Sunday, August 7, 2016

కొత్త జిల్లాలు కొత్త పాలన : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
కొత్త జిల్లాలు కొత్త పాలన
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (19-05-2016)

క్షేత్ర స్థాయిలో జిల్లా ఒక కీలకమైన యూనిట్. తెలంగాణలో కొత్త జిల్లాలు రాబోతున్నాయి...జిల్లాల సంఖ్య పెరగబోతున్నది. బహుశా, జిల్లా స్థాయిలో పాలనా వ్యవస్థలో కొన్ని సంస్కరణలు కూడా చేపట్టే అవకాశం వుంది. భారతదేశంలో...తెలంగాణ ప్రాంతంలో...జిల్లాల వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి ఒక సుదీర్ఘమైన నేపధ్యం వుంది. కాకపోతే 1772 లో వారెన్ హేస్టింగ్స్ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న జిల్లాల పాలనా వ్యవస్థ గురించి కాని, తదుపరి, సరిగ్గా వందేళ్ల తరువాత 1872 లో జార్జ్ కాంప్ బెల్ జిల్లా కలెక్ట్రర్ బృహత్తర బాధ్యతల గురించి నిర్వచించిన వివరాలు కాని, ఒక క్రమ పద్ధతిలో గ్రంధస్థం చేసిన వారు అతి కొద్ది మంది మాత్రమే వున్నారు. బహుశా అలాంటివారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గత శతాబ్ది అరవైవ దశకంలో ఆంగ్లంలో "డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా" పేరుతో మాజీ కేంద్ర కాబినెట్ కార్యదర్శి ఎస్ కే ఖేరా రాసిన పుస్తకం. భారతదేశంలో జిల్లాల పుట్టుపూర్వోత్తరాలు, పరిపాలనా విధానం, ఆవశ్యకత, వాటి ఆవిర్భావం, పరిణామక్రమం, పాలనలో చోటుచేసుకున్న తీరుతెన్నెలను, ఒక ప్రామాణికంగా ఎంచుకుని, 1964 లో రాసిన తన పుస్తకంలో ఎస్.ఎస్.ఖేరా అద్భుతంగా విశ్లేషించారు. ఇండియన్ సివిల్ సర్వీస్ కు చెందిన ఖేరా, జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రులుగా వున్న కాలంలో, వారి వద్ద క్యాబినెట్ సెక్రటరీ హోదాలో 15.04.1962 నుండి 18.11.1964 వరకూ పనిచేశారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ పుస్తకానికి ముందుమాట రాస్తూ, జిల్లా కలక్టర్ గా, డివిజనల్ కమిషనర్ గా, వివిధ విభాగాల ఉన్నతాధికారిగా మూడున్నర దశాబ్దాల కాలం చేసిన సేవల అనుభవాలను రంగరించి ఈ పుస్తకంలో జిల్లా పాలనా వ్యవస్థను విశ్లేషించారు ఖేరా అని కొనియాడారు. పుస్తకం ఆసాంతం చదివితే, అనేక ఆసక్తికర విశేషాలు, విజ్ఙానదాయక అంశాలు పాఠకులకు అవగతమౌతాయి.

పౌర వ్యవహారాల ఆజమాయిషీ, నిర్వహణకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ఒక నిర్ధుష్టమైన భౌగోళిక ప్రాంతంలో అమలుపరిచే ప్రభుత్వ విధివిధానాలను, చట్టపరమైన అంశాలను, జిల్లా పాలనా వ్యవస్థ అని పిలుస్తారు. భారత రాజ్యాంగంలో జిల్లాలను గురించి ఎక్కడ కూడా ప్రత్యేకంగా పేర్కొనడం జరగలేదు. కాకపోతే, ఒకటి రెండు చోట్ల జిల్లాస్థాయి జడ్జీలను గురించి ప్రస్తావన వుంది. జిల్లాల్లో పరిపాలనను గురించి కాని, జిల్లా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ స్థాయిలో బాధ్యతలను గురించి కాని చెప్పడం జరగలేదు. ఏది ఏమైనప్పటికీ, భౌగోళికంగా చిన్నదయినా, పెద్దదయినా పౌర పరిపాలనకు క్షేత్ర స్థాయిలో ఒక కీలకమైన కేంద్ర బిందువుగా, అనేక పరీక్షలకు, ఆటుపోట్లకు తట్టుకుని, కాలానుగుణంగా కొన్ని మార్పులకు లోనవుతూ, నిలదొక్కుగోగలిగింది జిల్లా. మను ధర్మ శాస్త్రం-మనుస్మృతిలో ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తే, గ్రామాలను స్వయం ప్రతిపత్తిగల గణతంత్ర వ్యవస్థగా పేర్కొనడం జరిగింది. అలానే, క్రమేపీ, సుమారు వెయ్యి గ్రామాల సమాహారం ఒక జిల్లాగా రూపాంతరం చెందింది. వాస్తవానికి, వర్తమాన గణంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం వున్న సుమారు 6,40,000 గ్రామాలను దేశంలోని 683 జిల్లాలతో భాగించి చూసినట్లయితే అటు-ఇటుగా జిల్లాకు వెయ్యి గ్రామాలే వుంటాయి. తెలంగాణాలో కూడా ఇప్పుడున్న 10,761 గ్రామాలు సగటున వెయ్యి గ్రామాల వంతున మొత్తం పది జిల్లాలలో వ్యాపించి వున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడితే సరాసరిన, ప్రతి 500 గ్రామాలకు ఒక జిల్లా వుండబోతుంది. మరిన్ని వివరాలలోకి పోతే....అక్బర్ చక్రవర్తి పరిపాలించే రోజుల్లో జిల్లాను "సర్కార్" గా వ్యవహరించేవారు. దాని అర్ధం....ప్రభుత్వం నడవడానికి, భౌగోళికంగా కొన్ని యూనిట్లుగా విభజించబడి పాలించబడిందని. ఇంచుమించుగా బ్రిటిష్ కాలంలోనూ ఇదే విధానాన్ని కొనసాగించడం జరిగింది.

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక నిరంతర వారధిలా, అనేక కీలకమైన విషయాలలో జిల్లా పరిపాలన వ్యవహరిస్తుంది. జిల్లా పరిపాలన, ప్రాధమికంగా, మూడు లేదా నాలుగు అంచెల్లో వుంటుంది. వీటిని సౌలభ్యం కొరకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. మొదటి అంచె లేదా ఉన్నత స్థాయి పరిపాలనా ప్రక్రియంతా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, ఇతర జిల్లా స్థాయి అధికారుల సహాయంతో జరుగుతుంది. రెండవ స్థాయిలో సబ్ డివిజన్ లేదా రెవిన్యూ డివిజన్ ద్వారా, మూడవ స్థాయిలో తహసీల్ లేదా మండలం ద్వారా పాలన జరుగుతుంది. అట్టడుగు స్థాయి, లేదా, క్షేత్ర స్థాయిలో గ్రామం యూనిట్ గా వుంటుంది. గ్రామం భౌగోళిక విస్తీర్ణం ఒకే విధంగా వుండాలని లేదు. ఈ యావత్ ప్రక్రియలో కలెక్టర్ జిల్లా స్థాయి పరిపాలనకు ముఖ్య భూమిక వహించగా, గ్రామ స్థాయిలో పనిచేసే పట్వారీ (పట్వారీ వ్యవస్థ కొన్ని రాష్ట్రాల్లో ఎత్తి వేయటం జరగక ముందు) రెవెన్యూ పాలనలో కీలక వ్యక్తిగా, క్షేత్ర స్థాయిలో ఆర్ధిక వ్యవహారాలను చక్కదిద్దేందుకు నిర్దేశించబడిన పాలనాధికారిగా చలామణి అయ్యారు. జిల్లాలకు సంబంధించిన పూర్తి వివరాలను, భూముల పట్టాల వివరాలను, అహర్నిషలూ పటిష్టంగా భద్రపరిచే బాధ్యతాయుత అధికారిగా పట్వారీని అభివర్ణించటం జరిగింది. కలెక్టర్ కు, పట్వారీకి మధ్య ఎందరో ఇతర అధికారుల తమతమ భాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.


జిల్లా పరిపాలనలో ముఖ్య భూమిక వహించేది భూ సంస్కరణలు, భూముల దైనందిన వ్యవహారం, భూ సేకరణ (భూమి కొనుగోలుగా తెలంగాణ రాష్ట్రంలో అంటున్నారిప్పుడు), భూముల రికార్డులు, భూమి శిస్తు. భూముల ఆజమాయిషీ-నిర్వహణలో భాగంగా, ప్రభుత్వ భూములను కాపాడడం, వాటిని పరిరక్షిస్తూనే వాటిని సద్వినియోగ పరచడం, వ్వవసాయానికి ఉపయోగపడని బంజరు భూములను కాపాడడం, అటవీ భూముల సంరక్షణ, నీటి మార్గాల నిర్వహణ తదితర అంశాలుంటాయి. జిల్లా పరిపాలనలో భూముల వ్యవహారమే కాకుండా వ్యవసాయ సంబంధమైన అంశాలు, నీటి పారుదల, పరిశ్రమలు, పౌరసరఫరా, రవాణా, సమాజాభివృద్ధి కార్యక్రమాలు, సహకార సంఘాలు, విద్య, వైద్యం, సంక్షేమం, విపత్తులు, ఎన్నికల నిర్వహణ, స్థానిక సంస్థలు తదితర వ్యవహారాలకు సంబంధించిన పాలనా వ్యవహారాలు కూడా వుంటాయి. వీటన్నింటి కన్నా ప్రధానమైంది కార్య నిర్వహణా బాధ్యతలు....వీటికి సంబంధించిన ప్రభుత్వ పరమైన వ్యవహారాలను, ఉన్నత స్థాయిలో, ఏకైక వ్యక్తిగా నిర్వహించేది జిల్లా కలెక్టర్. భారతదేశంలో జిల్లా ను ఒక కీలకమైన పరిపాలనా విభాగంగా అనుకరించడం వెనుక ఫ్రెంచ్ వారి "ప్రిఫెక్చుర్" ("సామ్రాజ్యం") పద్దతి వుందని ఖేరా పేర్కొన్నారు. అక్కడ దాని అధికారిని "ప్రిఫెక్ట్" అని పిలుస్తారు. దానినే జిల్లా అధికారికి వర్తించ బడుతుందని ఆయన పేర్కొన్నారు. తదనుగుణంగా, లండన్ లోని బ్రిటిష్ ప్రభుత్వానికి భారత దేశంలో ఏజన్సీగా ఈస్ట్ ఇండియా కంపెనీ పనిచేస్తున్న రోజుల్లో, జిల్లాను నియంత్రించేందుకు, భూమి శిస్తు వసూలుకు ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్ట్రర్ అనే అధికారి కావాల్సి వచ్చింది. లావాదేవీలను లాండ్ రెవిన్యూ-సిస్తు వసూలు పేరిట పరిగణించేవారు. కలెక్టర్ కు చట్టాన్ని పరిరక్షించే బాధ్యతనూ అప్పగించటం జరిగింది. ఈ పరిణామ క్రమంలో బ్రిటీష్ ప్రభుత్వానికి సివిల్ సర్వెంటుగా కలెక్టర్ రూపాంతరం చెందారు. మరి కొంతకాలానికి, ఈ ప్రక్రియలో భాగంగా, బ్రిటీష్ సార్వభౌమాధికారంలో జిల్లాలు అంతర్భాగం కాసాగాయి. భవిష్యత్ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా వ్యవహరించబోయే ‘‘కేప్టెన్ సాహెబ్’’ అని పిలవబడే ఉన్నత స్థాయి పోలీస్ అధికారిని కలెక్టర్ కు సహాయంగా నియమించటం జరిగింది. ఈ అధికారులను ఆర్మీ నుండి ఎంపిక చేసేవారు. పోలీస్ వ్యవస్థను భారతదేశంలో ఆర్మీ తరహాలో రూపుదిద్దడానికి ఇదే నాంది.

            దిన-దినాభి వృద్ధి చెందుతున్న జిల్లా యంత్రంగంలో, పాలనలో భాగంగా ఒక వైద్యాధికారిని జిల్లాలకు జోడించటం జరిగింది. వీరినే జిల్లాల సివిల్ సర్జన్ గా పిలిచేవారు. మిలటరీ వ్యవస్థకు చెందిన వైద్య విభాగం నుంచి ఈ వైద్యాధికారులను జిల్లాలకు పంపించారు మొదట్లో. ప్రజా సంక్షేమం అనే ఆలోచన ఒక విధంగా వైద్యరంగంతోనే మొదలైందని చెప్పొచ్చు. సివిల్ సర్జన్లను జిల్లా జైళ్లకు అధికారులుగా నియమించేవారప్పట్లో. వారినా విధంగా జైల్ సూపరింటెండెంట్ లని కూడా అనేవారు. పెద్ద-పెద్ద కేంద్ర కారాగారాలకు కూడా సివిల్ సర్జన్లను సూపరింటెండెంట్లుగా నియమించడం జరిగింది అదే సమయంలో. ఈ విస్తరణ ఇంతటితో ఆగకుండా జిల్లా పరిపాలనలో భాగంగా కలెక్టర్ కు అదనంగా చాలా మంది జిల్లా స్థాయి అధికారుల నియామకం చేయడం మొదలైంది. వారిలో, జిల్లా మెజిస్ట్రేట్ గా కలెక్టర్ కు అదనంగా బాధ్యతలు, జైల్ సూపరింటెండెంట్లు, సివిల్ సర్జన్లు, జిల్లా జడ్జీలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, స్కూల్ ఇన్స్ పెక్టర్లు, వ్యవసాయ అధికారుల లాంటివారున్నారు. పంచాయితీ రాజ్- స్థానిక స్వపరిపాలన అనే ఆలోచన కలగడంతో, కలెక్టర్ బాధ్యతలు, అధికారాలు మరింత విస్తృతం కాసాగాయి. ఒక నూతన పాలనా ధోరణికి తెర లేచింది. కలెక్టర్ వ్యవస్థ కాలక్రమేణ ఒక సమన్వయ సంస్థగా రూపాంతరం చెందసాగింది. ఇలా వుండగానే, భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. క్రమేపీ...జిల్లా స్థాయి పరిపాలన కొత్త పుంతలు తొక్క సాగింది. శాంతి భద్రతల పరి రక్షణ, రెవెన్యూ అంశాలకు సంబంధించిన పాలనా వ్యవహారాలు, ప్రజల సామాజిక ఆర్థిక అవసరాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు జిల్లా పాలనా యంత్రాంగంలో ముఖ్య అంశాలయ్యాయి. జిల్లా పరిపాలనలో కేంద్ర బిందువుగా, కీలకమైన పాత్ర పోషించే వ్యక్తిగా, కలెక్టర్-జిల్లా మెజిస్ట్రేట్ అనే వ్యవస్థ ప్రజావసరాలను తీర్చడంలో తన వంతు పాత్ర నిర్వహిస్తూనే వుంది. ప్రజలకు ప్రభుత్వానికి సంధానకర్తగా-వారధిగా పనిచేసుకుంటూ పోతుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  రాజకీయాలనేకం చోటు చేసుకున్నప్పటికీ, భారతదేశంలో జిల్లా కలెక్టర్సంస్థ నిలదొక్కుకు రావటం అభినందనీయం. కలెక్టర్ బాధ్యతలు ద్విగుణీకృతమైనప్పటికీ సమర్ధవంతంగా చేపట్టగలగడం జరుగుతోంది.

బ్రిటీష్ హయాంలో, "ఇండియన్ సివిల్ సర్వీస్" (ఐసీఎస్) కు చెందిన వారినే కలెక్టర్లగా నియమించడం జరిగేది. స్వాతంత్ర్యానంతరం "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్" (ఐఏఎస్) కు చెందిన వారిని నియమించడం జరుగుతోంది.  వీరిలో కొందరు యు.పి.ఎస్.సి ద్వారా ఎంపికైన వారైతే, మరి కొందరు రాష్ట్ర సర్వీసుకు చెంది, ..ఎస్. గా ప్రమోట్ ఐన వారుంటారు. ఐ..ఎస్. అధికారులను సర్ధార్ వల్లాభాయ్ పటేల్ "భారత దేశపు ఉక్కు వ్యవస్థ" గా అభివర్ణించారు. ఈ సర్వీసెస్ కు ఎంపికైన వారు, అత్యంత మేదో సంపత్తి కలిగిన వారై ఉండటం, సాంఘిక, సామాజిక, సాహిత్య, సాధారణ శాస్త్రం, సామాన్య శాస్త్రం, వైద్యం, ఇంజనీరింగ్ విద్యనభ్యసించి, ఉత్తమ శ్రేణుల్లో ఉత్తీర్ణులైన వారై ఉండటం, జనరల్ నాలెడ్జ్ లో ఎంతో ప్రతిభ కలవారై వుండడం, సర్వీసులో వుండగా ఏ శాఖ పని అప్పగించినా సమర్ధవంతంగా పనిచేసే నైపుణ్యం కలవారై వుండడం విశేషం. యు.పి.ఎస్.సి పరీక్షల అనంతరం ఐ..ఎస్. అధికారులుగా ఎంపికైన తర్వాత, ముస్సోరిలో ఏడాది కాలం శిక్షణ పూర్తి చేస్తారు. ఏ రాష్ట్రానికైతే వారు కేటాయించబడుతారో, ఆ రాష్ట్రంలోని ఒక జిల్లాలో సహాయ కలెక్టర్లుగా విధులు నిర్వర్తిస్తూనే, రాష్ట్ర పరిపాలనా శిక్షణ సంస్థలో కూడా శిక్షణ పొంది, మొదట సబ్ కలెక్టర్లుగా నియామకం అవుతారు. ఆ తరువాత జాయింట్ కలెక్టర్లుగా, ట్రైబల్ ప్రాంతాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్లుగా, డిప్యూటీ-జాయింట్ కార్యదర్శులుగా, సెక్రెటరీలుగా, ప్రిన్సిపల్ సెక్రెటరీలుగా, స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీలుగా పదవులు, పదోన్నతలు పొందుతారు. వీరిలో కొంత మంది ఛీఫ్ సెక్రెటరీ, క్యాబినెట్ సెక్రెటరీ వంటి పదవులను అధిష్ఠించటం జరుగుతుంది.

కలెక్టర్ల అధికారాలు-విధులు-బాధ్యతలు ప్రస్తుతం రెండు రకాలుగా వున్నాయి. ఒకటి నియంత్రణాధికారాలు కాగా, మరొకటి, సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాల అమలు. మరింత వివరంగా చెప్పుకోవాలంటే: పౌర భద్రత, న్యాయ పరమైన వ్యవహారాలు, అసంఘాకిక చర్యలను నిరోధించటం, రెవెన్యూ విధులు, జిల్లాల ప్రణాళికలు రూపొందించటం, ప్రకృతి విపత్తులను అధిగమించే చర్యలు చేపట్టడం, పౌర సంభందాలు, ఎక్సైజు వ్యవహారం  పర్యవేక్షించటం, వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు వచ్చేలా చూడటం, ఆర్ధిక వ్యవహారాలను పరిశీలించడం, స్టాంపు డ్యూటీల వసూలు, పౌర సంబంధాలను కొనసాగించటం, ఈ పరిపాలన, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికలు నిర్వర్తించిడం...లాంటివి వున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న, ప్రభుత్వ సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రెండు పడకగదుల  ఇళ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు, ధళితులకు భూ పంపిణీ, హరితహారం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు చేయటం లాంటివి వున్నాయి.

            అనేక సంవత్సరాలుగా జిల్లాల పాలన కొనసాగుతున్నప్పటికీ, వర్తమాన అవసరాలకు అనుగుణంగా, కలెక్టర్లు, ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా, తమ ఆలోచనా ధోరణిని అనుసంధానించి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమౌతుంది. End 

No comments:

Post a Comment