Monday, August 8, 2016

అమృత రస ప్రవాహ ఝరి....ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు ఆరవ భాగం -బాలకాండ:వనం జ్వాలా నరసింహా రావు

(Recovered and Reloaded)
అమృత రస ప్రవాహ ఝరి

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
ఆరవ భాగం -బాలకాండ

వనం జ్వాలా నరసింహా రావు

సూర్య దినపత్రిక (06-06-2016)

విలక్షణమైన ప్రబంధ గ్రంథమే రామాయణ కథనం అని అంటూ ఆ విషయాలను సోదాహరణంగా వివరిస్తారు వాసు దాసుగారు. లోక రక్షణ కొరకు భూమ్మీద అవతరించిన శ్రీరామచంద్రమూర్తి ప్రజా పాలన చేస్తున్న రోజుల్లో,భగవంతుడైన వాల్మీకి మహర్షి, లోకోపకారంగా, చిత్రమైన పదాలతో, ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణ రచన చేశాడు. పూర్వ రామాయణంలోని ఆరు కాండలలో ౫౩౭ (537) సర్గలుంటే, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత జరిగిన కథకు సంబంధించిన ఉత్తర కాండలో మరో ౧౧౦ (110) సర్గలున్నాయి.అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఈ గ్రంథాన్ని లోకానికి ప్రకటించినవారు కుశ లవులు.

సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు

బాల కాండ:     ౭౭    (77)     సర్గలు           ౨౨౫౬ (2256)                   శ్లోకాలు
అయోధ్య కాండ: ౧౧౯  (119)  సర్గలు           ౪౪౧౫ (4415)                    శ్లోకాలు
అరణ్య కాండ:   ౭౫   (75)     సర్గలు           ౨౭౩౨  (2732)                   శ్లోకాలు
కిష్కింధ కాండ: ౬౭   (67)      సర్గలు           ౨౬౨౦ (2620)                   శ్లోకాలు
సుందర కాండ: ౬౮  (68)      సర్గలు           ౩౦౦౬  (3006)                   శ్లోకాలు
యుద్ధ కాండ ౧౩౧ (131)     సర్గలు           ౫౯౯౦  (5990)                   శ్లోకాలు
ఉత్తర కాండ:    ౧౧౦ (110)     సర్గలు           ౩౨౩౪  (3234)                   శ్లోకాలు

ఏడు కాండలు: ౬౪౭ (647)    సర్గలు           ౨౪,౨౫౩ (24,253)              శ్లోకాలు
---------------------------------------------------------------------------------------------

స్థూల దృష్టితో పెద్ద సంఖ్య చెప్పేటప్పుడు దాని పైనున్న చిల్లర సంఖ్య గణించాల్సిన పనిలేదు. అందుకే రామాయణంలో ౨౪ (24) వేల శ్లోకాలని చెప్పడం జరిగింది. ప్రబంధ వైలక్షణ్యాన్ని తెలియచేసే సర్గ ఇది. పరమ ఆప్తుడైన కవి రచించడం, కీర్తిమంతుడైన నాయకుడు ప్రతిపాద్యుడిగా వుండడం,మహాత్ములు దాన్ని అంగీకరించడం, సాక్షాత్తూ కథానాయకుడే దాన్ని శ్లాఘించడం లాంటి విషయాలను కలిగున్న గ్రంథాన్ని "ప్రబంధ వైలక్షణ్య"మున్న గ్రంథ మంటారు. సర్గలోని మొదటి పద్యంలోనే ఈ విషయం విశదమవుతుంది. సమస్త సద్గుణాలతో లోకులందరినీ ఆనందపర్చిన శ్రీరామచంద్రుడి చరిత్రై నందువల్ల, రామాయణం కడు ఆదరణీయమైంది. శ్రీరామ చరిత్ర అంటే మహాపురుష చరిత్రే.. అందుకే దీనివలన ఎన్నో లాభాలున్నాయన్న భావన కూడా మొదటి పద్యం లోనే వివరించబడింది.శ్రీరామచంద్రమూర్తి రాజ్యం చేసే రోజుల్లో, సీతాదేవి తన ఆశ్రమం చేరిన తర్వాతే,వాల్మీకి రామాయణ రచన చేశారన్న విషయం కూడా ఈ పద్యంలో స్పష్టంగా బోధపడ్తుంది. శ్రీరామచంద్రమూర్తి అవతరించడానికి పూర్వమే వాల్మీకి రామాయణం రచించాడనడం సత్యదూరం. రామాయణంలోని శ్లోకాలు, సర్గలు,కాండల వివరాలు కూడా మొదటి పద్యంలో చెప్పడం జరిగింది.

  మొదటి పద్యం:
సీ: భువనావనార్థంబు భూమిపై జన్మించి, ప్రాప్తరాజ్యుండయి ప్రజలరాము
            డోముచు నుండ లోకోపకారంబుగ, భగవంతు డగు ఋషి వాల్మికుండు
           శ్రీరాము చరితంబు చిత్రపదంబుల, వెలయ నిర్వదినాల్గు వేలు శ్లోక
           సంఖ్యయు, వానిని సర్గముల్ గాగను, పూర్వరామాయణ మనను నూరు

తే:     లేను, కాండంబులారుగ  జానుమీర,
          వెండియునుబల్కె  బదపడి కాండమొండు
                  పావనంబై న రఘురాము భావికథను,
                     సో త్తరంబుగ నెల్ల రసోత్తరముగ.

ముని కుమారులవలె కనిపిస్తున్న కుశ లవులు ఎంతో సమర్థతతో,వాల్మీకి నేర్పిన విధంగానే, రామాయణాన్నంతా ముఖస్థం చేశారు. అయోధ్యకు పోయి, ప్రశస్త రీతిలో, కడు సంతోషంతో, మహర్షులు-సాదువులు-బ్రాహ్మణులున్న పెద్ద సభా మండపంలో ధర్మ సమ్మతమైన కావ్యాన్ని గానం చేయసాగారు. గుంపులు-గుంపులుగా జనాలున్న చోట, చిన్న-చిన్న వీధుల్లో,సందుల్లో-గొందుల్లో, రచ్చ బండల దగ్గర, అంగడి వీధుల్లో, సంతోషంగా పాడారు కుశ లవులు. వివిధ రకాల అభినయాలతో, నవ రసాల పలుకులతో కుశ లవులు గానం చేస్తుంటే, సంతోష సాగరంలో మునిగి తేలుతున్న జనావళి,వళ్లు మరిచి, వారిని భళీ-భళీ అని మెచ్చుకున్నారు.

అయోధ్య వీధుల్లో రామాయణ గానం చేస్తున్న కుశలవులను శ్రీరాముడు తన వద్దకు పిలిపించుకుంటాడు. మన్మధాకారంతో ముని వేషధారులైన కుశ లవులిద్దరు, ఒకే రకంగా వున్న విషయాన్ని - వారిని చూడగానే సమస్త విద్యలను సరిసమానంగా నేర్చుకున్నట్లుగా తెలుస్తున్న విషయాన్ని, శ్రీరామచంద్రుడు గమనించి, తన మనసులో అనుకుంటున్న దాన్ని తమ్ములతో ప్రస్తావిస్తాడు. తేనెలొలికే అందం తోనూ, అమృత రస ప్రవాహంలోని అలల లాగానూ, వేదార్థంలోని సదభిప్రాయం తోనూ, వింటున్న కొద్దీ బ్రహ్మానందం కలిగించే విధంగా కుశ లవులిద్దరు గానం చేస్తున్నారని అంటాడు. కుశలవుల గానాన్ని వినమని తమ్ముళ్లను ప్రోత్సహిస్తూ: "ఈ బాలకులు ఏ రసాన్నైతే అభినయిస్తూ పాడుతున్నారో, ఆ రసమే మనలో పుట్టి మనకూ అనుభవంలోకి వస్తున్నది. కవిత్వం విషయానికొస్తే, ఆసాంతం, విచిత్ర శబ్దాలతో కూడి వినసొంపుగావుంది. ఏ దోషాలు లేవు. ఇలాంటి నిర్దుష్టమైన-గుణవంతమైన-శ్లాఘ్యమైన కావ్యాన్ని చంద్ర బింబం లాంటి ఈ ముని కుమారులు గానం చేస్తున్నారు" అని సగౌరవంగా మాటలతోనే బహుకరిస్తూ అంటాడు శ్రీరాముడు.

ఈ సందర్భంలో వాసు దాసు గారు రాసిన ఉత్పలమాల పద్యానికి సంబంధించిన ఛందస్సు గురించి ఆయనే స్వయంగా కొన్ని వ్యాకరణ విషయాలను ప్రామాణికంగా ఉదహరిస్తారు. ఆయన రాసిన ఆపద్యం:

ఉత్పలమాల: సోదరులార  వింటిరె ర సోదయకారణ మై విచిత్ర శ
        బ్దాదరణీయ మై  విమల  మై  చెలువారెడుకావ్య మిందిరా
        సోదరమూర్తు  లీతపసి  సూనులు  గాన మొనర్ప నద్ధిరా
        మాదిరి  మీరె  నంచు  బహు మానపురస్కృతవాక్కు  లాడినన్

ఛందస్సు: మూడోపాదంలో "అఖండయతి" వాడబడింది. ఈ యతి విషయంలో భిన్నాభిప్రాయాలు వున్నాయని కవి అంటూ, "అఖండ యతి" ని అంగీకరించిన వారి పక్షాన తానున్నానని స్పష్టం చేశారు. అఖండ యతి సిద్ధాంతాన్ని నిరాకరించిన వారు లక్షణ-లక్ష్యాలను శోధించలేదని, భారాతాన్నైనా పూర్తిగా చదవలేదని ఆక్షేపించారు కవి. పూర్వ గ్రంథాలనుండి కొన్ని ఉదాహరణలిస్తూ,భీమకవి పేర్కొన్న పది యతులలో అఖండ యతి కూడా వుందని అంటారు. అప్పకవికి పూర్వులు, భీమకవికి ముందున్న కవులు ఎలా అఖండ యతిని ఆదరించారో సోదాహరణంగా పేర్కొన్నారు వాసు దాసుగారు.


రతీదేవిని మించిన సుందరమైన భార్యలు-అసమాన పరాక్రమం వున్నా, సంతానం లేనందున, సుఖాలెన్ని వున్నా-కుమారులవలన కలిగే భోగ భాగ్యాలతో సరితూగవని-తన తపస్సు వ్యర్థమనీ బాధపడేవాడు దశరథుడు. పుత్రులు కలిగేందుకు అశ్వమేథ యాగం చేస్తాననీ-అలా చేస్తే సంతానం కలగొచ్చనీ తన మంత్రులతో పురోహితులతో అంటాడు. అందులో భాగంగా పుత్రకామేష్టి యాగం కూడా చేయాలనుకుంటాడు.

పుత్ర కామేష్టి యాగం చేయ సంకల్పించిన దశరథుడితో ముఖ్యమంత్రి సుమంత్రుడు తనకు తెలిసిన ఒక ఉపాయాన్ని-దేన్నైతే సనత్కుమారుడు ఋషులందరూ వింటుండగా వెల్లడిచేశాడని వశిష్ఠాది మునులంటుండగా తాను విన్నాడో, దాన్ని చెపుతానని అంటాడు. ఆ ఉపాయంతో, పుత్రులు లేరన్న చింత తొలగిపోతుందని, అది పుత్రులు కలిగేందుకు నిర్విఘ్నమైన ఉపాయమని అంటాడు. కాశ్యపుడు అనే మునికి-హరిణిలకీ గొప్ప తపస్వి-పుణ్యవంతుడైన ఋశ్యశృంగుడనే కొడుకున్నాడనీ, అతడు పుట్టినప్పటినుండీ అడవుల్లోనే విహరించేవాడని సుమంత్రుడంటాడు. అడవుల్లో తిరిగే అతడు తన తండ్రిని చూడడానికి వచ్చే మునులను తప్ప ఇంకెవ్వరినీ చూడలేదు. ఎల్ల వేళలా తండ్రి ఆజ్ఞానుసారం తపస్సు చేస్తుండేవాడు. ఈ విషయాలను చెప్తూ బ్రహ్మచర్యం గురించి కూడా వివరిస్తాడు సుమంత్రుడు దశరథుడికి. ఇక్కడో పద్యాన్ని "తరలము" వృత్తంలో రాసారీవిధంగా:

తరలము:      జననమాది రసాస్థలిన్ వన చారియై సతతంబు నా
                మునివరేణ్యుఁ డు  గానఁ దండ్రికి  మ్రొక్క వచ్చెడియోగులన్
                ఘనతపస్వులఁ గాని  యన్యముఁ గానఁ  డెద్దియు, నిత్య మ
                య్యనఘుఁ  డుగ్రతపంబులన్  జన కాజ్ఞచొప్పున  వర్తిలున్-4

ఛందస్సు: ------ గణాలు. పన్నెండో స్థానంలో యతి.

ఋశ్యశృంగుడి చరిత్రను సవివరంగా చెప్పమని కోరిన దశరథుడితో,సుమంత్రుడు, ఇంతకుముందు చెప్పినదాన్నే మరింత సమగ్రంగా తెలియచేస్తాడు. ఆ సందర్భంలో "మత్తకోకిలము" వృత్తంలో ఒక పద్యాన్ని, "తరలము" లో ఇంకొక పద్యాన్ని రాస్తారు. అవి:

మత్తకోకిలము:       ఆ ఋషీంద్రుఁ డు పుట్టు వాదిగ నంబుజాయతనేత్ర ల
                న్వార లెట్టిరొ  యాలకింపఁ డు  పల్క  నేటికిఁ జూచుటల్
                వారముఖ్యులు  ధారణీశ్వర  వంచనాపర  లౌటచే
                నేరుపుల్  పచరించి  తేరఁ గ  నేర్తు  రెంతయుఁ  దిన్నఁ గన్-5
తరలము:                జనన  మందిన  దాదిఁ గా  బుర సంభవంబు  నేదేనియున్
                జనపదోద్భవమైనఁ జూచిన  జాడ లేదు, నెలంత 
                న్వినియు  నేని  నెఋంగఁ, డుగ్రసు నిష్ఠు డౌటఁ  దపంబునన్
                దనదునాశ్రమ భూమి  వీడఁడు  దండ్రిఁ దన్పు  సపర్యలన్-6

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం  యతి. తరలము నకు న------ గణాలు. పన్నెండో స్థానంలో యతి.
తాత్పర్యం:    

పుట్టినప్పటినుండి ఇంతవరకూ స్త్రీలను ఋశ్యశృంగుడు చూడలేదు కనుక, వారెలా వుంటారో ఎరుగడని-అందువల్ల ఆయనను తీసుకునిరాగలిగేది స్త్రీలేనని మంత్రులంటారు. కుల కాంతలకు బదులు వార కాంతలైతే, ఏదో విధంగా వంచనతో వశపర్చుకుని, ఋశ్యశృంగుడిని తీసుకుని రాగలుగుతారని-ఈ పనికి వారినే పంపిద్దామని సలహా ఇస్తారు మంత్రులు. నగరంలోగాని-పల్లెల్లోగాని       అందరికీ కనిపించే ఏ వస్తువునూ పుట్టినప్పటినుండి చూసినవాడు కాదు ఋశ్యశృంగుడు. స్త్రీలెలా వుంటారో అసలే తెలియదు.నియమ నిష్ఠలతో తపస్సు చేయడంలోనో-విరామం దొరికినప్పుడు తండ్రికి సేవలు చేయడంలోనో మాత్రమే సమయాన్ని గడిపేవాడు ఋశ్యశృంగుడు.ఆశ్రమాన్ని విడిచి ఎప్పుడూ-ఎక్కడకూ పోయినవాడు కాదాయన.ఇతిహాసాలు-పురాణాలు చదివి, స్త్రీలు ఎలా వుంటారోనని చదివిన వాడూ కాదు. అలాంటి ఋశ్యశృంగుడి దగ్గరికి వెళ్లాలంటే, అక్కడున్న విభండకుడు శపిస్తాడన్న భయంతో, వార కాంతలు చాలా దూరంలో వుండే, సరైన సమయం కొరకు ఎదురు చూశారు.


No comments:

Post a Comment