Saturday, August 6, 2016

గవర్నర్ ప్రసంగంపై గొడవ అనుచితం! : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
గవర్నర్ ప్రసంగంపై గొడవ అనుచితం!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర ప్రభ దినపత్రిక (07-04-2016)

తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సభ్యులనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్, గడిచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలుచేసిన వివిధ పథకాల వివరాలు సభకి తెలియచేశారు. ఇలా చేయడం ఏ రాష్ట్రంలోనైనా ఆనవాయితీ ప్రకారం జరిగేదే. అలానే, సాంప్రదాయం ప్రకారం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సీఎం చంద్రశేఖర రావు ప్రవేశ పెట్టడం, దానిపై చర్చ జరగడం, ఎప్పటి లాగానే శాసన సభ ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగాన్ని విమర్శించాయి. ప్రభుత్వం రాసిచ్చిన దానినే గవర్నర్ చదివారని, టీఆరెస్ మేనిఫెస్టో లాగా వుందని తప్పుపట్టాయి. ఒకవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు గవర్నర్ ను విమర్శించాయి ప్రతిపక్షాలు. ఇది మామూలుగా జరిగే విషయమే ఐనా, ప్రతిపక్షాల విమర్శలకు సీఎం స్పందించిన తీరు, భవిష్యత్ లో ఇలాంటి సందర్భాలలో విమర్శించే వారికి ఒక శాశ్వత జవాబు లాగా వుంటుందనాలి.

ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సీఎం మాట్లాడుతూ, చాలా స్పష్టంగా గవర్నర్ ప్రసంగం విషయంలో ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఆయనేం మాట్లాడాలి అనే విషయాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ.....”గవర్నర్ ప్రసంగం, గవర్నమెంట్ రాసిచ్చిన స్క్రిప్ట్ లాగా, టీఆరెస్ మేనిఫెస్టో లాగా, టీఆరెస్ కరపత్రం లాగా వుందని చాలా మంది ప్రతిపక్ష శాసన సభ సభ్యులు, మాట్లాడారు. ఇది మనల్ని మనమే అగౌరవ పరుచుకోవడం, అపహాస్యం చేసుకోవడం లాంటిది. డెఫిసిట్ గా గవర్నమెంట్ రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే గవర్నర్ చదువుతారు. చదివి తీరాలి. ఒక్క పదాన్ని కూడా అటు-ఇటు చదవడానికి గవర్నర్ కు అధికారం లేదు. రాజ్యాంగ అధినేతగా గవర్నర్ మంత్రి మండలికి ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో గవర్నర్, కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి సంబంధిత కాబినెట్ ఆమోదించిన స్క్రిప్ట్ నే ఉభయ సభల్లో చదవాలి. ఈ విషయం కాబినెట్ మంత్రులుగా పనిచేసిన కొందరు ప్రతిపక్ష శాసన సభ సభ్యులకు తెలిసిన విషయమే. ప్రతి సారీ గవర్నర్ ఉపన్యాసాన్ని కాబినెట్ ఆమోదం కోసం, దీనికొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తారు. ఈ సారీ అలానే జరిగింది. ప్రతిసారీ అలానే జరుగుతుంది. జరిగి తీరాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో వుంది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఆ పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాల ప్రతిరూపమే గవర్నర్ ఉపన్యాసంగా వుండాలి. అదే జరిగిందిప్పుడు. భవిష్యత్ లో కూడా అలానే జరుగుతుంది. అలా వాగ్దానాలు గవర్నర్ ఉపన్యాసంలో ప్రతిబింబించకపోతే తప్పు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ప్రభుత్వమైతే అధికారంలో వుంటుందో, పాపులర్ మాండేట్ తో గెలిచిన ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక లోని అంశాలను, అవి అమలు పరుస్తున్న విధానాన్నీ గవర్నర్ శాసన సభలో ప్రస్తావించాలి. అలా చెప్పకపోతే అది అప్రజాస్వామికం. వాస్తవానికి కొన్ని సందర్భాలలో, కొన్ని ప్రభుత్వాలు అలా చేయక పోవడానికి కారణం వారు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేయకపోవడమే! ఏ పార్టీ ఐతే ప్రజల్లోకి పోయి, మేనిఫెస్టో ఆధారంగా ఓట్లు అడుగుతుందో, ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత, ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, హామీలను, ప్రభుత్వ కార్యక్రమాలుగా అమలు చేయాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యంఅన్నారు. రాష్ట్రాలలో గవర్నర్ కాని, కేంద్రంలో రాష్ట్రపతి కాని, ఉభయ సభలనుద్దేశించి చేసే ప్రసంగం విషయంలో ఇంత స్పష్టత ఇచ్చిన ముఖ్యమంత్రి కాని, ప్రధాన మంత్రి కాని ఎవరూ లేరనే అనాలి.

పరిపాలనా వ్యవహారాల తీరుతెన్నులను, రాజ్యాంగ పరంగా గవర్నర్ కు సంక్రమించిన అధికారాలను, వాటికున్న హద్దులను, అవగాహన చేసుకోకుండా ప్రభుత్వం చేసిన ప్రతి పనినీ ప్రతిపక్షాలు అదే పనిగా విమర్శించడం అంత మంచిది కాదేమో! రాజ్యాంగ పరమైన బాధ్యతలు నెరవేర్చడంలో కేంద్రంలో రాష్ట్రపతికి, రాష్ట్రాలలో గవర్నర్ కు పెద్ద తేడా లేదు. ఒకే ఒక్క అతి పెద్ద తేడా...కేంద్రంలో ప్రధాన మంత్రి లేకుండా పాలన సాగదు....రాష్ట్రపతి పాలన అంటూ వుండదు. రాష్ట్రాలలో "రాజ్యాంగ బద్ధంగా పాలన సాగడానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు, రాష్ట్రపతి పాలన విధించడం, ఆ కాలంలో గవర్నర్ పాలనాధికారి కావడం జరుగుతుంది. కారణాలు ఏమైనా ఈ వెసులుబాటును కేంద్రంలో అధికారంలో వున్న అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మలచుకుని, దుర్వినియోగం చేసిన సందర్భాలు అనేకం వున్నాయి. అది వేరే విషయం. మరో విషయం...దేశానికి ప్రధాన మంత్రి ఎంతో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అంతే. ప్రజాభిప్రాయానికి కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రతినిధులు. వారికంటే ఎవరికీ ఎక్కువ అధికారాలు కలిగి వుండడానికి వీలు లేదు. వారిరువురూ ప్రజాస్వామ్యంగా ఎన్నికైనందున ప్రజలకు పూర్తి బాధ్యులు. ఇవన్నీ ఇలా వుండగా, గవర్నర్ పేరు మీదనే రాష్ట్రంలో పాలన సాగుతుంది. అది కేవలం పేరు మీదనే...అంతకంటే ఎక్కువ కానేకాదు.


గవర్నర్ పేరుమీదనే ప్రకటనలు, ఉత్తర్వులు, జీవోలు, జారీ అవుతాయి. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య గవర్నర్ కు ప్రత్యక్షంగానో-పరోక్షంగానో తెలియచేయాలి. గవర్నర్ కేవలం రాజ్యాంగ పరంగా సంక్రమించిన, రాజ్యాంగంలో పొందుపరచిన వ్యక్తే కాకుండా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను పరోక్షంగా పర్యవేక్షణ చేయొచ్చు. కొందరు గవర్నర్లు స్వయంగా సంస్థలను నెలకొల్పిన సందర్భాలు కూడా వున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన శారదా ముఖర్జీ "చేతన" అనే స్వచ్చంద సంస్థను, కుముద్ బెన్ జోషి "నీసా" అనే స్వచ్చంద సంస్థను స్థాపించి పలు రకాల కార్యక్రమాలను నిర్వహించారు. గవర్నర్ పర్యవేక్షణలో రెడ్ క్రాస్, హరిజన-గిరిజన వ్యవహారాలు, కుష్టు రోగుల పునరావాసం లాంటి కొన్ని కార్యక్రమాల నిర్వహణ కూడా జరుగుతుంది. మన రాష్ట్రంలో సాలార్ జంగ్ మ్యూజియం లాంటి వాటి బాధ్యత కూడా గవర్నర్ కు వుంది. రాజ్యాంగ ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమించినప్పటికీ, అది ఆయన ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు. "రాజు (రాణి) తప్పు చేయడానికి కుదరదు" అనే బ్రిటీష్ నానుడి ప్రకారం, శాసన సభలో మెజారిటీ స్థానాలను గెలుచుకున్న పార్టీ నాయకుడినే ముఖ్యమంత్రి చేయాలి కాని మరెవ్వరినీ కాదు. మంత్రివర్గం ఏర్పాటులో కూడా ముఖ్యమంత్రి సలహా-సూచన మేరకే గవర్నర్ వ్యవహరించాల్సి వుంటుంది. కాకపోతే గవర్నర్ తన మంత్రి వర్గానికి ఎల్లప్పుడూ తగు సలహాలు-సూచనలు ఇవ్వ వచ్చు. అవి ఏ మేరకు పాటించాలో నిర్ణయించే హక్కు కూడా మంత్రి మండలిది-దాని నాయకుడు ముఖ్యమంత్రిది.

ఆ మధ్యన, ఓ నాలుగైదు ఏళ్ల కింద అనుకుంటా...ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు తాను నియమించి-శాఖలను కేటాయించిన నలుగురు రాష్ట్ర మంత్రుల, ఇద్దరు పార్లమెంట్ సభ్యుల సమక్షంలో, పరిణితి చెందిన గ్రామాల సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నరసింహన్, తనను తాను "చెడ్డ గవర్నర్" గా అభివర్ణించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇక ముందు ఎక్కువ కాలం తను రాజ్‌భవన్ లో గడపనని, ప్రజల మధ్య గడుపుతానని, వారి కష్ట సుఖాలను విచారిస్తానని హామీ కూడా ఇచ్చారు. బహుశా రాష్ట్ర గవర్నర్, కేవలం నామ మాత్రంగా తన పేరుమీద కాకుండా, తానే-తన పర్యవేక్షణలోనే, ప్రజా సంక్షేమం గురించి స్వయంగా పర్యటనలు చేయబోతున్నారన్న అర్థం ఆయన మాటల్లో అప్పట్లో గోచరించింది. గవర్నర్ పేరుపై సాగే దే రాష్ట్రంలోని పాలనని, నెలకు మూడు రోజులు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తానని, సర్పంచులు పంచాయితీలను దత్తత తీసుకోవాలనీ, నిర్మల్ పురస్కార గ్రామాలు స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దాలనీ అనడమే కాకుండా, ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఒక ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ కూడా చేశారు నరసింహన్. ఇటీవల కాలంలో కూడా ఒక నాడు గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ నెలకొన్న పరిస్థితులపై కొన్ని విమర్శలు బహిరంగంగానే చేశారు కూడా. అలా చేయడం సబబా? కాదా? అనేది ఎవరికి తోచిన రీతిలో వారే భాష్యం చెప్పుకోవచ్చు. అది వేరే సంగతి. ఆయన ఉద్దేశం బహుశా...."తన ప్రభుత్వం" నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు "అనుబంధంగా-అభినందనగా" (సప్లిమెంటరీ-కాంప్లిమెంటరీ) మరో మార్గంలో ప్రజల క్షేమం పట్టించుకోవడం ఐతే తప్పులేదు. కాకపోతే ఇలాంటివన్నీ, రాజ్యాంగ పరిమితులకు-సాంప్రదాయాలకు లోబడి వున్నంతవరకు, అభిలషణీయమే.

కొందరు గవర్నర్లు ప్రత్యేకంగా వ్యవహరించడం ఈ దేశంలో, కొత్తే మీ కాదు. 1977-78 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పదిహేను నెలలు పనిచేసిన శారదా ముఖర్జీ, 1985-90 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసిన కుముద్ బెన్ జోషి, భిన్న రీతుల్లో వ్యవహరించినప్పటికీ, శైలిలో కొన్ని పోలికలున్నాయనాలి. దివి సీమను అతలాకుతలం చేసిన భీకరమైన తుఫాను నేపధ్యంలో, స్వచ్చంద సంస్థల పనితీరుకు మార్గదర్శకంగా-ధీటుగా పనిచేసే తరహాలో "చేతన" సంస్థను స్థాపించి, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ప్రజల-పాలకుల అభినందనలు అందుకున్నారు శారదా ముఖర్జీ. చేతన సంస్థకు, గవర్నర్ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరించే పద్ధతిలో సంస్థ నియమ నిబంధనలను అప్పటి గవర్నర్ కార్యదర్శి మోహన్ కందా తోడ్పాటుతో రూపొందించారామె. దరిమిలా మోహన్ కందా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. శారదా ముఖర్జీ గుజరాత్ గవర్నర్‍గా వెళ్లిపోయిన తర్వాత చేతన కార్యకలాపాలు అనతి కాలంలోనే ఆగిపోయాయి. ఏడేళ్ల తర్వాత గవర్నర్ గా వచ్చిన కుముద్ బెన్ జోషి, చేతన సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్చంద సంస్థను స్థాపించి, జోగినీ పునరావాస కార్యక్రమాలతో సహా పలు ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టారు. ఆ కాలంలో నాలుగు సంవత్సరాల పాటు చేతనకు నేను అడ్మినిస్ట్ర్రేటివ్ అధికారిగా-ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసాను. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో అనేక సందర్భాల్లో విభేదించిందన్నపేరు తెచ్చుకున్న కుముద్ బెన్ జోషి, ఆ రెండు సంస్థల కార్య కలాపాల విషయంలో ఆయన సలహా సంప్రదింపులను "కూడా" తీసుకునేవారు. జోగినిల దురాచారం రూపుమాపే దిశగా రాజ్ భవన్ దర్బార్ హాలులో ఆ అభాగినులకు వివాహం జరిపించడం, ఆ వివాహానికి నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, కేంద్రమంత్రి జలగం వెంగళ్ రావు హాజరు కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు, కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని స్వచ్చంద సంస్థలు చేపట్టిన మరి కొన్ని ముఖ్య కార్యక్రమాలు.

          పలు సందర్భాలలో, వేరు-వేరు సందర్భాలలో, పలు రాజకీయ పార్టీలు, సంబంధిత గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు, గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా రాజకీయ నాయకులు ప్రకటనలు ఇవ్వడం తగదు. అలానే గవర్నర్ ప్రసంగం విషయంలో కూడా ఆలోచనలేని విమర్శలు చేయడం సబబు కాదు. End


Jwala99@gmail.com (8008137012)

No comments:

Post a Comment