసిద్ధ పురాతన పుంగనూరు సంస్థాన ప్రభువు, మహారాజ రాజశ్రీ రాజా వీర బసవచిక్కరాయలు యశోవంత బహదూర్ గారు
ఆయన సంస్థానంలోని దివాన్-పండితుడు బ్రహ్మ శ్రీ
శేషప్ప శాస్త్రి గారిని, ఆస్థాన విద్వాంసుడు బ్రహ్మ శ్రీ వేంకటరామ శాస్త్రి గారిని
పంపారు”.
“చెన్నపురి నుంచి శ్రీ శైలాద్దంకి సమయోద్దండ కోలాహల లక్ష్మీ
నృసింహ కుమారేత్యాద్యభిజనవ్యపదేశ భాసురులు, అఖిల హరిదంతర విసృత్వర
కవితా పరిమళ మహాకవిత్వోచిత సహృదయ సముదయ సాదర సమర్పిత కవిభూషణ బిరుద భూషణుడు, శ్రీమత్కుమార తాతా చార్యులు గారొచ్చారు. శ్రీ కాళహస్తి నుంచి ఆంధ్రీకృత మహాభారతులు, ఉభయ భాషా కవిత్వ తత్వజ్ఞులు బ్రహ్మ శ్రీ శత ఘంటము వేంకట రంగ
శాస్త్రి గారొచ్చారు. వేంకటగిరి నుంచి కపిలాచిత్రకాయ ఉపాఖ్యానాది గ్రంథ కర్త
శ్రీమదుభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమత్కొమాండూరు శ్రీనివాసాచార్యులు గారు, తిరుపతి నుంచి చుళికీకృత సమస్తాంధ్ర గ్రంథులు-ఉభయ కవివయన్యులు బ్రహ్మ శ్రీ నాగ పూడి కుప్పుసామయ్య గారు
వచ్చారు. ఉభయ వేదాంత ప్రవర్తకులు-పండితులు
శ్రీమత్కమలాపురము రాఘవాచార్యులు గారు, గోపాలాచార్యులు గారు, తర్క వ్యాకరణ పారంగతులు సీతారామ శాస్త్రి గారు, శ్రీమదష్టావధానం నరసింహాచార్యులు గారు, పార్థసారథి సెట్టి గారు, కోటి రెడ్డి గారు, కె. చెంగయ్య గారి లాంటి కవులు, విద్వాంసులు
అనేకమంది వచ్చారు. వచ్చిన వారంతా విద్యావంతులే. అనాహుతులై
వచ్చిన వారిలోనూ పెక్కురు విద్యావంతులున్నారు. అపరిచితులైన వారి పేర్లను
నమోదు చేసుకునే అవకాశం కలగలేదు”.
“కార్యక్రమం మూడు రోజులూ, ఉదయం, శ్రీ సీతారామచంద్రులకు సహస్రనామార్చన యథావిధిగా జరుపబడింది. మొదటిరోజు ఉదయాన సంస్కృత వాల్మీకి రామాయణం, ఆంధ్ర వాల్మీకి రామాయణం పుస్తకాలను శ్రీస్వామివారి పల్లకిలో
వుంచి, ఆ పల్లకిని, రాయబహద్దర్ బ్రహ్మ శ్రీ హనుమంత గౌడ్ గారు, నెమలి సుబ్బారావు గారు, మల్లవరపు పెంచలార్య కవి
గారు, కాకినాడ సరస్వతీ పత్రికాధిపతి బ్రహ్మ శ్రీ కొత్తపల్లి
సూర్యారావు గారు-ఇతర ప్రముఖులు తమ భుజాలపై మోసారు. బ్రహ్మ శ్రీ కొత్తపల్లి పద్మనాభ శాస్త్రి గారు, బ్రహ్మ శ్రీ రాజ శ్రీ కూనపరాజు శేషాద్రి రావు గారు, ఛత్రం-చామర పట్టుకుని తోడురాగా, మంగళ వాద్యాలతో దేవాలయ
గ్రామ ప్రదక్షిణగా వూరేగించారు. గ్రంథానికి పూజ చేసిన తర్వాత ముందున్న కొంత భాగాన్ని కవి
చదివారు. ఒక్కరే మూడు దినాల్లో పూర్తి గ్రంథాన్ని చదవడం కష్టమని
భావించి, చిలుకూరి కృష్ణమూర్తి గారు, వేంకట
సుబ్బయ్య గారు, పద్మనాభ శాస్త్రి గారు, కోమాండూరు
శ్రీనివాసాచార్యులు గారు, క్రొత్తపల్లి సూర్యారావు గారు, కూనపరాజు
శేషాద్రి రావు గారు, కాళహస్తి శర్మ గారు తోడ్పడి పుస్తక పఠన పూర్తి చేశారు. మొదటిరోజు మధ్యాహ్నం దేవాలయ ముఖ మంటపంలో సభ జరిగింది. సీతారామ శాస్త్రి గారు, అష్టావధానం
నరసింహాచార్యులు గారు, ఆర్కాట్ హనుమంతాచార్యులు గారు, అద్దంకి
తాతాచార్యులు గారు, వాధూల శ్రీ వేంకట ప్రసన్న యోగీంద్ర స్వాముల (ధర్మకర్త) వారు, శ్రీ రామాయణం గురించి ఉపన్యసించారు. తెలుగు రాని బ్రహ్మ శ్రీ గోపాలసామయ్యర్ కూడా ఉపన్యసించారు”.
“రెండో రోజు మధ్యాహ్నం తిరిగి సభ జరిగింది. ఆహ్వాన సభా సభ్యుడు వి. వసంత రావు గారు సభ
ఉద్దేశాన్ని, ఒంటిమిట్ట గ్రామ ప్రసిద్ధిని, కార్యక్రమ
అపూర్వత్వాన్ని గురించి వివరించారు. ఆహ్వానితులకు స్వాగతం
పలుకుతూ, (మూడు సీస పద్యాలు, ఒక ఉత్పలమాల, ఒక కవిరాజవిరాజితము) "స్వాగత
పంచ రత్నాలు" చదివి వినిపించారు. అనంతరం సభాధ్యక్షుడు
శ్రీమద్ధర్మవరము కృష్ణమాచార్యులు గారు ఆంధ్రా భాషా విషయాలను గురించి ఉపన్యసించి, సందేశాలను చదివి వినిపించి, గ్రంథోత్పత్తిని
గురించి తెలుపమని కోరారు.
"భక్తే ఈ గ్రంథ రచనకు
కారణం" అని చెప్పిన నేను, ఈ విషయంలో
శ్రీరామచంద్రుడు చేసిన సహాయం గురించి వివరించాను. ఆ
తర్వాత సభాధ్యక్షుడు పండితులను ఉద్దేశించి, ఆంధ్ర వాల్మీకి
రామాయణాన్ని, పరీక్షించవచ్చని కోరారు. అప్పటికప్పుడు కొందరడిగిన
ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది. చాలామంది పండితులు
సభానంతరం వారి వసతి గృహాలకు గ్రంథాలను తీసుకొనిపోయి శోధించారు. ఆ రాత్రి పాదుకా పట్టాభిషేకం నాటకం ప్రదర్శించారు. వచ్చిన డబ్బులను దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. పిండారబోసినట్లున్న పౌర్ణమి నాటి పండు వెన్నెలలో, నంజుండప్ప గారు, కమలాపురం రాఘవాచార్యులు
గారు, నెమలి సుబ్బారావు గారు సీతా కల్యాణం హరి కథా కాలక్షేపం
బోధించారు”.
“మూడో రోజు ఉదయం హిందూ మతం గురించి ఉపన్యాసాలయిన తర్వాత గ్రంథ
పరీక్ష జరిగింది. పండితులందరూ వారి వారి సంతుష్టిని పద్యంగానో-ఉపన్యాసంగానో వెల్లడిచేసి, కృతిని
ప్రశంసించి కవిని ఆశీర్వదించారు. పట్టాభిషేకం భాగం పఠనంతో, సభాధ్యక్షుడి ఉపన్యాసంతో
సభ ముగిసింది. కనీ-వినీ ఎరుగని రీతిలో కార్యక్రమం ముగిసి, లోకులెల్లరు కొనియాడుతుంటే. శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం, కృతి భర్తైన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారికి
సమర్పించబడింది”.
“దిన త్రయం అన్నదానం జరిగింది. చిన్నా-పెద్దా తేడా లేకుండా అందరూ అందులో పాల్గొన్నారు. హేమా-హేమీలనుకునే వారు నడుం బిగించి వడ్డన చేశారు. వారందరికీ నా సాష్టాంగ నమస్కారాలు. అన్నదానానికి సహాయపడిన యాదాళ్ళ నాగమాంబ గారికి, శ్రీ వేంకట సుబ్బయ్య గారికి, శ్రీ
యాదాళ్ల పాపయ్య సెట్టి గారికి, ఇతర పుణ్యాత్ములందరికి శ్రీరాముడు శాశ్వత సౌఖ్యాలను ఇచ్చుగాక”. “కొక్కొండ వేంకటరత్నము పంతులు గారు "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణ కృతి ప్రశంస" గా "రత్నావళి పద్య పంచక బహు కృతి" ని
చేశారు. అలానే కవిభూషణ అద్దంకి కుమార తాతర్య గారు, నాగ పూడి కుప్పుసామయ్య గారు, వేంకట
రంగ శాస్త్రి గారు, మల్లవరపు పెంచలార్య కవి గారు, కొమాండూరు
శ్రీనివాసాచార్యులు గారు, నాధముని దాసు గారు పద్య రూపంలో ప్రశంసించగా ఇతరులు ఉపన్యాస
రూపంగా ప్రశంసించారు. అలనాటి పత్రికల్లో ఈ కార్యక్రమాన్ని గురించి విశేషంగా
వార్తలొచ్చాయి. ప్రశసింస్తూ ప్రసంగం చేసిన వారు-పద్యాలను చదివిన వారు, నన్ను బమ్మెర పోతనతో
పోల్చారు”.
వావిలికొలను సుబ్బారావు గారు ప్రాతఃస్మరణీయుడు.
No comments:
Post a Comment