బహళ
ప్రయోజనకారి...మల్లన్నసాగర్ రిజర్వాయర్
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (02-08-2016)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజునుంచి, రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రతి రైతు
వేస్తున్న ప్రధానమైన ప్రశ్న త్వరితిగతిన సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడు
పూర్తవుతాయనీ, ఎంత త్వరగా తమ పొలాలకు నీళ్లొస్తాయనీ.
తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ఇదే పరిస్థితి నెలకొని వుంది. రాష్ట్ర
ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదవీ ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన తక్షణమే
దృష్టిసారించిన ప్రాధాన్యతాంశం సాగునీటి ప్రాజెక్టులే. గత ప్రభుత్వాల హయాంలో
తెలంగాణాకు నీళ్లొస్తాయనే పేరుతో-నీళ్లిస్తామనే ఆశ చూపుతూ, రూపుదిద్దుకున్న సాగునీటి
ప్రాజెక్టులన్నీ, ఏదో విధంగా అంతర్ రాష్ట్ర వివాదాల్లో
చిక్కుకోవడమో, పర్యావరణ అనుమతుల నెపంతో పక్కన
పెట్టడమో, వణ్య ప్రాణి సంరక్షణ వున్న ప్రాంతాల
గుండా అవి పోవాల్సి రావడమో జరిగింది. ఇవన్నీ నిర్మాణ పరంగా ముందుకు ఏ మేరకు
సాగుతున్నాయనే విషయం క్షుణ్ణంగా సమీక్ష చేసిన సీఎంకు ఎక్కడి గొంగళి అక్కడే వున్న
సాగునీటిరంగ ముఖచిత్రం కనిపించింది. ముఖ్యమంత్రి. పదవీ విరమణ చేసిన నీటిపారుదల
ఛీఫ్ ఇంజనీర్లను, నిపుణులను సంప్రదించడమే కాకుండా, ముఖ్యమంత్రి స్వయానా ఒక పరిపూర్ణ
అవగాహనకు వచ్చేందుకు,
గూగుల్ మాపుల సహాయంతోను, లైడార్ సర్వేల ద్వారాను, అనేక విధాలుగా సమీక్ష చేయడం జరిగింది.
ఈ క్రమంలోనే, తెలంగాణకు నష్టం జరిగే రీతిలో సుమారు
450 కి పైగా గోదావరి నదిమీద మహారాష్ట్ర ప్రభుత్వం బారేజీలు కట్టిన విషయం కూడా వెలుగులోకొచ్చింది.
ప్రాణహిత-చేవెళ్ల
ప్రాజెక్టు ఒక కామిక్ కథ లాంటిదనాలి. దీని వెనుక భయంకరమైన కుట్ర దాగివుంది. ఈ
విషయాన్ని సీఎం కేసీఆర్ శాసనసభలో కూడా చేప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మించాలనే తలంపు
సమైక్య రాష్ట్రంలో ఎనాడూ లేనేలేదు. తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి మళ్లించడానికి, ఆ ప్రాంతానికి కూడా నీళ్లిస్తున్నామని
చెప్పడానికి, ఉద్యమకారులను అవహేళన చేయడానికి చేసిన
ఆలోచన ఈ కామిక్ కథ. 16 టీఎంసీల స్టొరేజ్ కెపాసిటీతో 16 లక్షల 45 వేల ఎకరాలకు నీరు పారిస్తామని, అందుకొరకు 5 టీఎంసీల సామర్థ్యంతో తంభిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్తామని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు!
ఇది సాధ్యమయ్యే పనా?
డిజైన్ లో భాగంగా ఆరు స్టేజీల
లిఫ్ట్, చేవెళ్ల దగ్గరకు వచ్చే సరికి మరో
లిఫ్ట్ కు రూపకల్పన జరిగింది. సాంకేతికంగా ఈ విధానంలో ఎన్నో లొసుగులున్నాయి.
మధ్యలో ఒక్క మోటారు పాడైనా మొత్తం పథకమంతా విఫలమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా
ప్రాజెక్టుల రూపకల్పనలో జరగాల్సిన విధానం మధ్యలో కొన్ని రిజర్వాయర్ల నిర్మాణం
చేయడం. ప్రాజెక్టు నుంచి గమ్యం వరకు 20 లేదా 30 లేదా 50 టీఎంసీల లేదా అంతకంటే తక్కువ సామర్థ్యం గల రిజర్వాయర్లను ఏర్పాటు
చేసుకుంటే, ఆయకట్ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నీళ్లు పారడానికి
వీలవుతుంది. ఈ విధానం వల్ల మధ్యలో మోటార్ పాడైనా, ఇంకేదైనా ఇబ్బంది
కలిగినా నీటి పారుదల సాగుతుంది. ఈ విషయాన్నెందుకు దృష్టిలో పెట్టుకోలేదో గత
ప్రభుత్వం?
తంభిడిహట్టి దగ్గర
ప్రాజెక్టు కట్తే మంచిదని సర్వే ఆధారంగా నివేదిక ఇచ్చిన వ్యాప్ కోస్ నిపుణులను, ప్రతినిధులను, ఈ విషయంపై ఆరాతీసిన ముఖ్యమంత్రికి, అసలు వాస్తవం తెల్సింది. తాము కాళేశ్వరం దగ్గరే ఎక్కువ నీళ్లుంటాయని, తంభిడిహట్టి దగ్గర కంటే అక్కడ కట్తేనే మంచిదని వైఎస్సార్ కు చెప్పామని, అయితే ఆయన వినిపించుకోకుండా, తమ నివేదికను
మార్చి రాయమని ఆదేశించారని వారు సీఎం కు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్
శాసనసభలో కూడా చెప్పారు. ఇక నీటి లభ్యత
విషయానికొస్తే....సీడబ్ల్యుసీ దగ్గరున్న గత 47 సంవత్సరాల రికార్డు పరిశీలిస్తే, కాళేశ్వరం దగ్గర సగటున ఏడాదికి 1651 టీఎంసీలు, తంభిడిహట్టి దగ్గర
సగటున 1144 టీఎంసీలు...అంటే...కాళేశ్వరంలో తంభిడిహట్టి కంటే 500 టీఎంసీలు అదనంగా లభ్యమవుతాయని అర్థం చేసుకోవచ్చు. మరెందుకిలా రాజశేఖర
రెడ్డి చేయాల్సి వచ్చింది? సమాధానం చాలా సులభం! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, తెలంగాణ రాష్ట్రం తంభిడిహట్టి లో ప్రాజెక్టు కట్టుకున్నా, కింద వున్న 500 టీఎంసీల నీళ్లు ధవళేశ్వరానికి పోవాలి! తెలంగాణ
మేడిగడ్డను ప్రతిపాదించడానికి కారణం వుంది. ఎందుకంటే..మహారాష్ట్ర వాళ్లు
తంభిడిహట్టికి ఒప్పుకోమన్నారు కాని, మేడిగడ్డకు
అంగీకరించడమే కాకుండా, ప్రాజెక్టు ఎత్తు 101 మీటర్లుండడానికి
కూడా అభ్యంతర పెట్టలేదు. ఇక్కడ స్టొరేజీ కెపాసిటీ దాదాపు 20 టీఎంసీలు....అదనంగా
ఏడాది పొడుగూతా, మున్నూటరవైఐదు రోజులు నీటి లభ్యత పూర్తి స్థాయిలో
వుంటుంది. ఇవన్నీ నగ్న సత్యాలు.
మేడిగడ్ద దగ్గర బారేజీ కట్టి, పంప్ హౌజ్ లతో అక్కడనుంచి నీళ్లు
తెచ్చే క్రమంలో, ఎప్పుడైనా-ఏదైనా కారణం చేత, నీటి లభ్యత తగ్గుతే, ఇంద్రావతి నుంచి కూడా నీళ్లను
తెచ్చుకునే అవకాశం పుష్కలంగా వుంది. మేడిగడ్ద దగ్గర బారేజీ కట్టితేనే, ప్రాణహిత, కడెం, ఆదిలాబాద్, మానేర్, కరీంనగర్, ఎస్సారెస్పీ కింది వరకు నీళ్లొచ్చే
వీలుంటుంది. మొత్తం మీద గతంలో చేసిన డిజైన్ ప్రకారం లభించే నీరు కేవలం 16.3 టీఎంసీలే కాగా, రీ డిజైనింగ్ వల్ల
సుమారు 200 టీఎంసీల నీళ్లొస్తాయి. అదే విధంగా అన్నారం బారేజీ
తరువాత, గోదావరి రైతుల భూములు మునగకుండా, గోదావరిని లైవ్ గా వుంచడానికి, అన్నారం కెపాసిటీ 3.62 టీఎంసీలుగా, సుదిమళ్ల 1.5 టీఎంసీలుగా డిజైన్ చేయడం జరిగింది. గతంలో మేడారం దగ్గర 0.58 టీఎంసీలుండేవి.
ఇది పెంచుకోవడానికి అవకాశం వున్నందున అక్కడ 3-4 టీఎంసీలకు
తీసుకోపోవచ్చు. ఇంతకు ముందు 0.35 టీఎంసీలున్న మల్కపేట్ ను ఇప్పుడు రీ డిజైనింగ్ లో
భాగంగా 3 టీఎంసీలు చేస్తున్నారు. అదే విధంగా అనంతగిరిలో 1 టీఎంసీ నుంచి 3.5 టీఎంసీలకు పెరుగుతున్నది. ఇమాంబాద్ లో 80 టీఎంసీలు కాని
అంతకంటే కొంచెం ఎక్కువగాని పెరిగే అవకాశం వుంది. దీని తరువాత వచ్చేదే బహుళ
ప్రయోజనకారైన మల్లన్నసాగర్ రిజర్వాయర్.
ఈ విధంగా రీ డిజైనింగ్ లో
రిజర్వాయర్లు-ప్రాజెక్టులు కట్టే క్రమంలో.....50 టీఎంసీల
మల్లన్నసాగర్; పాములపర్తి సమీపంలోని 21 టీఎంసీల కొండపోచమ్మ; భువనగిరి నియోజక వర్గంలోని 14.5 టీఎంసీల బస్వాపూర్; ఆలేర్ నియోజక
వర్గంలోని 9.84 టీఎంసీల గంధమర్రి; ఎల్లారెడ్డి నియోజక
వర్గం మోతే దగ్గర 2.90 టీఎంసీలు; అదే నియోజక
వర్గంలోని 1.5 టీఎంసీల గుజ్జువాన, 5 టీఎంసీల కాటేవాడి; కామారెడ్డి నియోజక
వర్గంలోని 5 టీఎంసీల తల్లమడ, 3 టీఎంసీల తిమ్మకపల్లి, 2.5 టీఎంసీల కాచాపూర్, 2.5 టీఎంసీల ఇసాయ్ పేట; నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప దగ్గర 5 టీఎంసీల కొండం
చెరువున్నాయి. అదే విధంగా హైదరాబాద్ తాగునీటి కోసం 20 టీఎంసీల సామర్థ్యంతో
షామీర్ పేట్ వద్ద మరో రిజర్వాయర్ డిజైన్ లో వుంది. గౌరవెల్లి రిజర్వాయర్
సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచి, గండిపేట్ దగ్గర 1 టీఎంసీ రిజర్వాయర్ కూడా వుంటుంది. 5. 5 టీఎంసీల
సామర్థ్యంతో పత్తిపాక సమీపంలో మరో రిజర్వాయర్ కూడా కట్టాలన్న ఆలోచన వుంది. ఈ
విధంగా రూపొందించిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వల్ల 200 టీఎంసీల వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం
సమగ్రంగా, సమర్థవంతంగా, పరిపూర్ణంగా ఆలోచన
చేసింది.
భవిష్యత్ లో మేడిగడ్డ రిజర్వాయర్ నుండి సుందిళ్ల, అన్నారం బారేజీల వరకు గోదావరి నది కలకళ లాడుతూ లైవ్ గా
జీవనదిలా పారుతుంది. సుందిళ్ల బారేజీనుంచి ఎల్లంపల్లి వరకు నీటికి ఢోకా లేదు.
ఎల్లంపల్లి ఈ పాటికే కట్టబడి వున్నందున, అక్కడ
ఈ సంవత్సరం నీళ్లు లేకపోయినా,
వచ్చే సంవత్సరానికి 20 టీఎంసీల పూర్తి స్థాయికి నింపడం
సాధ్యమవుతుంది. ఇక్కడి నుంచి రాయపట్నం బ్రిడ్జ్ దాటి ధర్మపురి దగ్గర జైనా దాకా
నీళ్లు లైవ్ గా ప్రవహిస్తాయి. అక్కడి నుండి ఎస్సారెస్పీని గోదావరి వరకు
పారించుకోగలిగితే,
మొత్తం 20 కిలోమీటర్ల మేరకు అంతా లైవ్ కాబోతుంది. మధ్యలో సధరపాడు బారేజీ, ఒకటో రెండో మూడో ఇతర బారేజీలు కడితే, శ్రీరాంసాగర్ నుండి
మేడిగడ్డ, ఇంద్రావతి దాకా గోదావరి నది పూర్తిగా లైవ్ గా
వుండే పరిస్థితి కలుగుతుంది. బారేజీలకు ఇరువైపుల ఆదిలాబాద్, కరీంనగర్ రైతులు చిన్న- చిన్న లిఫ్టులు ఏర్పాటు చేసుకుంటే, వాళ్ల పొలాలను చక్కగా, లాభసాటిగా పండించుకునే అవకాశం
వుంటుంది. మేడిగడ్డ నుండి ఎస్సారెస్పీ వరకు 200 కిలోమీటర్ల దూరం మొత్తం 365 రోజులు నీళ్లతో కళకళ లాడుతూ, ఎటు చూసినా పంట పొలాలతో, చేను, చెల్క, పశుపక్ష్యాదుల నిలయంగా, ఆహ్లాదకరంగా వుండబోతోంది. యావత్తు ఉత్తర తెలంగాణ, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా, సశ్యశ్యామలమై, నిరంతరం సజీవంగా, కళకళలాడే వ్యవసాయంతో ఒక అద్భుతమైన
ప్రాంతంగా రూపుదిద్దుకోనుంది అచిరకాలంలో.
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో మిడ్ మానేర్ డాం (ఎంఎండి)
లోకి రెండు టీఎంసీల నీళ్లు వచ్చే ఏర్పాటు జరుగుతున్నది. ఎంఎండి, అనంతగిరి రిజర్వాయర్ల సామర్థ్యం, వాటితో పాటు ఇమాంబాద్ సామర్థ్యం కూడా పెంచడం జరుగుతుంది.
ఇక మల్లన్న సాగర్ విషయానికొస్తే ఇదొక బహుళ ప్రయోజనకారి ప్రాజెక్టు అనాలి. 50 టీఎంసీల సామర్థ్యం కల ఈ రిజర్వాయర్
నుండే ఆలేర్,
భువనగిరికి నీళ్లు పోతాయి. సింగూర్ నింపాలన్నా, నిజాంసాగర్ నింపుకోవాలన్నా మల్లన్నసాగర్ నుండి గ్రావిటీతో నీళ్లు
పంపవచ్చు. దీనికి ఒక పైసా కూడా అదనంగా ఖర్చు కాదు. ఒక్క సారి నిజాంసాగర్ వరకు
నీళ్లొస్తే, అక్కడినుండి, ఏ ఇబ్బంది లేకుండా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటాయి. మూడు లక్షల ఎకరాలను సాగు
చేయాల్సిన 50-60 టీఎంసీల నిజాంసాగర్ ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ మూలాన గత వైభవం పునరుద్ధరించబడి, మొత్తం ఆయకట్ సాగులోకి వస్తుంది. అదే విధంగా ఎస్సారెస్పీ కూడా బాగుపడుతుంది. ఒక్క సారి నీళ్లు ఎంఎండి కి వస్తే, వరంగల్ జిల్లా పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ జిల్లాలో ఇప్పుడు
దేవాదుల ద్వారా సాగయ్యే ఆరు లక్షల ఎకరాలకు అదనంగా మరో నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. వీటన్నింటికీ మల్లన్నసాగర్ రిజర్వాయరే ఆధారం.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజ్వెక్టుల
రీడిజైనింగ్ ఆవశ్యకత,
అవసరం, నేపధ్యం, తెలంగాణాకు ఏళ్ల తరబడి జరిగిన అన్యాయం
గురించి సవివరంగా రాష్ట్ర శాసనసభలో సుదీర్ఘంగా గూగుల్ చిత్రపటాల సహాయంతో ఉపన్యాసం
చేసినప్పుడు, కారణాలేంటో చెప్పకుండా ప్రధాన
ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సభలో లేకుండా పోయింది. ఆనాడు కేసీఆర్ ఇచ్చిన
వివరణలో మల్లన్నసాగర్ గురించి కూడా స్పష్టంగా వుంది. వాళ్లలా ఎందుకు పోవాల్సి
వచ్చిందని సీఎం సభా ముఖంగా ప్రశ్నించారు కూడా. ప్రాజెక్టులకు సంబంధించి అదొక సమగ్ర
సమాచారంతో కూడిన విశ్లేషణాత్మక ఉపన్యాసం. యావత్ రాష్ట్రంతో పాటు, దేశ విదేశాల్లో వున్న పలువురు టీవీలకు
అతుక్కు పోయి ఆ ప్రసంగాన్ని విన్నారు ఒక్క కాంగ్రెస్ పార్టీ వారు మినహా! సభలో సీఎం
వివరించడానికి కారణం సభా ముఖంగా వారి సూచనలు, సలహాలు
తీసుకోవాలనే. ఆనాడు సలహాలు,
సూచనలు ఇవ్వకుండా సభను
బహిష్కరించి ఇప్పుడిలా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టడం ఎంతవరకు
సబబు? వాస్తవానికి ముంపు గ్రామాలకు
గురవుతున్న రైతుల్లో తొంబై శాతానికి పైగా తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి
అంగీకరించి ఆ మేరకు రిజిస్ట్రేషన్లు చేసారు కూడా. మరెందుకిప్పుడీ విధంగా మిగిలిన
కొద్దిమందిని రెచ్చగొట్టడం?
లక్షలాది ఎకరాలు సాగుబడిలోకి తేవడానికి
కీలకమమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ భవిష్యత్ లో ఒక బహుళ ప్రయోజనకారి ప్రాజెక్టు
కాబోతున్న తరుణంలో,
ఏవో కొన్ని గ్రామాలు
మునిగిపోతున్నాయన్న నెపంతో ప్రాజెక్టును ఆపడం సమంజసం కాదు.End
భవిష్యత్తులో కేసీఆర్ గారికంటే విభిన్నంగా, నిర్మొగమాటంగా చెప్పాలంటే ఆయనవిధానాలకు విరుధ్ధంగా ఆలోచించి వ్యవహరించే ముఖ్యమంత్రి అధికారంలోనికి వస్తే అప్పుడు కూడా మీరు ఇలాంటి ప్రభుత్వబాధ్యతలో ఉంటే ఎలా సరికొత్త బాణీలో సమర్థనలు వ్రాస్తారా అన్న ఊహ ఆసక్తి కలిగిస్తుంది. ఊహాత్మకప్రశ్నలకు సమాధానాలు ఆలోచించవలసిన పని లేదని మీరు తప్పక అనవచ్చును. అభ్యంతరం లేదు.
ReplyDelete