(Recovered and Reloaded)
ఇప్పటికీ అది ఆనందనిలయమే
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (16-05-2016)
ఏప్రియల్ చివరి వారంలో మరో మారు తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామి
వారి దర్శనం చేసుకుని వచ్చాం.
భగవంతుడి
దయవల్ల ఈ సారి కూడా వసతి,
అతి
చేరువ నుంచి స్వామి వారి దర్శనం చక్కగా జరిగాయి. అల మేలు మంగాపురంలో
అమ్మవారి దర్శనం కూడా బాగానే జరిగింది. ప్రస్తుతం చేస్తున్న
ఉద్యోగంలో చేరడానికి ముందు రెండేళ్ల క్రితం ఒకసారి, చేరిన తరువాత ఏడాది
క్రితం మరో సారి దర్శనం చేసుకున్నాం. అవీ బాగానే జరిగాయి. ఆ మాటకొస్తే "దర్శనం స్వామి ఇస్తేనే దొరికేది"...అంతే కాని ఎవరూ ఇచ్చేది కాదు. అదో నమ్మకం. హైదరాబాద్ నుంచి బయల్దేరి, రేణిగుంట విమానాశ్రయంలో దిగి, అక్కడి
మార్పులు చూసిన తరువాత,
చిన్నతనం
నుంచీ తిరుమల దర్శనానికి వెళ్లొచ్చిన విషయాలు గుర్తుకు రాసాగాయి.
తిరుమల
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవడానికి మా నెలసరి ఆదాయంలో ఒక శాతం పైకాన్ని
విడిగా తీసి పెట్తుంటాం.
దానికి అదనంగా, ఉద్యోగంలో పదోన్నతి కలిగినప్పుడు, ఇంక్రిమెంటు వచ్చినప్పుడు, మొదటి నెల జీతం ఎంత పెరిగితే అంత
మొత్తం కూడా ఆ తిరుమలేశుడి దర్శనార్థం ప్రత్యేకంగా దాచిపెడతాం. నాకు ఆదాయం రావడం మొదలైన గత ఐదు దశాబ్దాలుగా
ఇలానే చేస్తున్నాం.
ఎప్పటికప్పుడు, అప్పటి ఆదాయానికి అనుగుణంగానే
ఖర్చవుతున్నాయి కాని ఏనాడూ తిరుమల ప్రయాణం భారం మాత్రం కాలేదు. నాకు ఊహ తెలియక ముందు, తెలిసీ-తెలియని
రోజుల్లో, తెలిసినప్పటి నుంచీ తిరుమల వెళ్లి
రావడంలో చాలా మార్పులు స్వయంగా చూస్తూ వస్తున్నాను.
"వేంకటాద్రి సమం స్థానం
బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి"…
ఆ కలియుగ ప్రత్యక్ష దైవ దర్శనం ఒక్క క్షణ కాలంపాటు కలిగినా చాలని,
వందల-వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి,
లక్షలాది మంది భక్తులు, పవిత్ర పుణ్య
క్షేత్రమైన తిరుమల కొండకు నిత్యం వెళుతుంటారు. స్వామిని
దర్శించుకున్న సామాన్యులు కాని, అసామాన్యులు కాని, గంటల తరబడి క్యూలో నిలుచున్న వారు కాని, సరాసరి
వైకుంఠ ద్వారం గుండా లోనికి వెళ్లగలిగిన వారు కాని, ఒక్క
టంటే ఒక్క దర్శనం చాలనుకునేవారు కాని, వీలై నన్ని దర్శనాలు
కావాలనుకున్నవారు కాని, ఒక్క రూపాయి హుండీలో వేయలేని వారు
కాని, కోట్లాది రూపాయలు సమర్పించుకోగలిగే వారు కాని.....ఎవరైనా...కారణమేదైనా....ఎలా
వెళ్లినా, వచ్చినా....తృప్తి తీరా,
తనివితీరా దేవుడిని చూశామంటారే కాని, అసంతృప్తితో
ఎవరూ వెనుదిరిగిపోరు. వెళ్తూ....వెళ్తూ,
దర్శనంలో పడ్డ ఇబ్బందులేమన్నా వుంటే పూర్తిగా మరచి పోతూ, ఏ భక్తుడైనా, ఏం కోరినా-కోరకున్నా,
తప్పకుండా కోరేది మాత్రం ఒకటుంటుంది.....అదే,
"స్వామీ, పునర్దర్శన ప్రాప్తి కలిగించు"
అని. అలా తన భక్తులను తన వద్దకు
రప్పించుకుంటాడా కలియుగ దైవం!
శ్రీ మహావిష్ణువు నివాసమైన శ్రీ వైకుంఠమే తిరుమల! మహావిష్ణువిక్కడ
"ఆనంద నిలయం" అనే తన "బంగారు మేడ" లో దర్శనమిస్తున్నాడు. ఆలయ ప్రవేశం చేయాలంటే "మహా ద్వారం"
గుండా క్యూ లైన్లలో వెళ్లాలి భక్తులు. మహా
ద్వారాన్ని "పడి కావలి" అని,
"ముఖద్వారం" అని, "సింహద్వారం" అని, "పెరియ
తిరువాశల్" అని కూడా అంటారు. ఈ
మహా ద్వారానికి ఇరు ప్రక్కల ద్వారపాలకులుంటారు. మహా
ద్వారానికి ఆనుకుని ఒక మండపం వుంటుంది. ఆ పక్కనే "అద్దాల మండపం" వుంటుంది. అక్కడా
కొన్ని వుత్సవాలు జరుగుతాయి. దానికి ఎదురుగా వున్న మరో
మండపంలోనే ఒకప్పుడు కళ్యాణోత్సవం జరిగేది. ఆ మండపం పక్కనే "తిరుమలరాయ మండపం" వుంటుంది. దానికీ ప్రాధాన్యత వుంది. ఆలయ ప్రాంగణంలోనే "ధ్వజస్తంభం", "బలిపీఠం",
"క్షేత్రపాలక శిల" వుంటాయి. అదృష్టవంతులైన భక్తులకు ధ్వజస్తంభం పక్కనుంచి లోనికి పోయే వీలు కలుగుతుంది.
అక్కడ అన్నీ విశేషాలే! "నాలుగు కాళ్ల
మండపం", "విరజానది", శ్రీ
వేంకటేశ్వరుడికి అనుదినం అలంకరించే పూల దండలు, బంగారు వాకిలి
ఉభయ పార్శ్వాలలో నిలచి వున్న పంచలోహ మూర్తులు, "కులశేఖర
పడి".....ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో...ఎన్నెన్నో....!
ఏమిటీ కొండ మహాత్మ్యం? ఏముందీ
దైవంలో? ఎందుకిన్ని ఆర్జిత సేవలు? ఒక్కో
సేవకున్న ప్రత్యేకత ఏమిటి? పొరపాటునన్నా, లేదా, ఏమరుపాటునన్నా ఏనాడైనా ఏదైనా సేవ ఆగిందా?
ఏ సేవ, ఎప్పుడు, ఎంతసేపు
జరపాలన్న విషయంలో ఏవన్నా నియమ నిబంధనలున్నాయా? గతంలోను,
ఇప్పుడు సేవల వేళల్లో కాని, పట్టే
సమయాల్లోకాని, మార్పులు చేర్పులు జరిగాయా? జరగడానికి శాస్త్రీయ కారణాలే మన్నా వున్నాయా? ఆర్జిత
సేవలకు అనుమతిచ్చే భక్తుల సంఖ్యలో పెంచడం-తగ్గించడం జరిగిందా?
తిరుమల కొండలో "నిత్య కళ్యాణం-పచ్చతోరణం"…..అన్ని ఆర్జిత సేవలలోను "కళ్యాణోత్సవం"
కు ఒక ప్రత్యేకత వుంది. శ్రీ వేంకటేశ్వరుడికి,
శ్రీదేవి-భూదేవిలకు, అనునిత్యం
తిరుమలలో, భారతీయ హిందూ సాంప్రదాయ రీతిలో, వేద మంత్రోచ్ఛారణల మధ్య, ఇరు వంశాల వంశ క్రమాన్ని-ప్రవరను పఠనం చేస్తూ, అర్చకులు మంగళ సూత్ర ధారణ
చేస్తారు. కళ్యాణోత్సవం చేయించిన వారికి నేరుగా మూల విరాట్
దర్శనం చేయించే ఆనవాయితీ వుండేది ఒకప్పుడు. కాలం మారింది.
కాలానుగుణంగా కళ్యాణోత్సవం చేయించేవారి సంఖ్య పదుల నుండి వందలకు-వేలకు చేరుకుంది. ఉత్సవం జరిపించే స్థలం కూడా
తదనుగుణంగా మార్చవలసి వచ్చింది. సరాసరి మూల విరాట్ దర్శనం
చేయించే ఆచారం మారింది. సర్వదర్శనం క్యూలో కలిపి, ఆ తోపులాటలోనే వీరికీ దర్శనం-అదీ లఘు దర్శనం
చేయిస్తున్నారిప్పుడు. ఐనా, కళ్యాణోత్సవం
చేయిస్తున్న వారి సంఖ్య పెరుగుతుందేకాని తగ్గడం లేదు. ఈ
మార్పులకు కారణాలుండే వుండాలి. ఇవన్నీ భక్తులు
తెలుసుకోవాలనుకున్నా, ఏ కొద్దిమందికో తప్ప అందరికీ
వీలుండదేమో! శ్రీ వేంకటేశ్వరుడికి అను నిత్యం జరిపించే ఒక్కో
సేవకు ఒక్కో ప్రాధాన్యం వుంది-విశేషముంది. ప్రతి సేవలో అనుసరించే ఒక్కో విధానానికి విశేష ప్రాముఖ్యత వుంది. ఉదాహరణకు "సన్నిధి గొల్ల" అని పిలువబడే ఒక యాదవ వ్యక్తి బంగారు వాకిళ్ల తాళాలు తీయడం. ప్రతి నిత్యం తొలి దర్శనం అతడికే కలుగుతుంది. సుప్రభాత
సేవ సమయాన పొర్లు దండాలు మరో విశేషం. వాటి గురించి గత ఏబై
సంవత్సరాలకు పైగా తిరుమలను దర్శించుకుంటున్న నాకు తెలిసింది చాలా తక్కువ. ఊహ తెలిసినప్పటి నుంచీ - తెలియనప్పటి నుంచి కూడా
తిరుమలను అనేక మార్లు దర్శించుకున్న నాకు అప్పటికీ-ఇప్పటికీ
తేడా కనిపించడం మాత్రం వాస్తవం.
మొదటి సారి చిన్న వయసులో కుటుంబంతో కలిసి
కాలినడకన నేను తిరుమల వెళ్లాను. ఆ తరువాత సుమారు ఏబై ఆరేళ్ల క్రితం నా ఉపనయనానికి
వెళ్లినప్పుడు, పాతిక మందికి పైగా ఒక జట్టుగా కలిసి వెళ్లాం.
నాలుగైదు కచ్చడం (ఎద్దులు లాగే) బళ్లు, మరో నాలుగైదు (ఎద్దులు
లాగే) పెద్ద బళ్లు కట్టుకుని మా స్వగ్రామం నుంచి బయల్దేరాం.
ఆరేడు కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న రైల్వే స్టేషన్ కు చేరుకుని, అక్కడ నుంచి పాసింజర్ రైల్లో విజయవాడ వెళ్లాం. విజయవాడలో
సత్రం బస..అక్కడినుంచి మర్నాడు సాయంత్రం తిరుమలకు ప్రయాణం కట్టాం. బయల్దేరిన మూడో
రోజు ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగాం. స్థానికంగా
వున్న దేవాలయాలను దర్శించుకుని, మర్నాడు తిరుమలకు బస్సులో
ప్రయాణమయ్యాం. ఆ రోజుల్లో తిరుమల-తిరుపతి
దేవస్థానం వారే బస్సులు నడిపేవారు. అప్పట్లో సెక్యూరిటీ
చెకింగులు అసలే లేవు. తిరుమలలో ఇప్పటి లాగా టిటిడి వారి వసతి
గృహాలు ఎక్కువగా వుండేవి కావు. ఎన్నో ప్రయివేట్ సత్రాలుండేవి.
వాటిలో "పెండ్యాల వారి సత్రం"
చాలా పేరున్న సత్రం. అక్కడే బస చేశాం. వంటా-వార్పూ అన్నీ అక్కడే. అక్కడే
నా ఉపనయనం జరిగింది. దాదాపు మూడు రోజులు అక్కడే వున్నాం.
దర్శనానికి ఎన్ని సార్లు వీలుంటే అన్ని సార్లు, ఏ దర్శనం కావాలనుకుంటే ఆ దర్శనానికి, ఎవరి సహకారం
లేకుండానే వెళ్లొచ్చాం. నాకు గుర్తున్నంతవరకు ప్రధాన ద్వారం
గుండా సరాసరి వెళ్లొచ్చాం. కళ్యాణోత్సవం చేయించాం. గుళ్లో తిరగని ప్రదేశం లేదు. ఏ రకమైన కట్టుబాట్లు
లేవు. ఇక లడ్డులకు కొదవే లేదు. కళ్యాణోత్సవం
చేయించిన వారు బస చేసే చోటికి, ఆలయ నిర్వాహకులు, ఒక పెద్ద గంప నిండా పులిహోర, దద్ధోజనం, పొంగలి, పెద్ద లడ్డులు, వడలు,
చిన్న లడ్డులు వచ్చేవి. శ్రీవారి దర్శనానికి
ముందు వరాహ స్వామి దర్శనం చేసుకున్నాం. పక్కనే వున్న
స్వామిపుష్కరణి-కోనేరులో
స్నానం చేసే వాళ్లం. అప్పట్లో అందులో నీరు శుభ్రంగా-కొబ్బరి నీళ్లలా వుండేది. తిరుమల సమీపంలోని పాప నాశనానికి
తప్పనిసరిగా వెళ్లే ఆచారం వుండేది అప్పట్లో. అక్కడ నిరంతరం
ధారగా నీరు పడుతుండేది. నీరు పడడానికి ఒక చైన్ గుంజాలి.
అది గుంజినప్పుడు నీరు పడకపోతే పాపాలు తొలగనట్లు భావించేవారు.
మూడు రోజుల తరువాత, తిరుగు
ప్రయాణం అయ్యాం. ఆ రోజుల్లో ఒక పద్దతి ప్రకారం దైవ దర్శనం
చేసుకునే ఆచారం వుండేది.
వరాహ స్వామి దర్శనం, వేంకటేశ్వర స్వామి దర్శనం, అల మేలు మంగ దర్శనం, గోవింద రాజ స్వామి దర్శనం, శ్రీ కాళహస్తి దర్శనం తిరుగు
ప్రయాణంలో విజయవాడలో ఆగి కనకదుర్గ దర్శనం చేసుకునే వాళ్లం. సుమారు వారం-పది రోజుల యాత్ర అలా సాగేది అప్పట్లో. సత్రాలలో వుండేవాళ్లం. హాయిగా దర్శనాలు చేసుకునే వాళ్లం. ఇప్పుడేమో మధ్యాహ్నం బయల్దేరి
విమానంలో వెళ్లి, మర్నాడు ఉదయం దర్శనం చేసుకుని ఇరవై
నాలుగు గంటల్లో తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు. ఒకప్పుడు
ఒక్క వాయుదూత్ మాత్రమే వుండేది...ఇప్పుడు తిరుపతికి పన్నెండు విమానాలున్నాయి. సాయంత్రం తిరుమలకు చేరుకోవడం, వారి-వారి స్థాయిని బట్టి మర్నాడు
ఉదయం సుప్రభాత సేవ కాని,
అర్చన కాని, అభిషేకం కాని, నిజ పాద దర్శనం కాని, వీటన్నిటినీ మించి ఎల్-1, ఎల్-2,ఎల్-3
కేటగిరీ కింద బ్రేక్ దర్శనం కాని చేసుకోవడం, వీలుంటే
అల మేలు మంగాపురం పోవడం,
లేదా సరాసరి విమానాశ్రయానికి
పోయి హైదరాబాద్, ఢిల్లీ, ఇతర
మహానగరాలకు చేరుకోవడం జరుగుతోంది. సామాన్యులు ఎప్పటి లాగానే ధర్మ దర్శనం కాని, ఆన్ లైన్ దర్శనం కాని
చేసుకుంటున్నారు.
నాకు ఏప్రిల్ 30,
1969 న వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత పెళ్లి
బట్టలతో స్వామివారి దర్శనం చేసుకోడానికి వెళ్లాం. అప్పట్లో మా ఖమ్మం జిల్లాకు
చెందిన కొలిపాక కిషన్ రావు గారు టిటిడి పాలక మండలి సభ్యుడుగా వుండేవారు. ఆయనతో కలిసి తిరుమల వెళ్లాం. వాళ్లకు పద్మావతి అతిధి
గృహంలో బస. మాకు వేరే చోట. అప్పట్లో
పద్మావతి అతిధి గృహమే అన్నింటి కన్నా పెద్దది. ఇక మా
దర్శనాలు, ఇతర సౌకర్యాలు అన్నీ టిటిడి అధికారులే స్వయంగా
చూసుకున్నారు. ఏ ఇబ్బందీ కలగలేదు. ఆ
యాత్రలో ప్రధాన ద్వారం ముందరే పాలక మండలి సభ్యుడితో సహా మేం కూడా కారులో దిగాం.
సరాసరి మొదలు సుప్రభాత దర్శనం, తరువాత మిగతా
దర్శనాలు చేసుకున్నాం. అప్పుడప్పుడే యాత్రీకుల రద్దీ పెరగడం
మొదలైంది. మా తిరుమల ప్రయాణాలలో ఇదొక మరపురాని అనుభవం.
క్రమేపీ
యాత్రీకుల రద్దీ పెరగడం మొదలైంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం రు. 25 ల టికెట్ తో ప్రారంభమైనట్లు జ్ఞాపకం. సిఫారసు ఉత్తరాల సాంప్రదాయం మొదలైంది. ఆర్జిత సేవలకు కోటా కూడా మొదలైంది. అప్పటి నుంచి వెళ్లిన ప్రతి సారి
టిటిడి ఈఓ కు గాని,
జెఈఓ కు గాని సిఫార్సు
వుత్తరాలు తీసుకెళ్లడం ఆనవాయితీగా మారింది. అప్పట్లో
అర్చనానంతర దర్శనానికి ప్రాముఖ్యత వుండేది. చాలా మంది కళ్యాణం తప్పక చేయించే వారు.
ఎప్పుడైతే కళ్యాణం చేయించిన వారికి లఘు, మహా
లఘు దర్శనాలు మొదలయ్యాయో ఇక అక్కడి నుంచి అవి చేయించడం మానుకున్నాం. రాజ్ భవన్‌లో పని చేసినంత కాలం, ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి వద్ద పౌర సంబంధాల
అధికారిగా పని చేసినప్పుడు,
ఏ ఇబ్బంది లేకుండా వెళ్లి
రాగలిగాం. ఒక సారి తిరుమలలో తమిళ నాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రుల
సమావేశానికి ముఖ్యమంత్రి సిబ్బందిలో వున్న నేను కూడా హాజరయ్యాను. అప్పుడు ముఖ్యమంత్రితో సహా
దేవాలయంలోకి ప్రధాన ద్వారం గుండా వెళ్లిన వారిలో నేను కూడా వున్నాను.
తరువాత...తరువాత
కూడా తిరుమల దర్శనాలు ఇబ్బంది లేకుండానే జరిగాయి. ఎన్నాళ్ల
బట్టో మాకు స్వామివారికి అభిషేకం చేయించాలన్న కోరిక వుండేది. ఆ కోరికా తీరింది ఒకటి రెండు సార్లు. టిటిడి బోర్డ్ చైర్మన్‌గా టి. సుబ్బిరామిరెడ్డి వున్నప్పుడు అభిషేకం
చేయించాం మొదటి సారి.
మరో సారి కూడా ఆ అవకాశం
లభించింది. అర్చన, సుప్రభాతం, అభిషేకం, కళ్యాణం లాంటివి చేయించిన మాకు "వస్త్రం" సేవ చేయించాలనే కోరిక కలిగింది. ఐ. వి. సుబ్బారావు గారు ఎండోమెంట్ శాఖ
కార్యదర్శిగా-టిటిడి బోర్డ్ సభ్యుడుగా వున్నప్పుడు
ఆయన సిఫార్సుతో రు.
50,000 టికెట్ కొని ఆ ముచ్చటా తీర్చుకున్నాం. నిజంగా అదొక అద్భుత అవకాశం. స్వామివారి ముందర గంటకు పైగా కూర్చుని
చూసే అరుదైన అవకాశం అలా మొదటి సారిగా లభించింది. రమణాచారిగారు
టిటిడి ఈఓ కాగానే అలాంటి అవకాశం మరో మారు కూడా లభించింది. మా అబ్బాయి ఆదిత్యకు కూడా ఆ అవకాశం
లభించింది.
ఇదంతా నా అనుభవం మాత్రమే. నాకింత మంచిగా జరుగుతున్నది
కాబట్టి అక్కడ యాత్రీకులకు ఏ ఇబ్బందీ కలగడం లేదని అనడం లేదు. కాకపోతే ఎవరి అదృష్టం వారిదే! చివరి క్షణం వరకూ
దర్శనం టికెట్లు దొరుకుతాయో, లేదో అన్న అనుమానం నాకు కలిగిన
సందర్భాలు లేకపోలేదు. అప్పుడొకాయన అన్నారు.... దర్శనం స్వామి ఇవ్వాల్సిందే కాని మనం తెచ్చుకోవడం కాదని! ఇప్పటికీ, దర్శనం చేసుకుంటున్నప్పుడు, క్యూలో అసహనానికి గురైన సందర్భాలు అనేకం. క్యూలో
వంటి మీద చేయి వేసి తోస్తున్నప్పుడు కోపగించుకున్న సందర్భాలు అనేకం. అలానే వివిఐపి గా స్వామివారి ముందు నన్ను-నా కుటుంబ
సభ్యులను నిలబెట్టిన సందర్భాలూ అనేకం. ఎప్పటికెయ్యది
ప్రాప్తమో అదే జరుగుతుందని అనుకునే వాడిని. కోపమొచ్చినా
అణచుకునేవాడిని. ఏదేమైనా కాలం మారింది. ఏబై-అరవై ఏళ్ల క్రితం పరిస్థితులు ఇప్పుడు లేవు. సరాసరి
దైవ దర్శనానికి పోయేందుకు ఇప్పుడు వీలు లేదు. ఇప్పటి
నియమనిబంధనలు పాటించక తప్పదు. భక్తులను ఇలా నియంత్రిస్తేనే
అందరికీ దర్శనం దొరికే అవకాశం వుంటుంది. ఒకనాడు విఐపి లకు
వున్న ప్రాముఖ్యత ఇప్పుడు లేదే! ఆ రోజుల్లో లాగా అన్నీ-అందరికీ ఇప్పుడు జరగడం లేదే! రాబోయే రోజుల్లో ఏం జరగ
బోతోందో ఎవరూ ఊహించలేరేమో!
Jwala99@gmail.com
8008137012 (M)
Flat Number 502, Vasavi Bhuvana Apartments, Srinagar Colony
Yellareddyguda, Hyderabad 500 073
No comments:
Post a Comment