Saturday, August 20, 2016

పౌరసంబంధాల పథనిర్దేశకుడు భండారు పర్వతాలరావు : వనం జ్వాలా నరసింహారావు

పౌరసంబంధాల పథనిర్దేశకుడు భండారు పర్వతాలరావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (21-08-2016)
వనం జ్వాలా నరసింహారావు

సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున (ఆగస్ట్ 21, 2006) 71 సంవత్సరాల భండారు పర్వతాలరావు పుట్టపర్తిలో మరణించారు. ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న పర్వతాలరావు స్వఛ్చందంగా పదవీ విరమణ చేసిన కొన్నాళ్ల నుంచి పుట్టపర్తి భగవాన్ సత్యసాయిబాబా సన్నిధిలోనే వుంటూ ఆయన సేవలో తరించిపోయేవారు. ఈ తరం పాత్రికేయులకు కాని, ఇతరులకు కాని, అంతగా తెలిసుండని, వుండే అవకాశం లేని భండారు పర్వతాల రావు కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తో మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన స్వర్గీయ ఎన్టీ రామారావు వరకు, ఆ తరువాత స్వర్గీయ ఎన్, జనార్ధన రెడ్డికి, అంటే ఆరుగురు ముఖ్యమంత్రులకు ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసి ఆ పదవికే వన్నె తెచ్చిన సంగతి కూడా బహుకొద్ది మందికే తెలిసుంటుంది. "పీఆర్వో టు సీఎం" అనే పదవిని మొట్టమొదటి సారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1978 లో మొదటి దఫా ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో ఏర్పాటైంది. భండారు పర్వతాలరావును ఆ పదవిలో ఆయన నియమించారు. విరివిగా పుస్తకపఠనం, రచనలు చేసే అలవాటున్న పర్వతాలరావు ఉమ్మడి రాష్ట్రంలో సమాచార-పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్ గా, ఆంధ్రా బాంక్ పౌర సంబంధాల అధికారిగా, చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్ట్రర్ గా, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయానికి పరీక్షల విభాగపు కౌన్సిలర్ గా పనిచేశారు. స్వఛ్చంధ పాత్రికేయుడిగా ప్రసిద్ధికెక్కిన ఆయన ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ సలహాదారుడిగా, నేషనల్ ఇన్పర్మేషన్ సర్వీసెస్ న్యూస్ ఫీచర్ గౌరవ సంపాదకుడిగా కూడా పనిచేశారు.

1958 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార పౌరసంబంధ శాఖలో డీపీఆర్వో గా ఉద్యోగంలో చేరిన పర్వతాలరావు, స్వయం కృషితో, స్వయం ప్రతిభతో, అదే శాఖలో ఉన్నతోన్నత స్థానమైన డైరెక్టర్ పదవిని నిర్వహించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు, ప్రప్రధమంగా సీఎం పీఆర్వో పదవిని ఏర్పాటు చేయగానే, సమాచార పౌర సంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న పర్వతాలరావును ఆయనే స్వయంగా ఆ పదవిలో నియమించారు. బహశా ఆ పదవిని ఆయన నిర్వహించిన తీరు అప్పటికీ, ఇప్పటికీ, బహుశా ఎప్పటికీ ఒక ఆదర్శంగా వుండిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ పదవిలో వున్న మాలాంటి ఎంతో మందికి ఆయన స్ఫూర్తిదాత అనవచ్చు. ఆంగ్లం, తెలుగు భాషల్లో ప్రావీణ్యం వున్న పర్వతాలరావు, వచన, కవిత్వ రచనలెన్నో చేసారు. బహుగ్రంథకర్త. ప్రముఖంగా పేర్కొనాల్సిన వాటిలో: టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్ర ఆధారంగా వంద చిన్ని కథలను "ప్రకాశం గాథా శతి", "మన సుప్రసిద్ధ దేవాలయాలు", "పరమాచార్య పావన గాథలు", "నారసింహాయ" పేర్కొనవచ్చు. అనేక పత్రికలకు, మాగజైన్లకు ఆయన వ్యాసాలు రాసేవారు.


స్వఛ్చంద పదవీ విరమణ అనంతరం, పుట్టపర్తిలో నివాసం ఏర్పాటు చేసుకునే ముందర కొన్నాళ్ల పాటు, ఆయన అపారమైన అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ, డాక్టర్ ఎంసీఆర్ హెచార్డీ సంస్ద కొంతమేరకు ఉపయోగించుకున్నాయి. అంతరించి పోతున్న హస్తకళల మీద ఆయన సుదీర్ఘ అధ్యయనం చేశారు. వాటి తయారీ ప్రదేశాలకు వెళ్లి, హస్తకళాకారులతో స్వయంగా అనేక మార్లు మాట్లాడి, వాటి నేపధ్యం, తయారీ విధానం, అంతరించి పోవడానికి దారితీస్తున్న కారణాలను కూలంకషంగా పరిశీలించి సమగ్ర నివేదికలు తయారుచేసారాయన. వాటినెలా పునరుద్ధరించాలో కూడా సూచించారు. ఆయన నివేదిక ఆధారంగానే వాటి పునరుద్ధరణకొరకై "హస్తకళల అభివృద్ధి కేంద్రాలను" కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిధులతో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. "వీణల తయారీ", "మృదంగం తయారీ", "తోలుబొమ్మలు" మీద ఆయన చేసిన అధ్యయన నివేదికలను ఒక పుస్తక రూపంలో తెచ్చి వున్నట్లయితే భావితరాల వారికి ఎంతో ఉపయోగంగా వుండేది కాని నేనెంత ప్రయత్నం చేసినా హస్తకలల అభివృద్ధి సంస్థతో ఆ పని చేయించలేకపోయాను. ఇప్పటికీ ఆ డమ్మీ కాపీ నా దగ్గర భధ్రపరచాను.


ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర రావు, పౌరసంబంధాల పితామహుడు డాక్టర్ సీవీ నరసింహారెడ్డి, అత్యవసర సహాయ సేవల రూప శిల్పి డాక్టర్ ఏపీ రంగారావు, పర్వతాలరావుతో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పారు. స్వయానా మేనమామ అయిన పర్వతాలరావును తన బాల్యం నుంచే అమితంగా అభిమానించే వాడినని, "పర్వతాలరావు చెడువారిలో కూడా వారిలోని మంచి గుణాలను మాత్రమే వెలికితీసే అపురూపమైన శక్తిగల అరుదైన వ్యక్తి" అన్నారు రంగారావు. పర్వతాల రావు ఎప్పుడూ, ఎవరినీ, ఒక్క పొల్లుమాట కూడా అనేవాడు కాదని, కోపమంటే ఏమిటో ఆయనకు తెలియదని రంగారావు అన్నారు. ఒక గొప్ప రచయితగా, ఉపన్యాసకుడిగా, వక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా ఆయనలో దాగి వున్న శక్తి అనిర్వచనీయం అన్నారాయన. అహర్నిశలూ మార్పుకు ప్రేరేపణ కలిగిస్తూనే, ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో తనకొక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశాలున్నప్పటికీ, కారణాలేవైనా, పర్వతాలరావు స్వఛ్చందంగా ఒక ప్రేమైక జీవిగా మారి, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాడని రంగారావు కొనియాడారు.

సమాచార పౌర సంబంధాల శాఖకు-వృత్తికి, ఒక గొప్పతనాన్ని, క్రమశిక్షణను, నిబద్ధతను, ఆత్మగౌరవాన్ని సమకూర్చిన ఒక మహనీయుడిగా, ఓ అరుదైన పౌరసంబంధాల వృత్తి నిపుణిడిగా పర్వతాలరావును వర్ణించారు ఆయన సహాద్యోగి, ఆ శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ సీవీ నరసింహారెడ్డి. సత్యసాయి బాబా ఆశయానికి, సిద్ధాంతానికి, బోధనలకు ప్రభావితుడై, ఆయన అడుగుజాడల్లో పయనించడానికొరకే, మానవసేవ ధ్యేయంగా తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా, పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో పర్వతాలరావు వానప్రశ్తం చేశాడని ఆయన అన్నారు. "ఒక వైవిధ్యభరితమైన వ్యక్తి ఆయన. ఒక గొప్ప స్కాలర్ గా, మేధావిగా, నిపుణిడిగా, అత్యున్నత ప్రమాణాలను పాటించిన మహా మనీషి పర్వతాలరావు. సేవే పరమావధిగా ఆయన జీవించాడు. ఆయన ఆలోచనలు, మాటలు, చేతలు ఆధ్యాత్మిక మార్గంలో వుండేవి. అసలు-సిసలైన అజాతశత్రువు పర్వతాలరావు ఒక గొప్ప స్నేహితుడు, దార్శనికుడు, తాత్వికుడు" అన్నారు ఆయన గురించి నరసింహారెడ్డి.

ఆత్మగౌరవానికి ప్రతీకగా, అరుదైన అసామాన్య వ్యక్తిత్వానికి నిదర్శనంగా పర్వతాలరావు తనకెప్పుడూ ఆరాధ్యనీయమైన మనిషన్నారు సీనియర్ పాత్రికేయులు, మాజీ ఏపీ ప్రెస్ అకాడెమీ అధ్యక్షులు పొత్తూరి వెంకటేశ్వ్రర రావు. వర్కింగ్ జర్నలిస్టుగా తనకాయన పరిచయమయ్యారని అన్నారు పొత్తూరి. "ఆయనో నిశ్శబ్ద అగ్నిపర్వతం లాంటివాడని, ఎన్నో సమస్యలను తనలోనే దాచుకునేవాడని, వాటిలో కొన్ని ఆయనకు సంబంధించినవైతే మిగతావి ఇతరులవని నాకెప్పుడూ అనుమానంగా వుండేది. ఆయనెప్పుడూ ఇతరులను తన సమస్యలతో ఇబ్బందిపెట్టేవాడుకాదు కాని, ఇతరుల-ముఖ్యంగా స్నేహితుల బాధలను ఎప్పుడూ పంచుకునేవాడు" అన్నారాయన. "ఆయుర్వేద వైద్యంలో ఆయనకు బాగా ప్రవేశం వుంది. ప్రాక్టీస్ చేయడానికి ఆయన అర్హుడు కూడా. మెడిటేషన్ కూడా బాగా తెలిసిన వాడు. ఆయనో గొప్ప పరిశోధకుడు. నరసింహ స్వామి మీద ఆయన రాసిన పరిశోధనాత్మక పుస్తకాలు అరుదైన సాహిత్యం" అన్నారు పొత్తూరి.

"చెన్నా టు అన్నా" (చెన్నారెడ్డి నుంచి ఎన్టీ రామారావు వరకు) పేరుతో ఒక పుస్తకం రాయాలని పర్వతాలరావు అంటుండేవారు. దురదృష్ట వశాత్తు అది ఇంకా వెలుగుచూడలేదు. ఆ పుస్తకం ప్రచురితమై వున్నట్లయితే, అలనాటి ఎన్నో రాజకీయ చారిత్రక ప్రాధాన్యతాంశాలను, మెలకువలను, ముఖ్యమంత్రుల మనోగతాన్ని, మనం తెలుసుకోగలిగే వాళ్లం. స్వర్గీయ టీ. అంజయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనదగ్గర పర్వతాలరావు పీఆర్వోగా పనిచేసిన రోజులనాటి ఒక సంఘటనను పొత్తూరి ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. అప్పట్లో పొత్తూరి ఆంధ్రప్రభ మాగజైన్ సంపాదకులు. "ముఖ్యమంత్రితో ముఖాముఖి" శీర్షికన వారంవారం ఆంధ్రప్రభలో ఒక ఫీచర్ ప్రచురించేవారప్పట్లో. సంపాదకుడిగా, పత్రికాముఖంగా పాఠకులనుండి ప్రశ్నలను ఆహ్వానించేవారాయన. వాటికి సీఎం ఇచ్చిన సమాధానాలను మాగజైన్ లో వారంవారం ప్రచురించేవారు. సమాధానాలు ఇచ్చే విషయంలో, విషయ సేకరణకు సంబంధించి, ముఖ్యమంత్రి అంజయ్యకు ఆయన కార్యదర్శి స్వర్గీయ యు బి రాఘవేంద్ర రావు. పీఆర్వో పర్వతాలరావు సహాయపడేవారు. వారిద్దరూ, ముఖ్యంగా పర్వతాలరావు రాసిచ్చే సమాధానాలు ఏ మార్పులూ లేకుండా అంజయ్య అంగీకరించే వారనీ, అది ఆయనపై అంజయ్యకు వున్న అపారమైన నమ్మకం అనీ పొత్తూరి గుర్తుచేసుకున్నారు.

సుమారు ఏబైఅయిదు ఏళ్ల క్రితం ఆయన ఖమ్మంలో డీపీఆర్వోగా పనిచేస్తున్న రోజుల్లో పర్వతాలరావుతో నాకు మొదటిసారిగా పరిచయమైంది. రికాబ్-బజార్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుంటున్న నాకు ఆయన సోదరుడు (ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు) భండారు శ్రీనివాస రావు క్లాస్ మేట్. ఆయన ద్వారా పరిచయం అయింది. ఆ తరువాత నేను ఆయన మేనకోడలిని వివాహం చేసుకోవడంతో పరిచయం కాస్తా చుట్టరికంగా మారింది. 1989 లో స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేనాయనకు పీఆర్వోవో గా పనిచేశాను. అప్పట్లో డిప్యుటేషన్ మీద ఆంధ్రాబాంక్ పీఆర్వోగా పనిచేస్తున్న పర్వతాలరావును ఏరి-కోరి శాఖకు తిరిగి రప్పించుకుని సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా నియమించారు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఆ విధంగా ఆ హోదాలో వున్న ఆయనతో కలిసి సమన్వయంతో పనిచేసే అవకాశం కలిగింది నాకప్పట్లో. చెన్నారెడ్డి ఉపన్యాసాలను సేకరించి, ఎడిట్ చేసి, ఒకచోట చేర్చి, చాలాకాలం తరువాత "యాన్ ఎజెండా ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ ఏపీ" పేరుతో పుస్తక రూపంలో తేవడానికి ఆయన ఎంతగానో తోడ్పడ్డారు.

దురదృష్ట వశాత్తు పర్వతాలరావు సతీమణి, 78 ఏళ్ల వయసున్న శ్రీమతి సరోజినీదేవికి, భర్త చనిపోయి పదేళ్లయినా, ఆమెకు రావాల్సిన కుటుంబ పింఛను, ప్రభుత్వ నిబంధనలు అనుమతించడం లేదన్న కారణాన ఇంకా మంజూరు కాలేదు. తన ఆర్థిక ఇబ్బందులను మాత్రమే తన శ్రీమతికి వారసత్వంగా ఇవ్వగలిగిన మహానుభావుడాయన. తనకంటూ ఆయన ఏమీ మిగుల్చుకోలేదు.   


పర్వతాలరావు ఎంతమందికో స్నేహితుడు...తాత్వికుడు...దార్శినికుడు. వారిలో నేనూ ఒకడిని కావడం గర్వకారణమే! End 

No comments:

Post a Comment