Saturday, August 6, 2016

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు-2 : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు-2
సూర్య దినపత్రిక (24-04-2016)
వనం జ్వాలా నరసింహారావు

          శ్రీ రామాయణం క్షీర ధార. వాసుదాసుగారి శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం, మందరాలన్నీ, మందార మకరంద మాధుర్యాలే.కవికులగురువు కాళిదాసు అన్నట్లు."చరిత్ర మా రాముడిది. రచన సాక్షాత్తు వాల్మీకులవారిది. గానం చేసినవారు కిన్నెర గాత్రులైన కుశ లవులు. ఇంతటి మహనీయమైన రామాయణ కావ్యంలో, శ్రోతలను పరవశింప చేయని అంశం అనేదేదీ లేదు.

            భగవద్గీత, శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం, శ్రీ రామాయణం భారతీయ సంస్కృతీ రూపాలు. సనాతన ధర్మ ప్రతిపాదకాలు. వీటి మౌలిక తత్వాలు ధర్మ-జ్ఞానాలు. ఈ రెండింటినీ వాచ్య-వ్యంగార్థాలతో శ్రీ మద్రామాయణం ఆవిష్కరిస్తోంది. వాల్మీకి ఆదికవి. రామాయణం ఆదికావ్యం. ఇది ధ్వని-అర్థ ప్రతిపాదిత మహా మంత్రపూతం. గాయత్రీ బీజసంయుతం. ఉపనిషతత్వసారం.స్మరణ-పారాయణ మాత్రంగా అంతఃకరణ శుద్ధి అవుతుంది.

            వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా, పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా కలిపి తెనిగించిన ఏకైక మహాకవి కీర్తి శేషులు వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు. ఆ మహానుభావుడి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, తెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకున్నాయి. కానీ, కాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోతున్నాయి. రామాయణానికి రచయిత ఒక్కడే. వాల్మీకి మహర్షి తప్ప ఇతరులెవరికీ రామాయణం రచయిత అని చెప్పుకునే హక్కులేదనే అనాలి. వాసుదాసుగారు కూడా వ్యాఖ్యాతననే అంటారు తన ఆంధ్ర వాల్మీకి రామాయణానికి.

            వాల్మీకి రామాయణ క్షీరసాగర మధనాన్ని చేసి "మందర"మకరందాలనూ, రమా రామ పారమ్య పీయూషాలనూ, నాలుగు చెరగులా పంచి, ఆ మథనంలో ఆవిర్భవించిన శ్రీ సీతారాముల తత్వాన్ని, వేద వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించి, ఆంధ్రుల హృదయ కేదారాలను ప్రపుల్లంచేసిన పరమ భాగవతోత్తములు "ఆంధ్ర వాల్మీకి"వాసుదాస స్వామి. "రామ భక్తి సామ్రాజ్యం యే మానవుల కబ్బెనో మనసా! ఆ మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమే" అన్న త్యాగరాజ స్వామి వారి కీర్తనకు సాకార దివ్య స్వరూపులు వాసుదాస స్వామి. ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి అవతరించి వున్న కాలంలో, వారి దర్శన-అనుగ్రహ భాషణా సౌభాగ్యమబ్బిన వారు, "శ్రీ మద్రామాయణం-మందరం" పారాయణ పరులై,తమ పరంపరకు శ్రీ వాసుదాస స్వామి గారి దివ్య స్మృతులను అందించి తరించారు. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని అందరికంటే మొట్ట మొదలు ఆంధ్రీకరించి, పదే-పదే రామాయణ పఠన పాఠన శ్రవణాదుల పట్ల ఆంధ్రులకు అత్యుత్సాహాన్ని కలిగించి, "రామ భక్తి సామ్రాజ్యం" అంటే, ఆంధ్ర దేశమే సుమా,అనిపించిన నిరుపమ రామ భక్తులు వాసుదాస స్వామివారు.

                        ఇరవైనాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహా మహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు, వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందో యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ,తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, "మందరం" అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు. ఆంధ్ర పాఠక లోకం మందరాన్ని అపారంగా అభిమానించింది-ఆదరించింది.

            వాసుదాసుగారి కీర్తికి ఆలవాలమైంది ఆంధ్ర వాల్మీకి రామాయణం.ఆంధ్ర భాషలో అంతకుముందు రామాయణానికి యధా మూలాలు లేవని, అర్థ పూర్తి కలిగి, కావ్య-ఇతిహాస గౌరవ పాత్రమై, సర్వజన పఠనీయమై,ప్రామాణికమై, మూలానుసరమైన రామాయణం తెలుగులో వుండడం లోకోపకారంగా భావించి, రచించించారీ గ్రంథాన్ని వాసుదాసుగారు.ఎనిమిదేళ్లలో రామాయణాన్ని తొలుత నిర్వచనంగా ఆంధ్రీకరించి, అలనాటి కడప మండలంలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామికి అంకితం చేసారు .ఆయన రచించిన నిర్వచన రామాయణం, ఆయన జీవిత కాలంలోనే,నాలుగైదు సార్లు ముద్రించబడింది. ఆంధ్ర వాల్మీకి రామాయణం బాల కాండలో,తన స్వవిషయం గురించి ప్రస్తావిస్తూ వాసుదాసుగారు, సంస్కృత రామాయణాన్ని శ్రీరామచంద్రుడి కుమారులైన కుశ-లవులు లోకానికి ప్రకటించినట్లే, తనకూ ఆయన కుమారుడిగా, అలాంటి అధికారం వుందని,అయితే సంకల్పించడం మాత్రమే తన వంతని-నిర్వహించడం శ్రీరాముడి వంతని,పూర్తిచేయించే భారం ఆయన భుజాలపైనే వేస్తున్నానని, ఆయన వలదన్నా వదలనని చెప్పుకుంటారు.


            వాసుదాసుగారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణానికి తెలుగులో సరైన వ్యాఖ్యానముంటే, సంస్కృతం రానివారికి చక్కగా అర్థమవుతుందని మిత్రులంటారాయనతో. మూల గ్రంథం రాయడంకంటే వ్యాఖ్యానం రాయడం కష్టమనుకుంటారాయన మొదట్లో. బాగా ఆలోచించిన తర్వాత, (శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం) "మందరం" పేరుతో గొప్ప వ్యాఖ్యానం రాసారు వాసుదాసుగారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. సరికొత్త విజ్ఞాన సర్వస్వం."మందరం"అంటే, క్షీరసాగరాన్ని మథించడంలో కవ్వంగా ఉపయోగించిన మందర పర్వతమే గుర్తుకొస్తుంది సాధారణంగా ఎవరికైనా. కాని,వాసుదాసుగారి శ్రీపాద సంబంధులకు మాత్రం, "మందరం" అంటే, మొదట గుర్తుకొచ్చేది, ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరమే. వాల్మీకి విరచితమైన రామాయణాన్ని శ్రీవారు, "క్షీరవారాసి" గా సంభావించి, దానిని మధించిన తమ"మేథ" అందించిన మకరందాలను-మధురిమలను, ముచ్చటగా "మందరం"అని పేర్కొన్నారు. సహృదయ నైవేద్యంగా-అనుభవైక వేద్యంగా వచ్చిన రచనలకు అసాధ్యంగా-నిగమ గోచరంగా భావించబడిన రామాయణానికి"మందరం" అని నామకరణం చేయడంలో తను కొంతవరకే న్యాయం చేయగలిగానని అంటారాయన. ఇందులోంచి చిలికిన కొద్దీ ఎన్నో దివ్య రసాయనాలు ఉద్భవిస్తాయని, భావితరాలవారు ఇందుకు పూనుకోవాలని కూడా సూచించారు వాసుదాసుగారు.

            తను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున రాసారు వాసుదాసుగారు. మందరంలో తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిధార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి" కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది. ఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పల మాలలు, సీస-ఆటవెలది-తేటగీతి-కంద-శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే వృత్తాలన్నిటినీ, సందర్భోచితంగా ప్రయోగించారు. వాటిలో, "మత్తకోకిలము", "పంచ చామరం", "కవిరాజ విరాజితము", "తరలము", "ప్రహరణకలిత", "సుగంధి", "ఉత్సాహం", "మనోహరిణి", "వనమయూరము", "తోటకము", "మానిని", "ఇంద్రవంశము", "లయగ్రాహి", "తోదకము", "మాలిని", "కలితాంతము", "మధురగతిరగడ", "వనమంజరి", "కమల విలసితము", "వసంతమంజరి", "మంజుభాషిణి", "స్రగ్ధర", "వసంతతిలక", "మాలి", "కరిబృంహితము", “చారుమతి", "వృషభగతిరగడ", "స్రగ్విని", "మనోరంజని", “హ్లాదిని”,"వంశస్థము", "తామరసం", "పద్మనాభ వృత్తం", "అంబురుహ వృత్తం", "మణిమంజరి", "మంగళ మహాశ్రీ వృత్తం", "మందాక్రాంత" లాంటివెన్నో వున్నాయి. ద్విపదలూ వున్నాయి. దండకం కూడా వుందో సందర్భంలో.ఎక్కడ ఎందుకు ఏ విధంగా ఛందో యతులను ఉపయోగించారో కూడా వివరించారు. వీటికి తోడు అనేక వ్యాకరణ విషయాలను అవసరమైన ప్రతి చోటా పాఠకులకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియచేశారు.

            వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది.ప్రతికాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలోని, ప్రతి పద్యానికి, ప్రతి పదార్థం ఇస్తూ, చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్థాలను-అంతరార్థాలను-ఉపమానాలను ఉటంకిస్తూ, సాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవి. ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా చదువుకుంటూ పోతే-అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే,ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ఒక సారి ధర్మశాస్త్రం లాగా, ఇంకో సారి రాజనీతి శాస్త్రం లాగా,మరో చోట ఇంకో శాస్త్రం లాగా బోధపడుతుంది. ప్రతికాండ ఒక భూగోళ శాస్త్రం-ఖగోళ శాస్త్రం-సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా,సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురా తత్వ శాస్త్రం లాగా దర్శనమిస్తుంది.బహుశా, క్షుణ్ణంగా చదివితే, ఇంకెన్నో రకమైన శాస్త్ర విషయాలు గోచరిస్తాయి.అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ  మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు-వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి. పాదరసం నుండి బంగారం చేసే రహస్యమైన విషయాలలాంటి అనేకమైనవి తెలుసుకోవచ్చు, పరిశోధనా దృక్ఫదంతో చదివితే. ప్రతి కాండ చివర వాసుదాసుగారు రాసిన ఆఖరు పద్యంలో, ఆ కాండలో వున్న మొత్తం పద్యాలెన్నో తెలియచేసే పంక్తులుంటాయి.

            ఆంధ్ర వాల్మీకిరామాయణం రాయడానికి ప్రేరణ-స్ఫూర్తి, భాగవత గ్రంథకర్త బమ్మెర పోతన సంకల్పం ద్వారానే తనకు లభించిందంటారు వాసుదాసుగారు. పోతనను కరుణించిన శ్రీరామచంద్రమూర్తి, ఆయనతో భాగవతాన్ని తెనిగింపచేసి భవ బంధ విముక్తుడిని చేసాడని, అందుకే,పలుకుపలుకులో తేనెలొలికించి, వ్యాస భాగవతాన్ని మరిపించగలిగాడని వాసుదాసుగారి అభిప్రాయం. ఆ విధంగానే, శ్రీరాముడి కరుణ తనపైన కూడా ప్రసరించిందని వాసుదాసుగారు భావించి వుండాలి. తద్రూపమే ఆంధ్ర వాల్మీకం.వాల్మీకాన్ని ఆమూలాగ్రంగా పరిశోధించిన పరమ భాగవతోత్తముడు వాసుదాసస్వామి.108సార్లు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని పఠించి-పారాయణం చేసి, పట్టాభిషేకాలు, సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించిన ఏకైక మహానుభావుడు వాసుదాసస్వామి.

            తనకంటే ముందు కాలం నాటి పూర్వ కవులెవరు, రామాయణాన్ని(పూర్వ కాండలు, ఉత్తర కాండ కలిపి) సంపూర్ణంగా తెనిగించలేదని గ్రహించిన వాసుదాసుగారు, అన్ని కాండలను తెనిగించి, విశేషించి తెలుగు పాఠక లోకానికి ఆవిష్కరించాలని సంకల్పించుకున్నారు."వాల్మీకిరామాయణాన్ని సమగ్రంగా, యథామూలంగా పలికినవారు పూర్వ కవులందూ-నేటి (ఆయన కాలం నాటి) కవులందూ లేరు. నేటి (ఆయన కాలం నాటి) రామాయణాలలో మూలానుసరణంగా వుంది, సమగ్రం కాదు. సమగ్రమయింది మూలాను సరణం కాదు. తమ అభిప్రాయాలను, ఇతరుల అభిప్రాయాలను మూలంగా చేర్చిపెడితే, అది వాల్మీకి పలికిందెలా అవుతుంది?" అని ప్రశ్నించాడు వాసుదాసుగారు.

            భగవత్ చరిత్రలెన్నో వుండగా రామాయణ రచనకే ఎందుకు పూనుకున్నావని అడిగినవారికి తనదైన శైలిలో జవాబిచ్చారు వాసుదాసుగారు. జనన-మరణ రూపకమైన సంసార బంధం నుండి విముక్తి చేసేది రామ కథేనని, భగవత్ సాయుజ్యం పొందేందుకు రామాయణ రచన చేసానని అంటారాయన. పూర్వం కొందరు రాసారుకదా, మరల ఎందుకు రాస్తున్నావంటే, "ఎవరి పుణ్యం వారిదే. ఒకరి పుణ్యం మరొకరిని రక్షించదు"అని జవాబిస్తూ, శ్రీరాముడి అనుగ్రహం కొరకు రామాయణాన్ని రచించి వాగ్రూపకైంకర్యం చేయదల్చానంటారు వాసుదాసుగారు.

            భారద్వాజ గోత్రీకుడు, ఆపస్తంబ సూత్రుడు, గోల్కొండ వ్యాపారి శాఖీయుడయిన వావిలికొలను సుబ్బారావుగారు, కడప జిల్లా-జమ్మలమడుగులో 1863 లో జన్మించి 1939 లో పరమపదించారు. ఎఫ్.ఎ చదువు పూర్తిచేసి, పొద్దుటూరు తాలూకా కార్యాలయంలో చిరుద్యోగిగా చేరి,రెవెన్యూ ఇన్స్పెక్టర్ హోదాకెదిగారు. ఆ విధంగా 1893-1904 మధ్య కాలంలో పదకొండేళ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసారు మొదట్లో. కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత, మద్రాస్ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్య కాలంలో పనిచేసారు.వాసుదాసుగారి తర్వాత ఆ పదవిని అలంకరించింది అక్కిరాజు ఉమాకాంతం గారు. కళాశాలలో చేరక ముందే, పినతండ్రి మీద తనకున్న కృతజ్ఞతకు గుర్తుగా, "శ్రీ కుమారాభ్యుదయం" అనే ప్రబంధ గ్రంథాన్ని రచించి, ఆయనకు అంకితమిచ్చి శాశ్వత స్వర్గ సుఖాన్ని కలిగించారాయనకు. ఆయన రచించిన ఆ ప్రబంధం, నాటి కవి పండితులను ఆశ్చర్య పరిచింది. ఆయన ప్రతిభకది తొలి హారం.


            ఆంధ్ర పండితుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే, భార్యా వియోగం కలగడంతో, వాసుదాసుగారు భక్తి-యోగ మార్గం పట్టారు. జీర్ణ దశలో వున్న ఒంటిమిట్ట రామాలయాన్ని సముద్ధరించాలన్న సంకల్పంతో, బిక్షాటనచేసి లభించిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఆంధ్ర వాల్మీకి రచనాకాలం1900-1908 మధ్య కాలంలో. గాయత్రీ మంత్రం, రామ షడక్షర మంత్రం మూలంలో వున్నట్లే, అనువాదంలో కూడా నిక్షిప్తం చేసారాయన. వాల్మీకంలో వున్న బీజాక్షరాలన్నీ, ఇందులోనూ యథాస్థానంలో చేర్చబడ్డాయి. విడిగా వాసుదాసుగారు, గాయత్రీ రామాయణం, శ్రీరామనుతి కూడా రాసారు. ఆంధ్ర వాల్మీకం అనువాదమైనా, స్వంత రచన-స్వతంత్ర రచన అనిపించుకుంది.


No comments:

Post a Comment