(Recovered and Reloaded)
రాముడు లేని అయోధ్య - చంద్రుడు లేని రాత్రి
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
పదవ భాగం అయోధ్య కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (04-07-2016)
శ్రీరామ లక్ష్మణులు సీతతో గూడి అడవులకు బయల్దేరుతారు. వెంట వస్తున్న
పురజనుల కంటబడకుండా వారిని ఏమరిచి ఉత్తరాభిముఖంగా ప్రయాణమై పోతారు. అలా వెళ్తూ, ఉత్తర
కోసలదేశాన్ని దాటి పోతారు. మార్గమధ్యంలో కనిపించిన వేదశ్రుతి నదిని, గోమతి అనే
నదిని దాటుతారు. ఆ తర్వాత గంగానది కనిపిస్తుంది. గంగను వర్ణిస్తూ
"లయగ్రాహి" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారు ఈ విధంగా:
లయగ్రాహి:
అంగుగ దినేశకుల పుంగవుఁ డు మోద
మలరంగను గనుంగొనె నభంగతరభంగో
త్సంగను శివాంబుచయ రంగను
మహాఋషినిషంగను శుభాశ్రమచ యాంగను సురీవ్యా
సంగనుత సుందరవిహంగకుల రాజిత తరంగకజలాశయవిభంగను సరౌఘో
త్తుంగభవభీహనన చంగను
నభంగురశుభాంగను దరంగముఖరంగ నలగంగన్ - 29
ఛందస్సు:
లయగ్రాహికి భ-జ-స-న-భ-జ-స-న-భ-య
గణాలుంటాయి. తొమ్మిదో అక్షరం ప్రాసయతి. ఇలాంటివి పాదానికి నాలుగుండాలి.
తాత్పర్యం: పెద్ద-పెద్ద
అలలు గలదైన, స్వఛ్చమైన జలాలు గలదైన,మహర్షుల సంభంధం కలదైన, పుణ్య
కార్యాలు చేయాల్సిన ఆశ్రమాలను తనతీరంలో కలదైన, స్నానం చేసే
దేవతాస్త్రీలు గలదైన, పొగడదగిన అందమైన పక్షిజాతులతో ప్రకాశించే అలలుగల మడుగులను అక్కడక్కడా
కలదైన,మనుష్య సమూహాల అతిశయమైన
జనన-మరణాలనే భయాన్ని పోగట్టే సామర్థ్యం కలదైన, అధిక
శుభాన్నిచ్చే అవయవాలు కలదైన గంగ అనే పేరున్న ప్రసిద్ధ నదిని శ్రీరాముడు సంతోషంతో
చూసాడు.
సీతా రామలక్ష్మణులు గంగానదీ సమీపంలో మిత్రుడు గుహుడిని కలుస్తారు.
సీతాదేవిని, అన్నదమ్ములను విశ్రాంతి తీసుకొమ్మని-నిదురించమని, నిద్రాభంగం
కాకుండా తాను రక్షణగా వుంటానని అంటాడు గుహుడు. శ్రీరామ వనవాసంవల్ల అయోధ్యలో
కలుగనున్న పరిణామాల గురించి లక్ష్మణుడు గుహుడికి చెప్పుతాడు. ఆ తర్వాత శ్రీరామ
లక్ష్మణులు,సీత గంగను దాటడానికి కావాల్సిన
ఏర్పాట్లన్నీ గుహుడు చేస్తాడు. తమవెంట ఇంతదూరం వచ్చిన సుమంత్రుడిని అయోధ్యకు
మరలిపొమ్మంటాడు శ్రీరాముడు. భరతుడు రాజ్యమేలుతున్న రాజ్యాన్ని కైక అనుభవించాలన్నదే
తన ముఖ్యాభిప్రాయంగా దశరథుడికి ప్రియమైన విధంగా తెలియచేయమని సుమంత్రుడిని కోరుతాడు
రాముడు. శ్రీరామ లక్ష్మణులు జడలు ధరిస్తారు-మునుల మాదిరిగా కనిపించారప్పుడు. గంగనుదాటేందుకు నావ ఎక్కిన పిదప
సీతాదేవి తమనందరిని రక్షించమని గంగను ప్రార్తిస్తుంది. నావ అవతలి ఒడ్డుకు చేరిన
తదుపరి అందరు కిందకు దిగుతారు. నిజమైన అరణ్యవాసం ఇక అప్పటినుండి మొదలవుతుంది. ఆ సమయంలో
శ్రీరాముడు తల్లిదండ్రులను తలచుకొని దుఃఖిస్తుంటాడు. తనను గర్భంలో ధరించిన కౌసల్య
నిర్భాగ్యురాలని బాధపడ్తాడు. అలా శ్రీరాముడు బాదపడడం, ఆయన్ను
తమ్ముడు లక్ష్మణుడు ఓదార్చడం జరుగుతున్న క్రమంలో నాలుగు పద్యాలను (తోటకము, తోదకము, ఉత్సాహము, మత్తకోకిలము)
రాసారీవిధంగా:
తోటకము: అని పెక్కు
తెరంగుల నశ్రుయుతా
ననుఁ డై
విజనంపు వనంబున నా
యనఘాత్మకుఁ
డేడిచి యానిశ యం
దొనరన్
మునిపోలికి నున్న యెడన్ -30
ఛందస్సు:
తోటకమునకు నాలుగు
"స" గణాలు 9వ యింట యతి
తోదకము: అలలు
చలింపని యంబుధినామం
టల పెను పార
ధనంజయు నట్టుల్
నిలిపి
విలాపము నివ్వెర నుండన్
లలివచనంబుల
లక్ష్మణుఁ డాడెన్ -31
ఛందస్సు: తోదకమునకు
న- జ- జ- య గణాలు. పాదమునకు 12అక్షరములుంటాయి. ప్రాస నియమం
వుంది.
ఉత్సాహము: నిక్కమింత
రామచంద్ర నీవు వీడి వచ్చుటన్
దిక్కుమాలి యాయయోధ్య తేజు మాసి
యుండెడిన్
జుక్కరేఁ డు లేని రేయి
చొప్పునన్; వ్యథామతిన్
న్రుక్కఁ దగునె నేను సీత
న్రుక్కమే నినుం గనన్ -32
ఛందస్సు:
ఉత్సాహమునకు ఏడు సూర్య గణాలు, ఒక గురువు, ఐదవ గణం
మొదటి అక్షరం యతి. ఇందులో అన్నీ "హ" గణాలే అవుతే అది "సుగంధి"
వృత్తం అవుతుంది. సగణ-హగణాలకు సూర్య గణాలని పేరు.
మత్తకోకిలము:
నిన్నుఁ బాసి ధరాతనూజయు నేను నొక్క ముహూర్తమే
ని న్ని లం
గలవారమే తమ నీటి బాసిన చేఁ పల
ట్లన్న!
యాజనకాఖ్యుఁ డేటికి నంబ యేటికిఁ దమ్ముఁ డేన్
నిన్నుఁ
వాసిన స్వర్గమేటికి నిక్క మియ్యది రాఘవా -33
ఛందస్సు: మత్తకోకిలము
వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో
అక్షరం యతి.
తాత్పర్యం:
తన (రాముడి)
వలన తల్లికి, లోకులకు కలిగిన దుఃఖాన్ని తలచుకొని అనేకవిధాలుగా పరితపించి, కన్నీళ్లతో
కూడిన కన్నులు కలవాడై,ఓదార్చేందుకు జనులెవరూలేని అడవిలో ఏ పాపం ఎరుగని శ్రీరామచంద్రుడు ఆ
రాత్రంతా ఏడిచి మౌనవ్రతం పూనిన వాడివలె వుండిపోయాడు. అలలు కదలని సముద్రంలాగా, మంటలు
చల్లారిన అగ్నిహోత్రం లాగా ఏడుపును ఆపుచేసి కొంచెం కోలుకుంటున్నట్లు
కనిపిస్తున్నప్పుడు, తమ్ముడు లక్ష్మణుడు "ఉత్సాహకరమైన" మాటలు
చెప్పుదామనుకుంటాడు అన్నకు. ("నిలిపి విలాపము" అనడమంటే, తనంత తానే
ఉపశమించుకున్నాడని భావం. "అలలు చలింపని అంబుధి" అంటే, వాయువు
ప్రేరితమైనప్పుడే అలలు ఎగిసినట్లు, దుఃఖం
ప్రేరించు వారెవరూ లేనప్పుడు ఉపశమనమే దారి అని భావన. ఒక విధంగా ఈ ఉపమానం పూర్తిగా
శ్రీరాముడికి అన్వయించక పోవచ్చు). ఇలా అంటున్నాడు రాముడితో: రామచంద్రా ! నీవు
చెపుతున్న మాటల్లో కొంత నిజం లేకపోలేదు. నువ్వు వదిలివచ్చిన కారణాన దిక్కులేనిదైన
ఆ అయోధ్య, కాంతిహీనమై, చంద్రుడు
లేని రాత్రిలాగా వుంటుందనడంలో సందేహం లేదు. కాని, వనవాసానికి
రాకముందు చేయాల్సిన ఆలోచన, వనవాసం
చేద్దామని నిశ్చయించుకున్న తర్వాత,ఇప్పుడు-ఇక్కడ ఆలోచించి దుఃఖపడడం తగిన పనికాదు. ముందు చేసిన కార్యం
గురించి వెనుక ఆలోచించేవాడు బుద్ధిమంతుడనిపించుకోడు. వెనుక చింత వెర్రితనం
లాంటిది. నువ్వు ధైర్యంగా వున్న కారణాన, ఆయనే
ధైర్యంతో వుంటే మనమెందుకు దుఃఖించి ఆయనకు కష్ఠం కలిగించాలనుకొని, నీ కొరకు
మేము నిబ్బరంగా వున్నాం. నువ్విలా దుఃఖపడితే, నీ కోసం
మేమెంత దుఃఖపడాలో ఆలోచించు. రాఘవా ! నువ్విక్కడ దుఃఖపడుకుంటూ నన్ను వూరికి
పొమ్మన్నావుగాని, నా మనస్స్థితిని ఆలోచించలేదు. నేనుగాని,సీతగాని మా సుఖం కొరకు నీ వెంట రాలేదు. సుఖపడాలనుకుంటే అయోధ్యలోనే
వుండిపోయేవాళ్లం. అయోధ్య నుంచే ఆ సేవ చేసేవాళ్లం. అడవిలో వున్నా చేసేవాళ్లం. కాల
దేశాలు మాకు ప్రధానం కాదు. ( ఆ తర్వాత రాముడామాటలకు సంతోషించాడు).
శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి అరణ్యవాసానికి పోయిన కొన్నాళ్లకు
దశరథుడు దుఃఖంతో మరణించాడు. ఆయన మరణానికి అంతఃపుర స్త్రీలు ఏడుస్తారు. రాజకీయ
వ్యవహారాలు తెలిసినవారు ఏడుస్తున్న కౌసల్యను ఓదార్చి, మృత
దేహానికి చేయాల్సిన ధర్మ విధులగురించి తదుపరి చర్యలు చేపట్తారు. అంత దుఃఖంలో
అంతఃపుర స్త్రీలు కైకను దుర్భాషలాడుతారు. భవిష్యత్ లో కైక పెత్తనంలో తామెలా అక్కడ
వుండగలమోనని పొరలి-పొరలి ఏడుస్తుంటారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, కాంతిహీనమైన
అయోధ్యాపురుని గురించి, అక్కడి
పరిస్థితి గురించి మూడు పద్యాలు - మాలిని, కలితాంతము, మానిని వృత్తాల్లో-
రాసారీవిధంగా కవి:
మాలిని: కలయఁ గ జను
లెందుం గార్పఁ గన్ బాష్పవారిన్
గులతరుణులు హాహా ఘోషముల్ నించు చుండన్
లలి నలుకులు మ్రుగ్గు ల్గానరా కెట్టి యింటన్
బొలుపు దొరఁ గి యుండెం బ్రోలు గుర్తింపకుండన్ -34
ఛందస్సు:
మాలిని వృత్తానికి న-న-మ-య-య
గణాలు. 9 వ అక్షరం యతి.
కలితాంతము: భూమీశ్వరుఁ
డేడ్చుచు బొంది విడన్
భామాజన మార్తిని వ్రాలనిలన్
శ్రీమద్రవి యస్తముఁ జేర జనెన్
భూమిం బెనుఁ జీఁ కటి పొల్పెసఁ
గెన్ -35
ఛందస్సు: కలితాంతమునకు
త-ట-జ-వ గణాలు. 8 వ అక్షరం యతి.
మానిని: తామరసాప్తుఁ
డు లేనినభం బనఁ
దారలు లేని త్రియామ యనం
గా మహితాత్ముఁ డు భూపతి లేమిని గద్గదకంఠసమాకులితా
యామమహాపథచత్వరసంఘము నై పురి యొప్ప నరుల్
సతులున్
స్తోమములై చెడఁ దిట్టుచు
నుండిరి ద్రోహి మొనర్చినకై
కయినిన్-36
ఛందస్సు: మానిని
వృత్తానికి ఏడు "భ" గణాలు, గురువు, 13 వ అక్షరం
యతి.
తాత్పర్యం:
ఎక్కడ చూసినా ప్రజలు కన్నీరు కారుస్తుంటే, కుల
స్త్రీలు హాహా కారాలు చేస్తుంటే, ఎవరి ఇంటి
ముందు కూడా అందంగా అలకడం గానీ-ముగ్గులు వేయడం గానీ లేకుండా, ఇది అయోధ్యా
పురమా అని గుర్తించ లేకుండా వుండి సౌందర్యం లేనిదయింది. పుడమి రాజు ఏడుస్తూ
శరీరాన్ని వదిలి పెట్టగా, భార్యలందరు
దుఃఖంతో నేలగూలారు. శోభాయమానంగా వుండే సూర్యుడు అస్తమించాడు. భూమంతా పెనుచీకటి
వ్యాపించింది. సూర్యుడు లేని ఆకాశం-నక్షత్రాలు లేని రాత్రి అన్నట్లుగా, గొప్ప
మనస్సు గల రాజు లేనందువల్ల, వ్యసనంతో
డగ్గుత్తిక పడిన కంఠాల వారితో కలత చెందిన రాచ బాటలు, నాలుగు త్రోవలు
కలిసే ప్రదేశాలు కనిపించాయి. స్త్రీ-పురుషులు గుంపులు-గుంపులుగా చేరి రాజద్రోహం, భర్తృ
ద్రోహం, పుత్ర ద్రోహం, ప్రజా
ద్రోహం చేసిన కైకేయిని నాశనమై పోవాలని నోటి కొచ్చినట్లు తిట్టారు.
No comments:
Post a Comment